అమ్మ యథార్ధ స్థితి – అయం ఆత్మా బ్రహ్మ
అమ్మ అవతార స్థితి – అహం బ్రహ్మ
అమ్మ వ్యవహారంలో – ప్రజ్ఞానం బ్రహ్మ
అమ్మ యదార్థ స్థితిలో వుండి, వ్యవహార స్థితిలో కూడా ఉండటం ‘తత్వమసి’ అనసూయ – అభేదము.
సృష్టిలో లోపం లేదు – దృష్టిలోపమే అన్ని అమ్మ వాక్యం నా భావనలోనిది. వ్యక్తీకరణ.
‘అమ్మ’ అని తలచుకోగానే ఒక పరిమిత రూపానికే గాక, చైతన్యశక్తిగా, బ్రహ్మగా భావించినపుడు వ్యాపకానికి చెందిన అనుభూతి కల్గుతుంది. ‘యద్భావం తద్భవతి’ అని గదా శాస్త్రవాక్యం. ఈ ‘సృష్టి అనాది, నాది’ అని స్పష్టపరచింది. అంటే ఈ కనబడే సర్వజగత్తుకు తానే ఆధారమని, తానే పోషక కర్తగా, లయకర్తగా ఈ సృష్టిని తానే వ్యక్తీకరించుకుని “అమ్మ”గా బహిర్గతమైనది. ‘నేను అనుకుంటేనే మీరు అనుకునేది’ అని అందరిలో తానే ఆ చైతన్యశక్తిగా ఉన్నానని స్పష్టపరుస్తూ, తన ఆదేశాను సారంగానే జరుగుతున్నదని దృఢపరచింది. మరి భేదం ఎక్కడ వచ్చింది?
ఈ సృష్టిని నేను చూసే విధానంలో లోపం ఉంది. ఏమిటా భేదం? ద్వంద్వ భావన. ఈ భేద భావం పోవాలంటే, నా దృష్టిని మార్చుకోవాలి. అది ఎలా తెలియాలి? ‘అమ్మ’ శరీరిగా ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా సూచనలు ఇచ్చింది. అప్పుడే గ్రహించలేనిది, ఇప్పుడెలా అర్థం చేసుకోగలను? ఎవరిని ఎలా ఎలా మార్చుకోవాలో, ఎవరిని ఏ మేరకు ఉద్దరించాలో వారి వారి అర్హతలను బట్టి మార్గం చూపిస్తుంది. అశరీరిగా అమ్మ ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. కాని దానిని తీసుకునే శక్తి ఇక్కడ లేనపుడు శరీరులుగా ఉన్న శ్రీసద్గురువు రూపంలో బోధిస్తోంది. ఈ దృష్టిని ఎలా మార్చుకోవాలో కూడ అమ్మ చూపించింది. “నేను మీలో దైవత్వాన్ని చూస్తాను, నాలో మీరు మానవత్వాన్ని చూస్తారు” అని సున్నితంగా మందలించింది. అందరిలో అమ్మను దర్శించడమే అమ్మను పొందడం. ఎలా? గురూపదేశమార్గం సహాయకారి. అశరీరులైన దేశికేంద్రియులు అనుభవింప చేయగలరు.
సాధన : రూపాలు అనేకం, స్వభావాలు వేర్వేరు. వీటిని వదిలి అందిరిలో ఆధారంగా ఉన్న ఆ చైతన్య శక్తి దృష్ట్యా చూస్తే ఏకమేగా. ఒక్కటే అనే భావన స్థిర పడినపుడు నామరూపాలకు ప్రాధాన్యత ఉండదు. గీతలో చెప్పిన ఒక శ్లోకం ఆధారంగా కూడా దృష్టికోణం మార్చుకోవచ్చు.
సత్వం రజస్తమ ఇతిగుణాః ప్రకృతి సంభవః
నిభద్నంతి మహాబాహో దేహీ దేహిన మయ్యయమ్||
ఈ ప్రకృతి మూడు గుణాలతో కూడుకున్నది. అంతా ప్రకృతిలోని వారమే. ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ గుణములకు లోబడటం వలన అనేకత్వం కనబడుతోంది. ‘గుణములు గుణములతో వర్తిస్తున్నయ్’ అన్న భావనతో చూస్తే వ్యక్తులు, నామరూపాల బలం తగ్గుతుంది.
ప్రతివారు తమ తమ సంస్కార, వాసనా బలముతో జీవిస్తున్నారు. కార్యరూపంలో జరుగుతున్న వాటిని సంస్కారవాసనా బలాలుగా గుర్తించినపుడు రాగద్వేషాల ప్రభావం పలచబడుతుంది. ‘అమ్మ’ ఇంకో మార్గం చూపించింది. అన్నిటికి ‘సరే’ అనటం. రెండక్షరాలే. సాధన చాలా ఉంది. ‘సరే’ అనే పదాన్ని మంత్రంగా తీసుకుని, మనో వాక్కాయ కర్మలుగా అలా జీవించినపుడు, తన సహజస్థితి అయినటువంటి ఆ ‘శాంతి’ని కొంత అనుభవించవచ్చు (ఆత్మశాంతి), ‘అమ్మ’ తన చరిత్రలో ఈ పదాన్ని ఎక్కడెక్కడ ఎలా వాడాలో చక్కగా ఆచరించి చూపించింది. ఇదే సాధనా చతుష్టయ సంపత్తి. వేదాంత వాక్యాలు అనుకుంటాం. కాని అమ్మ ప్రతివాక్కు వేదవాక్కు, అమ్మ చాలా తేలిక భాషలో అర్థమయ్యేలా చెప్తుంది. అనుకుంటాం. ఆ పదంలోని అర్ధం భావ గర్భితంగా ఉంటుందని ఇప్పుడు అర్ధం అయ్యేలా చేస్తోంది. వాచ్యార్థమేగాక, భావార్థము, లక్ష్యార్థము, మరికొన్నిటిలో సాధనావాక్యము సూచనగా అందిస్తోంది. ఉదాహరణకు – ‘నిగ్రహంకోసం విగ్రహారాధన’ – మనసును మూర్తిపై కేంద్రీకరించి పూజిస్తాం. ఆ కాసేపు ప్రశాంతతను అనుభవిస్తాం. ‘అమ్మ త్రిపుర’ కదా. ఈ పురంలో మూడు కాలాలలో, మూడు శరీరాలుగా, మూడు అవస్థలలో ఒకేలా ఉన్నది. సాకారము నుండి, నిరాకారోపాసన ద్వారా ‘అమ్మ’కు దగ్గర కాగలం. అమ్మను పొందడం కోసమే ఈ జన్మ. అమ్మానందమే బ్రహ్మానందం. ప్రతి ఒక్కరికి ఈ బ్రహ్మానందానుభూతి కలిగించాలని వేడుకూంటూ……..