ఒకసోదరి అమ్మవద్ద 12 సంవత్సరాల పైగా నామ సంకీర్తనం, సుప్రభాత సంధ్యావందనాలు నియమం తప్పకుండా చేసుకునేది.
ఒకసారి మరో సోదరి పోతుకూచి ఝాన్సీలక్ష్మి ఆమెతో మట్లాడుతూ అడిగారు “అక్కయ్యా! మీరు నామం :
చేస్తూ మధ్యలో తన్మయత్వం పొందుతున్నట్లు కనపడుతుంది. ఎలా సాధ్యమయింది?” అని.
“మనకు ఇష్టమైన పదార్థం తింటున్నప్పుడు నోట్లో నీరు ఊరినట్లు, నామాన్ని చెబుతున్నప్పుడు నాకు కంటివెంట నీరు వస్తుంది” అని సమాధానం ఇస్తుంది.
“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్” అన్నది ఉపనిషద్వాక్యం. సుదీర్ఘ సాధనానంతరం ఋషులు కనుగొన్న నిత్యసత్యమైన వాక్యం. అదే ఆత్మానందం. ఆ ఆనందం “ఇదీ” అని వాక్యాలలో చెప్పటం అసాధ్యం. “యతో వాచో నివర్తంతే అప్రావ్య మనసా సహ!” వాక్కు, మనస్సు కూడా ఆ ఆనందాన్ని అభివర్ణించ ప్రయత్నించి. సాధ్యంకాక, వెనుకకు మరలుతున్నాయట.
అటువంటి ఆనందాన్ని ఆ సోదరి అమ్మ నామసంకీర్తనలో అందుకున్నారు. అదీ నామమాధుర్యం! ఎంత
ధన్యురాలు ఆ సోదరి!! ఆ స్థితి అందుకోగలిగితే దానికి సాటి ఏది? స్వర్గం ఎందుకు? మోక్షం ఎందుకు? బ్రహ్మ
వదవి కూడా ఎందుకు?
భాగవతంలో బ్రహ్మ కృష్ణుని స్తుతిస్తూ అంటారు.
“ఏలా బ్రహ్మ పదంబు? వేదములకున్ వీక్షింపగారాని ని
న్నీ లోకంబున నీ వనాంతరమునం దీ మందలో కృష్ణయం
చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పైవేష్టించినం జాలదే”
“హే కృష్ణా! అనంతమైన వేదరాశి కూడా నిన్ను సంపూర్ణంగా దర్శించలేదు. అటువంటి నిన్ను ఈ భూలోకంలో, ఈ వనములలో, ఈ గోవులు, గోపబాలుర మందలో “నీవు తప్ప మరేమీ అక్కర్లేదు” అంటూ ఆరాధించే ఈ గొల్లపిల్లల పాదరేణువులు శిరస్సుపై ధరించిన చాలుకదా! ఎందుకీ బ్రహ్మ వదవి?” అంటారు. సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మ!!!
బ్రహ్మ పదవి కన్నా బ్రహ్మానంద స్థితి గొప్పది అని భావం. అటువంటి స్థితిని అనుభవించిన అమ్మ భక్తులు కోకొల్లలు. ఆ స్థితిని అందుకోవటానికి ప్రయత్నించాలి. అందుకు సులభమైన మార్గాన్ని అఖండ నామ సంకీర్తన వేదిక ద్వారా అమ్మ మనకు అందించింది !!