సోదరుడు శ్రీ ఎం. పూర్ణచంద్రరావు గారిని గురించి ఇంతలోనే నివాళులు అర్పిస్తూ వ్యాసం వ్రాయవలసి వస్తుందని ఊహించలేదు. నాలుగు రోజుల క్రింద చూసిన వ్యక్తి అకస్మాత్తుగా కనుమరుగవ్వటం చాలా బాధాకరంగాను, వెలితిగాను వున్నది.
అమ్మ స్వగ్రామమైన మన్నవలోనే ఆయన జన్మించడం ఒక పుణ్యవిశేషం. అమ్మకు చిన్నతనం నుండి సేవలు చేసుకున్న మహనీయుడు. నేను 1961 వ సంవత్సరంలో అమ్మను మొదటి సారిగా దర్శించుకున్నప్పుడు, ఆయన జిల్లెళ్ళమూడిలో సేవాకార్యాక్రమాలు నిర్వహిస్తూ వుండేవారు. చాలా సహృదయుడు, స్నేహశీలి.
చిన్నతనంలో జిల్లెళ్ళమూడిలోనే వుండి, తరువాత అనేక ప్రదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళాల్సిరావడం వలన 1982 వరకు వారు జిల్లెళ్ళమూడికి కాస్త దూరంగా వుండవలసి వచ్చేది. ఆ తరువాత 1983 నుంచీ జిల్లెళ్ళమూడికి చేరువై, అనేక సేవాకార్యక్రమాలలో విరివిగా పాల్గొనేవారు
నాకు వారితో చిన్నప్పటి నుంచి పరిచయం వున్నప్పటికి, అనుబంధం ఏర్పడినది మాత్రం 1983 తరువాతనే. ఒకనాటి సాయంత్రం జిల్లెళ్ళమూడిలో సోదరులు శ్రీ రవి అన్నయ్య, నేను పనిచేస్తున్న జిల్లెళ్ళమూడి స్టేట్ బ్యాంక్కి వారు రావడం జరిగింది. శ్రీ రవిఅన్నయ్య నాకు వారిని పరిచయం చేశారు.
1983 నుంచి 1985 వ సంవత్సరం వరకు జిల్లెళ్ళమూడిలో అనేక సేవాకార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. అమ్మ మహాప్రస్థానానికి తయారు చేస్తున్నదా అన్నట్లుగా అనేక సూచనలు చేసింది. విశేషమైన వస్త్ర వితరణలు, అన్నవితరణలు, నామ సంకీర్తనలు, సోదరులు శ్రీరామ్ గారి రామలీలలు నాటక కార్యక్రమాలు, అమ్మ చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టాలను స్టేజ్పై ప్రదర్శించుట… ఇట్లా అనేకానేక ఊపిరిసలపని రీతిలో కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ఆ సమయంలో సోదరులు శ్రీ పూర్ణచంద్రరావు చేసిన సేవలు అసమానం.
ఆ రోజుల్లో అమ్మకు ఏవి అవసరమో అమ్మ సూచనలు అందుకొని నిర్వహించేవారు. టన్నుల కొద్దీ పూలు, గోతాల నిండా కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు గుంటూరు నుంచి తెస్తూవుండేవారు.
ఆయనకో చిన్న కారు వుండేది. ఆ కారులో ఎంత మంది ప్రయాణం చేసేవారో, ఎన్ని సేవాకార్యక్రమాలకు ఉపకరణమైందో అంతేలేదు.
శ్రీ హైమాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముందుగా గుర్తుకు వచ్చేది సోదరుడు శ్రీ పూర్ణచంద్రరావు గారే. సోదరులు శ్రీ రాజుపాలెపు శేషగిరిరావు, ఐ. రామకృష్ణారావు, శ్రీ రవి అన్నయ్య మున్నగు వారి సహాయసహకారాలతో శ్రీ హైమాలయం డిజైన్, దాని నిర్మాణము, హైమ విగ్రహం రూపొందడంలో వారి కృషి అద్వితీయం. కొంతకాలంపాటు సంస్థకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.
ఆయనకున్న ఒకే ఒక్క కుమారుడు అమెరికాలో నిర్యాణము చెందినప్పుడు ఆయన చూపిన నిబ్బరము అసాధారణమైనది.
నాన్నగారి శతజయంతి ఉత్సవాల్లో అనేక అన్నవితరణ కార్యక్రమాలు, ఇతర సేవాకార్యక్రమాలు నిర్వహించటంలో ప్రధాన పాత్ర పోషించారు.
వారి సేవాతత్పరతను, అమ్మపట్ల వారికున్న భక్తి ప్రపత్తులను గురించి వివరించడం అనేది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఆయన అమ్మపాదాల చెంతకు చేరిన మరొక పారిజాత కుసుమం.
వారి కుటుంబ సభ్యులకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించవలెనని అమ్మని ప్రార్థిస్తున్నాను.