“దయాస్వరూపంతో ఎప్పుడూ ఆర్ద్రమైన మనస్సు గల శ్రీమాతకి ‘నిత్యక్లిన్నా’ అని పేరు. “నిత్యం దయాక్లిన్నా సార్ధా” అని భాస్కరాచార్యుల వారి వివరణ.
త్రిపురాదేవి భక్తులకు భుక్తిముక్తులను ప్రసాదించే ‘నిత్యక్లిన్నా’ అని గరుడపురాణం వివరించింది “భారతీవ్యాఖ్య.
“దయామూర్తీ”, “సాంద్రకరుణా”, “కరుణారస సాగరా”, “అవ్యాజకరుణామూర్తి”, “రాజత్కృపా” ఇత్యాది ఎన్నో నామాలలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి దయాస్వభావాన్ని కీర్తించారు. అమ్మవారికి తన బిడ్డలపై అంతులేని ప్రేమ. అమ్మవారు “ప్రేమరూప” కదా! అంతులేని ఆ ప్రేమవలన అమ్మవారికి తన బిడ్డలపై అపారమైన కరుణ. ఆ కరుణ కారణంగా అమ్మవారు తన ఆశేష సంతానానికి భోగభాగ్యాలను, సుఖశాంతు లను, ధనధాన్యాదులను ప్రసాదిస్తూ “ప్రియంకరి” గా ప్రసిద్ధికెక్కింది. శ్రీ లలితాదేవి దయాస్వభావాన్ని వివరించే నామమే “నిత్యక్లిన్నా”.
“అమ్మ” “నిత్యక్లిన్న”. అందుకే “దయలేని మనస్సే దయ్యమేమో” అని దయ భగత్స్వరూపమని, ఆ దయే లేకపోతే దయ్యమే అని “అమ్మ” ఎంతో తేలిక భాషలో, అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పింది. దయలేని మనస్సు దయ్యమైతే దయగల మనసు దైవమేగా మరి. ఇంకా వివరణ ఇస్తూ “భగవంతుడు అంటే మనస్సే. అది ఎక్కడో లేదు” అన్నది. అంతటితో ఆగిందా? లేదే! “నేనూ మనస్సూ ఒక్కటే” – అని కూడా అన్నది. అంటే దయాస్వభావం గల మనస్సు ఉంటే అది భగవంతుడు. ఆ మనసు “అమ్మ”. అంటే దయా స్వభావమే రూపుదాల్చిన తల్లి కనుక “అమ్మ” – “నిత్యక్లిన్న”.
“నీకేమీ ఫరవాలేదు. నేను ఉన్నాను. నీకు చేసే వాళ్ళు లేరు అనుకోకు; నేను చేస్తాను. నాలోనే కలుపుకుంటాను” అని ఎందరికో వరాన్ని ప్రసాదిస్తూ అభయాన్ని అనుగ్రహించిన తల్లి. మాటలతో మాత్రమే కాదు; తన చేతలతో ఎందరికో స్వయంగా సేవలందించిన మాతృమూర్తి మన “అమ్మ”.
పక్షవాతంతో ఇరవై సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్న గుండేలరావుగారిపట్ల “అమ్మ” కురిపించిన కరుణారసవృష్టి అపూర్వం, అపారం. అప్పటికి “అమ్మ”వయస్సు పది కూడ దాటలేదు. అంత పసితనంలోనే ఒక పక్షవాతరోగికి “అమ్మ”, నారింజ పండు తొనలు తీసి నోటికి అందించడం, అన్నం కలిపి గోరుముద్దలుగా తినిపించడం, మూత్ర విసర్జనతో కలుషితమైన వస్త్రాలు తీసి శుభ్రవస్త్రాలు పరచడం వంటి పనులు చేసి ఆయనపై తన పరిపూర్ణ కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింప చేసింది. ఇలా ఒకరోజు, రెండు రోజులు కాదు; దాదాపుగా పదిహేను రోజులు. ఆయన కన్నుమూసేవరకు దగ్గరే ఉండి అన్ని సేవలూ చేసిన ‘నిత్యక్లిన్న’ “అమ్మ”. అందుకే గుండేలరావు గారు “అమ్మ”ను గురించి “నా రాముడే నా కోసం ఇట్లా అవతరించాడు. లేకపోతే నాపై అంత కరుణ ఎవరికి ఉంటుంది? అసలు దయార్ద్రహృదయం ఒక్క రాముడికి మాత్రమే ఉన్నది. నా రాముని ప్రేమకూ కరుణకూ కారణం లేదు. అందుకే ఈ దీనుని కోసం ఈ రూపం దాల్చి వచ్చాడు” అని, “అమ్మ”లో రాముణ్ణి దర్శించిన ధన్యజీవి. కారణం లేని ప్రేమ కనిపించని రోజుల్లో అకారణంగా తనకు తెలియని రోగగ్రస్తుడైన ఒక వ్యక్తికి చిన్నతనంలోనే అంతటి సేవలు చేసిన తల్లి “నిత్యక్లిన్న” కాదా మరి!
ఆ పసిప్రాయంలోనే తాను జ్వరంతో బాధపడుతూ నీరసంగా ఉండి కూడా కాలికి రాయి తగిలి క్రిందపడిన పాకీదాని కొడుకును చివాలున పరుగెత్తి వెళ్ళి చంకనెత్తుకున్న కరుణామూర్తి “అమ్మ”. అమ్మ తాతగారు వెంకట సుబ్బారావు “దీనిలో భూత దయ కనబడుతున్నది. జ్వరంతో ఉండి ఎంత వేగంగా పరిగెత్తిందో చూడండి. అది మనసులోని ఆవేగమే కాని కాళ్ళలోని వేగమా?” అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు. “అమ్మ” దయకు పిల్లవాడి పాకీతనం కూడా అడ్డు కాలేదు. పాకీది చూడకుండా ముందుకు వెళుతోంది. చాలామంది పెద్దవారు చూసినా, చలించలేదు. కాని పసిపిల్ల అయిన “అమ్మ” – దయార్ద్రహృదయ కనుక వెంటనే స్పందించి తన నీరసాన్ని కూడా లెక్క చేయకుండా ఒక్కఉదుటన వాడిని చంకనెత్తుకుంది అంటే దయాస్వరూపమే “అమ్మ” అనిపించక తప్పదు ఎవరికైనా!
పాలుగారే పసిప్రాయంలోనే “కరుణ లేకపోతే మనమే లేదు” అని ప్రకటించిన “అమ్మ”-నిత్యక్లిన్న. “అమ్మ” ప్రపంచానికి “అమ్మ”గా తెలిసిన తర్వాత తన కరుణను తన బిడ్డలపై వర్షించలేదు; బాల్యం నుంచీ “అమ్మ” సకలప్రాణులపట్ల ఎంతో దయను ప్రదర్శించింది. అది ఎవరి మెప్పుకోసమో కాదు. దయ నిత్యక్లిన్న. “అమ్మ”కు సహజ లక్షణం.
తన చిట్టి చిట్టి చేతులతో తనకు ప్రసాదంగా పెట్టిన వడపప్పును మరింతగా పెట్టించుకుని పెద్దరోట్లో వేసి పొత్రంతో తాను తిరుగుతూ పచ్చడి చేసి బిచ్చగాళ్ళకు అన్నంలోకి ఆధరువుగా పెట్టి వారి ఆకలి తీర్చిన తల్లి. “అందరి అమ్మ” గా గుర్తింపు పొందిన తర్వాత – గారెముక్కలు కాకులకు విసురుతూ అవి ముక్కుతో అందుకుని తింటుంటే ఆనందించిన తల్లి. లేనివాడి దగ్గర నుంచీ, బాగా డబ్బున్న వాడి దాకా అందరికీ అన్నంపెట్టి, బట్టలు ఇచ్చి ఆదరించిన అమృత హృదయ “అమ్మ”.
పిల్లీ, పిల్లి పిల్లలూ “అమ్మ”గదిలో చేరి, ఆ గదిని పాడు చేస్తున్నాయని, వాటిని ఒక గోతంలో మూటగట్టి దూరంగా వదలి వదిలించుకోవాలని చేసిన సోదరుల ప్రయత్నాన్ని వారించి, వాటిని గోతంలో నుంచి తీయించిన “అమ్మ”దయ ఎంతటిదో గదా!
“అమ్మ”ను చూడటానికి రోజూ క్రమం తప్పకుండా వచ్చి చూసే పెద్దకుక్కకు అంతిమ క్షణాలు సమీపించాయి. దయాసముద్ర అయిన “అమ్మ” తన వద్దకు రాలేని స్థితిలో ఉన్న ఆ ప్రాణివద్దకు తానే వెళ్ళి, దానికి తులసిదళాలు వేసిన పాలను స్వయంగా త్రాగించి, మూతి తుడిచి, ఒళ్ళంతా నిమిరి, దాన్ని సురక్షిత స్థానానికి చేర్చమని సూచించి, దానికి సుగతిని అనుగ్రహించింది.
సాటి ప్రాణి బాధకు మనస్సు ద్రవించి, కన్నీరుగా ప్రవహించటమే క్లిన్నత్వం. ఒకసారి ఒక ఎద్దు తను ఉన్న ఊరు దాటి ప్రక్క ఊరిపొలంలో మేత మేస్తుంటే, ఆ పొలం యజమాని నిర్దయగా ఆ ఆంబోతు మెడమీద గడ్డ పలుగుతో క్రూరంగా కొట్టాడు. అది అంత బాధతో తన యజమాని వద్దకు వచ్చింది. ఆ యజమాని దానికి ఎంతో చికిత్స చేయించినా, ఆ మర్నాడే అది ప్రాణం కోల్పోయింది. ఈ సంఘటన వివరిస్తూ ఉండగా, “అమ్మ” కంఠం రుద్ధమై, కన్నీరుబికి, మాటరాక ఉండిపోయింది. ఇదే క్లిన్నత్వం. అందుకే “అమ్మ” నిత్యక్లిన్న.
భుక్తి, ముక్తి ప్రదాయిని అయిన “అమ్మ” మనకు కడుపునిండా అన్నం పెట్టింది. ఒంటి నిండా కప్పుకునేటందుకు బట్టలు ఇచ్చింది. అంతటితో ఆగక, కాస్త ముందు అనుగ్రహించింది. – వెనుకల తేడాతో అందరికీ సుగతిని అనుగ్రహించింది. ఇలా “అమ్మ” జీవిత మహోదధిలోని తరంగాలను తరచి చూస్తే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు “అమ్మ” దయకు అద్దం పడుతూ ఉంటాయి, అలాంటి “అమ్మ”- నిత్యక్లిన్న.
అర్కపురిలోని అందరింటిలో శ్రీ అనసూయేశ్వరా లయంలో నిత్యక్లిన్నగా కొలువుతీరిన “అమ్మ”ను దర్శించి, స్మరించి, భజించి, తరించుదాం.