నేను బెంగుళూరులో పని చేస్తూ ఉండగా 1982 వ సంవత్సరంలో Dr. V.M. Rao గారితో పరిచయం ఏర్పడింది. ఆయన Economics లో Doctorate చేశారు. Institute for Social and Economic Change, Banglore లో పని చేస్తూ ఉండేవారు. వారి నివాసం మా ఇంటికి చాలా దగ్గరగా ఉండటం వల్ల తరచూ మేము కలుసుకొంటూ ఉండేవాళ్ళం. వారి ఇంటిలో తన Subject వే కాకుండా అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు, సంచికలు (magazines) ఒక చిన్న సైజు లైబ్రేరీ లా ఉండేవి. అంతేకాకుండా ఆయనకు అవతారాలు, ఆనాటి నుంచి ఈ నాటికి వరకు ఉన్న గురువులు, దేశవిదేశాలలో ఉన్న అనేక మతములు, వాటి ఆచార వ్యవహారాలు, వాటిలో ఉన్న సందేశాలు వగైరాలన్నింటి గురించి మంచి జ్ఞానం ఉండేది. అవన్నీ సందర్భానుసారం నాకు చెబుతూ ఉండేవారు. ఇది గమనించిన నేను ఆయనతో అమ్మని గురించి నాకు తెలిసినంతవరకూ కూలంకషంగా చెప్పాను. జిల్లెళ్ళమూడి ప్రత్యేకతను మరీ వివరించి చెప్పాను. ఆయన నేను ఇచ్చిన MOTHER OF ALL ఉద్గ్రంథాన్ని ఒక్క రోజులోనే చదివేశారు. అమ్మ ప్రేమ, విధానం ఆయనకు ఎంతో నచ్చి వెంటనే జిల్లెళ్ళమూడికి వెళ్ళాలని, తనను నేను తీసుకొని వెళ్ళాలని ఆత్రుతతో ఎంతో ఒత్తిడి చేశారు. సరేనని మేము ఇద్దరం బెంగుళూరు నుంచి బయలుదేరి జిల్లెళ్ళమూడి చేరాము.
నా 48 సంవత్సారాల జిల్లెళ్ళమూడి అనుబంధంలో నేను అమ్మగురించి చెప్పగా, వారంరోజులు తిరగకముందే అమ్మ సన్నిధికి వచ్చిన ఒకే ఒక వ్యక్తి Dr. V.M.Rao గారు.
అమ్మ ఆయనను మామూలు కుశల ప్రశ్నలు వేసి, ప్రసాదం (ఏమి ఇచ్చిందో – గుర్తు లేదు) ఆయనకు స్వయంగా తినిపించి, పంచె, కండువా, పూలదండ మెడలో వేసి ఎంతో ప్రేమగా చూసింది. ఆయన అమ్మ రూపానికి, వాత్సల్యానికి జిల్లెళ్ళమూడి అనుబంధాలకు ముగ్ధుడయిపోయారు. ఆ తరువాతనుంచి మా సంభాషణలలో ఎక్కువ శాతం అమ్మ – జిల్లెళ్ళమూడి గురించే ఉండేవి. అమ్మ పూజలకు ఆయన వచ్చేవారు. అమ్మ మీద ఆయనకు ఎంతో విశ్వాసం కలిగింది.
ఒకసారి ఆయన ఇంటిలో అమ్మ పూజా కార్యక్రమం పెట్టుకొన్నారు. ఆయన పరిచయస్తులు కొంతమందే అయినా మన జిల్లెళ్ళమూడి Circle వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. పూజ బాగా జరిగి ఇంక ప్రసాదాలు పంచబోతున్న సమయంలో ఎవరో TV on చేశారు. వెంటనే News Channel తెరపైకి వచ్చి ఈ వార్త వచ్చింది :-
“ప్రధాన మంత్రి ఏర్పరిచిన High Power Economic Committee లో బెంగుళూరు నుంచి Institute for Social & Economic Changes, Director Sri V.M.Rao గారిని కూడా ఎన్నుకొన్నారు”. పూజ just అవగానే ఈ వార్త చాలా ఆశ్చరం కదా! అది విన్న మేమందరం ఆనందంతో చప్పట్లు కొట్టి ఆయనకు అభినందనలు తెలిపాము.
నన్ను ఆశ్చర్య పరచిన విషయం ఏమిటంటే గత మా రెండు సంవత్సరాల పరిచయంలో ఆయన ఎప్పుడూ తను Director post లో ఉన్నానని పొరపాటున కూడా చెప్పలేదు. ఆయన నిరాడంబరత గురించి క్రింది పేరాలో మళ్ళీ చెబుతాను.
అందరూ వెళ్ళిపోయాక ఆయన నా రెండు చేతులు పట్టుకొని ఎంతో భావోద్వేగంతో ఇలా అన్నారు :- “రామకృష్ణా ! నేను ఇంక 6 నెలలలో రిటైర్ అయిపోతున్నాను. ఇంకా పెద్ద అమ్మాయి పెళ్ళి కూడా చేయలేదు. (ఆయనకు ఇద్దరు కుమార్తెలు) నాకు మా బంధువులతో సంబంధాలు అంతంత మాత్రమే. పెళ్ళి ఎలా చేయగలనో అన్న దిగులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. అయినా ‘అమ్మ ఉందిలే – అన్నీ తను చూసుకుంటుందిలే’ అనే నమ్మకంతో నన్ను నేనే సంభాళించుకుంటున్నాను. ఇప్పుడు చూడు. అమ్మ అపారమైన కృప నాపై ఎలా చూపించిందో. నాకు ఇంకా రెండు సంవత్సరాల సర్వీస్ పెరిగింది. ఈ లోపున అమ్మయే ఏదో మార్గం చూపిస్తుంది” అని అన్నారు.
ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమ్మ తన లీలను చూపించింది. ఒక రోజు ఆయన ఎప్పుడూ చూడని దంపతులు వారింటికి వచ్చారు. తమని పరిచయం చేసుకొని, మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని తెలిసింది. మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వగలరేమో కనుక్కొందాముని వచ్చాము అని అన్నారు. ఊహకందని ఈ సంఘటన వారికి ఎంత ఆనందం, ఆశ్చర్యం కలిగించి ఉంటుందో మీరు ఊహించగలరు. అదే సంబంధం కుదిరి అమ్మాయి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది.
ఆయన నిరాడంబరతకు ఇంకొన్ని ఉదాహరణలు :-
ఆయన Director అని తెలిసిన తరువాత, ఆయన Colleague ఒకాయనను “ఆయన రోజూ ఆటోరిక్షాలో ఆఫీసుకి వెళ్ళడం ఏమిటండీ? కంపెనీ కారు లేదా ?” అని అడిగాను. సమాధానంగా ఆయన “లేకేమండీ ఉంది. అది ఆయన తన ఆఫీసు పనికి మాత్రం వాడతారు – స్వంత పనులకు – కనీసం ఆఫీసు రాక పోకలకు కూడా వాడరు” అని చెప్పారు.
రాచర్ల రహి మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళే సందర్భంగా మా ఇంట్లోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. ఒకరోజు మేము ఇద్దరం (నేను, రహి) VM Rao గారింటికి వెళ్ళాము, మా వాడు అమెరికా వెడుతున్నాడు అని ఎంతో గర్వంగా అన్నాను. ఆయన అమెరికాలో ఏ ప్రాంతం, ఏ ఊరుకి వెళ్తున్నాడో అడిగి తెలుసుకొన్నారు. వెంటనే ఆ ఊరు గురించి, ఏ రోడ్డు ఎటు వెడుతుందో, ఏమి ఎక్కడ దొరుకుతాయో, ఇండియన్ హెూటల్స్ ఎక్కడ ఉన్నాయో వివరంగా చెప్పారు. ఇంత విడమరచి చెబుతున్నారు. మీరు ఎప్పుడైనా అక్కడకు వెళ్ళారా అని అడిగాను. ఆయన ‘అందులో ఆశ్చర్యం ఏముంది – నేను రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను కదా’ అన్నారు. ఈ విషయం కూడా ఆయన ఎప్పుడూ నాతో ప్రస్తావించలేదు.
అమ్మయందు భక్తి, విశ్వాసం, నమ్రత, నిరాడంబరత కలిగిన ఇలాంటి మహానుభావులు ఎంత మంది ఉన్నారో, వారి ఈ గుణాలలో లేశమైనా నేను నేర్చుకోగలిగితే నేను కృతార్థుణ్ణి!!
జయహో మాతా.