మేము ప్రస్తుతం ఫ్లారిడాలో వుంటున్నాము. ఇది చాలా వేడి ప్రదేశం. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లాగానే మల్లెపూలు, తులసి, కరివేపాకు, అరటి, మామిడి బాగా పండుతాయి. ఇక్కడ దాదాపు సంవత్సరమంతా పూజకు పూలకొరత ఉండదు. రోజూ దేముడికి పూలు తులసి దళాలతో పూజచేస్తూ వుంటాము.
నిర్మాల్యాలను తీసి రోజూ, పూల మొక్కలలో వేయడం మన పద్ధతి. మేమూ అలాగే చేస్తాం.
ఒకసారి నాకు అనుకోకుండా పన్ను నొప్పి కొద్దిగా మొదలయ్యింది. పనివత్తిడితో బద్ధకించి అదే పోతుందిలే అని వూరుకున్నాను. Dentist కి appointment దొరకడం చాలా కష్టం నెలవరకు కూడా ఇవ్వరు. అత్యవసరమో బాధ చాలా ఎక్కువగా వుంటే బహుశా చూసే అవకాశం వుంటుంది. భరించలేని బాధలేదు కాబట్టి వెంటనే డాక్టరుకు వెళ్ళదలచక, పోతుందిలే అని వూరుకున్నాను.
ఆరోజు శుక్రవారం. పన్నునొప్పి క్రమేణ ఎక్కువయ్యింది. ఏంచేయాలి ? ఎమర్జన్సీ అయినా సోమవారం వరకు ఆగాల్సిందే. సరే ఇక రెండు రోజులు బాధ భరించి సోమవారం డాక్టరు దగ్గరకు వెళ్లామను కున్నాను. ఆ మధ్యాహ్నం చిన్న ఆలోచన వచ్చింది. రోజూ నిర్మాల్యాలతో తులసిదళాలు కూడా మొక్కలలో వేస్తాము కదా! తులసిదళాలను పడేయడం ఎందుకు? వాటిని తింటే ఏమవుతుంది ? అనుకున్నాను.
ఆ సాయంత్రం (శుక్రవారం సాయంత్రం) దేమునికి దీపం పెట్టి పాలుపెట్టి, ‘అంఆ’ పాదాలవద్ద వుంచిన కొన్ని తులసి దళాలను నాకు నొప్పిగా వున్న పన్ను దగ్గర వుంచాను. అదే విధంగా శని, ఆదివారాలు కూడా చేసాను. తులసిదళాలను నొప్పిగా వున్న పన్ను దగ్గర పెట్టూ వచ్చాను.
క్రమంగా పన్ను నొప్పి తగ్గుతూ వచ్చింది. వారం రోజుల్లో పన్ను నొప్పి పూర్తిగా పోయింది. నొప్పి తగ్గినా అలవాటు మానకుండా ఇంకా రోజూ తులసీదళాలు నిర్మాల్యాలు ‘అంఆ’ ప్రసాదంగా నోట్లో వేసుకుంటూనే వున్నాను. ఆ విధంగా ‘అంఆ’ నిర్మాల్య ప్రసాదం అమూల్యమైన ఔషధ ప్రసాదంగా మారింది. మన ప్రాంతంలో తులసిని ఔషధంగా సేవిస్తారు కాని పంటి నొప్పికి వుపయోగిస్తూరేమో. నాకు తెలియదు. కాని, బాధ పడ్తున్న నాకు ఆ సమయంలో ‘అంఆ’ వైద్యుడిగా నాలో ఔషధంగా తులసిని సేవించమని ప్రేరణ కలిగించిందని నమ్ముతున్నాను. నాకు బాధోపశమనం కలిగించిన తల్లి ‘అంఆ’కు శతాధిక వందనములు.