దైవం మానవరూపంలో అవతరించి ఈ భూమిపై నడయాడడం ఒక అద్భుత సన్నివేశం. ‘సృష్టి అనాది నాది’ అని ప్రకటించిన అమ్మ మాతృప్రేమకు మానవాకృతిగా ఈ భూమిపై అవతరించి, ఆ అద్భుతాన్ని దర్శించే అవకాశాన్ని మనకు కలిగించింది. అమ్మ తనను గురించి తానే ఒక సత్యాన్ని మనకు అందించింది. “రూపం పరిమితం, శక్తి అనంతం” అని. ఈ నాలుగు పదాల్లోనే అమ్మ అవతార తత్త్వమంతా ఇమిడి ఉన్నది. పరిమిత రూపం అంటే మానవత్వం. అనంతశక్తి అంటే దైవత్వం. ఈ మానవతా మాధవత్వ మధుర సమ్మేళనమే అమ్మతత్త్వం.
అమ్మ జన్మించిన 1923 మార్చి 28వ తేది మొదలు 1985 జూన్ 12 వరకు ఉన్న అమ్మ జీవితం ఒక మహోదధి. బాహ్యంగా చూడటానికి ఇది ఒక చరిత్ర. మూలంలోకి వెళ్ళి, పరిశోధించి చూస్తే అనంతమైన అమ్మతత్త్వం దర్శనమిస్తుంది. అగాధమైన అమ్మ తత్త్వ జలధిలోని ఒక్కొక్క తరంగం అమ్మ లీలా విశేషాలను తెలియజేస్తూ ఉంటాయి. సముద్రజలం కంటే వేరుగా తరంగానికి ఉనికి లేదు. తరంగాలలో ఉన్న తత్త్వం సముద్రానిదే. అలాగే అమ్మ జీవితంలోని సన్నివేశాలన్నీ, అమ్మ తత్త్వాన్ని మనకు తేటతెల్లం చేస్తాయి. కొన్ని అమ్మ సర్వశక్తిమత్వాన్ని, కొన్ని అమ్మ సర్వవ్యాపకత్వాన్ని, మరికొన్ని అమ్మ సర్వజ్ఞత్వాన్ని, కొన్ని అకారణ కారుణ్యాన్ని, అవ్యాజ వాత్సల్యాన్ని, విశ్వజనీన మాతృత్వాన్నీ, అపారమైన ప్రేమను తెలియపరుస్తూ “నా జీవితం అబద్దం, చరిత్ర బద్ధం అన్న అమ్మ ప్రకటనకు నిదర్శనంగా కనిపిస్తాయి.
అమ్మ బాల్యంలో ఎక్కువగా బాపట్లలో తన చినతాతగారైన చిదంబర రావు గారింట్లో ఉంటూ ఉండేది. బాపట్లలో ఉన్నప్పుడు ఒకసారి అక్కడ సముద్ర తీరానికి వెళ్ళింది. అప్పుడు అమ్మకు నాలుగేళ్ళ వయస్సు. అక్కడ ఒక జాలరి అమ్మ ఒంటి నిండా ఉన్న సొమ్ములు చూసి, మనస్సులో ప్రలోభం కలిగి అమ్మను. ఎత్తుకుని సొమ్ములన్నీ తీసుకుని, అమ్మను రెండు చేతులా ఎత్తి సముద్రంలో విసరివేస్తాడు. కానీ ఆ క్షణంలో తనకు కలిగిన వింత అనుభవంలో తన తప్పు తెలిసికొని పశ్చాత్తాపంతో దహించుకుపోతూ విలపిస్తూ, నగలను తిరిగి ఇవ్వ బోయాడు. అమ్మ అతణ్ణి బుజ్జగిస్తూ, ఈ సొమ్ము నీవే ఉంచుకో నాన్నా! నీవు ప్రాణాలతో దక్కావు నాకు అదే చాలు, తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము’ 6 అని అవ్యాజప్రేమను ప్రకటించింది. ఈ విధంగా కరడుగట్టిన అతని క్రౌర్యాన్ని తన ప్రేమలో కడిగివేసింది. ఎంతటి కఠిన పాషాణమయినా ఆ అనురాగ స్పర్శలో సచేతనమై ద్రవించ వలసినదే. తనను చంపటానికి వచ్చిన క్రూరుణ్ణి సైతం బిడ్డగా చూసే ఆ మనస్తత్వం నాలుగేళ్ళ వయస్సులో ఉన్న అమ్మకు ఏ సాధన ఫలితమని చెప్పగలం?
ఈ సన్నివేశాన్ని గురించి ఆలోచిస్తే ఇది నిజమా? అనిపిస్తుంది. నాలుగేండ్ల వయస్సులో అమ్మ ఒక్కతే సముద్ర తీరానికి వెళ్ళడం, ఇంట్లోవాళ్ళు గమనించక పోవడం, ఇవన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అక్కడ జాలరికి కలిగిన అనుభవం, ‘తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము’ అని ఒక శాశ్వత జీవన సత్యాన్ని ఆ వయస్సులో అమ్మ ప్రకటించడం ఇవన్నీ సమ్మ శక్యం గాని విషయాలుగా అనిపిస్తాయి. ఇది చరిత్ర – ఇది ఇతిహసం. ఇదే అమ్మ లీల.
అలాగే అమ్మకు పదిహేనేళ్ళ వయస్సులో క్రొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో మంచినీళ్ళ కోసం బిందె తీసుకుని రైల్వేస్టేషన్ దగ్గర ఆస్పత్రి సమీపంలో ఉన్న కుళాయి దగ్గరకు రోజూ వస్తూ వుండేది. ఆసుపత్రి గోడ ప్రక్కన మూడు రోజులుగా ముసుగు కప్పుకుని ఒక మనిషి పడుకుని ఉంటాడు. ఎవరూ ఆ సంగతి పట్టించుకోరు. కానీ అమ్మ అతని దగ్గరకు వెళ్ళి, ఏమైనా కదలిక వస్తుందేమోనని చూస్తుండగా ఆ దారిన ఎవరో ఒక మనిషి వెళ్తూ, ‘నీ కెందుకు చిన్నపిల్లవు. ఆ అబ్బాయి నాలుగు రోజుల నుండి ఉన్నాడు, చచ్చిపోయి నట్లున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఊరుకుంటే నీ కెందుకు?’ అని మందలిస్తాడు. కాని, అమ్మ ఆ మాటలేమీ పట్టించుకోక, మెల్లగా అతని ముసుగు తీస్తుంది. జ్వరంతో మండిపోతూ, అతడి కళ్ళు అంటుకుపోయి, పుసులు గట్టి, నీళ్ళు కారుతూ ఉంటాయి. ఆ స్థితి చూసి అమ్మ తానే స్వయంగా డాక్టరుని పిలుచుకుని వచ్చి, అతడిని ఆస్పత్రిలో చేర్పించి, డాక్టర్ వద్దంటున్నా ఏ మాత్రం అరమరికలు లేని ఆదరణతో దుర్వాసనతో ఉన్న అతనికి అన్ని సపర్యలు చేస్తుంది.
డాక్టర్కే బ్రతుకుతాడని నమ్మకం లేని ఆ వ్యక్తి, అమ్మ ఆదరణతో కోలుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. డాక్టర్గారు అమ్మతో ‘ఒక అనాథకు, దిక్కులేని వాడికి, దిక్కు నీవై, తల్లికంటే ఎక్కువగా సేవ చేశావు. ఇదంతా నాకు పాఠంగా ఉన్నదమ్మా’ అంటాడు. సమాజపరంగా గానీ, కుటుంబపరంగా గానీ, ఎన్నో ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే వర్గ వర్ణ భేదం లేకుండా సపర్యలన్నీ చేసింది. అమ్మ. ప్రపంచంలో ఏ స్త్రీకయినా మాతృత్వం, ఆ మాతృత్వానికి సహజమైన ప్రేమ, మాధుర్యం తల్లిగా మారాక అనుభవంలోకి వస్తాయి. కాని బాల్యావస్థలోనే అందరిపై అమ్మ చూపిన అమ్మప్రేమ అసాధారణమైంది. రెండేళ్ళ వయస్సులోనే తనకంటే పెద్దవారితో ‘నేను అమ్మను’ అని చెప్పడం, ‘అందరూ నా బిడ్డలే’ అని అనడమే కాకుండా ఆనాటి నుంచి చివరివరకు వాళ్ళ వయస్సుతో నిమిత్తం లేకుండా అందరినీ ప్రేమతో లాలించడం, ‘ఆ ప్రేమ వాహినికి ఆనకట్టలను ప్రయోజకుడైనను సృష్టింపగలడె’ అని డా॥ నారపరాజు శ్రీధరరావుగారు వర్ణించినట్లుగా అమ్మ ప్రేమఝరికి నిర్ణీత మార్గాలులేవు, ‘సృష్టికి కారణం అకారణం’ అని అమ్మ చెప్పినట్లుగానే అమ్మ ప్రేమకు కారణాపేక్ష లేదు. ఏ విచక్షణా లేకుండా ఎల్లరకు ఎల్లలు లేని తన ఎనలేని ప్రేమను పంచిపెట్టడం అమ్మతత్త్వం. ‘మా మీద నీకెందుకింత ప్రేమ’ అని ఒకరు ప్రశ్నిస్తే ‘మీరు నాకేదో చేయాలని, నేనెప్పుడూ అనుకోను. ప్రేమ నాకు సహజం’ అని ప్రకటించిన అమ్మ ప్రేమకు ఏ అవధులు లేవు. చరిత్ర బద్ధమైన ఈ సన్నివేశాలన్నీ మనకు ఆశ్చర్యాన్ని కల్గిస్తూ, ఏ నిబంధలనకు లోబడని అమ్మ అవ్యాజప్రేమకు సోదాహరణంగా నిలుస్తున్నాయి.
!!జయ హెూమాతా!!