1. Home
  2. Articles
  3. Mother of All
  4. నా జీవితం అబద్ధం – చరిత్రబద్ధం

నా జీవితం అబద్ధం – చరిత్రబద్ధం

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 1
Year : 2023

(గత సంచిక తరువాయి)

సృష్టే తానైన అమ్మ మన ఆనందాలతో మన దుఃఖాలతో తాను తాదాత్మ్యం చెందుతుంది. అమ్మ దగ్గర అతి సన్నిహితంగా మెలిగిన వారు ఇటువంటి సంఘటనలు ఎన్నో ప్రత్యక్షంగా చూసినట్లు వారి మాటల వలన మనకు తెలుస్తుంది. ఎవరికయినా అనారోగ్యంగా ఉండి వారికి ఆహారం అవసరమయి నపుడు అమ్మ ప్రత్యేకించి వారికోసం వండిస్తూ ఉండేది. కొన్ని సమయాల్లో అమ్మ తనలో తాను ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్లుండడం చాలా మంది సోదరీ సోదరులకు అనుభవంలో ఉన్న విషయం. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ప్రత్యక్షంగా దర్శించిన అనుభవాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

1964 ఏప్రిల్ 26వ తేదీన తనను దర్శింప వచ్చిన వారందరినీ అన్నపూర్ణాలయానికి భోజనానికి పంపిన తరువాత అమ్మ లోపలికి వెళ్లింది. అమ్మతో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఉన్నట్లుండి అమ్మ మన మధ్యనున్న స్ఫురణ లేకుండా ఎవరినో సంబోధిస్తూ ‘అమ్మా! శ్యామలా! నిన్నెవరు చూస్తారు. నీకు చపాతీ చేయించి పెట్టనా!’ అని అనటం మొదలు పెట్టింది. మళ్లీ వెంటనే మామూలుగా అయిపోయి ప్రక్కనున్న వారితో ఒక చపాతీ చేసి తీసుకురా! అని చెప్పి తాను స్వీకరించింది. అమ్మ ఏమయినా ఆహారం తీసుకుంటే అది తనకోసం కాదని ఎవరెవరికొరకో అట్లా స్వీకరిస్తుందని స్పష్టమైంది. ఇటువంటిదే వారి స్వీయానుభవం ఒకటి చెప్పారు.

ఆచార్య భరద్వాజగారు అమ్మ దగ్గరకు వచ్చినరోజు ప్రతి సంవత్సరం ఒక పండుగ మాదిరి చేసుకుంటారు. 1964 ఆగస్టు 19న క్షీరాన్నం చేయించి అమ్మకు నివేదన సమర్పించారు. పెద్దగిన్నె నిండా పరమాన్నం ఉంది. వేడివేడిగా పొగలు వస్తూ ఉన్నది. సాధారణంగా అమ్మ ఒక చుక్క నోటిలో వేసుకుని మిగిలింది అందరికీ పెట్టమని చెప్తుంది. కానీ ఈసారి మాత్రం అమ్మ ఆ వేడి పాయసాన్ని తినడం ప్రారంభించింది. బాగా తినగల వాళ్లకు కూడ ఎక్కువయ్యేంత పాయసం ఉంది. కానీ త్వరత్వరగా ఆ గిన్నెలోని పాయసమంతా అమ్మ తినేసింది. అమ్మ తినే సమయంలో అమ్మ దృష్టి మాత్రం కూర్చున్న మంచానికే ఎదురుగా ఉన్న గోడకేసి మధ్య నిలిచి ఉంది. “కొంచెం తిను. ఇంకా కొంచెం తినమ్మా” అని ఒక పసిపిల్లకు తినిపించినట్లు మాట్లాడింది. తినటం అంతా పూర్తయ్యాక మన స్ఫురణలోకి వచ్చి “అంతా అయిపోయిందికదా నీవేం” తింటావు? అని భరద్వాజ గారిని అడిగింది. వారు సమాధానం చెప్పే లోపుగానే ఖాళీ గిన్నెలో చెయ్యి కడుక్కుని నీవు ఇది తీసుకో అన్నది అమ్మ. అమ్మ పరధ్యానము, ఒక వ్యక్తి తినటం అసంభవం అయిన పాయసం స్వీకరించటము, అమ్మ పలికిన మాటలూ, ఒక రహస్యాన్ని విశదీకరిస్తున్నట్లుగా అన్పించిందట. అమ్మ ఏమయినా తిన్నా, కావాలని కోరినా ఆపదల్లో ఉన్న వారికోసంగానీ, తపో నిమగ్నులయి ఎక్కడో అరణ్యాలలో ఉండే వారికోసమే అని తెలిసింది అన్నారు భరద్వాజగారు. నీకేం కావాల్సి వచ్చినా నువ్వెక్కడయినా కొనుక్కు తినగలవు. “ఎక్కడో అరణ్యాల్లో ఉండేవారి అవసరాలు గమనించేందుకు ఎవరూ లేని వారినెవరు చూస్తారు.’ అన్నదట అమ్మ. ఈ విధంగా, వివిధ స్థలాల్లో వివిధ సమయాల్లో అవసరమే విలువైనది అని తాను చెప్పినట్లుగానే ఎందరికో అవసరానికి ఆహారాన్ని అందించింది అమ్మ. “మీరు తింటే నేను తిన్నట్లేనని ప్రకటించిన అమ్మ ఇలాంటి సందర్భాల్లో మాత్రం తాను తినటం ద్వారా వారి ఆకలిని తీర్చింది.

జ్ఞానానికి పరాకాష్ఠ చరాచర ప్రకృతితో తాదాత్మ్యం. ఒకసారి రమణ మహర్షి దగ్గరకు కొందరు భక్తులు ఆపిల్ పండ్లు ఒక బుట్టెడు తెచ్చి మహర్షికి ఇచ్చారు. ఆయన హాలులో ఉన్న వారిని కలయ చూసి తలా ఒకపండు ఇస్తున్నారు. తెచ్చిన వారు కంగారుపడి ‘మీరు తినడానికి తెచ్చాము స్వామీ!’ అన్నారు. అపుడు మహర్షి ‘ఇప్పుడు తినేదిమటుకు ఎవరూ? నేను కాదూ?’ అని ప్రశ్నించారు. ఉన్నది ఒకే ఆత్మ ఏ నోటితో తింటేనేమి? నేను అందరి నోళ్ల ద్వారా తినగలను. మహర్షికి అందరూ మహర్షులే. అంతా నేనే కనుక మీరు పండ్లు అవీ ఇవ్వడం పంచదార గణపతి బొజ్జగిల్లి నైవేద్యం పెట్టినట్లు. ఇన్ని రూపాలుగా కనపడుతున్నది ఒక్కటే అన్నారు. ‘దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్’ జ్ఞానమయమైన దృష్టి కలవారికి అంతా బ్రహ్మమయంగానే కనిపిస్తుంది. తమకంటె భిన్నంగా ప్రపంచం కన్పించదు. మీరు కానిది నేనేదీ కాదని, మీరు నాబిడ్డలేకాదు నా అవయవాలు కూడ అని ప్రకటించే అమ్మ తన దగ్గరకు వచ్చిన వాళ్లకు అన్నం పెట్టి వాళ్లు తింటూ ఉంటే తాను త్రేన్చుతూ ఉండేది. కానీ ఈ సన్నివేశంలో తాను తిన్నట్లుగా కన్పించి వారికి స్వస్థత చేకూర్చింది. అంతానేనే అనే ఈ జ్ఞానం ఒక మేఘం అనుకుంటే అమ్మలో అది అనురాగమయి వర్షించడం కన్పిస్తుంది. ఈ సన్నివేశంలో మాతృత్వపు కోణం నుంచి అమ్మ మనస్సు ఆవిష్కరింపబడింది.

శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యగారు ఒకసారి అమ్మదగ్గరకు వచ్చిపుడు అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది. ఏ బిడ్డ బాధ అమ్మ అనుభవిస్తోందో అని మనస్సులో అనుకున్నారట. అపుడు అమ్మ “ఇక్కడ సృష్టిలో నాది కానిది ఏదయినా ఉందా? నేను కానిది ఏదయినా ఉంటే చెప్పు. ఇంకొకళ్లది తీసుకున్నాను అనుకోవడానికి ‘వేరే ఎవరిదీ కాదు నాన్నా! నాది నేనే అనుభవిస్తున్నాను. నాతో నేనే ఆడుకుంటున్నాను. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అదినాకు తెలుసు నాన్నా! అదే నేను” – అని తన సహజ స్థితిని అద్భుతంగా వివరించింది అమ్మ.

జయహోమాతా

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!