“పురాణ మిత్యేవ న సాధుసర్వం
నచాపి కావ్యం నవ మిత్యవద్యమ్
సంతఃపరీక్ష్యాన్యతరత్ భజంతే” అని కాళిదాసు
మహాకవి ఒక చోట చెప్పారు. కొంగొత్తలు సంతరించుకొన్నంత మాత్రమున అవి దోషభూయిష్టమైనదని కాదు అని అర్థము. విజ్ఞులైనవారు విషయ పరిజ్ఞాన సంపదను గ్రహించవలయును గాని ప్రాచీనత, నవీనతల గురించి స్పర్థకూడదని కాళిదాసు మహాకవి తెగేసి లోకానికి వివరిస్తాడు. చాటిన వైనం మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం. కాలగమనంలో మార్పులు అత్యంత సహజం. నాటి వస్తువులు నేడు పనికిరానిని నేటి విజ్ఞానం నాటి విజ్ఞానంతో పోలిస్తే ఎంతో ఘనమని మీమాంసతో ఈ విధమైన తేడాలు ప్రస్ఫుటంగా గమనించబడుతున్నాయి. వాటిలోని ప్రత్యేకతను బట్టి ఆయా అంశాలను లోక కళ్యాణార్థం స్వీకరించటమో లేదా తిరస్కరించటమో జరుగుతుంది.
కానీ ప్రాచీనత – నవీనతల భేదం లేనిది అమ్మతనం. ఇది కాదనలేని నిజం. మంచితనం లాగే అమ్మతనం సుందరమైన అనుభూతి ‘అమ్మ’ అనే మాటలోని సౌందర్యం, ఆనందం, ఆహ్లాదం. సృష్టిలో మరింకెక్కడా దొరకదు. అమ్మతనం అనాది అమ్మ పిలుపులో నవీనత నూతనత్వం కలిగియుంటుంది. అమ్మ అందించే ఆదరణ కీర్తించారు. నేటిది కాదు. కేవలం నాటిది మాత్రమే కూడా కాదు. అమ్మా అని పిలవటం అది ఒక యోగం. అమ్మతనాన్ని గమనించుకోవాలన్నా, అమ్మతనాన్ని అనుభవించాలన్నా, యోగం కావాలి. ఇక్కడ యోగం అంటే అవసరమైన అమ్మ ఆదరణ (పొందలేకపోతే) లేకపోతే అది పొందటం. లేనిదానిని పొందటమే యోగం. ఈ యోగం అమ్మ సంకల్పించినప్పుడు మాత్రమే మనకి లభిస్తుంది. అమ్మ “కానీకి” దొరకదు. అందుకే “అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే” అన్నారు. ఇంతటి ప్రేమపూర్వకమైన అమ్మ ఆదరణ పొందగలగడం. దీనిని మించిన ఐశ్వర్యం మనిషికి మరొకటి యుండదు. భౌతికంగా మన శరీరరానికి గాని, మానసికంగా మనస్సుకి గాని అస్వస్థత ఏర్పడగానే “అమ్మా”
అని పెదాలతో పలికి ఊరట చెందుతాము. అమ్మ అనే రెండక్షరాలు ఉచ్ఛరించగానే స్వాంతన చెందే అమృత తుల్యమైన మంత్రం అమ్మ అనే పదం.
అమ్మని ఆవిష్కరించుకొని ఆనందం పొందాలంటే శ్రీనాథమహాకవి తన “హరవిలాసం” అనే కావ్యంలో ఒక పాత్రతో తండ్రి కన్నా అమ్మ పాత్ర ఎలా గొప్పదో అమ్మకివ్వవలసిన అగ్రస్థానం ఏమిటో చిన్న పద్యంలో వివరిస్తాడు.
“ఉదరమునన్ భరించి, ప్రసవోద్భవ వేదన బొంది పిమ్మటన్
ముది ముదియైన పీతబడి, మూత్రమునంబడి లజ్జవండుగా
నదవదయైన తల్లికి ప్రియంబొ సుతుండు, వృధాభిమానిదు
ర్మదుడగు తండ్రికిన్ బ్రియమొ, మానసవీధి దలంచి చూడుమా!
అంటాడు. నవమాసములు మోసి, అయిష్టమైన వానిని భుజియించి, తన బిడ్డ కోసం ఇష్టమైన వానిని విసర్జించి, ప్రసవ వేదనలు భరించి, రోతయైన మల మూత్రాదులను లెక్కసేయక ఎత్తిపోసే “అమ్మ”ని కీర్తించటం, గౌరవించటం మన ఉన్నతికి మూల కారణమని గ్రహించాలి. కనుకనే అమ్మ అనే పదం అమృతతుల్యం అని చెప్పక తప్పదు. అందుకనే శ్రీ వ్యాసులవారు అమ్మని “అవ్యాజ కరుణామూర్తి” యని లలితా సహస్రనామాల్లో కీర్తించారు.
తల్లిగర్భంలో ప్రతి అణువునీ స్పృశించిన శిశువు బయటికి రాగానే రోదిస్తుంది. ఈ రోదనే చైతన్యానికి ప్రతీక. ఈ చైతన్య రోదన వినగానే తల్లి తన నవమాసాల వ్యధను మరచి ఆనందిస్తుంది. ఆ చైతన్య రోదనే శివం. అది లోపిస్తే శిశువే శవం. శివాన్ని పొందిన శిశువుకి 11వ రోజున బారసాల కార్యక్రమం జరుపుతారు. ఆ క్రమంలో తండ్రి తన సంతానాన్ని భూమిపై మొదటిసారిగా బంధుమిత్రుల సమక్షంలో తాకుతూ “ఆత్మా వై పుత్రనామాపి” అనే మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. తన ఆత్మ స్వరూపమే తనకి కలిగిన ఈ సంతానం” అని ఈ మంత్రార్థం. ఈ మంత్రం వల్ల “బింబ ప్రతిబింబ సామ్యం” అనబడే ఏకాత్మ భావన ప్రస్ఫుటం చేస్తాడు. ఈ మంత్రార్ధమునే అనసూయేశ్వరి మాత తన కొలువుకి వచ్చిన ఆశ్రితులు (బిడ్డలు) అందరికి అందరి ముందు “ఆత్మావై….. నామాపి” అని ప్రవచిస్తుంది. ఆ మంత్రమే “మీ అందరు నా బిడ్డలే”. అనటమే అని గ్రహించాలి. నా పదవీ విరమణ సభలో నన్ను ఆశీర్వదించటానికి వచ్చిన అన్నగారు “పురుషోత్తమ పుత్రభార్గవ” గారు ఉపన్యసిస్తున్న మా జిల్లెళ్ళమూడిలో మేమందరం ఒకరి నొకరు అక్కయ్య, అన్నయ్యా, తమ్ముడు అని పిలుచుకుంటామని ఆనందంగా చెప్పుతూ,
అమ్మ ఏర్పరచిన అందరింటిలో మేమందరం రక్తసంబంధీకులం కాకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమాభిమానాలు మా మధ్య నెలకొన్నాయి అన్నారు. ఈ విధమైన ఏకాత్మభావన జిల్లెళ్ళమూడి అమ్మబిడ్డలకి ఎలా ఏర్పడిందో గమనించుకోవాలి. అమ్మ ఆశీర్వాదానికి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ పలకరింపు నాన్నా! అని పిలుస్తుంది. అప్పుడు సర్వశక్తుల సాక్షిగా అమ్మ నీవు “నా ఆత్మ స్వరూపుడివని” అందరితో చెప్పినట్లే ఈ విధంగా అమ్మ మనందరిని “ఏకాత్మభావన సామ్యాని”కి దగ్గర చేసింది. ఏనాడైతే కొన్ని లక్షల మంది భక్తులు అనసూయేశ్వరి మాతను అమ్మగా భావించి అమ్మ ఆశీస్సులు పొందారో, వారందరు అమ్మ ద్వారా అమ్మ ఆత్మ స్వరూపులుగా మారిపోయారు. తర్వాత వారందరు అమ్మ ద్వారా ఒకరి నొకరు వారిలోని అమ్మ ఆత్మస్వరూపాన్ని దర్శించి మనందరం అమ్మబిడ్డలమనే అన్యోన్య ప్రేమాభిమానాల్లో విహరిస్తున్నారు. “మీరంతా నా బిడ్డలు” అన్న అమ్మ మాటల్లో ఎంతో వేదార్థమున్నది. అందుకే అమ్మ ఏది చెప్పినా వేదమే. వేదంలో లేనిది అమ్మ చెప్పదు. తోలు నోరు కాదుగా తాలుమాట రావటానికి అమ్మ విశ్వజనని అనటానికి ఇంతకంటే నిదర్శనం వుండాలా ? ఇన్ని లక్షల మందిలో అమ్మ స్వరూపాన్ని దర్శించిన మనం లేదా ఇన్ని లక్షల మంది తమలో అమ్మను దర్శించిన వైనం అమ్మ దైవత్వానికి నిదర్శనం. ఇలా అంతటా ఆవహించిన అమ్మను మనం ఎల్లవేళలా గమనించు కోగలగాలి. ఒకసారి జిల్లెళ్ళమూడిలో అమ్మ ఒక భక్తునికి (బిడ్డ) క్రొత్త బట్టలు పెట్టి మెడలో దండలు వేసి ఇది నేను చేసే సన్మానం నాయనా” అంటే ఆ భక్తుడు అమ్మ ఒడిలో తలపెట్టి భోరున ఏడ్చాడుట. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకొకాయన అమ్మ బట్టలు పెడితే ఆనందించాల్సిందే పోయి యీ ఏడ్పులేమిటని అమ్మనే సరాసరి అడిగాడట. దానికి అమ్మ నవ్వుతూ “పిల్లలు పుట్టగానే ఎందు కేడుస్తారురా అదే ఈ బిడ్డ ఏడ్పుకి కారణం” అన్నది. “ఆత్మా వై పుత్రనామాసి” అనే పద్ధతి అమ్మ సమన్వయ పరచిందనటానికి ఈ విధమైన ఉదాహరణలు కోకొల్లలు. పరతత్వస్వరూపిణిగా లోకానికి పరిచయం చేసుకొన్న పరదేవతా స్వరూపిణి అమ్మ.
ఒక చోట అమ్మ “అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే ఆధ్యాత్మికశక్తి” అని ప్రవచించింది. అట్లాగని అమ్మ ఎప్పుడూ నిగూఢమైన ఆధ్యాత్మిక ఉపన్యాసాలందించిన దాఖలాలు లేవు. అమ్మ ఎప్పుడు చెప్పినా తేలిక మాటలతో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేది. చెలమలో నీరు తోడిన కొద్ది దొరుకుతాయి. మనలో కొంతమంది అమ్మని అర్చించు కోవాలనుకోవటం, అమ్మకోసం తపించటం జరుగుతుంది. అమ్మ కోసం వెతుకులాట ఎంత వెర్రితనం. “తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః” హృదయ మధ్యలో నీవారశూకవత్ అనగా వడ్లగింజరూపంలో పరాత్పరి మనందరి హృదయాలలో వ్యవస్థితమై యున్నది. నియమబద్ధంగా జీవితం గడుపుతూ అమ్మని ధ్యానించు కుంటూ అమ్మని గమనించుకోగలగాలి. “శ్రేయాంసి బహువిఘ్నాని” అన్నారు. మనిషి మంచి ఆలోచన వచ్చి ఆచరించాలంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. సాధకులుగా మనం విషయ లంపటాలలో చిక్కుకొని, ప్రాపంచిక సౌఖ్యాలు కోసం వెంపర్లాడుతున్నాము. అన్నీ కలసి వచ్చి తన ఆశలు తీరితే అది మన గొప్పగా భావిస్తున్నాము. ఆశలు తీరకపోతే కృశించిపోతున్నాము. సాధకులుగా మనం గమనించాల్సింది శరీరం + అమ్మ (పరాత్పరి) = చైతన్యం, శరీరం – అమ్మ – చైతన్యరాహిత్యం మనందరం చైతన్యవంతులం కనుక మనలో ఆత్మస్వరూపిణిగా ఉన్న అమ్మను గమనించుకుంటూ అమ్మ నామస్మరణ చేసుకుంటూండటమే మనకు రక్ష.
శంకరభాగవత్పాదులవారు కూడ
“సంప్రాప్తే సన్నిహితెకాలే నహి నహి రక్షతి”
డుకృజ్కరణే” అని వ్యాకరణాంశాలను వల్లె చేస్తున్న శిష్యులను మందలిస్తున్నట్లుగా మనలందరిని నామస్మరణ చేస్తూ ధన్యులు కావవలసినదిగా హెచ్చరించారు. కనుక అమ్మ నామస్మరణ మరువక నిత్యస్మరణతో పునీతులం కావటమే అమ్మకు ఆనందం. మనకి మోక్షదాయకం.