విశ్వజనని, రాజరాజేశ్వరి, లలితగా అర్చింప బడిన అమ్మలో 05-05-1936 కి ముందు నిర్గుణత్వాన్ని, సగుణత్వాన్ని అధిమానుషతత్వాన్ని దర్శనం చేసినవాడు మౌలాలి. అమ్మ తనను గురువునని చెప్పుకొనకపోయినా, తనకు శిష్యులు లేరని చెప్పినా, అమ్మజీవిత చరిత్రలో శిష్యసదృశంగా ప్రాతఃస్మరణీయుడు మౌలాలి.
మౌలాలి మసీదుకువెళ్ళని, ఖురాన్ చదవని పెదనందిపాడు వద్దగల నాగులపాడుకు చెందిన ఒక మహమ్మదీయుడు. వారి పూర్వులు బాపట్ల వచ్చేశారు. తండ్రి, తాతలు కృష్ణ భక్తులు. మౌలాలి బ్రహ్మంగారి భక్తులైన ఒక వైశ్యకుటుంబంతో సన్నిహిత సంబంధం కలిగి, బ్రహ్మంగారి కుమార్తె ఈశ్వరమ్మను ఆరాధిస్తూ ఉండేవాడు. బాపట్లలో చదలవాడ వారి ఇళ్ళవతల ఉండేవాడు. మెట్రిక్ చదువుతుండగా మశూచిసోకి కంటిచూపులేదు. అది అతనికి జ్ఞానచక్షువు సిద్ధించిన శుభఘడియ. ఆ సమయంలోనే అమ్మనామం పొంది, ఒంటరిగా గడుపుతూ, నామాన్నే నమ్ముకొని దొరికిన దానితో కడుపు నింపుకొనేవాడు. అమ్మ బాపట్లలో మంత్రిక్రిష్టయ్యగారి యింటికి వెడుతుండగా అమ్మను మొదటిసారి చూశాడు. అదొక మధురమైన విశ్వరూప దర్శనం, ప్రణవసుందరమైన బిందునాదప్రతీక. అమ్మలో వయస్సును, మనస్సును, విశ్వాన్ని దాటిన నిర్గుణ తేజో విభూతిని దర్శించిన భూమిబిడ్డ.
అంతే పొంగిపొరలుతున్న ఆత్రుత, పేరుకొన్న ఒంటరితనం, గడ్డకట్టిన అజ్ఞానం ధ్వంసమయి అమ్మలో నమ్మలేని నిజాన్ని నమ్మకం పోగొట్టుకోలేనంతగా చూశాడు. ఆ దివ్యదర్శనకృపావిశేషం అమ్మ పాదపద్మార్పిత షట్పదాన్ని చేసింది.
అమ్మలో అన్నం పెట్టే ఒకతల్లిని, ఎవరు ఏ రూపు కోరుకొంటే ఆ రూపులో కనపడగలిగే దైవీసౌందర్యాన్ని, మృదుల మంజుల ప్రేమైక తత్త్వాధిష్ఠాతయైన ఒక శ్రీమత్ సింహాసనేశ్వరిని చూశాడు. తనను అర్పించుకొన్నాడు. అమ్మ దాన్ని సాదరంగా స్వీకరించింది. తన బాధలు చూచిన ఒక సహచరుని, తనయోగప్రవృత్తి ప్రదర్శించడానికి ఒక ప్రేక్షకుని, తనమనస్సుకి దర్పణం పట్టే ఒక మానసపుత్రుణ్ణి చూసికొంది. అమ్మ ఆ మానస పుత్రుణ్ణి తనకు ప్రియమైన చిదంబరరావుతాతగారికి పరిచయం చేస్తుంది. అది అమ్మ దైవీసౌహార్ద్రతకు పట్టంకట్టినవేళ, మత మౌఢ్యాన్ని కాలరాచినవేళ, మానవత్వాన్ని పులుగడిగి ఆభరణంగా ధరించినవేళ.
మౌలాలి దొప్పలపూడిలో అడుక్కొంటూ మన్నవలో అమ్మతో గడిపేవాడు. అమ్మే అతనిలోకం. మౌలాలి సేవకుడు, అమ్మ అధినాయిక. మౌలాలి సాధకుడు, అమ్మ సద్గురువు. మౌలాలి చకోరపక్షి, అమ్మ షోడశకళా విభూతిగల చంద్రబింబము.
నంబూరులో, గుంటూరులో, తెనాలిలో అమ్మ ఎక్కడుంటే మౌలాలి అక్కడే. అమ్మ దాత, మౌలాలి భిక్షకుడు. ఉపనయనంలో చెప్పే భవతీ భిక్షాందేహి అనే భావనను వశీకృతంచేసుకొన్న అమ్మ ప్రీతిపాత్రుడు.
అమ్మను ఈశ్వరమ్మ కంటే, బ్రహ్మంగారికంటే, సృష్టిలో అతిగొప్పవారికంటే గొప్పగా చూశాడు.
అమ్మకు మౌలాలి సేవచేయలేదు, పూజచేయలేదు, నామం చెప్పలేదు, అభిషేకం చేయలేదు. అఖండా ద్వైతతత్త్వానుభవం పొందాడు.
కొల్లిమర్ల సూరయ్య గారితో “అమ్మకు తపస్సెందుకు?” ఆమె మూలానికే మూలం” అంటారు. గీత చెప్తున్న కృష్ణశర్మ గారితో తెనాలిలో సౌహృదయాంత రంగ స్పందనలను పంచుకొంటాడు. అమ్మ మౌలాలీకి హఠయోగరహస్యాలు, కుండలినీ తత్త్వము బోధిస్తుంది. నాకు నువ్వు కావాలిగాని బోధలు ఎందుకు? అంటాడు. జగజ్జననిపై ఎప్పుడో చూపు తొలగించావు, దివ్యత్వమౌ జ్ఞానాన్నిచ్చావు అంటాడు.
అమ్మ వివాహపరంగా ఎదుర్కొంటున్న ఆందోళన తాళలేక, తల్లీ నీకు పెళ్ళి అవసరమా? మనం ఏ అడవిలోకైనా వెడదాము అంటే అమ్మ “ఇప్పుడున్నది అడవికాదా, అక్కడ పులులు, క్రూర మృగాలభయం, ఇక్కడ మానవులభయం” అని ఉద్భోధిస్తారు.
మౌలాలి “అమ్మా ! నీవు అనుభవించే కష్టాలే నీకు సాధనైతే, ఇటువంటి సాధన ఎవరికీ వద్దు” అంటాడు.
నాన్నగారిని తొలిసారిగా చూచిన మౌలాలీకి వారిలోని సోమశేఖరతత్త్వాన్ని అమ్మ ఉపదేశిస్తారు. “విషం కక్కే పాములోను దాగియున్న అమృతత్త్వం చూడు. వివేకఖ్యాతికి నిర్మలత్వం పెంచుకో” అని అమ్మ ఉద్బోధిస్తారు.
తనమెడలో ఆధారమైన దారం పడేంతవరకూ తనతోనే ఉండమని అమ్మ మౌలాలీకి చెపుతారు.
అమ్మలో అఖండత్వాన్ని, అధిమానుషత్వాన్ని, మానవత్వాన్ని త్రివేణీసంగమంగా దర్శించిన మౌలాలీ విద్యాధికులైన భక్తులకు అందని, వారు అర్థం చేసుకోలేని అతిసామాన్యుడు, అసామాన్యుడు, మహామాన్యుడు.
గురువు గొప్పదనం శిష్యుని వలన తెలుస్తుంది అనుకొంటే, రామదాసు అన్నట్లు
“భండన భీముడార్త జనబాంధవు డుజ్జ్వలబాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటి దైవమికలేడనుచున్ గడకట్టి
భేరికాడాండడడాండడాండ నినదంబు ల
జాండము నిండ మత్తవేదండమునెక్కి చాటెదను”
అనీ,”మొక్కిననీకు మొక్కవలె మోక్షమునిచ్చిన నీవె యీవలెన్” అనకపోయినా, ఆర్తి, ఆర్ద్రత, ప్రపత్తి, ప్రణిపాతము గల మహోన్నత వ్యక్తి మౌలాలీ. దాసో హం దాసదాసో హం అన్న పరంపరగా.. ఎదిగిన మౌలాలి గురుజన వంద్యుడు.