చల్లనితల్లి వేదముల సారమెరింగిన కల్పవల్లి సం
పల్లలితార్ద్ర మానసిక వత్సలతా విభవ ప్రదీప తా
నెల్లర కెల్ల వేళలను ఎల్ల తెరంగుల రూపుగట్టు మా
జిల్లెళ్ళమూడి తల్లి దయసేయుత మాయని మంగళంబులన్.
ఇది జన్మస్థలి వీరలే అనుజు లిందే నాకు స్వర్గ మ్మిటన్
తుదిశ్వాసన్ విడువంగా కోర్కె ఇట పొత్తుల్ జీవసంజీవనుల్
ఇదియే మాతృ పదాబ్జధూళిని పవిత్రీభూతమౌ నేల నే నే
ముదమారంగను పొంగి పొర్లెదను సమ్మోదమ్ముతో దమ్ముతో.
గానము చేయగా కలుగు కమ్మని గొంతుక లేదు భక్తిలో
తానము చేయగల్గిన విధానము నాయెడ కానుపింప దీ
దీనుని యెట్టు లేలెదవొ తీయని తావక ప్రేమనింపి నీ
ధ్యానములోన నుండెడి విధమ్మున చేయగదమ్మ అంబికా!.
అమ్మవు జన్మనీయ మనసైనను అర్కపురమ్ములోన ని
త్యమ్మును నీదు గర్భగుడి ద్వారమునై నిలువంగనిమ్ము ప్రే
మమ్మున నీదు పాదుకల మధ్య సుమమ్ముగ నుండనిమ్ము నన్
చిమ్మన నిమ్ము ధూళి నిజశీర్షమునందు ధరింపనిమ్ము జ
న్మమ్మది ధన్యమైనటుల నామనమందు తలంతు నమ్మరో.
నేనొక పూలమానయి నీ గళసీమ నలంకరింపగా
పూనికలేదు తల్లి ! ఒక పూవుగ లేకొక గడ్డిపోచగా
నైనను పాదపీఠి కడనైనను నిల్వగ సాధన మిచ్చినన్
నేనొక కల్పవృక్షమున నీడగనుండి నటంచు నెంచెదన్
ఎనుబది యేండ్లు వచ్చినవి ఇప్పటికే గతియించె భార్య,తా
వినయ విశిష్టుడై నిలుచు పెద్దకుమారుడు కీర్తిశేషుడై
చనియెను కళ్ళముందే దివి-సాగుచునుంటిని మాతృసేవలో
అనుకొనుచుంటి నిప్పుడిక అమ్మను చేరుటె మంచిదంచు నేన్.
తనువు పటుత్వ శక్తి విడి తా తడబాటును కూర్చుచుండగా
పనిబడి ఇంద్రియమ్ముల ప్రభావము దేహముపైన చూపగా
నెనయగ అంతరింద్రియము లెట్లు జయింతును ? మాతృమూర్తియే
కనికరముంచి నన్నిక ఎకాయెకి నెత్తుక పోవు గావుతన్.
మువ్వురు పిల్లలున్ సుగుణమూర్తులు, పోయినవాడు పోగ, నా
కి వ్వసుధాస్థలిన్ సుఖము నీయగ నిర్వురు సేవచేయగా
నెవ్వరు సాటినాకు, మనసెంతయు తృప్తిని గాంచె బంగరుం
బువ్వుగ అమ్మ పాదముల పూజకు గైకొనుగాక వేగమే.
నా యింట నేనె అతిథిగ
శ్రేయముగా నుండునట్టి సిద్ధి నొసగుమా!
ఆయుష్షుండెడు వరకును
ధ్యేయమ్మౌ నాదుకోర్కె తీరెడివరకున్.
మంచి చెడ్డలు చూడని మమత తోడ
బిడ్డలను కాచుచున్నట్టి దొడ్డతల్లి
నాదు విన్నపమాలించి నన్నుబ్రోచి
వేగ నీలోన కలుపుకో – వేడుచుంటి.