(గత సంచిక తరువాయి)
అమ్మను లలితా స్వరూపంగా భక్తులందరూ ఆరాధిస్తారు. ఈ విషయంలో విశేషమైన ప్రత్యక్ష అనుభవాలు పొందిన వారెందరో ఉన్నారు. మణిద్వీపవాసిని అయిన లలితాదేవియే అర్కపురిలో అమ్మ అయి మనలను అనుగ్రహిస్తున్నది. శ్రీలలితా సహస్ర నామాల్లో ‘దేశకాలాపరిచ్ఛిన్నా’, ‘సర్వగా’ అనే నామాలు ఉన్నాయి. సర్వకాలములందు సర్వ స్థానములందు తానై సర్వత్రా వ్యాపించి ఉండేది. అంటే పరిమితులకు పరిధులకు అతీతమైంది. దేశకాల కొలతలకు ఇమడనిది. అంతటా అన్ని వేళలా అనంతంగా వ్యాపించిన పరమేశ్వరి అమ్మ అన్నీ అంతా తానే అయినది.
“మీరు చూస్తే నేను కనపడను; నేను కనపడితే మీరు చూస్తారు,’ “నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను; మీరు ఇక్కడకు వచ్చి నన్ను చూస్తారు” అని చెప్పిన అమ్మ జిల్లెళ్ళమూడిలోనే తాను ఉండి అనేక రూపాలలో అనేక ప్రాంతాలలో ఎందరికో తన దర్శనాన్ని అనుగ్రహించింది. అంతటా అన్నింటా తనను, తనలోనే అన్నింటినీ దర్శించగల యోగేశ్వరి అమ్మకు ఏ బంధనాలు లేవు. కనుకనే ‘నా జీవితం అబద్ధం’ అని ప్రకటించింది.
ఒక సోదరులు చీరాల నుంచి అమ్మ దర్శనం కోసం జిల్లెళ్ళమూడి బయలుదేరారు. ఆయన చేతిలో తాటి బెల్లం ఉన్నది. ఇంతలో ఒక వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చి తాటిబెల్లం కొంచెం ఇవ్వమని అడిగిందట. ఆ సోదరులు పో! పో! అంటూ ఆమెకు పెట్టకుండా కారును పోనిచ్చి జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ దగ్గరకు వెళ్ళి యధావిధిగా పూజ చేసుకున్నారు. అప్పుడు వారితో అమ్మ “తాటిబెల్లం కొంత ఇమ్మని అడిగాను, ఇవ్వలేదే?” అన్నది. ఆయన బిత్తర పోయారు. చీరాలలో ఆ వృద్ధురాలి రూపంలో అడిగింది అమ్మే అని అప్పటికి ఆయనకు అర్థం అయింది. వెంటనే అమ్మ పాదాలను పట్టుకుని ‘లీలా వినోదిని అయిన నీ లీల తెలుసుకోలేక పోయానమ్మా! నన్ను క్షమించమ్మా – అని ప్రార్ధించి. తాటిబెల్లం అమ్మకు నివేదనగా సమర్పించారు.
అలాగే తమిళనాడుకు చెందిన ఒక సోదరులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళ్ళారు. స్వామి సన్నిధిలో ఒక స్త్రీ మూర్తి వారి దగ్గరకు వచ్చి ప్రసాదం ఇచ్చింది. ఆయన అంతకు ముందు అమ్మను చూడ లేదు; జిల్లెళ్ళమూడి పేరు కూడా వినలేదు. అందువలన ఆయనకు అమ్మను గుర్తు పట్టే అవకాశం లేదు. ఎవరో ప్రసాదం పెట్టారని తప్ప ఆ సంఘటనలో ఆయనకు ఏ విశేషం కన్పించలేదు. కానీ తరువాత వ్యాపారరీత్యా ఆయన మంగళగిరి వెళ్ళారు. అక్కడ తన స్నేహితుని ఇంట్లో అమ్మ ఫోటో చూసి ఆశ్చర్యపోయి అమ్మను గురించి వివరాలు తెలుసుకున్నారు. అప్పటికి ఆయనకు తిరుమలలో ప్రసాదం ఇచ్చినది అమ్మే అని అర్ధం అయింది. వెంటనే జిల్లెళ్ళమూడికి వచ్చి అమ్మ తిరుపతి ఎప్పుడయినా వచ్చిందా అని విచారిస్తే ఎప్పుడూ అమ్మ తిరుపతి వెళ్ళలేదని తెలిసింది. ఇంతటి అనుభవాన్ని అమ్మ తనకు ప్రసాదించిందని ఆయన భక్తి పారవశ్యంతో ఆనందరసాబ్ధిలో మునిగిపోయారు. ఇదంతా ఒక లీల అయితే అక్కడున్న సోదరులు అమ్మతో “అమ్మా! ఆయనకు ఏం ప్రసాదం ఇచ్చావు?” అని అడిగితే “నాదగ్గర ఏముంటుందీ ఎవరికయినా ఇవ్వడానికి; షుగరు ఇచ్చి ఉంటాను” అన్నది నవ్వుతూ. ఆరోగ్యరీత్యా అమ్మకు ‘మధుమేహము’ ఉంది. వారు వెళ్ళి ఆ సోదరుని ఆరాతీస్తే ‘తిరుమలలో అమ్మ ప్రసాదంగా పంచదార పెట్టిందని’ చెప్పారు. ఇంక అక్కడ ఉన్న అందరూ ‘అవగతము కావు తల్లీ నీ లీల అద్భుతంబులు చూడగా’ అంటూ అమ్మకు చేతులు జోడించారు.
అమ్మ బిడ్డలలో నెల్లూరు అన్నయ్య (శ్రీ మేనకూర సుందర రామిరెడ్డి) తెలియని వారుండరేమో! ఆయన అన్ని క్షేత్రాలను దర్శిస్తూ 1930లో పండరీపురం కూడా వెళ్ళారు. అక్కడ ఆ జనసందోహంలో తెలుగు భాషలేని ఊళ్ళో “ఏం, నాన్నా!’ అని ఒక ముత్తైదువ పలుకరించింది. నొసటన పెద్ద కుంకుమ బొట్టు. అతిలోకమయిన ఆ చూపులో ఏదో విశేషం గోచరించి ‘ఈమె అసామాన్యంగా ఉన్నదే’ అని అన్పించింది ఆయనకు. ఆమెతో మాట్లాడి కొంచెం ముందుకు వెళ్ళి వెనుతిరిగి చూసేటప్పటికి ఆమె కన్పించలేదు. ‘ఇంతలోనే మాయమై పోయిందేమిటి?’ అని ఆశ్చర్యపోయారు.
తరువాత 1966లో రెడ్డి అన్నయ్య మొదటిసారిగా అమ్మ దగ్గరకు వచ్చారు. అప్పుడు అమ్మ “నాన్నా! పండరీపురం వెళ్ళావా? అక్కడ ఒక ముత్తైదువ ‘ఏం నాన్నా!’ అని పలకరించిందా? అంటూ తన దగ్గర ఉన్న ఒక ఫొటో చూపించి ‘(ఆమె) ఇలాగే ఉందా, నాన్నా?’ అని అడగగా – అమ్మే ఆరోజు పండరీపురంలో కనిపించిందని రెడ్డిగారికి అర్థం అయింది. ఇన్ని సంవత్సరాలు తరువాత అమ్మ అడిగేదాక వారికి ఆ విషయం జ్ఞాపకం కూడా రాలేదు.
36 ఏళ్ళ క్రితం – అంటే అమ్మకి 7 సంవత్సరాల వయస్సులో, 1930లో ఒక ముత్తైదువగా కన్పించి రెడ్డిగారు అమ్మ సన్నిధికి చేరుకోవడానికి అమ్మ ఆనాడే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇలాంటి సన్నివేశాలు – ‘ఎక్కడైనా ఎప్పుడయినా ఏ రూపంలోనైనా ఉన్నది ఒకటే – ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా తన దర్శనాన్ని అనుగ్రహిస్తుంది అమ్మ’ – అని తెలియచేస్తున్నాయి. అమ్మ సామాన్య మానవరూపంలో సంచరించిన ఒక అవతారమూర్తి. మాతృమూర్తి అయి మహనీయ వాత్సల్యాన్ని వర్షించే అమ్మ భౌతికరూపం మానవత్వం. అమ్మలో కనిపించే అలౌకికత్వం మాధవత్వం. ఈ రెండింటి సమ్మేళనమే అమ్మ తత్త్వం. ‘మాయా మానుష యోషా మహిత వేషధారీ’ – అని శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు ప్రస్తుతించినట్లుగా లీలా మానుష విగ్రహ అయిన అమ్మకు తన బిడ్డలతో ఆడుకోవడం వారిని ఆనందింప చేయడం ఒక వినోదం. ఇలాంటి దివ్యలీలలు అమ్మ జీవిత చరిత్రలో ఎన్నో ఎన్నెన్నో జయహెూ మాతా.
(సశేషం)