జరిగింది చెప్పేది చరిత్ర. అంటే వాస్తవం. మరి అబద్ధం ఎలా అవుతుంది. అన్పిస్తుంది. కానీ, అమ్మ అవతార విశేషమంతా ఈ వాక్యంలోనే ఇమిడి ఉంది. అబద్ధం అంటే దేనికీ బద్ధం కాక పూర్తి స్వాతంత్ర్యం కలది. అన్నింటికీ అతీతమైంది. దేశకాల అవధులు లేనిది అని అర్థం.
“మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతా నేనే” అంటూ ఆద్యంత రహితమూ, అపరిమితమూ అయిన అమ్మకు ఈ రూపమూ ఈ సంసారమూ ఇవన్నీ అబద్ధం కాక మరేమవుతాయి? అనంతమైన శక్తి పరిమిత రూపాన్ని ధరించడమే అవతారం. ఈ విషయాన్నే అమ్మ వివరిస్తూ అసలు ఎప్పుడూ ఉన్నది. అవతారం ప్రతివారూ గుర్తించడానికి మాత్రమే. దానినే లీల అనీ, ఆట అనీ అంటారు. రూపం వచ్చేసరికి బద్ధుడౌతాడు. రూపం ఎప్పుడయితే కావలసి వచ్చిందో అప్పుడు నిర్ణయానికి బద్ధుడు కావలసిందే’ అంటూ ‘నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడ బద్ధుడే’ అని ప్రవచించింది.
ఒకసారి అమ్మ వైకుంఠపాళి ఆడుతున్నది. అది చూసి ఒక పిల్లవాడు ‘నీకు ఆటలంటే ఇష్టమా అని అడిగితే, ‘అవును నాన్నా! నేను వచ్చింది అందుకే. నేను చేస్తున్నది అదే’ అన్నది అమ్మ నవ్వుతూ. అలాగే ఒకసారి అమ్మ దర్శనం జరుగుతున్నది. అందరూ అమ్మను చూస్తూ ఉన్నారు. ఒక చిన్నపిల్ల తన తల్లిని ‘దేవుడమ్మను మాట్లాడమను’ అని అడగమంటే అమ్మ ఆ అమ్మాయిని పిలిచి దగ్గర కూర్చో బెట్టుకుని ‘ఆడుకుందామా’ అని అడిగింది. ఆ పాప సరే అన్నదే కాని తన ఆట బొమ్మలు ఇక్కడ లేవుగా అని ఆలోచిస్తుంటే, అమ్మ ఎదురుగా ఉన్న అందరినీ చూపి “ఇవి నా ఆట బొమ్మలు. చక్కగా ఆడుకోవచ్చు” అన్నది. ఒక సందర్భంలో ఒక వృద్ధురాలు అమ్మతో నిష్ఠూరంగా ‘ఈ బొమ్మను’ అని తననుద్దేశించి ‘నీ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు’ అంటే, అమ్మ నవ్వి ‘ఆ బొమ్మలను ఆడించడానికి’ అని తనను చూపుతూ ‘ఈ బొమ్మ ఎన్ని ఆటలు ఆడాలో ఆలోచిస్తున్నావా’ అని అడిగింది. ‘సృష్టికి కారణం అకారణం’ అని ప్రకటించిన అమ్మకు ఈ సృష్టి ఒక లీలా వినోదం. ‘లీలా వినోదినీ’ అని లలితా ఈ సహస్రనామాలలో మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అలాగే ‘క్రీడార్థం సృజామ్యహం’ అని చెప్పినట్లుగా భగవంతుడికి ఈ సృష్టి ఒక క్రీడ.
లోకంలో మనం ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలను చూస్తూ ఉన్నాం. అవి తాత్కాలికమైనవి. కానీ నిరంతరం ఈ చరాచర సృష్టిని నడిపించే ఆ పరాశక్తి చేసే చిద్విలాసం ఎవరికీ అంతుపట్టనిది. ‘లీలా క్లుప్త బ్రహ్మాండ మండలా’ అయిన అమ్మకు ఇదంతా ఒక లీల. ‘లీల’ అంటేనే దేనికీ బద్దం కానిది. భౌతిక జగత్తులో నమ్మశక్యం గాని నిజం లీల. అనుభవైకవేద్యమైంది. శ్రీకృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా తాను అవతారపురుషుడనే సత్యాన్ని వెల్లడించాడు. భగవంతుని లీలలతోనూ భగవద్భక్తుల చరిత్రలతోనూ నిండినదే భాగవతం. అమ్మ జీవిత చరిత్ర అంటే మరో భాగవతమే. మానవాతీత మహిత శక్తులతో జన్మించిన అమ్మ జీవితంలో ప్రతి సన్నివేశం ఒక లీలయే.
అమ్మ జనన సమయంలో గొల్లనాగమ్మ బొడ్డు కోయడానికి చాకు పట్టుకుంటే ఆ చాకు అతి పొడవుగా త్రిశూలం లాగా, నాభి కమలం లాగా అందులో ఒక దివ్య తేజోరూపిణి సర్వాభరణ భూషిత అయి ఉన్నట్టు కన్పిస్తుంది. ఒక అవతారమూర్తి జననం అన్న విషయాన్ని ఈ సన్నివేశం తెలియచేస్తుంది.
సలసల కాగే సాంబారులో చేయి పెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అమ్మ చెయ్యి పెట్టింది. కానీ కాలలేదు. చేయి చెక్కు చెదరలేదు. అదే లీల. కాని దీని ద్వారా ఒక సందేశం అందించింది అమ్మ. పతివ్రత అంటే పతిని ఆధారంగా చేసికొని పంచభూతాలను జయించడం అని అనుభవ పూర్వకంగా చెప్పి, ప్రతి స్త్రీ భర్తను దైవంగా ఆరాధించాలని పాతివ్రత్య మహిమతో ఎంతటి మహత్కార్యాలయినా సాధించవచ్చనీ, పంచ భూతాలపై అధికారాన్ని పొందవచ్చని ఆచరణాత్మకంగా ప్రబోధించింది.
అమ్మ బాల్యంలో బాపట్లలో భావనారాయణ స్వామి దేవాలయంలోని అర్చకునికి అనేక అనుభవాలు ప్రసాదించింది. ఆలయ ధర్మకర్తకు అదృశ్యవాణి రూపంలో యథార్థం ప్రకటించి దొంగతనం అంటగట్టబడిన ఆ అర్చకుణ్ణి రక్షించింది. అంతకు మునుపే అమ్మ దర్శనంతో ఆనంద పారవశ్యంలో తేలిపోతున్న ఆ అర్చకుడు అమ్మ అనుగ్రహించిన ఈ రక్షణకు పులకించి తేరుకొనేలోగా ఆ వీధివెంట నడుస్తున్న అమ్మ కిటికీలో నుండి కనపడింది. పరుగు పరుగున వెళ్ళి చూడగా ఆ వీధి వెంట నడిచే వారిలో అమ్మ కనిపించలేదు. ఆ అర్చకుడు ఆవేదనతో తన ఆంతర్యాన్ని అమ్మకు నివేదించుకున్నాడు. దాగుడుమూతలు వద్దనీ, మాయను తొలగించమనీ, సంపూర్ణ దర్శనం శాశ్వతంగా అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ‘నీ ఒడిలోకి తీసుకోమ్మా’ అని ఆర్తితో పలికాడు. అంతలో ‘ఇపుడు నీవు నా ఒడిలోనే ఉన్నావు నాన్నా!’ అని వినిపించింది.
దైవం భక్తులకు తన ఉనికిని స్ఫురింపచేస్తూ విశ్వాసం కలిగిస్తూ అంతలోనే మాయ పొరలు కప్పుతూ ఉంటాడు. అమ్మ ఇలాంటి అనుభవాన్నే ఆ అర్చకుడికి కలిగించింది. ఇవన్నీ అనుభవంలో తెలుసుకునేవే. అందుకే ఇవి లీలలు. కాని, చరిత్రబద్ధమైనవి. ఇలాంటి సంఘటనలు ఎన్నో, ఎన్నెన్నో..
(సశేషం)