‘మీరు దేన్ని గురించి ఆలోచిస్తారూ?’ అని ఒకరు “అమ్మ”ను ప్రశ్నించా రొకసారి. దానికి “అమ్మ” సమాధానం “భోజనాన్ని గురించి”… అవును.. “అమ్మ” ఆలోచన లెప్పుడూ భోజనాన్ని గురించే. పెద్ద అయ్యాక, “అమ్మ” గా గుర్తింపు పొందాక కాదు. చాలా చిన్నతనం నుంచీ “అమ్మ” భోజనం గురించే ఆలోచించేది… అని “అమ్మ” చరిత్ర పారాయణ చేస్తున్న “అమ్మ” బిడ్డలందరికీ తెలుసు. అయితే భోజనం గురించే ఆలోచించే“అమ్మ” నిజానికి ‘నిరాహార’. మరి ఎవరి భోజనం గురించి ఆలోచించేది “అమ్మ”. తన బిడ్డల భోజనం గురించి. ఇంతకీ ఆ బిడ్డ లెవరు?
“ఆబ్రహ్మకీటజనని” అయిన”అమ్మ”కు క్రిమి కీటకాలు, పశుపక్ష్యాదులతో సహా అందరూ బిడ్డలే. అందుకే పశువులకూ, పక్షులకూ ఆహారం అందించిన సందర్భాలెన్నో “అమ్మ” జీవితంలో మనకు తారస పడతాయి.
ఈ కలిలో తన కాకలి లేదని చెప్పిన”అమ్మ” అన్ని బాధలకంటే ఆకలి ఎక్కువ బాధాకరమైనది అని కూడా స్పష్టంగా చెప్పింది. అందుకే గుప్పెడు బియ్యం పథకం అమలులో పెట్టి, ఆ బియ్యంతో అన్నార్తుల ఆకలి తీర్చింది.
‘మీరు భోజనం చేశారా?’ అని అడిగిన ఒకరితో “ఆకలి కావటం లేదు. అదే భోజనం చేయటం.” అన్నది “అమ్మ”. అలాగే ఇంకొక సందర్భంలో “నాకు ఎప్పుడూ ఏమీ తినవలెనని అనిపించదు. ఏమి తినవలసి వచ్చినా వద్దు అనిపించదు.” అని చెప్పింది. అంటే మనకు వలె తినటం, తినకపోవటం అనే తేడా”అమ్మ”కు లేదు. అలాగే “అమ్మ”కు ఏది ఇష్టం?’ అని అడిగివారితో” నాకు అన్నీ ఇష్టమే. పులుపూ ఇష్టమే, కారమూ ఇష్టమే, తీపీ ఇష్టమే, చేదూ ఇష్టమే” అని ప్రకటించింది. పాయ సాన్నం మొదలుగా హరిద్రాన్నం వరకూ గల అన్ని రకాల అన్నాలనూ ఆనందంగా స్వీకరించే “సర్వౌదన ప్రీతచిత్త” అయిన “అమ్మ” కు అన్ని రుచులూ సమానమే కదా!
ఆ రోజుల్లో “అమ్మ”కు రకరకాలైన నైవేద్యాలను సమర్పించేవారు. “అమ్మ” ఆ పదార్థాలను చేతితో తాకి, వేలితో నాకి, కంటితో చూసి మనకు ప్రసాదంగా అనుగ్రహించిన సందర్భాలు మనందరికీ సుపరిచితమే. అంటే “అమ్మ” కేవలం తన దృష్ప్రసారమాత్రంచేతనే శ్రీ పదార్థాలను ఆస్వాదించగలదు అని తెలుస్తోంది కదా! ఒక్కొక్కసారి “అమ్మ” పెద్ద పళ్ళెం నిండా అన్నం పెట్టించుకుని, అన్ని రకాల పదార్థాలను అందులో కలిపి, ఆ మిశ్రమ అన్నాన్ని అందరికీ ముద్దలుగా పెట్టడం, ఆ ముద్దలను అమృతప్రాయంగా మనం స్వీకరించడం అనుభవైకవేద్యమే తప్ప మాటల కందనిది.
ఒకసారి రాత్రివేళ “అమ్మ”కు కడుపులో మంటగా అనిపించింది. అప్పుడు“అమ్మ” ఒక గ్లాసుడు మజ్జిగ తెప్పించుకుని తాగింది. అందువల్ల మర్నాడు ఉదయం “అమ్మ”ను ‘మజ్జిగ తాగుతావా అమ్మా’ అని అడిగితే “మజ్జిగ (భోజనాలు చేసే) వాళ్ళకే చాలటం లేదుటమ్మా! ఎందుకు? వద్దులే..” అన్నది. తన కడుపు మంట నైనా ఓర్చుకోవడానికి ఇష్టపడింది కానీ తన బిడ్డలకు ఒక్క గ్లాసుడు మజ్జిగ తగ్గడానికి “అమ్మ” మనస్సు అంగీకరించలేదు. “అమ్మ” అవ్యాజకరుణకు అవధులెక్కడివి?
“మజ్జిగ మరీ పలచనై చిక్కకుండా ఉన్నాయి నాన్నా. ఎప్పటికైనా వడ్డనలోకి గడ్డపెరుగును వడ్డించ గలిగితే అదే నాకు ఆనందం” అన్న అమ్మ మాటలు ఇప్పటికీ : నా చెవుల్లో గింగురుమంటూ నా హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
డిసెంబర్ 2021 “విశ్వజనని” పత్రికలోని ‘మమతల పెన్నిధి’ వ్యాసంలో…… “ఉత్సవ సందర్భా లలో అయినా గడ్డ పెరుగు వడ్డిస్తే, శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించినట్లు పిల్లలు వేళ్ళమధ్య చుట్టుకున్న పెరుగును ఆనందంగా తింటుంటే కనువిందుగా ఉంటుందని మావారితో అన్నారు. అది మొదలు ఎప్పుడు మాకు భోజనాలు పెట్టుకునే అవకాశం వచ్చినా అగ్రస్థానం గడ్డపెరుగుకే..” అని డా. ఉప్పల వరలక్ష్మిగారు “అమ్మ” అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రస్తావన కూడా గడ్డపెరుగుకు “అమ్మ” ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియచేస్తోంది.
జోరువానలో తడిసి ముద్దయిపోయి చిదంబరరావు తాతగారింటి పంచలో తలదాచుకున్న బిచ్చగాళ్ళ జోలెల్లోని తడిసిన అన్నాన్ని తీసేసి, ఇంటిలోనుంచి అన్నం, పులుసులతో పాటు నేతిగిన్నె కూడా తెచ్చి, ఆ బీదవారి పులుసు ముద్దలోకి నెయ్యి వడ్డించిన అ”బుల్లి అమ్మ” మనస్సెంత పెద్దదండీ!! ఆనాడే “అమ్మ” హృదయమార్దవం, మాతృప్రేమ అభివ్యక్తమైనాయి. ఆదరంగా కొసరి కొసరి పదార్థాలను, అన్నాన్నీ వడ్డిస్తూ ఉంటే ఎంత ఆకలి లేనివారికైనా ఎంతో కొంత అన్నం తినాలనిపించక తప్పదు. వడ్డన ఒక కళ. శైశవంనుంచే ఆ కళలో ఆరి తేరిన “అమ్మ” అన్నద’. అందుకే “నీ కున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనే మహత్తర సందేశాన్ని ఒక ఉపదేశంగా మన కందించింది “అమ్మ”.
“తరంగాలు” పారాయణ చేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాలు చదువుతూ ఉన్నప్పుడు నాలో కలిగిన భావపరంపరకు “అమ్మ” అనుగ్రహించిన ప్రేరణ కారణం కాగా… అన్నపూర్ణాలయంలో అన్నంలోకి వడ్డించడానికి నెయ్యి, ఆఖరి ముద్దగా తియ్యటి గడ్డపెరుగు ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో…. 100 కేజీల నెయ్యీ, 100 కేజీల గడ్డ పెరుగూ…. 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న “అమ్మ”కు నైవేద్యంగా సమర్పించుకో గలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.
జయహోూ మాతా! శ్రీ అనసూయా!