కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసింది. కృష్ణుడు, వ్యాసుడు పూనుకొని ఎన్నో ఉపదేశాలు చేసి పితా మహుడైన భీష్ముని చేతకూడా ఉపదేశాలు చేయించి ధర్మరాజుని చక్రవర్తిని చేశారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడై నాడు. ఇక భీమార్జునులకు పని ఏముంటుంది?
ఎప్పుడో ద్వారకా నగరాన్ని వదలి హస్తినాపురానికి వచ్చి ఇక్కడే ఉండిపోయిన కృష్ణుడు ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత తిరిగి ద్వారకా నగరానికి ప్రయాణమైనాడు. అతనికి ప్రాణమిత్రుడు కాబట్టి అర్జునుడు కూడా కృష్ణునితోపాటు ద్వారకా నగరానికి వెళ్ళాడు అన్నగారి అనుమతితో. ధర్మరాజు పరిపాలిస్తున్నాడు. కాలం గడుస్తోంది. కొన్నాళ్ళ తర్వాత ధర్మరాజుకు ఒకనాడు ఎన్నో దుశ్శకునాలు కన్పించాయి. ధర్మజుడి మనస్సు కకావికలం అయిపోయింది. ఎందుకిలా జరిగిందో? ఈ దుశ్శకునాలకి ఫలితం ఏమిటి? పర్యవసానం ఏమిటి? అని ఆరాటపడుతున్న సమయంలో దీనవదనంతో అర్జునుడు హస్తినలో ప్రవేశించి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు.
‘సంగతి ఏమిటి?’ అని ధర్మరాజు అడిగాడు. అర్జునుడు వివరించాడు. ద్వారకనుంచి తిరిగి వచ్చి అర్జునుడు చెప్పిన మాట – కృష్ణుడు తనువు చాలించాడు. – అని. కృష్ణుని నిర్యాణ వార్త అర్జునుడు చెప్పాడు. అది పాండవులందరికి అశనిపాతమైంది. ఆ మాట చెప్పి అర్జునుడు కృష్ణుడి వల్ల తాము పొందిన మేలు, ప్రయోజనం – ఎన్నెన్ని సందర్భాల్లో కృష్ణుడు ఎలా ఎలా తనను ఆపదలలో ఆదుకున్నాడో ఆ విశేషాలను అన్నీ చెప్పాడు. అటువంటి కృష్ణుడు లేకపోయాక తాను జీవించి ఉండడం ఎందుకు? అని కూడా బాధ పడ్డాడు
మన సారథి, మన సచివుడు,
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్,
మన విభుడు, గురువు, దేవర,
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!’ – అంటూ.
పాండవులందరూ కృష్ణుడుని తలచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అతి తీవ్రమైన వేదనను అనుభవించారు. తమకు సర్వస్వము అయిన కృష్ణుడు శరీరం వదిలేసిన తర్వాత ఇక తమ జీవితానికి అర్థం, పరమార్థం లేదని రోదించారు. తీవ్రంగా విలపించారు. సరిగా ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వారి బాధను గుర్తించాడు.
నారదుడు పాండవులకు ఓదార్పు మాటలు చెప్పాడు – కృష్ణుడు అవతార పరిసమాప్తి చెయ్యడం కృష్ణుడి నిర్ణయమే – అని తెలియజేశాడు. పరమాత్మ ఏ ప్రయోజనం కోసం భూమిపైకి దిగి వచ్చాడో, ప్రయోజనం నెరవేరిన తర్వాత తన అవతారాన్ని పరిసమాప్తి చేస్తాడన్న విషయాన్ని దేవర్షి అయిన నారదుడు అ సందర్భంలో పాండవులకు వివరించాడు. ఇక్కడ వ్యాసులవారు చెప్పని ఒక మాట పోతనగారు చెప్పారు – అది వచనంలో చెప్పారు
“కంటకంబునన్ కంటకోన్మూలనంబు సేసి, కంటకంబులు రెంటిని పరిహరించు విన్నాణి తెరంగున యాదవరూప శరీరంబునం చేసి లోకకంటక శరీరంబులు సంహరించి, నిజ శరీరంబు విడిచె. సంహారంబునకు నిజశరీర పరశరీరంబులు రెండును ఈశ్వరునకు సమంబులు’ – అని.
ఇది పోతన గారు మూలంలో లేని అదనంగా వ్రాసిన వాక్యాలు – “ముల్లును ముల్లుతో తీసేసి గుచ్చుకున్న ముల్లుతోపాటు తీయడానికి ఉపయోగించిన ముల్లునుకూడా విజ్ఞాని అయినవాడు ఎలా పారవేస్తాడో, శరీరాలు ధరించి లోక కంటకులుగా తయారైన వాళ్ళని తొలగించడం కోసం ముల్లును ముల్లుతో తీయడానికి, అంటే ముల్లును తీయడానికి మరొక ముల్లు అవసరమైనట్టే, శరీరాలు తొలగించడానికి మరొక శరీరం అవసరమైంది కాబట్టి శరీరధారియై వచ్చాడు పరమాత్మ. వచ్చి వారందరి శరీరాలు తొలగించి లోకకంటకులను సంహరించి లోకానికి శాంతి కలిగించి, తాను వచ్చిన విశ్వశ్రేయః కార్యక్రమం అవతార ప్రణాళిక పూర్తి అయింది కాబట్టి ఇక తన శరీరాన్ని కూడా చాలించాడు” ‘అన్నాడు. ‘సంహారంబునకు నిజశరీర పరశరీరంబులు రెండును ఈశ్వరునకు సమంబులు’- అనే మాట చాలా గొప్ప మాట. ఉపసంహరించడం ప్రారంభిస్తే ఇతరుల శరీరమా తన శరీరమా అని పరమాత్మ చూడడు. ఇతరుల శరీరం కాబట్టి తీసేద్దాం, తన శరీరం కాబట్టి ఇలాగే కొనసాగిద్దాం అని అనుకోడు పరమాత్మ. వచ్చినపని అయిపోయిన తర్వాత దానిని తీసివేయాలి కాబట్టి తీసేశాడు. ఏ గదిలో పని పూర్తి అయిపోతే ఆ గదిలో దీపం ఆర్పివేసినట్లుగా ఏ శరీరంతో పని పూర్తి అయిపోతే ఆ శరీరాల్లోని శక్తిని ఉపసంహరించుట ప్రకృతిలోని ప్రణాళిక – అనేది ఈ సన్నివేశం మనకి అందిస్తున్న ప్రబోధం.
ఈ ప్రబోధాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దుఃఖాన్ని అదుపుచేసుకుని కర్తవ్యంలోకి రావలసిన అవసరం ఉన్నది. – అని భాగవతం మనకి ఉపదేశిస్తున్నది.
ఈ సారాంశాన్ని “అమ్మ” ఒక చక్కని మాటలో తెలియచేసింది – నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడా బద్ధుడే” అని. ఒక నిర్ణయమంటూ జరిగిన తర్వాత తన విషయంలో కూడా ఆ నిర్ణయాన్ని పాటిస్తాడు నిర్ణేత అయినవాడు, నిర్ణయించిన వాడు. అతడి నిర్ణయం ఇతరులకేకాదు, అతడికి కూడా అన్వయిస్తుంది. నిర్ణయం అంటేనే మార్పులేనిది అని కదా! ఒకసారి నిర్ణయం జరిగి పోయింది; అందులో మార్పు ఉండదు. ఆ నిర్ణయం అమలు జరిగి తీరుతుంది. “Our lives are pre recorded cassettes” అన్న రమణ మహర్షి మాటలసారం కూడా ఇదే అనిపిస్తుంది. మహనీయుల మహితోక్తులను మనస్సులో స్మరించి కష్టకాలంలో మనం దుఃఖానికి లోనుకాకుండా కర్తవ్యశీలురమై దైవానుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రయత్నం చెయ్యాలి – అని పురాణేతిహాసాలు మనకు తెలియ చేస్తున్నాయి. ఈ సందేశసారం మనకు వంటపట్టి మనం కర్తవ్యశీలురమై ప్రశాంతజీవన సౌభాగ్యాన్ని అందుకునే శక్తిని ఆ పరమాత్మ మనకి అనుగ్రహించుగాక. అని ఆకాక్షిస్తూ – స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని.