(గత సంచిక తరువాయి)
‘ఆదిమధ్యాంత ముకో హం న బద్ధ్య హం కదాచన |
స్వభావ నిర్మలః శుద్ధః స ఏవాహం న సంశయః ॥’
“నేను ఆది, మధ్య, అంతమూ లేని వాడను, అనాదిని, అనంతుడను, ఎన్నడూ ఏవిధమైన బంధములూ లేని వాడను. దేనికీ కట్టుబడని వాడను, అబద్ధుడను” – అని చెప్పినట్లుగా ఆదీ అంతమూ లేనిది అమ్మ. ఈ సర్వానికీ ఆది అంతమూ అయినది అమ్మ. “ఈ సృష్టి అనాది, నాది, అనంతమ్మను నేను” – – అంటూ సర్వమూ తానే అయిన అమ్మ జీవితం దేనికీ కట్టుబడనిది. అమ్మ తత్త్యాధికా, తత్త్వమయీ, అన్ని తత్త్వాలకూ అతీతమైంది. అన్ని తత్త్యాలలో వ్యాపించి ఉండేది అమ్మే. లోకాతీతా గుణాతీతా సర్వాతీతా అయిన అమ్మ జీవితం అబద్ధం కాక మరేమవుతుంది.
‘జన్మ కర్మచ మే దివ్యం’ – అని శ్రీకృష్ణపరమాత్మ ప్రవచించినట్లుగా అమ్మ జన్మ కర్మలు దివ్యమైనవి. పరిమితులకు లోబడకపోవడమే దివ్యత్వం. అమ్మ ఆవిర్భావ సమయంలో ఎన్నో అద్భుత లీలలనూ, అపూర్వ విశేషాలనూ అక్కడి వారు గమనించగలిగారు. ఆ తరువాత అమ్మ జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశమూ, అమ్మ ప్రతి కదలిక లీలావినోదిని అయిన అమ్మ లీలయే. లీల అంటేనే దేనికీ బద్ధం కానిది. ఒక ప్రక్క సాధారణంగా కన్పిస్తూనే మరొక వంక తన అసాధారణతను కనపరచింది. పరిమిత రూపాన్ని ధరించినపుడు దాని కట్టుబాట్లకు, నియమాలకు కట్టుబడినట్లు కన్పించినా మరొకవైపు తన సర్వశక్తిమత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని ఏదో ఒక రూపంగా అమ్మ అవగతం చేసింది.
గోవిందరాజు దత్తాత్రేయులు గారితో “నిన్ను మంగళగిరి బాలమ్మగారి సత్రంలో వడ్డన చేస్తుంటే చూశాను” అన్నది. అప్పటికి అమ్మ జన్మించలేదు. అమ్మ పాదాలను తాకిన భక్తులచే ఒక పాదం చల్లగా మరొకపాదం వెచ్చగా సోకిన సందర్భాలు ఉన్నాయి. ఒకరిద్దరికి తయారు చేసిన భోజనం కొన్ని వందలమందికి అమ్మ పెడుతూ ఉండేది. అమ్మ మట్టి గడ్డ ప్రసాదంగా ఇవ్వడం, అది పరిమళ భరితంగా రుచికరంగా ఉండడం; కుంకుమ తీర్థ ప్రసాదాలతో ఎందరో అధివ్యాధుల నుండి దూరం కావడం… ఇలా ఎన్నో అమ్మ సన్నిధిలో సర్వ సాధారణంగా జరిగిపోయేవి. వరద వస్తే ‘ఆడపిల్లను ఊరికే పంపట మెందుకు?’ – అంటూ అమ్మ చీరె, రవిక, పసుపు కుంకుమ ఇస్తే ఆ వరద వెల్లువ వెనుతిరిగి వెళ్ళిపోయింది. కొమ్మూరు డాక్టరు శ్రీ అనంత సీతాచలం గారు. అమ్మకు ఇంజక్షన్ ఇద్దామని ఎంతప్రయత్నించినా మందు శరీరంలోకి ఎక్కలేదు. ఆయన నిరాశతో అలా చూస్తూ ఉంటే మందు దానంతట అదే లోపలికి పోయింది. ఏక కాలంలో అనేకచోట్ల అనేక మందికి కన్పించడం, అనేక రూపాలలో దర్శనం ఇవ్వడం ఇలా అమ్మ లీలలు చిత్ర విచిత్రాలు.
అతి చిన్న వయసులో అమ్మ అంకదాసుకు విచిత్రమైన అనుభవాన్ని ప్రసాదించింది. అతడు అమ్మలో కొండలు, కోనలూ, అడవులూ-అంబోధులూ, నదులూ-నిధులూ, మనుషులూ-జంతువులూ, పక్షులూ-పురుగులూ-ఎన్నో ఎన్నెన్నో- అలా విశ్వమంతా అవలోకించాడు. కృష్ణుడు యశోదకు చూపిన దృశ్యం అతడి మనస్సులో మెదిలింది. కృష్ణుడు కూడ విశ్వరూపం అంటూ ఈ సృష్టినేగా చూపించాడు” – అని అంటుంది అమ్మ.
“నన్ను చూడటానికి మీరు రావాలిగానీ, నేను ఇక్కడ నుండే మిమ్మల్ని చూసుకోగలను; నాకు ఈ గోడలు అడ్డు కాదు; మీరు చూస్తే నేను కనపడను, నేను కనపడితే మీరు చూస్తారు” – అన్న అమ్మ మాటలను పరిశీలిస్తే – మనం చూస్తే అమ్మ కనిపించక పోవటమేమిటి? అమ్మ ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా! అని అమ్మ దగ్గరే అమ్మను చూస్తూ కూర్చున్న మనకు అన్పిస్తుంది. కానీ అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో కనిపించే రూపం మాత్రమే కాదు. అంతులేనిది, అడ్డులేనిది; అన్నింటికీ ఆధారమై అంతటా నిండి ఉన్న అమ్మను చూడడమే నిజమైన దర్శనం. అంటే అమ్మ తత్త్వాన్ని దర్శించ గలగాలి. విశ్వాన్నే మాతగా దర్శించాలి. అది కూడ అమ్మే ప్రసాదించాలి.
“నేను కనపడితే మీరు చూస్తారు” అని అమ్మ చెప్పడంలోని పరమార్థం ఇదే. అటువంటి దర్శనాన్ని అమ్మ అంకదాసుకు అనుగ్రహించింది.
అలాగే జిల్లెళ్ళమూడిలోనే ఉన్న అమ్మ గుంటూరులో ఉన్న శ్రీరామరాజు బాలకృష్ణమూర్తి భార్య జయమ్మ గారిని ఓదార్చిన సంఘటన చూస్తే ‘ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు’ అన్న పద్యం ఎవరికయినా స్మరణకు రాక మానదు.
శ్రీరామరాజు బాలకృష్ణమూర్తిగారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్.ఎమ్.ఓ. గా పనిచేస్తుండేవారు. ఆయన ఆధ్యాత్మికంగా సాధన ఏమీ చేయడం లేదనీ, ఆ మార్గంలో ప్రయాణించడం లేదనీ, ఆధ్మాత్మిక ఉన్నతిని పొందడం లేదని ఆయన భార్య శ్రీమతి జయమ్మ గారు బాధపడుతూ ఉండేవారు. ఒకసారి
ఆమె అలా దుఃఖపడుతూ ఉండగా ఎవరో ఒక స్త్రీ తన ప్రక్కనుంచి వెళ్తున్నట్ల నిపించింది. అంతలోనే ఆ స్త్రీ మూర్తి ఆమె తలమీద చేయివేసి – ‘ఆయనలో తప్పకుండా మార్పు వస్తుంది. నీవు అనుకున్నది జరుగుతుంది’ – అని చెప్పింది. దానికి ఆమె కోపంతో ఆ చేతిని విసిరేసి వెనుకకు తోసి వేసింది. తల నిమురుతున్న ఆమెకు వెనుక నున్న గోడ కొట్టుకుని పెద్ద బొప్పి కట్టింది. ఆ బొప్పితోనే జయమ్మగారిని ఓదార్చి ఆమె అంతర్థానం అయింది. ఆమె ఎవరో కూడ జయమ్మ గారికి తెలియదు. జరిగిన సంగతి భర్తతో చెప్పి ఆమె ధ్యానంలో కూర్చుంటే వచ్చిన వ్యక్తి ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ అని తెలిసింది. అప్పటి వరకు అమ్మను గురించి వారికేమీ తెలియదు. అమ్మ తనను గురించి తాను తెలియ పరిస్తేనే గదా మనకు తెలిసేది. ఇంతలో జయమ్మ గారి మామగారు ‘మాతృశ్రీ ‘ మాసపత్రిక తీసికొనివచ్చి అమ్మ గురించి చెప్పారు. అంతకు ముందురోజే అమ్మ దర్శన మివ్వడం, మరునాడే పత్రిక రావడం ఆశ్చర్యాన్నీ ఆనందాన్ని కలిగించే విషయాలే అయినా ఇవన్నీ అమ్మ నిర్ణయంలోని భాగాలే.
ఆ తరువాత ఆమె అమ్మ దర్శనానికి జిల్లెళ్ళమూడి వచ్చారు. ఒక పాకలో చిన్న మంచం మీద అమ్మ కూర్చొని ఉంది. చుట్టూ భక్తజనం. జయమ్మగారు ఆ పాక గడప దగ్గర కూర్చున్నారు. ఆమెను చూస్తూ అమ్మ “నేను గుంటూరు వెళ్ళి వచ్చానురా!” అన్నది రామకృష్ణ అన్నయ్యతో. ‘ఇక్కడే ఉన్న నువ్వు గుంటూరు ఎప్పుడు వెళ్ళావు? ఇది మేము నమ్మాలా! నీవు అబద్ధం చెప్తున్నావు’ – అన్నారు అన్నయ్య. “కాదు, నాన్నా! వెళ్ళి వచ్చాను. కావాలంటే చూడు” అంటూ అమ్మ తన తలమీద ఉన్న బొప్పిని చూపించింది. ఇది నమ్మ శక్యంగాని నిజం. జిల్లెళ్ళమూడిలోనే ఉన్న అమ్మ ఎక్కడికయినా వెళ్లగలదు; ఏ రూపంలో అయినా కనిపించగలదు. అంతటా ఉన్న అమ్మకు పరిమితి లేదు. పరిధీ లేదు. అందుకే అమ్మ నా జీవితం అబద్ధం అన్నది. కానీ అమ్మ జీవిత మహోదధిలో ఇదీ ఒక తరంగమే. అందుకే చరిత్రబద్ధం.
ఈ సన్నివేశం చూస్తుంటే ఒక భక్తుడి చేతిలో గుపపు దెబ్బ తిన్న శ్రీశ్రీనివాసుని లీల స్మృతి పథంలో మెదులుతుంది.
జయహో మాతా.
(జయమ్మగారి సన్నివేశం శ్రీమతికుసుమా చక్రవర్తి, శ్రీ ఎ.ఎస్.చక్రవర్తి గార్ల ‘అమ్మ బడి – అమ్మగుడి’ ఆధారంగా)