1. Home
  2. Articles
  3. Mother of All
  4. “నా దయ ఒడి దుడుకులే” – అమ్మ

“నా దయ ఒడి దుడుకులే” – అమ్మ

Mallapragada Acharya
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 20
Month : July
Issue Number : 3
Year : 2021

‘రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవో

 ద్వేజకమైన గాండీవము విల్లట సారధి సర్వభద్ర సం

 యోజకుడైన చక్రి యట యుగ్ర గదాధరుడైన భీముడ

 య్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటదేమి చోద్యమో!’

 ఈశ్వరుడు విష్ణు

డెవ్వేళ యెవ్వాని 

కేమి సేయు పురుషు

 డేమి యెఱుగు? 

అతని మాయలకు

 మహాత్ములు విద్వాంసు

 లణగి మెలగు చుందు

 రంధులగుచు ॥

 (ఆంధ్రమహాభాగవతం – ప్రథమ స్కంథం, పోతన)

ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అంపశయ్యపై ఉన్నాడు. భీష్ముడు. అతడి వద్దకు కుంతీ పాండవులు వ్యాస కృష్ణులతో కలసి వచ్చారు. తన కారణంగానే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని, రక్తపాతంతో వచ్చిన రాజ్యాధికారం తనకు వద్దని భావించిన ధర్మరాజు భీష్ముడి ఉపదేశంతో దారికి వస్తాడని ఆశించి, వ్యాసుడూ కృష్ణుడూ ధర్మరాజును తీసుకు వచ్చారు. వారందరినీ చూసి ఆనందించాడు భీష్ముడు. సంగతి చెప్పి, ‘ధర్మరాజుకు కర్తవ్యం బోధించవలసినది’గా భీష్ముణ్ణి కోరాడు కృష్ణుడు. అప్పుడు భీష్ముడు చేసిన సంభాషణలోనివి ఈ రెండు పద్యాలు.

“ధర్మరాజు చక్రవర్తి. ఇంద్ర తనయుడు, ధనుర్విద్యా విశారదుడు అర్జునుడు, అతడి ధనుస్సు గాండీవం. అది శత్రుసంహారక శక్తి గలది. అతడి రథానికి సారథి సమస్త శుభాలనూ సమకూర్చగల శ్రీకృష్ణుడు. భయంకరమైన గదా దండం ధరించిన భీముడు ఆ యుద్ధంలో వారికి తోడుగా నిలుస్తాడు. అంతటి వారే అయినా పాండవులకు ఎన్నో కష్టాలు రావటం ఎంత ఆశ్చర్యకరమో!

దైవం ఎవరికి ఎప్పుడు ఏమి చేస్తాడో, మానవులకు ఏమి తెలుస్తుంది? ‘అతడి’ లీలా విలాసాలకు మహాత్ములైనా, పండితులైనా ఏమీ తెలియని వారివలె తలవంచక తప్పదు” – ఇదీ ఈ పద్యాలకు తాత్పర్యం.

సాధారణంగా మనం – “అసమర్థులు కష్టాల పాలవుతారు. సమర్థులైనవారు హాయిగా సుఖ జీవనం సాగిస్తారు” – అని అనుకుంటూ ఉంటాము. అందుకే ముందుగా భీష్ముడు పాండవుల పరాక్రమ సామర్థ్యాలు ప్రస్తావించాడు.

అఖండ భూమండలాన్ని ఏకచ్ఛత్రంగా ఏలుకోగల సార్వభౌముడు ధర్మరాజు. దేవలోకానికి వెళ్ళి కాలకేయ నివాత కవచులను సంహరించిన మేటి విలుకాడు అర్జునుడు. దేవతలకు సాధ్యంకాని ఈ రాక్షస సంహారకాండను అవలీలగా నిర్వహించి, స్వర్గలోకంలో అర్ధ సింహాసన గౌరవం అందుకో గలిగిన జగదేక పరాక్రమశాలి అర్జునుడు. శత్రు సంహార సామర్థ్యం గల గాండీవం అతడి ఆయుధం. ఇక, అతడి రథానికి సారధి సామాన్యుడా? సమస్త శుభ ప్రదాత. అతడే చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు. గదా యుద్ధంలో ఆరితేరిన మహాబలశాలి భీముడు ఏ యుద్ధంలో అయినా వారి వెంట ఉంటాడు.

ఇంతటి సమర్థులే అయినా, పాండవులకు వచ్చినన్ని కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మనం మరో భావన కూడా చేస్తాం – ‘ఎంత సమర్ధులైనా, దైవానుగ్రహానికి నోచుకోలేకపోతే వారికి కష్టాలు తప్పవు’ – అని అనుకుంటాం మనం. అందుకే

పాండవుల సామర్థ్యాన్ని ప్రస్తావించిన తరువాత కృష్ణుణ్ణి ప్రస్తుతించాడు భీష్ముడు. “సర్వ భద్ర సంయోజకుడైన కృష్ణుడు” అర్జున రథానికి మాత్రమే కాదు, పాండవుల జీవిత రధానికే సారధి. సర్వభద్ర సంయోజకుడు – అంటే సాక్షాత్తూ భగవంతుడే. భగవంతుడే అండగా ఉన్నా, పాండవులు కష్టాలపాలు కాక తప్పలేదు – అంటున్నాడు భీష్మపితామహుడు.

అసమర్థులకు కష్టాలు తప్పవు. సమర్థులే అయినా, దైవానుగ్రహం పొందలేని వారు ఆపదలపాలు కాక తప్పదు. కాని, పాండవులు సమర్థులు. వారికి దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నది. అయినా, కష్టాలు తప్పలేదని సారాంశం. అపారమైన సామర్థ్యమూ అసమానమైన దైవానుగ్రహమూ ఉండి కూడా అసాధారణమైన కష్టాలు తప్పవనేది దీని ద్వారా మనం గుర్తించాలని సారాంశం. ఈ సారాంశాన్నే సమర్థిస్తూ తరువాతి పద్యం కొనసాగింది.

“భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? అతడి లీలలూ మాయలూ మహాత్ములకూ విద్వాంసులకూ సైతం అంతు పట్టవు.” మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలకు కారణం మన ఊహకు అందేది కాదని, కష్టాలు వచ్చినంత మాత్రాన అసమర్తులమని బావించటమో దైవానుగ్రహము లేదనుకోవటము మానవుల బలహీనత తప్ప యదార్థం కాదని గుర్తించాలి. కష్టాల్లో క్రుంగిపోయి, సుఖల్లో పొంగిపోయి, మానవుడు కర్తవ్యం విస్మరించరాదని, కష్టమూ సుఖమూ కూడా ఆ రూపంలో దైవం మనకు ఇచ్చే శిక్షణగా గుర్తించాలని సారాంశం. సుఖదుఃఖాలకు తట్టుకొని నిలబడే విధంగా మానవుడు తన్ను తాను మలచుకోవాలని, కష్టమైనా సుఖమైనా మనకేదో నేర్పటానికే వచ్చిందని గమనించి, ఆ దిశగా మన ఆలోచనలకు పదును పెట్టి, కర్తవ్యశీలురం కావాలని భీష్ముని ఉపదేశసారం.

“నా దయ ఉన్నంత మాత్రాన ఒడి దుడుకులు లేకుండా పోవు. నా దయ ఒడి దుడుకులే” – అని చెప్పిన (జిల్లెళ్ళమూడి అమ్మ వాక్యం ఈ సత్యాన్నే సూత్రప్రాయంగా సూచిస్తోంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!