మేము బాపట్లలో 1966 సంవత్సరాల ప్రాంతాల్లో ఉండేవారం. మా వారు. పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఇంగ్లీషు అధ్యాపకులుగా పనిచేసే వారు.
జిల్లెళ్ళమూడి బాపట్లకు దగ్గర అవటంచే తరుచూ వెళ్ళి అమ్మ సన్నిధిలో గంటల తరబడి గడిపే వాళ్ళం. అమ్మ అందరినీ తల్లిలా నవ్వుతూ పలకరించేది. అమ్మను చూడగానే ఆనందం కలిగేది. తెలియని అనుభూతి కలిగేది. అందరినీ అన్నం తిని వెళ్ళండి అనేది. ఆ మాటలు మధురాతి మధురంగా ఉండేవి. అమ్మ ప్రసాదం తినే బయలుదేరే వాళ్ళం.
మావారు, నేను రచనలు చేస్తూ, రేడియో ప్రసంగాలు ఇస్తూ బాపట్లలో సత్ కాలక్షేపం చేస్తూ ఉండే వాళ్ళం.
మా బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు జిల్లెళ్ళమూడి వెళ్ళేటప్పుడో లేకపోతే తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వచ్చేవారు.
వారిలో శ్రీపుట్టపర్తి నారాయణాచార్యులు, నేదునూరి కృష్ణమూర్తి గారు ప్రముఖులు. వాళ్ళు చెప్పే అమ్మ సంగతులతో మాకు ఎప్పుడూ కాలక్షేపం అయ్యేది. ఒకసారి నేను, మా స్నేహితులు కలిసి అమ్మ పుట్టిన రోజుకి కారులో జిల్లెళ్ళమూడికి బయలుదేరాం. బాపట్ల నుంచి బయలుదేరిన తరువాత మధ్యలో రైలు గేటు వేయటంతో కొంచెం సేపు ఆగాల్సి వచ్చింది. అక్కడికి మల్లెపూలు అమ్ముతూ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మకు ఇద్దామని ఒక మూర పూలు కొని జిల్లెళ్ళమూడి చేరాం.
అమ్మ దగ్గరకు వెళ్ళేటప్పటికి అమ్మ ఉన్న హాలు అంతా భక్తులతో నిండి పోయింది. పూజ అయిపోయినట్లు ఉంది. అమ్మ మెడ నిండా పెద్ద పెద్ద గులాబీ దండలు వేసి ఉన్నాయి. పాదాల నిండా పూజా పుష్పాలతో నిండి అమ్మ జగన్మాతలా కనిపించింది. చేతులెత్తి నమస్కరించాను. నేను తెచ్చిన ఒక మూర మల్లెపూల దండ తీసుకుని అమ్మ దగ్గరకు వెళ్ళడానికి బిడియ బడ్డాను. అలాగే చాలా సేపు నిలుచుండి: పోయాను.
ఇంతలో ఒక అమ్మాయి వచ్చి, ఆ మల్లెమాల ఇవ్వండి అమ్మకు ఇస్తాను అంది. తరువాత ఆ దండ అమ్మ పాదాల దగ్గర పెట్టింది. అమ్మ నవ్వుతూ నా ఒంక చూసింది. సంతోషంతో నేను పులకించి పోయాను.
అందరూ ఆనందంతో మాటలూ, పాటలతో; హాలంతా ఎంతో ఆనందంగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేసేటప్పటికి చాలా పొద్దు పోతుందని తిరుగు ప్రయాణానికి కారు దగ్గరకు వచ్చాం.
ఒక అక్కయ్య వచ్చి భోజనం చేసి వెళ్ళండంటూ మెల్లగా అంది. మీకు ఎందుకండి శ్రమ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం అన్నాను. ఆ అక్కయ్య నేను వేరే పూరింట్లో కొంతమందికి వంట చేసాను అక్కడ తిని వెళ్ళింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి అంది. సరే అయితే, అలాగే వస్తాం అని, మా డ్రైవర్ ఇంటికి వెళ్ళి తింటాడు లేండి అన్నాను. అట్లా ఎందుకు అతనూ ఇక్కడే తింటాడు అంది. ఎవరూ తినకుండా వెళ్ళటం అమ్మకు ఇష్టం ఉండదు అంది నవ్వుతూ. అమ్మ దగ్గరకు వచ్చిన వారందరికీ సహృదయం వస్తుందేమో అనిపించింది.
ఆ అక్కయ్య ఆదరణగా పెట్టిన అన్నం ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ మరచిపోలేదు. అక్కయ్యకు మా సంతోషాన్ని తెలియచేస్తూ, నమస్కరిస్తూ పేరు అడిగాను. నవ్వుతూ పుణ్యవతి అంది. ఇక్కడికి వచ్చే వారికీ, ఇక్కడే ఉండే వారికీ, అమ్మ లాగే అందరినీ ఆదరంగా చూసుకునే మంచి మనస్సు వస్తుందేమో అన్నాను.
మేము అంతా మాట్లాడుతూ ఇంట్లో నుంచి వెళ్ళి వస్తాం అంటూ బయటికి వచ్చాం. ఇంతలో ఒక పదహారు సంవత్సరాల వయస్సు ఉండే అమ్మాయి ఒక పల్లెం నిండా పూలు పెట్టుకుని నాకు ఎదురుగా వచ్చి అమ్మకు పూజ చేసిన పూలు తీసుకోండి అంది. వెంటనే పమిట కొంగు పెద్దగా పట్టాను. నవ్వుతూ కొంగు నిండా పోసింది. రివ్వున వెను తిరిగి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు.
ఆ పూవులన్నీ ఇంటికి వచ్చాక పెద్ద దండ కట్టి దేముడు ఫోటోకి వేసాను. దేముడు కళ కళ లాడుతూ కనిపించాడు. సంతోషంతో నమస్కరిస్తూ అమ్మా అన్నాను. అమ్మకు పూజ చేసిన పూలు దేమునికి వేయ వచ్చునా అని మా వారి సందేహం. ఆ దేవుని స్వరూపమే, అమ్మగా మానవ జన్మనెత్తి మనకందరికీ దగ్గరలో ఉంది అన్నాను. వారు ‘అలాగా’ అన్నారు. అవును అంతే. దేముడు ఎవరు ఏ దృష్టితో చూస్తే అలా కనిపిస్తాడు. రాతిని దేమునిగా చెక్కి పూజించి, దేమునిగా చూస్తున్నాము. అవయవాలు శిల అనుకోవచ్చును. భగవదంశ ఉన్న వారు దేముడిని చూస్తారు. ఆయన కరుణకు పాత్రులు అవుతారు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి స్తంభంలో కనిపించాడు. భగవంతుడు అవతార పురుషుడు. సంభవామి యుగే యుగే అన్నారు.
…జయహో మాతా..