విషయం, ప్రయోజనం, సంబంధం, అధికారం అనుబంధ చతుష్టయం. జడమైన కర్మ, పలితాన్ని ఇవ్వలేదు. కర్మఫలదాత భగవంతుడు. పూర్ణత్వాన్ని పొందాలన్న కోరికతో కర్మ చేస్తాము. పరిమితమైన కర్మ పూర్ణత్వాన్ని ప్రసాదించలేదు. అపరిమితమైన పూర్ణత్వాన్ని పరిమితమైన కర్మ ఎలా ఇవ్వగలదు! కర్మచేయటానికి కారణం కోరిక. కోరిక రావటానికి అజ్ఞానం కారణమవుతుంది. చీకటినిచీకటితో పోగొట్టలేము. అజ్ఞానాన్ని కర్మ పోగొట్టలేదు. చీకటి పోవాలంటే వెలుతురు ఎట్లా కావాలో అట్లే అజ్ఞానాన్ని పోగొట్టటానికి జ్ఞానం కావాలి. ఏది ప్రవృత్తికి కారణమో అది నివృత్తికి వీలుకాదు. వెలుగు వల్ల చీకటి పోవాలి.
ఏకత్వాన్ని దర్శించే వానికి క్రోధాలంటవు. సూర్యుడు ఉదయిస్తే మంచు కరిగిపోయినట్లు అవతారమూర్తి అమ్మ సన్నిధిన మన కామనలు పరిసమాప్తి చెందుతాయి. అన్నీ తానే అయి మన అవసరాలను కనిపెట్టే అమ్మ మన కోరికలను పుష్పించి ఫలింప చేస్తుంది. వేరే ఇంకేమీ కావాలనే ఇచ్చ కూడా నశింప చేస్తుంది.
ఒక మారు ప్రిన్సిపాల్ శ్రీ రాధాకృష్ణ శర్మగారు అమ్మకు నమస్కరించి కూర్చున్నారు. అమ్మ “నాన్నా వెంకన్నను అడిగినట్లు చెప్పరా” అన్నది. మా అందరికీ ఆశ్చర్యమనిపించింది. శ్రీ శర్మ అన్నయ్యగారు తిరుపతికి వెళ్తున్నానని చెప్పటానికి వచ్చారుట. ఒక మారు శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు అమ్మ సన్నిధికి వచ్చినప్పుడు “వెంకన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడురా?” అన్నది అమ్మ.
1979 సం||లో తిరుపతికి శ్రీ చక్రవర్తిగారు మిత్రులు కలిసి బయలు దేరారు. బాపట్లలో అమ్మ వున్నదని తెలిసి అమ్మను దర్శించుకున్నారు. కానీ తిరుపతి వెళ్తున్నట్లు అమ్మకు చెప్పలేదు. డిసెంబరు 31 సాయంత్రం దర్శనం కొరకు క్యూలో నిలుచున్నారు. రాత్రి 12 గం||లకు పెద్ద తొక్కిసలాటయి ముగ్గురు వెనక్కు నెట్టి వేయబడ్డారు. ఎంత పరపతి ఉపయోగించినా దర్శనం అవలేదు. మర్నాడు మధ్యాహ్నం 12 గం॥లకు వీళ్ళ ముగ్గురూ కూర్చుని అమ్మకు క్షమాపణ చెప్పుకొని ‘లలిత’ పారాయణ చేసుకున్నారు. అది పూర్తి అయిన వెంటనే ప్రక్క వున్న తలుపు తెరిచి దర్శనం చేసుకోవటానికి గుడి తాలూకు వాళ్ళు ఎవరైనా వున్నారా? అని అడిగారు. వీళ్ళు వాళ్ళ గోడును వెళ్ళ బోసుకున్నారు. దానితో ఆలోచించి వీళ్ళను లోపలికి ఆహ్వానించి శ్రీవారి దివ్యదర్శనం చేయించారు. ఇది అమ్మ అనుగ్రహ ఫలితమేనని పరిపూర్ణ విశ్వాసం.
1969 సం||లో అమ్మ దర్శనానంతరం 2005 సం॥ వరకు తిరుపతికి వెళ్ళటానికి వీలు పడలేదు. అంతవరకూ ప్రతి సంవత్సరం వెళ్ళే నాకు 26 సం||ల సుదీర్ఘకాలం గడచింది. ఎన్నిమార్లు ప్రయత్నించినా కుదరక పోవటంతో అమ్మనే ప్రార్ధించాను. కుటుంబ సమేతంగా మొక్కు వుండటంతో ఎన్నోమార్లు అనుకున్నా ఒకరికి కుదిరితే మరొకరికి కుదరక ఏదో అడ్డంకులతో వెళ్ళలేకపోయాము. చివరకు అమ్మకే వదిలేసాను.
మా చిన్న అమ్మాయి మాధవి, మా అల్లుడు ఆదిత్య, మనవరాలు గీత ఇథియోపియా నుండి వచ్చారు. ఆగష్టు 7వ తారీఖు బయలుదేరి మొత్తం కుటుంబము 13 మందిమి తిరుపతి వెళ్ళాము. వెళ్ళిన రోజే ఎంతో అంగరంగవైభవంగా వున్న తిరుమలేశుని కన్నులారా చూడగలిగాము. నలుగురు దంపతులమూ కళ్యాణం చేసుకోవాలనుకున్నాము. నేను క్రింద కూర్చోలేని కారణంగా కుదరలేదు. నేనూ ఈయన కాటేజ్కి తిరిగి వచ్చాము. మా మనవరాలు స్పూర్తికి టికెట్టు లేనందున దానికి అనుమతి ఇవ్వలేదు. మేము తిరిగి రావటంతో దానికి కళ్యాణం చూసే అదృష్టం కలిగింది.
మిగిలిన వారంతా మూడు మార్లు స్వామిని దర్శించుకున్నారు. ఆ రెండు రోజులూ మా కుంటుంబం అంతా ఎంతో ఆనందంగా గడిపాము. అన్నమయ్య హోటల్లో ఆ రెండు రోజులూ భోజనాలు చేసాము. అక్కడి నుంచీ బయలుదేరి ఒక వ్యాన్, ఒక అంబాసిడర్కారులో దిగువ తిరుపతికి చేరుకున్నాము. అలివేలు మంగాపురంలో మొదటి శ్రావణ శుక్రవారం అవటంతో అమ్మ వారికి పెద్ద గులాబీల దండను బేరమాడుతున్నాను. కారులో వచ్చిన మా అబ్బాయి కృష్ణవచ్చి లలిత్ వున్నాడా? అని అడిగాడు. మీ కారులో వున్నాడనుకున్నామని చెప్పాను. దానితో కంగారుగా వాన్ లో పైకి వెళ్ళాడు.
మా కృష్ణ టోల్ గేటు దగ్గరకు వచ్చేటప్పటికి అంతులేని వ్యధ మొదలైందిట. మనిషి వున్నట్లుండి బాగా క్రుంగిపోయినట్లు అయి పరుగుపరుగున నా దగ్గరకు వచ్చి అడిగాడు. నేను పిల్లవాడు మా దగ్గర లేడనటంతో మనిషి డీలాపడి వెంటనేపైకి వెళ్ళాడు. కానీ అందరికీ పిల్లవాడు తప్పక దొరుకుతాడన్న నమ్మకమే మమ్మల్ని అంతసేపూ బ్రతికించింది.
నేను వ్యాన్ ఎక్కగానే “చిన్నవాడు ఏడిరా?” అని అడిగాను. దానికి మా పెద్ద అమ్మాయి అను, మా కోడలు ఉమ దగ్గర వున్నాడని చెప్పింది. ఒకటికి పదిమాట్లు ఫోన్లు చేసుకునే వాళ్ళం కూడా ఏదో మాయ కప్పినట్లు అయింది. రెండుమార్లే చేసినా మామూలుగా మాట్లాడి వూరుకున్నారు. సాధారణంగా ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళ చేతుల్లో సెల్ లాక్కుని మాట్లాడేవాడు. లేదా పక్క నుంచీ వాడి మాటలైనా వినిపిస్తుండేవి. అలా వినిపించకపోవటంతో ఆవేదన చెందాడు. క్రిందకు దిగేవరకూ వాడి గురించి ఆలోచన రాకుండా చేసి మమ్మల్ని ఎక్కువ సేపు బాధపడకుండా అమ్మ మాయ కప్పేసింది. లేక పోతే ముందే వాడి ఆలోచన వచ్చినా వెనక్కి వెళ్ళటానికి కుదరదు కదా!
ఆ రోజు ఉదయమే చేయి పట్టుకు నడు లేకపోతే తప్పిపోతావని అన్నాను. తప్పిపోవటమంటే ఏమిటి మామ్మా అని ఒకటికి రెండు మూడు మాట్లు అడిగాడు. దానికి నేను “మేము ఎవ్వరు కనిపించకుండా నీ ఒక్కడివే వుండటం” అని చెప్పాను.
వాడులేక పోతే మా ఇల్లు ఇల్లులా వుండదు. మా అమ్మా, నాన్నా ఒక్క క్షణం కూడా వుండలేరు. పిల్లవాడ్ని ఎవరైనా తీసుకుపోయి అమ్మేసుకుంటారో లేక ఏదైనా అనాధ శరణాలయంలో వప్ప చెప్తారో అన్న ఆలోచనలతో మా వాడు. ఏడ్చాడు. పిల్లవాడి కాలు మీద పెద్ద పుట్టుమచ్చ వుంది. ఒక వేళ పెద్దవాడయ్యాక కనుక్కోవటానికి అలా పుట్టు మచ్చ వుందేమో అని పరిపరి విధాల దుఃఖించాడు. మా కోడలు మేకపోతు గాంభీర్యతో ఏమి మాట్లాడలేక పోయింది. వెంటనే వాళ్ళు పైతిరుపతికి వెళ్ళారు.
అమ్మ దయ అన్నట్లుగా కారు డ్రైవరు పదినిమిషాలు కష్టపడి గుర్తు తెచ్చుకొని విజిలెన్సు వాళ్ళ నెంబరు ఇచ్చాడు. వెంటనే మా చిన్న అమ్మాయి మాధవి అక్కడికి ఫోను చేసింది. పిల్లవాడు వాళ్ళదగ్గరకు వచ్చాడని వాడిపేరు లలిత్ చక్రవర్తి వాళ్ళ నాన్నపేరు రాధా కృష్ణ, అమ్మ ఉమాదేవి, తాతగారు ఎ.ఎస్. చక్రవర్తి మాది విశాఖపట్టణం అశోక్ హౌస్ పెద్ద వాల్తేరు అని చెప్పాడుట. మేము అందర్నీ ప్రశ్నిస్తాము కాని ఆ బాబు మమ్మల్నే ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడని చెప్పారు.
మేము ఒక జడ్జీగారి ద్వారా వెళ్ళాము. బాబు ఆయనకు ఫోను చేసి చెప్పగానే ఆయన పోలీసు వాళ్ళను ఎలర్ట్చేసి, మైక్రో ఎనౌన్సుమెంట్ ఇప్పించారు. కానీ మేమంతా క్రిందకు వచ్చేసాము. కాబట్టి ఆ సమాచారం తెలియలేదు.
అన్నమయ్య హోటల్ లోని నాయుడు అన్న అతను వాళ్ళు మా హోటల్ నుంచే వెళ్ళారు. అక్కడికి తప్పక వస్తారు, బాబును నా దగ్గర వుంచుకుంటానని తీసుకు వెళ్ళాడు. ఆ విషయం విజిలెన్స్ వాళ్ళు మా వాళ్ళకు తెలియ చేసారు. వీళ్ళు వెంటనే పై తిరుపతికి వెళ్తున్న మా బాబువాళ్ళకు తెలియచేసారు.
ఒక అరగంటలో పిల్లవాడి గురించి సమాచారం తెల్సినా అదే మాకు కొన్ని యుగాలుగా అనిపించింది. అమ్మా! 36 సం॥ల తరువాత వచ్చాను. ఎంతో ఆనందంతో వున్న తరుణంలో ఇలా మధనపడవల్సిరావటం ఏమిటమ్మా! అని ఆర్తి ఆవేదనలతో అమ్మనే ప్రార్ధించాను.
. అలివేలు మంగాపురం క్యూలో వున్న ఈయనకు ఈ విషయమేమి తెలియదు. మా మనవలు ఏడుస్తుంటే ఏడవటం కాదు అమ్మ నామం చేయండని వాళ్ళను వూరుకో పెట్టాను. ఈయనకు తెలిస్తే ఎక్కడ కంగారు పడ్తారో అని వాళ్ళను బాగా వెనగా వుంచాను. కానీ ఆయనకే ఏదో తెలియని ఆవేదన బయలు దేరి నేను ఈ క్యూలో రాలేను. నాకు అంతా అమ్మే నేను వెళ్ళిపోతానని ఆ ఇనుపఫెన్సింగ్ దూకి వెళ్ళిపోయారు.
మా చిన్న అమ్మాయి. మా పెద్ద అల్లుడు కనిపించారు ఏమయిందని అడిగితే . పిల్లవాడు వున్నాడని చెప్పారు. అది విన్న నేను అంతమటుకూ బిగపెట్టుకొని వున్న ఏడుపును నిభాయించుకోలేకపోయాను. వాడు దొరికాడన్నాక ఏడుస్తావేమిటి? అమ్మా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముచ్చెమటలుపోయటంతో మళ్ళీ హార్టు ఎటాక్ వస్తుందేమోనని భయపడ్డాను. బాబు వున్నాడని తెలిసాక విపరీతంగా ఏడ్చాను. పిల్లలకు అర్థంకాక తెల్లబోయారు. ఏది ఏమైనా మా తిరుపతి ప్రయాణం. సుఖాంతం అయింది.
తిరుపతి నుంచీ తిరిగి వచ్చిన తరువాత విజయా మెడికల్ సెంటర్ వాళ్ళు వారి దగ్గర వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం వున్నది పంపిస్తామన్నారు. ఆయనంతట ఆయన వస్తానంటే వద్దంటం ఎందుకని పంపించమన్నాను. అక్కడ నిత్య నైవేద్య దీపారాధనలు సరిగా జరగటం లేదని మా ఇంటికి పంపుతామన్నారు. దానితోపాటు టేకుది పెద్ద మేనా లాంటి మందిరం పంపించారు. దానిలో ఆ విగ్రహం పట్టలేదు. దానిని వేరే బల్ల మీద వుంచాము. ఆ మేనాలో అమ్మ బంధుమిత్ర సపరివారంగా పరివేష్టిత అయింది.
అది చూచి మా మనవడు లలిత్ చక్రవర్తి “నేను తిరుపతిలో తప్పిపోయానని నన్ను చూచుకోవటానికి వచ్చారా?” అని అడిగితే ఆశ్చర్యపోవటం మా వంతు 5 సం॥ల వాడికి లలితా సహస్రనామాల్లో 50 శ్లోకాలు ఉచ్చారణ దోషం లేకుండా చెప్పటం అమ్మకు వాడియందున్న వాత్సల్యమే కారణము. ప్రతి క్షణం జరిగే సంఘటనలు అమ్మ ప్రసాదంగా స్వీకరించే మనస్తత్వాన్ని కలుగచేసిన అమ్మకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము, అమ్మను ప్రార్థించటం మినహా
“జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి”