‘ముక్తి’ అంటే విడుదల. మనస్సు ప్రపంచ సంబంధమైన విషయాల్లో చిక్కు పడకుండా విడుదల ‘ముక్తి’. లలితాదేవి నిత్యమూ ముక్త స్థితిలోనే ఉంటుంది. నిత్యమూ బద్ధమై (కట్టుబడి) ఉండడం జీవలక్షణం. నిత్యమూ ముక్తమై (విడుదలై) ఉండడం దైవ లక్షణం. లలితాదేవి ‘నిత్యముక్త’. కర్మలూ, కర్మఫలాలు, విషయవాసనలు, ప్రాపంచిక బంధాలు – మొదలైన వాటికి కట్టుబడకుండా, శోక, మోహ, భయాలకు అతీతంగా ఉండే ‘నిత్యముక్త’ స్వరూపిణి లలితాదేవి. తానే మోక్షమై, తన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే దేవి “నిత్యముక్త” …… భారతీవ్యాఖ్య.
మానవులమైన మనకు ఈ ప్రాపంచిక విషయాలతో బంధం బలంగా ఉంటుంది. ఇది కేవలం మానవులకు మాత్రమే పరిమితం కావడం లేదు. మనం పెంచుకునే పశుపక్ష్యాదులపైనా, మనం సమ కూర్చుకున్న వస్తు సముదాయం పైన కూడా తెలియని బంధం ఏర్పడుతోంది. మన బంధువులో, ఆత్మీయులో తాత్కాలికంగా దూరమైనా, శాశ్వతంగా దూరమైనా మనం భాధపడుతూ ఉంటాం. ఇవేవీ శాశ్వతం కావని తెలిసినా, అసలు మన ఉనికే అశాశ్వతం అని తెలుసుకుని కూడా, ఆ నిజాన్ని ఇముడ్చుకోలేక బాధ పడుతుంటాం. లలితాదేవి ఇలాంటి బంధాలకు అతీతమైనది కనుక ఆ తల్లి ‘నిత్యముక్త’.
“అమ్మ” “నిత్యముక్త”. “ వైకల్యం లేనిదే కైవల్యం” అని నిర్వచించిన “అమ్మ”కు ఎవరిపైనా, దేనిపట్ల కూడా బంధమూ లేదు; విముఖతా లేదు. “బంధం బాధిస్తుంది” అని ప్రవచించిన “అమ్మ”కు ఎవరితోనూ ఎలాంటి ప్రత్యేకమైన బంధం లేదు. కనుక ఆ తల్లికి ఎలాంటి బాధా లేదు. “సర్వత్రా అనురాగమే విరాగం” అని కదా “అమ్మ” ప్రబోధం. “అమ్మ”కు అందరూ, అన్నీ సమానమే. చరాచరసృష్టిని తన బిడ్డలుగా చూసిన తల్లి. కనుక “అమ్మ”కు ఏదీ బంధంగా మారి బాధించలేదు. అందువల్ల “అమ్మ” “నిత్యముక్త”.
నాలుగేళ్ల పనిప్రాయంలోనే కన్నతల్లిని కోల్పోయిన “అమ్మ”కు ఆ సమయంలో ఎలాంటి దుఃఖమూ కలుగలేదు. సరికదా! దుఃఖిస్తున్న తండ్రితో, బంధువులతో “అమ్మ” చేసిన సంభాషణ అప్పటి వారికే కాదు, ఇప్పటి వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
‘అమ్మ చచ్చిపోయింది” అని చెప్పిన తండ్రి సీతాపతిగారి కన్నీళ్ళను తన బుల్లి బుల్లి చేతులతో తుడుస్తూ, “చచ్చిపోవడమంటే ఏమిటి?” అని ప్రశ్నించింది “అమ్మ”. ముఖంలో ఏ మార్పూ లేకుండా, కంటిలో చుక్క నీరు లేకుండా నిశ్చలంగా ఉన్న “అమ్మ”ను చూసిన బంధువులకు ఆ అమ్మాయికి విషయం అర్థం కాలే దనుకున్నారు. అర్థం అయ్యేటట్లు చెప్పటానికి ప్రయత్నించారు. చివరకు చిదంబర రావు తాతగారు చచ్చిపోయినవారు దేవుడి ఇష్టం ప్రకారం దైవంలోకి వెళతారని చెప్పారు. “దైవం పంపిన మనిషి దైవం ఇష్టం ప్రకారం దైవంలోకి పోతే, మధ్యలో మనకు ఏడు పెందుకు తాతయ్యా” అని ప్రశ్నించింది “అమ్మ”. అంతటితో ఆగలేదు “అమ్మ”. “అసలు- నాన్నా- ఎవరు మా అమ్మ. పోయింది మా అమ్మా? ఈ శరీరం మా అమ్మా? ఈ శరీరమే అయితే పోలేదు. పోయిందే మా అమ్మ అయితే దానిని ఇదివరకు చూడలేదు. మరెందుకు ఇక బాధ?…” అన్నది. ఇది పసిపిల్లగా ఉన్న “అమ్మ” చేసిన తత్త్వబోధ. వేదాంతానికి పరాకాష్ఠ. ఈ ముక్తస్థితి “అమ్మ”కు ఏ సాధన వల్లా వచ్చింది కాదు. పుట్టుకతోనే వచ్చిన సహజమైన స్థితి. అందుకే “అమ్మ” ‘నిత్యముక్త.
“అమ్మ” మేనత్త భర్త (మామగారు) బ్రహ్మాండం సుబ్బారావుగారు మరణించినప్పుడు కూడా “అమ్మ” చిన్న బాలిక. అయినా ఆ కుటుంబానికి తాను ఉన్నాను అనే ధైర్యాన్నీ, ఊరటను కలిగించింది. తన అత్తగారు కనకమ్మ (బామ్మ) గారు, తన తండ్రి సీతాపతి (తాతగారు) గారు మరణించి నప్పుడు కూడా నిర్విచారంగా కర్తవ్యపాలన చేసిన “అమ్మ” . ‘నిత్యముక్త’.
“తనను కన్నవాళ్ళ మీద కంటే తను కన్నవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ” అనే “అమ్మ” వాక్యం సార్వకాలికమైన, విశ్వజనీనమైన సత్యం. విశ్వజనని అయిన “అమ్మ”కు ఈ చరాచరసృష్టీ తన బిడ్డలే. కనుక, “అమ్మ” ప్రేమ అందరిపట్ల, అన్నింటిపైనా సమానమే. “నా గర్భతీపి సర్వత్రా ఉంటుంది” అని చెప్పింది కదా! “అమ్మ”. అలాంటి “అమ్మ” కడుపున పుట్టడం ఆమె సంతానం చేసుకున్న పూర్వపుణ్యఫలం. ఆ అదృష్టానికి నోచుకున్న భాగ్యశాలిని హైమ. అయితే యుక్త వయస్సులోనే పరమపదాన్ని చేరుకున్న హైమవతీదేవికి ‘నిర్మమ’గా తన కర్తవ్యాన్ని నిర్వహించడం ‘నిత్యముక్త’ అయిన “అమ్మ” కే సాధ్యం. 6-4-1968 న హైమకు జరుగవలసిన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించిన “అమ్మ” ఆ మరునాడు (7-4-1968) ఉదయమే “పదార్చన” అనే పుస్తక ఆవిష్కరణ సభలో వేదిక నలంకరించి అందరినీ అలరించింది. సృష్టి, స్థితి లయకారిణి అయిన “అమ్మ”.. హైమ ప్రతిష్ఠను గురించి “ఏముంది అందులో? దానిని ఎలా కన్నానో, పాలు ఎలా ఇచ్చానో, అన్నం ఎలా పెట్టానో, ఇదీ అట్లాగే చేశాను” అని చెప్పిన – ‘నిత్యముక్త’.
తనను కన్న తల్లిదండ్రుల విషయంలో, తాను కన్న హైమక్క విషయంలో “అమ్మ” లోని ముక్త స్థితికి అబ్బురపడతాం. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే….. తనకు తాళి కట్టిన భర్త దివంగతులై నప్పుడు కూడా “అమ్మ” ఎంతో నిశ్చలంగా ఉన్నది. ఇంచుమించుగా ఒక రోజంతా “అమ్మ” అదేవిధంగా ఉన్నది. ఆ తరువాత కార్యకర్తలకు కర్తవ్యోపదేశం చేసింది. దుఃఖ సాగరంలో మునిగిన అందరింటి బిడ్డలందరితో “నాన్నగారు ఎక్కడకూ వెళ్ళలేదు. వెళ్ళరు. మనతోనే మన మధ్యనే ఉంటారు” అని ధైర్యం చెప్పింది. “మరణమంటే పరిణామమే” అని చెప్పిన “అమ్మ” తనకు ప్రాణాధికమైన నాన్నగారి మరణం గురించి… “సృష్టిలో సహజమైన పరిణామం జరిగింది. ఎవరూ దుఃఖ పడాల్సిన అవసరం లేదు”….అని చాలా ప్రశాంతంగా ప్రకటించింది. ‘నిత్యముక్త’ అయిన “అమ్మ” కు మాత్రమే ఇది సాధ్యం.
విశ్వజనని అయిన “అమ్మ”కు ఎవరూ సొంతం కాదు; ఎవరూ పరాయివారు కాదు. అందరి జనన మరణాలు సృష్టిలోని సహజ పరిణామం గానే “అమ్మ”కు అనిపిస్తాయి. అందుకే, “నిర్ణయించినవాడు కూడా నిర్ణయానికి బద్ధుడే” అని నిర్ద్వంద్వంగా ప్రకటించి, ఆ నిర్ణయానికి తానూ కట్టుబడిన “అమ్మ” 12-06-1985న తన నాటకానికి భరతవాక్యం పలికి, తెరదించేసింది..
అందరింటిలోని అనసూయేశ్వరాలయంలో ‘నిత్యముక్త’ గా కొలువు తీరిన మాతృశ్రీ అనసూయా మహాదేవి చరణకమలములకు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లుతూ….
జయహోమాతా …