శ్రీ సోమయాజులుగారు యజ్ఞయాగాది క్రతువుల్ని, వేదవిహిత కర్మల్ని ఆచరించారు. వారు అమ్మను “సత్యం అంటే ఏమిటమ్మా?” అని అడిగితే అమ్మ “నిత్యమైనది” అని సరళంగా సూటిగా నిర్వచించింది.
‘సదసద్వివేచన’ అనీ ‘నిత్యానిత్యవస్తువివేకము’ అనీ వేదాంత శాస్త్రపరంగా రెండు పారిభాషిక పదాలు ఆ వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. సత్+అసత్ + వివేచన = సదసద్వివేచన; నిత్య + అనిత్య + వస్తువివేకము = నిత్యవస్తువివేకము కదా! సత్యం కానిది ఒకటి ఉన్నదని ముందుగా ఊహించి ఇది సత్యము, ఇది అసత్యము అని విభజన చేస్తారు. అలా పోగా పోగా అంతా సత్యమే అని తెలుస్తుంది. అదే విధంగా ఇది నిత్యము, ఇది అనిత్యము నేతి, నేతి – న + ఇతి – ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ పోగా పోగా అంతా నిత్యమే అని తెలుస్తుంది.
‘బ్రహ్మసత్యం – జగన్మిథ్య’ అంటే “అంతా సత్యమే, నాన్నా! మిధ్య ఏమీ లేదు” అన్నది. మిధ్య అంటే మార్పు లేదు అని కాదు. సృష్టి పరిణామ శీలం కలది. సృష్టికి నాశనం లేదు. Matter or Energy can neither be created nor destroyed oo SCIENCE.
భౌతిక దృష్టితో చూస్తే నిత్యమైన వాటికి SCIENCE పరంగా కొన్ని ఉదాహరణల నివ్వవచ్చు. సున్నపురాయి (CaCO)ని వేడిచేస్తే కాల్షియం ఆక్సైడ్, కార్బన్ ఆక్సైడ్గా విడిపోతుంది. లోహాలన్నీ మంచి విద్యుద్వాహకాలు, అలోహాలన్నీ (గ్రాఫైట్ తప్ప) విద్యున్నిరోధకాలు. నీరు సార్వత్రిక ద్రావణి (Universal Solvent) కాంతి తరంగాలు, ధ్వనితరంగాలు, ఋజుమార్గంలో ప్రసరిస్తాయనేది సత్యమే; కానీ వాటిని నిరోధించే వస్తువులు ఎదురైనపుడు వంగి ప్రయాణం చేస్తాయి అనేదీ సత్యమే. నక్షత్ర ప్రకాశం, గ్రహగమనాలూ సత్యమే – నిత్యమే.
సత్యేన ధార్యతే పృధ్వీ సత్యేన తపతేరవిః |
సత్యేన వాయవో వాంతి సర్వ సత్యేప్రతిష్ఠితమ్ ॥
అనేది ఆర్థోక్తి. భూమి సత్యము వలననే నిలబడింది; సూర్యుడు సత్యము వలననే ప్రకాశిస్తున్నాడు, వాయువు సత్యము వలననే వీస్తోంది; అంతా సత్యంలోనే ప్రతిష్టించబడింది అని. ‘బ్రహ్మ’ ని కూడా సత్యమనే నిర్వచించించాయి వేదాలు – సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ – అని.
సత్యస్వరూప ఆవిష్కరణకి ఒక ఉదాహరణ.
“మనస్సే దైవం” అన్నది అమ్మ. మనస్సు చంచల స్వభావం కలది; సంకల్ప వికల్పాత్మకమైనది. దీనికి అమ్మ చక్కని వివరణ నిచ్చింది. “సంకల్పము, వికల్పము అని రెండు ఉన్నాయి, నాన్నా! సంకల్పము అంటే ఒక ఆలోచన వచ్చిందీ అని; వికల్పము అంటే అది మారిందీ అని. సంకల్పమూ వికల్పమూ రెండూ ఆ శక్తివే నన్న సంకల్పమే సత్సంకల్పం” – అని. కనుకనే అమ్మ “అంతా వాడే చేస్తున్నాడని నమ్ము” అనే దివ్య సందేశాన్ని ఇచ్చింది.. అది సందేశమే కాదు, ఆదేశము కూడా. వేదాలు ఒక దిశా నిర్దేశంచేసి “ఏతత్ ‘అనుశాసనం’. ‘ఏవం ఉపాసితవ్యం’ అంటే ఇది శాసనం (MAXIM), ఈ విధంగా దీనిని గ్రహించాలి, ఆచరించాలి – అని ఆజ్ఞాపిస్తాయి.
ఈ సారాంశాన్ని ఒక చిన్న సన్నివేశం ద్వారా వివరిస్తాను. ఒకనాడు అమ్మ గదిలో మంచం మీద కూర్చున్నది. “ఆరు బయట కూర్చుంటాను” అన్నది. అమ్మ మంచం, దిండు, దుప్పటి, వెండిపీట, కుంకం పొట్లాలు అన్నీ తెచ్చి బయట ఏర్పాటు చేశారు. అమ్మ వచ్చి ఆసీన అయింది. “అమ్మా! దిండు ఏవైపు పెట్టమంటావు?” అని అడిగారు. అంటే ఉత్తరం వైపా దక్షిణం వైపా అని ఉద్దేశం. అమ్మ నవ్వుతూ “ఏ దిక్కు అయినా ఒకటే. అన్నిటికీ వాడే దిక్కు” అన్నది. కనిపించని ఈశ్వరుడు, ఈశ్వర సంకల్పము, ఈశ్వర సృష్టి సత్యమే కనిపించే జీవులు అందలి రక్తప్రసరణ, హృదయ స్పందన, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, ఇంకా సృష్టి స్థితిలయాలు…. సత్యమే.
“జడం ఏమీ లేదు, నాన్నా! అంతా చైతన్యమే” అనే అమ్మ వాక్యం సంశయచ్ఛేద వచనం ఈ సందర్భంగా కూడా.
అమ్మ ప్రేమ సత్యం.
అమ్మ లాలన, పాలన, పోషణ, రక్షణ, శిక్షణ, సంస్కరణ సత్యం.
నిరుపమానమైన అమ్మరాగం అనన్యసామాన్యమైన త్యాగం సత్యం.
అమ్మ అనుగ్రహం – ఆశీర్వచనం సత్యం. విశ్వకళ్యాణకారక అమ్మ సంకల్పం సత్యం.
అమ్మ సౌందర్య విశేషం – శేముషీవైభవం సత్యం. అమ్మ వాక్కు – దృక్కు సత్యం.
అమ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిత్యం, సత్యం.
అమ్మ ఆదరణ – అమ్మ ఆప్యాయత సత్యం.
అమ్మ అకారణకారుణ్యం ఆశ్చర్యకర వాత్సల్యం సత్యం. అమ్మ కన్నీరు సత్యం;
బిడ్డల కన్నీరు తుడవటానికి అమ్మపడే తాపత్రయం సత్యం. అమ్మ అతివర్ణాశ్రమ తత్త్వం ఘటనాఘటన సామర్థ్యం సత్యం. అమ్మ అనసూయా తత్వం – మానవతా మాధవత్వ మధుర సమ్మేళనం సత్యం. కాస్త ముందూ వెనకా అయినా జీవులంతా అమ్మలో లీనం కావడం సత్యం.
అమ్మ నిత్యం – సత్యం.