నేను ఒక రోజు గుంటూరులో ఉండగా ఒక విచిత్రమైన కలవచ్చింది. ఆకలలో నేను తెనాలి కారులో పోతున్నాను ఆ మధ్య. అనగా నారాకోడూరు తెనాలి రోడ్డు మధ్యలో కొన్న క్వారీస్ వున్నవి. అక్కడ కొండలకు సంబంధించిన ఎర్రకంకర, కంకరమట్టి త్రవ్వి, గోతులు, గోతులుగా తీసారు. అక్కడకు వెళ్ళేటప్పటికి నేను పాస్కు పోవలసిన ఆవశ్యకత ఏర్పడ్డది. కారుక్రిందకు దిగాను. ఆ క్వారీల నుండి ఒక పెద్ద పాము రెండు తలలు కలది నిటారుగా నిలబడి నన్ను చూస్తున్నది. నేను ఆశ్చర్యపోతూ నమస్కరించాను. ఆ పాము అన్నది నేను నిన్ను 1 1/2 సంవత్సరాల నుండి చూస్తూనే యున్నాను అని. 11/2 సంవత్సరాల నుండి నన్ను చూడటమేమిటో నాకు అవగతము కాలేదు. అంతే మెలుకవ వచ్చింది. లేచాను. కలను గురించి తీవ్రంగా ఆలోచించటము మొదలు పెట్టాను. ఒకరోజు జిల్లెళ్ళమూడిలో నవనాగ నాగేశ్వరాలయంలో ప్రదక్షిణాలు చేస్తున్నాను. మళ్ళీ ఆ సర్పము నా మనోఫలకము మీద ముద్రవేసింది. అప్పుడు ఆలోచించాను. ఈ ఆలయప్రతిష్ఠ జరిగి ఎన్నాళ్ళు అయింది అని. అప్పుడు నేను వాకబు చేయగా తెలిసింది ఈ ప్రతిష్ట జరిగి సరిగా అప్పటికి 1 1/2 సంవత్సరాలైంది అని. అంటే శిలారూపంలో ఉన్న ఆ నవనాగేశ్వరుడు కూడా నన్ను చూస్తున్నాడు అనిపించింది. మరి శిలారూపంలో యున్న నవనాగేశ్వరుడు నన్ను చూస్తున్నాడా? అట్లా చూడటానికి అవకాశం ఉన్నదా ? అని. శిల శిలయై యున్నప్పుడు అది రాయి. దానికి ప్రాణ ప్రతిష్ట జరిగితే అది దేవుడు. రాయిలో కూడా ప్రాణముంటుంది. ఇంకా ప్రాణప్రతిష్ట చేయట మెందుకు? అదివరకు ఉన్నది రాయి అని మనము ప్రాణప్రతిష్ఠ చేశాము అనే భావన చేతనే ప్రాణప్రతిష్ఠ జరిగినట్లుగా భావింపబడుతోంది. అప్పటినుండి జడములు కూడా ప్రాణము ఉన్నట్లే భావన నమ్మకము. “నమ్మకమే భగవంతుడు” అంది అమ్మ. ఒకసారి అమ్మ అంది “ఒకరాయిని పెట్టి కుంకుడు కాయలు కొట్టితే అది గుండ్రాయి అవుతుంది. దానికే ఆలయములో పెట్టి అభిషేకాలు పూజలు చేస్తే అది శివుడు అవుతుంది” అంటే ఇంతకు అది మన భావనలోనే. మనమెట్లా భావిస్తే అట్లా జరుగుతుంది. యత్ భావం తత్భవతి అన్నట్లు ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయటంలో మనలో ఉన్న ఆత్మను దానిలో ప్రతిష్ఠ చేయటమే. అనగా దానిని ఆత్మగా చూడటమే. అంటే అందులో మనను చూడటమే. ఆలయాలలోని విగ్రహాలను చూచినపుడు మనం దర్శించేది. మన ఆత్మనే అనగా మననే దర్పణాయుత మనను మనము చూచినట్లే.
నిన్ను నేను చూస్తూనే ఉన్నాను
K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : April
Issue Number : 9
Year : 2011
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.