“నిష్కామకర్మకు వర్జ్యకాలం ఉత్తమమైనది” అన్నది అమ్మ (అమ్మ – అమ్మ వాక్యాలు 283).
వర్జ్యకాలం అంటే శుభకార్యాలు చేయటానికి హడలెత్తిపోతాం. ప్రయాణమై వెళ్ళాలన్నా, ఒక వ్యవహారం చేయాలన్నా, కొత్తబట్టలు ధరించాలన్నా పెట్టాలన్నా అడుగుతీసి అడుగువేయాలంటే వర్ణ్యకాలం భయావహమే.
కాగా “నిష్కామ కర్మకు వర్జ్యకాలం ఉత్తమమైనది” అన్నది అమ్మ. అమ్మ కాలస్వరూపిణి, కాలాతీత మహాశక్తి; అమ్మని వర్జ్యం ఏం చేస్తుంది. అనుకోవచ్చు. నిష్కామకర్మ అంటే ‘మనం చేసే కర్మలు మనవి కావు, ఆశక్తివి’ అనుకోవటం. ఆ యదార్థస్థితిని పరాత్పరి అమ్మ మాత్రమే ప్రసాదిస్తుంది. ఈ సత్యాన్ని వివరిస్తూ శ్రీ అన్నమాచార్యులవారు ‘శ్రీ వేంకటపతి – తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురులు గరిమల కర్మయోగి’ అన్నారు.
“సంకల్పమే భగవంతుడు” అనీ, “సంకల్పమూ, వికల్పమూ ఆశక్తి వేనన్న సంకల్పమే సత్సంకల్పం” అనీ అమ్మ స్పష్టం చేసింది. కొంత తనది- కొంత ఆశక్తిది అనుకోవటం పరిమిత దృష్టి. ‘వర్జ్యకాలం’ స్వరూప స్వభావాల్ని అమ్మ చక్కగా వివరించింది. ఆ వివరణకి వెళ్ళబోయే ముందు ‘వర్జ్యకాలం’లో అమ్మ చేసిన నిష్కామకర్మని వీక్షిద్దాం:
మాన్యసో॥ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు అమ్మ పర్ణకుటీరంలో ఉండే తొలిరోజులలో అమ్మకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అహెూరాత్రములు కొన్ని వందలగంటలు అమ్మతో సంభాషించారు. వారిని ‘వెంకన్నా!’ అని అమ్మ ముద్దుగా పిలుచుకునేది. అన్నయ్యగారికి పొగత్రాగటం అనే దురలవాటు ఉండేది. అమ్మతో చెప్పి మానేద్దామని ఎన్నో విఫల ప్రయత్నాలు చేశారు. అమ్మకి మాట ఇవ్వాలంటే మనోధైర్యం కావాలి. అమ్మకి మాటిచ్చి తప్పకూడదు కదా!
వారు ఒకసారి జిల్లెళ్ళమూడి వచ్చారు. రెండు మూడు రోజులుండి ఉదయం ప్రయాణమౌతున్నారు. అక్కడ రోడ్డు మీద మువ్వల సత్యం కాఫీ, కొట్టు ఉండేది, కాఫీ త్రాగి తన వద్దగల ఒక Gold Flake ‘సిగరెట్ త్రాగి, ఇంకొకటి ఉంటే దానిని అక్కడే అట్టి పెట్టి లోపలికి వచ్చి అమ్మకి నమస్కరించుకుని బొట్టు పెట్టించుకుని బయటకు వచ్చారు. నాన్నగారు ఎదురై “ఏమండీ పెడుతున్నారా? కాసేపు ఉండండి. వర్జ్యం” – అన్నారు. వెంకటేశ్వర రావుగార్కి వర్జ్యం, శకునం ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అయినా నాన్నగారి మాట కాదనలేక తిరిగి వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నారు. అమ్మను దర్శించుకోవటం, అమ్మతో సంభాషించటం వారికి అత్యంత ఆనందదాయకమైన సంగతులు. కాగా ఆ సమయంలో – వర్జ్య కాలంలో – అమ్మ ఏవో దురభ్యాసాల గురించి మాట్లాడటం మొదలు పెట్టింది.
మాటల మధ్యలో అన్నయ్యగారు “నాకు కూడా ఈ సిగిరెట్తో పెద్ద బాధ అయిందమ్మా. నీతో చెప్పి మానేద్దామనుకుంటున్నాను. మానేస్తానమ్మా” అన్నారు. అమ్మ తల ఊపింది. ఏమీ ప్రత్యుత్తరమివ్వలేదు. అనంతరం అమ్మ టాపిక్ మార్చేసింది. కాస్సేపుండి అన్నయ్య బయటికి వచ్చారు. అలవాటు ప్రకారం కాఫీ కొట్టుకి వెళ్ళి కాఫీ త్రాగి, అప్రయత్నంగా సిగిరెట్ పెట్టె చేతిలోకి తీసుకున్నారు. అందులో ఉంచుకున్న ఒక్క సిగిరెట్ కాల్చాలా వద్దా అన్న మీమాంస. మీమాంస ఎందుకంటే – అమ్మకి మాట ఇచ్చే ముందు తాను దానిని దాచుకున్నారు కాబట్టి దానికి వాగ్దానం సంగతి వర్తించదు; ఏమైనా అమ్మకి మాట ఇచ్చారు కనుక ఆ తర్వాత మాట తప్పటానికి వీలులేదు. అలా సందిగ్ధావస్థలో పెట్టె తెరిచారు. ఆశ్చర్యం. అందులో సిగిరెట్ లేదు. సత్యాన్ని అడిగారు ‘చూశావా?’ అని; ‘నాకు తెలియదు అన్నయ్యా’ అన్నాడు. వారికి సందేహం తీరిపోయింది; పరిష్కారం లభించింది. అమ్మకి మాట ఇచ్చిన క్షణం నుంచీ సిగిరెట్ కాల్చలేదు.
ఇక్కడ మనం దృష్టి సారించాల్సిన సంగతులు ఆయన ఎన్నో సార్లు అమ్మకి మనవి చేసి మానేద్దామని ప్రయత్నాలు చేశారు, నాన్నగారి పుణ్యమా అని వర్జ్య కాలంలో అమ్మ సన్నిధికి చేరారు. ఆ అవకాశాన్ని పురస్కరించుకుని అమ్మ దురలవాట్లను గురించి ప్రస్తావించి ప్రేరణ నిచ్చింది. వారు అమ్మకి వాగ్దానం చేశారు. దానితో కథ సుఖాంతం అయింది. అమ్మ ముందు చూపుతో వారిచే సిగిరెట్ అలవాటు మాన్పించింది. ఈ మాట ఎందుకు చెప్పుకోవాలంటే – ఆనాటికే వారిపై ధూమపానం దుష్ప్రభావాన్ని చూపింది. దాని వలన 2002లో బైపాస్ సర్జరి జరిగింది. అమ్మ వారి అలవాటు మాన్పించి ఉండకపోతే ఇంకా ఎన్ని ఇబ్బందులు పడేవారో !
సరే. మరల ప్రస్తుతాంశానికి వద్దాం.
‘వర్జ్యకాలం’ గురించి అమ్మ మరికొన్ని సందర్భాల్లో విస్తృతంగా చర్చించింది.
క్రోసూరు కరణంగారు వారి కుమారుడి వివాహానికి అమ్మనే లగ్నం నిశ్చయించమన్నారు. (ఆ సందర్భంగా)
అమ్మ : “నేను అన్ని రోజులూ మంచివంటా.
నేనైతే వర్జ్యంలో చేస్తా. మనుషులు చేరటానికే వివాహాల్లో టైము పెట్టుకోవటం” (అమ్మ – అమ్మ వాక్యాలు 1273). అమ్మ కల్యాణ దినోత్సవం, మే 5వ తేదీ, నాడు కొన్ని వందల కల్యాణాలు అమ్మ స్వయంగా చేసింది. అది మూఢం, వర్జ్యం, దుర్ముహూర్తం అని లేదు; తిథి వార నక్షత్రాల్ని పరిగణించ లేదు. సాధారణంగా శుభముహూర్తాన్ని నిర్ణయించటానికి పంచకరహితం అని లగ్న శుద్ధి చూస్తారు.
“నేనైతే వర్యంలో చేస్తా” అన్నది అమ్మ. అది శాస్త్రాన్ని ధిక్కరించటం కాదు; మన అవగాహనా రాహిత్యాన్ని సూచించటం. తన సత్తాను చాటుకోవటానికీ, సవాలు విసరటానికీ కాదు; మనకి కనువిప్పు కలిగించటం కోసం. ఈసంగతులు శాస్త్రవేత్తలు చాలా లోతుగా చర్చించాలి. మనుషులు చేరటానికే వివాహాల్లో టైము పెట్టుకోవటం” అన్నది. రాత్రి గం. 8.30నిలకు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచే సమయం. కావున వచ్చే బంధుమిత్రులు కాస్త అటూఇటూగా కల్యాణ వేదిక చేరుకోవటానికి ముహూర్తం..
అమ్మ : ఎట్లా ఉంటే అది వర్జ్యం కాలం, నాన్నా?
సో : గణితం చెయ్యలేని కాలం వర్జ్య కాలం. అయితే అది పనికి రాదంటారు గదమ్మా.
అమ్మ : పనికిరాకపోవటం కాదు. వాడికి ఉపయోగపడటం లేదు. (అమ్మ అమ్మ వాక్యాలు 826).
వాడికి అంటే ‘పంచాగకర్త’కి, ‘లగ్న నిర్ణేత’ అని నా అభిప్రాయం. నాకు జ్యోతిశ్శాస్త్ర పరిజ్ఞానం లేదు. అందరింటి సోదరులు శ్రీ అన్నపర్తి కృష్ణశర్మగారు. వంటి శాస్త్రజ్ఞులు కూలంకషంగా ఈ అంశాన్ని అధ్యయనం చేయ సమర్థులు. వర్జ్య కాలం పనికి వస్తుందని, శుభకార్యాలూ చేయవచ్చనీ అమ్మ ఘంటా పధంగా చెపుతోంది. అది అమ్మ అనుభవ సంజనిత ప్రవచనం. ‘అయితే అది పనికిరాదంటారు గదమ్మా’ అంటే “పనికి రాకపోవటం కాదు. వాడికి ఉపయోగపడటం లేదు” అన్నది అమ్మ. ఈ సందర్భంగా ఒక సమాంతర భావనని విచారిద్దాం. “కుళ్ళు మీరనుకున్నంత చెడ్డది కాదు, నాన్నా, మంచితనం నిల్వ ఉంటే అంతే” అని అమ్మ ఒక ఉపమానాన్ని ఇచ్చింది. ఒక కాయ పండింది. దానిని ఉపయోగించుకోకుండా గూట్లో పెట్టి కొంత కాలం ఉంచేస్తే కుళ్ళి పోతుంది; Decompose అవుతుంది.
అలాగే ‘వర్ణ్యకాలం’ నిల్వఉండి ‘ముసుగుదొంగ’ అనిపిస్తోంది. Open secret ఏమంటే శాస్త్రం తమకు అందినంత వరకు ఒకరు వ్రాసిందే; అది వారి అనుభవం. ఏతావాతా ‘వర్జ్య కాలం’ ‘బూచి’లా కనిపిస్తోంది. అది అవశ్యం విజ్ఞుల చర్చనీయాంశం; పరిశోధనాంశం. కాగా సత్యస్వరూపిణి కనుక అమ్మ ఒక సార్వకాలిక సత్యాన్ని నిర్మొహమాటంగా దర్శింపజేసింది. ఒక కోణం లోంచి చూస్తే అది విప్లవాత్మక ప్రవచనం అనిపిస్తుంది. విప్లవాత్మకం అంటే విలక్షణమైనది, విశిష్టమైనది – అని నా దృక్పథం.