“క్రోధం (కోపం) మానవుని సర్వనాశనానికి కారణం. క్రోధం బుద్ధిమాంద్యం కలిగిస్తుంది. మందబుద్ధికి వినాశం తప్పదు. అలాంటి క్రోధం లేనిది శ్రీమాత. రాగద్వేషాత్మకమైన మనస్సు క్రోధానికి పుట్టినిల్లు. శ్రీమాతకు వాత్సల్యమే కాని క్రోధం లేదు. దేవికి అందరూ సమానులే. ఆమె నిప్రోధ.”
“నిస్క్రోధ అయిన లలితాదేవి తన భక్తుల క్రోధాన్ని కూడా శమింప చేస్తుంది. క్రోధాన్ని ఉపశమింపజేసి, సన్మార్గంలో సాధకులను నడిపించే శ్రీమాత క్రోధశమని” – భారతీవ్యాఖ్య.
“తన కోపమె తన శత్రువు….” అనే పద్యం తెలుగు వారందరికీ కంఠస్థమే. అయితే, ఆ భావాన్ని హృదయస్థం చేసుకున్న మహానుభావులు మాత్రం కొద్దిమందే. కోపం మానవులకు సహజలక్షణం. పసితనంలో కూడా కోపం ఉంటుంది. పసిపిల్లలు తమ కోపాన్ని ఏడుపురూపంలో వ్యక్తం చేస్తారు. “బాలానాం రోదనం బలం” అని వాడుకలో ఉన్నది. తమ మనస్సులోని కోరికను తీర్చుకునేటందుకు వారు ఏడుపును ఆయుధంగా ప్రయోగించి, తామనుకున్నది సాధిస్తారు. అయితే, కోపం వేరు, క్రోధం వేరు. కామక్రోధ లోభ మోహమదమాత్సర్యాలు’ అనే అరిషడ్వర్గంలో ‘క్రోధం’ అనే చెప్పారు. క్రోధం చాలా ప్రమాదకరమైనది. కోపం తాటాకు మంటలాంటిది. క్షణంలో మింటి కెగసి, మరుక్షణంలో చల్లారి పోతుంది. కాని, క్రోధం అలాకాదు. కోపం ముదిరి క్రోధంగా మారుతుంది. క్రోధం ఉన్నవారు జీవితాంతం సాధిస్తూ, కసి తీర్చుకుంటూ ఉంటారు. క్రోధం కారణంగానే ఈనాడు రకరకాల కక్షసాధింపు చర్యలను మనం చూస్తూ ఉన్నాం. అలాంటి క్రోధం లేని శ్రీమాత నిస్క్రోధ. ఆ తల్లి క్రోధశమని కూడా.
“అమ్మ” నిప్రోధ, క్రోధశమని”, “తాత్కాలికమైన భావం కోపం. శాశ్వతమైన కక్షసాధించడం క్రోధం” – “అమ్మ”. అలాంటి క్రోధపూరితమైన సంఘటనలు ఏవీ “అమ్మ” జీవితంలో మనకు మచ్చుకైనా కనిపించవు. మనకు కోపం వస్తుంది. కాని, “అమ్మ” కోపాన్ని తెచ్చుకునేది. తన బిడ్డలను మందలించవలసి వస్తే, తాత్కాలికంగా “అమ్మ” కోపాన్ని అభినయించేది. తనను ప్రేమించిన వారినే కాదు; ద్వేషించినవారిని, దూషించిన వారిని, హింసించిన వారిని, హత్యాయత్నం చేసినవారిని, తన గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిని కూడా ప్రేమించి, లాలించగల మనస్తత్వం మన “అమ్మ”ది. అందుకే “అమ్మ” నిధ. ఇది “అమ్మ” కావాలని తెచ్చిపెట్టుకున్నది కాదు. ఇది “ఆమె” కు సహజగుణం. బాల్యం నుంచి “అమ్మ” తనకు హాని చేసినవారిపై కూడా తన వాత్సల్యాన్నే కురిపించింది కాని, కోపాన్ని ప్రదర్శించలేదు.
బాల్యంలోనే “అమ్మ” ఒంటిమీది సొమ్ములను తీసుకోవడంతో ఆగక, “అమ్మ”ను చంపాలని సముద్రంలోకి విసిరి వేసిన జాలరిని కూడా ప్రేమతో కాపాడిన ‘కరుణారస సాగర’ – “అమ్మ”. చిన్నతనంలో – చిదంబరరావు తాతగారి అమ్మాయి, భారతిగారు “అమ్మ” జడపట్టుకుని, లాగి, క్రిందకు పడదోస్తే, దాన్ని కప్పిపుచ్చి, తానే వెనక్కి తూలినట్లు తాతగారికి చెప్పిన “అమ్మ” నిస్క్రోధ. “అమ్మ”గా అందరి పూజలూ అందుకుంటున్న దశలో, శాయమ్మగారు పొరబాటున “అమ్మ” కూర్చునే పీటను తీసివేస్తే, పీట ఉందనుకొని, కూర్చోబోయిన “అమ్మ” వెల్లకిలా పడింది. అందరూ శాయమ్మగారిని కోప్పడుతుంటే, వారిని వారించి, అందులో ఆమె తప్పేమీ లేదని, గమనించకపోవడం తన తప్పని, వారికి నచ్చచెప్పి, వారి కోపాన్ని ఉపశమింప చేసింది “అమ్మ”. కోపాన్ని శమింప చేసుకునే విధానాన్ని తన ప్రవర్తన ద్వారా మనకు తెలియజేయడానికే తప్ప, ‘సహస్రాక్షి’ అయిన “అమ్మ”కు గమనించక పోవడం ఉంటుందా?
జిల్లెళ్ళమూడిలోని అందరింటి’ పై దాడిచేసి, ఆశ్రమ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన నక్సలైట్లను గుర్తించి, బంధించి తెచ్చి “అమ్మ” ముందు నిలబెడితే – వాత్సల్యామృత వర్షిణి అయిన “అమ్మ” – ముందు వారి భోజనం సంగతి చూడమని, అన్నానికి ఆలస్యం ఉంటే, ఈ లోగా ‘టిఫిన్’ పెట్టించి, తరువాత విచారణ చేయమని ఆదేశించిన “ప్రేమ రూప”. వయస్సులో ఉన్న “అమ్మ”ను అవమానించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి, ఆ తరువాత కాలంలో “అమ్మ” దర్శనానికి వస్తే, అతనిని ప్రేమగా ఆహ్వానించి, తన దగ్గరగా కూర్చోబెట్టుకుని, అతని తల, వీపు నిమురుతూ, కుశల ప్రశ్నలు వేసి, అరటిపండు ఒలిచి నోటికి అందించి, బొట్టుపెట్టి, కొత్తబట్టలు పెట్టి, ఆదరించిన “అమ్మ” నిధ. దురదగొండాకుతో పూజించినా, గుండ్రాళ్ళతో అర్చించినా మారుమాట్లాడక పోగా, వారిపై కూడా తన అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరించిన “అమ్మ” నిస్క్రోధ. ఇలా చెప్పుకుంటూ పోతే, “అమ్మ” జీవితచరిత్ర పుటల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో!
నిప్రోధ అయిన “అమ్మ” – తన బిడ్డలలోని క్రోధత్వాన్ని తొలగించగల క్రోధశమని. చీరాలలో కీ॥శే॥ డా॥ నారపరాజు శ్రీధరరావుగారికి డాక్టరుగా ఎంత పరపతి ఉన్నదో, అంతకంటే ఎక్కువగా ‘మహాకోపిష్టి’ అనే పేరు ఉన్నది. ఆయన కోపానికి ఇంటా బయటా, స్వ-పర, భార్యా-బిడ్డలూ అనే భేదం లేదు. అందరూ ఆయన కోపానికి గురైన వారే; భయపడినవారే. ఒక్కొక్కసారి ఆయన కోపం, క్రోధంగా మారి రోజుల తరబడి కుటుంబసభ్యులతో మాట్లాడని సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఆయన తన చివరి రోజుల్లో (నాలుగయిదు సంవత్సరాలు) ప్రశాంతగంభీరులై, కోపతాపాలకు అతీతులై, ఒక సాధకుడిగా జీవితం గడపడం “అమ్మ” అనుగ్రహవిశేషమే. ఎందుకంటే – “స్వభావో దురతిక్రమః” అనీ, “పుట్టుకతో వచ్చిన బుద్ధిపుడకలతోనే పోతుంది” అనీ లోకంలో వింటున్నాం. “అమ్మ” కూడా – “భావం మారేది. స్వభావం మారనిది” అన్నది. అలాంటి మారని స్వభావాన్ని కూడా మార్చే శక్తి “అమ్మ”కు మాత్రమే ఉన్నది.
డా॥ శ్రీధరరావు గారిలో వచ్చిన ఈ గొప్ప మార్పును ఆయనకు సమీపవర్తినిగా, సన్నిహితంగా ఉన్న నేను ప్రత్యక్షంగా, స్పష్టంగా గమనించాను. ఆయనలోని మానసిక పరివర్తనకు పరాకాష్ఠ – భార్యను కూడా (చివరి రెండు సంవత్సరాలు) ‘అమ్మా’ అని సంబోధించడం. నిషోధ అయిన “అమ్మ” క్రోధశమనిగా కోపస్వభావులైన శ్రీధరరావుగారిని కటాక్షించిన తీరు అత్యద్భుతం.
నిప్రోధ, క్రోధశమని అయిన అర్కపురీశ్వరి మాతృశ్రీ. అనసూయామాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ – నాలోని కోపతాపాలను స్వీకరించి, శాంతి సహనాలను నాకు ప్రసాదించమని నిండు మనస్సుతో వేడుకుంటున్నాను.
“అమ్మా ! అని పిలచినా ఆలకించవేమమ్మా!
నా వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా!”
మాతృసంహిత రచయితకు కృతజ్ఞతలు.