1. Home
  2. Articles
  3. Mother of All
  4. నా జీవితం అబద్ధం – చరిత్ర బద్ధం

నా జీవితం అబద్ధం – చరిత్ర బద్ధం

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 21
Month : October
Issue Number : 4
Year : 2022

(October-December 2021 సంచిక తరువాయి)

అమ్మ తనను గురించి తానే ఒక సత్యాన్ని మనకు అందించింది – ‘రూపం పరిమితం, శక్తి అనంతం’ అని. ఈ నాలుగు పదాల్లోనే అమ్మ అవతార తత్త్వమంతా ఇమిడి ఉంది. పరిమితరూపం మానవత్వం. 1923-1985 మధ్యకాలంలో మానవాకృతి ధరించిన అమ్మచరిత్ర దేశకాల బద్ధమైంది; పరమాత్మగా అమ్మ జీవితం దేశకాలబద్ధం కాదు. అంటే అబద్ధం.

అమ్మ మరియొక సందర్భంలో తన స్థితిని ఎరుక పరుస్తూ – ‘ఆద్యంతాలు లేనిదీ, అన్నింటికీ ఆధారమైనదీ, ఏ అడ్డూ లేనిది అమ్మ. నేను చూడదలుచుకుంటే ఈ గోడలు నాకు అడ్డుకావు. నేను ఈ నాలుగు గోడల మధ్య ఈ మంచంపై ఉన్నాననుకున్నారేమో! అవసరమయితే నేను అన్నీ చూడగల్గుదునూ, అన్నీ వినగల్గుదునూ’ అని నిర్ద్వంద్వంగా తన సర్వవ్యాపకత్వాన్ని అభివ్యక్తం చేసింది. జిల్లెళ్ళమూడిలో పరిమితరూపంలో పదిమంది మధ్య కూర్చొని మాట్లాడే అమ్మ దేశవిదేశాలలో రాష్ట్ర రాష్టేతర ప్రాంతాల్లో వివిధ వృత్తి ప్రవృత్తులలో ఉన్న బిడ్డలను ఎలా కాపాడ గలిగింది? ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో తన దివ్యదర్శనాన్ని ఎలా అనుగ్రహించ గలిగింది? – అదే అమ్మ సర్వవ్యాపకత్వం.

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో –

‘అహం’ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ॥

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయ స్తథాII

 

మత్తః పరతం నాన్యత్కించి దస్తి ధనంజయ

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ – శ్లోకాల్లో

సర్వానికీ తానే కారణమనీ, తనకంటే భిన్నమైనదంటూ ఏమీ లేదని ప్రవచించి నట్లుగా ‘ఈ సృష్టి అనాది నాది’ అంటున్న అమ్మ “మీరు కానిది నేనేదీ కాను; మీరంతా నేనే; మీదంతా నేనే, ఇదంతా నేనే; ‘నేనెపుడూ ఒంటరిదాన్ని కాను; నాలో అందరూ ఉన్నారు. అందువల్ల నేనే అన్నీ అయి ఉన్నాను” – అని వెల్లడించింది. అంటే తాను కాకుండా ఏమీ లేదనే స్థితి. తాను కాకుండా ఇతరము లేనివాడు అంతా తానైన వాడు పరమాత్మ. అమ్మ ఈ స్థితిని గుర్తించిన శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మగారు ‘పరమాత్మవైన నా అమ్మా!’ అంటూ స్తుతించారనిపిస్తుంది.

అనంతమైన చైతన్య శక్తి ఒక రూపం ధరిస్తే తానే సర్వం కనుక సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వం సహజంగానే ఉంటాయి. శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్యగారు అమ్మ ప్రక్కనే ఉండి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో దూరంగా ఉన్న భాస్కరరావు అన్నయ్య ప్రక్కనే అమ్మ ఉన్నట్లు ఆయనకు కన్పించింది. ఇది అమ్మలోని సర్వవ్యాపకత్వానికి నిదర్శనమే తప్ప ఆ చైతన్యానికి అడ్డమేముంది? ఒకసారి సో॥ తంగిరాల కేశవశర్మగారు “ఇపుడు నాతో మాట్లాడుతూ ఇలా ఉన్నావు. నిన్ను తలుచుకుంటూ ఒకరు హైదరాబాదులో ఉన్నారు. నీవు ఎవరి దగ్గర ఉన్నట్లు?” అని అడిగారు. అప్పుడు అమ్మ, “అదేమిటి నాన్నా! ‘సర్వవ్యాపిని’ అంటూ అక్కడ – ఇక్కడ అని గిరిగీస్తారేమిటి?” – అని ప్రశ్నించింది.

అమ్మ బాల్యంలో బాపట్లలో చిదంబరరావు తాతగారింట్లో ఉన్నప్పుడు లక్ష్మణాచార్యులు గారు వచ్చి అమ్మను ఎత్తుకుని ‘ఈ ఉదయం తొమ్మిందింటికి మా ఇంటికి వచ్చావటమ్మా?’ అని అడిగారు. చిదంబరరావుగారు ‘తొమ్మిదింటికి తలంటి పోసుకుంటున్నది’ – అన్నారు నవ్వుతూ. ‘మా ఇంటికి వచ్చిందే, చేతిలో మొక్కజొన్న కండె కూడ పట్టుకున్నది. నేను చూశాను’ అని ఆశ్చర్యపోయారు లక్ష్మణాచార్యులగారు. ‘అయినా మన చర్చ ఎందుకూ! ఎదురుగుండా ఉన్నదిగా, అడుగుదాం’ అన్నారు చిదంబరరావు గారు. ‘నిజమే తాతగారూ – మీరు ఆస్పత్రికి వెళ్ళినపుడు తొందర తొందరగా వెళ్ళి వచ్చాను’ అన్నది అమ్మ. ‘అప్పుడు తొమ్మిది కాదు పది అయ్యింది’ అన్నారు తాతగారు. ‘మా ఇంటికి వచ్చినపుడు తొమ్మిదే అయింది’ అన్నారు లక్ష్మణాచార్యులు గారు. అమ్మను ఆ విషయమే ‘జరిగింది. జరిగినట్లు’ చెప్పు అని అడగ్గా “ఎలా అయితేనేమి, వెళ్ళి వచ్చాను” అని ఒక తెర వేసింది. అన్నీ తానైన అమ్మ ఒకచోట ఉంటూ మరొకచోట కనిపించడంలో వింత ఏముంది?

అలాగే సీతాపతి తాతగారు ఏదో ఊరికి ప్రయాణమవుతూ అమ్మ అన్నగారు రాఘవరావు మామయ్యకు తెలియచేయటం ఎలా! అని ఆలోచిస్తున్నంతలో రాఘవరావు మామయ్య లోపలకు వచ్చి ‘టిక్కెట్లు కొనుక్కుని వచ్చాను’ అన్నాడు. ‘ఈపూట ప్రయాణం అని నీకు ఎవరు చెప్పారు?’ అంటే, ‘దుకాణం దగ్గర నిలుచుంటే అమ్మాయి (అమ్మ) వచ్చి చెప్పింది’ అన్నాడు. ‘ఏవమ్మా! నీవు ఇక్కడే ఉన్నావుగా’ అని ఆశ్చర్యంతో తాతగారు అడగగా “మీరు స్నానాలు చేసేటప్పుడు వెళ్ళి వచ్చానులెండి” అన్న అమ్మ మాటకు ‘వెళ్ళకుండా మాత్రం చెప్పకూడదుటలే’ అన్నారు తాతగారు. “సృష్టే దైవం” అని ప్రవచించిన అమ్మ తానే సృష్టిగా మారి ఇన్ని రూపాలు అయినపుడు తన రూపంతోనే మరొకచోట కన్పించడంలో వింత ఏముంది? సృష్టే తాను కనుక మన ఆనందాలు, మన దుఃఖాలలో తాను తాదాత్మ్యం చెందుతుంది అమ్మ. అట్టి సంఘటనలు అమ్మ జీవిత చరిత్రలో ఎన్నో కన్పిస్తాయి.

ఒక రోజున అమ్మ ఒక సోదరితో “డబ్బున్న వాళ్ళకూ, తెచ్చుకోగల వాళ్ళకూ, చేసుకోగల వాళ్ళకూ, వాళ్ళందరికీ ఏం పెడతారుగానీ ఏమీలేని దానికి నాకు పెట్టండి. నా కివాళ పథ్యం. రెండు గోధుమ రొట్టెలు, కాసిని వేడినీళ్ళు పది నిముషాల్లో తెచ్చి పెడుతారూ?” అన్నది. ఆ సోదరి అమ్మ చెప్పినట్లుగా తీసుకు వచ్చింది. అమ్మ పడుకునే తింటూ “రొట్టె పచ్చిగా ఉన్నదా? నెమ్ము ఉండకూడదు. గర్భంలో నెమ్ము చేరుతుంది. ఇవాళ పథ్యం”- అంటూ అమ్మ అసలు సంగతిని వివరించింది “పండరీపురం అనే ఊరి దగ్గర వడ్డెవాళ్ళ పిల్ల ఉన్నది. ఆ అమ్మాయి ఇంట్లో బాధలు తట్టుకోలేక అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నది. ఆ అమ్మాయి గర్భిణి. గర్భం విచ్ఛిత్తి అయింది. అడవుల్లో తినడానికి ఏమీ లేక చెట్ల క్రింద పడుకుని ‘అమ్మా! అమ్మా!’ అని మూలుగుతోంది” అంటూ రొట్టెను ఆతృతగా తిన్నది. ఈ విధంగా ఆ అమ్మాయి రూపంలో ఉన్నది కూడ తానే కనుక తాను తినడం ద్వారా ఆ అమ్మాయికి ఆహారం అందేటట్లు చేసింది.

ఈ విధంగా అంతా తానే అయిన అమ్మ జీవితం దేనికీ కట్టుబడనిది. కానీ ఈ సంఘటనలు చరిత్ర బద్ధమైనవి. అందుకే “నా జీవితం అబద్ధం చరిత్రబద్ధం” అని ప్రకటించింది అమ్మ.

(సశేషం…)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!