“శరీరధారులకు కోరికలుంటాయి. కోరిక లున్నప్పుడు క్రియలు అవసరం. కోరికలు తీర్చుకునేందుకు క్రియలను ఆచరించడం తప్పనిసరి. కాని, లలితాదేవి నిరుపాధి (శరీరం లేనిది), నిష్కామ (కోరికలు లేనిది). కనుక ఆమెకు క్రియతో సంబంధం లేదు. ఆమెకు విధి నిషేధాలు లేవు. విధి నిషేధాత్మకమైన క్రియా కలాపం లేని శ్రీమాతకు నిష్క్రియ అని పేరు …. క్రియలు అక్కర లేకుండా ప్రపంచ వ్యవహారాన్ని నడిపించే లలితాదేవి నిష్క్రియ.” – భారతీవ్యాఖ్య.
సృష్టిలోని ప్రాణికోటికి కోరిక సహజం. మానవులకే కాదు; పశుపక్ష్యాదులకు కూడా కోరికలుంటాయి. పక్షులు సైతం పుల్లాపుడకా ముక్కుతో పట్టుకుని గూడు కట్టుకుంటాయి. జత కడతాయి. ఆహారాన్ని సేకరిస్తాయి. పిల్లల్ని పోషిస్తాయి. అందుకోసం – వాటికి తగ్గ పనులు అవి చేస్తాయి. ఏ కోరిక ఉన్నా లేకపోయినా ప్రాణం ఉన్న ప్రతి జీవికి అన్నం మీద ఆపేక్ష తప్పక ఉంటుంది. అందుకోసం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే, నోటి దగ్గరకు తిండి దానంతట అదే నడిచిరాదు కదా! “శరీరం ఆద్యంఖలు ధర్మసాధనమ్” – శరీర రక్షణ కోసం ఏదో ఒక పని (క్రియ) చేసి, పొట్టనింపుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మానవుల సంగతికి వస్తే, కోరికలకు అంతు ఉండదు. తమ కోరికలు తీర్చుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎన్ని విధాలుగా ప్రవర్తిస్తారో ! ఒక్కొక్కసారి కోరిక నెరవేర్చుకోవడానికి అధర్మానికి కూడా పాల్పడతారు. కాని, నిరుపాధి, నిష్కామ అయిన శ్రీలలితాంబిక నిష్క్రియ. సృష్టి స్థితి లయాలను క్రియలతో అవసరం లేకుండానే, లీలామాత్రంగా నిర్వహించగల సమర్థురాలు శ్రీలలిత. అందుకే శ్రీమాత – నిష్క్రియ.
“అమ్మ” – నిష్క్రియ. “అమ్మ” సంకల్పం చేతనే అన్ని పనులూ జరిగిపోతూ ఉంటాయి. ఏదీ “అమ్మ” పని గట్టుకుని చేసినట్లు కనిపించదు. ఇక్కడ లేనిదీ లేదు; మరోచోట ఉన్నదీ లేదు … ఏ కూరల రోజులలో ఆ కూరలు వస్తూనే ఉంటాయి. బస్తాలు, బస్తాలు కూరలు ఎవరి కోసం వస్తున్నాయి… అతి చిన్న పండుగ అయిన చిలుకు ఏకాదశి నాడు కూడా తలంటి పోసుకుని పిండివంటలు చేసుకుంటారిక్కడ’ అనే ఒక సోదరి మాటల్లో “అమ్మ” – నిష్క్రియగా దర్శనమిస్తోంది. అందరింటి లోని ‘నిత్యాన్నదాన’ విశేషాన్ని ఎందరో ఆశ్చర్యంగా ప్రశంసించారు. ఆ విషయమై “అమ్మ”ను ప్రశ్నించారు. అందరి ప్రశ్నకు “అమ్మ” సమాధానం ఒక్కటే. “మనం పెట్టటం కాదు నాన్నా! ఇక్కడ ఎవరి అన్నం వారు తిని వెళతారు” – ఈ వాక్యం “అమ్మ” నిష్క్రియత్వాన్ని తెలియ చేస్తుంది. “అమ్మ” స్వర్ణోత్సవాల వేడుకల్లో లక్షమందికి అన్నం, పదార్థాలు తయారు చేస్తే, రెండు లక్షల మందికి పైగా భోజనం చేసినా, ఇంకా మిగిలిపోవడంతో కాలువల్లో, బయట పడవేసి, ఇతర జీవరాసులకు కూడా ఆకలి తీర్చడం జరిగిందంటే – అది నిష్క్రియ అయిన “అమ్మ” లీలకాకపోతే ఏమిటి?
“నా కబురు సరాసరి చేరుతుంది. మీ కబుర్లు పోస్టాఫీసులో ముద్రలు పడితే గాని ఎక్కడికయినా చేరవు” అని రామకృష్ణ అన్నయ్యతో చెప్పిన “అమ్మ” మాటల్లో తన సంకల్పం మాత్రం చేతనే పనులు వాటంతట అవే జరిగిపోతాయి అనే భావం స్పష్టం అవుతోంది కదా! “అమ్మ” ఏయే సోదరులను గురించి ప్రస్తావిస్తుందో, వారు ముందుగా అనుకోకుండా, అప్పటికప్పుడు ఎవరో ప్రేరేపించినట్లు, “అమ్మ” సన్నిధికి వచ్చి చేరిన సంఘటనలెన్నో!
అలాగే, “అమ్మ” తాను వెళ్ళాలనుకున్న చోటికి ఏ వాహనాల అవసరమూ లేకుండానే వెళ్ళిపోగలదు. “మీరు తీసుకు వెళ్ళితే కార్లు అవసరం. కానీ, నేను రావాలను కున్నప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. వీటితో పని లేదు” – ఎంత స్పష్టంగా తెలియచేసిందో తాను నిష్క్రియ అని “అమ్మ”. ఎందరో సోదరులకు జిల్లెళ్ళమూడిలో కాకుండా ఇతర ప్రదేశాల్లో “అమ్మ” తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహించింది. అంతేకాదు. వారికి ప్రసాదం పంచి పెట్టింది. తన కృపాకటాక్షాన్ని వారిపై ప్రసరించింది. జిల్లెళ్ళమూడిలోనే ఏకకాలంలో అనేక ప్రదేశాల్లో కనిపించి, తన బిడ్డలకు అంతులేని ఆనందాన్ని కలిగించింది.
ఎక్కడో దూరంగా ఉన్న బిడ్డ ఆకలిని తన సంకల్పం మాత్రం చేత పోగొట్టింది. కష్టాలకు ఓర్చుకోలేని ఒక బిడ్డ ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకుంటే, సంకల్ప మాత్రం చేత అతని ప్రాణాలు రక్షించింది. “అమ్మ” దగ్గరకు మనం వెళ్ళాలనుకున్నా, “అమ్మ” సంకల్పించకపోతే వెళ్ళలేం. అన్ని ప్రయత్నాలు చేసుకుని కూడా ఆగిపోతాం. “అమ్మ” తలచుకుంటే, మన ప్రమేయం లేకుండానే జిల్లెళ్ళమూడికి, చేరగలుగుతాం. అందుకే “అమ్మ” – “మీరు చూడాలనుకుంటే చూడలేరు. నేను కనబడితే మీరు చూస్తారు”అని ప్రకటించింది. లీలా మాత్రంగా ఏదైనా చేయగలిగిన “అమ్మ” నిష్క్రియ.
జిల్లెళ్ళమూడిలోని అనసూయేశ్వరాలయంలో కొలువై ఉన్న “అమ్మ”ను నిష్క్రియగా దర్శిస్తూ, “అమ్మ” చెప్పిన – “ఏ మార్గాన నడిచినా, వాడే నడిపిస్తున్నాడను కోవడమే సన్నార్గం” – అనే వాక్యాన్ని మంత్రంగా జపిస్తూ, నిరంతరం “అమ్మ”ను స్మరిస్తూ ఉండడం కంటే ధన్యతమరే ముంటుంది.
“అమ్మ”కు నివేదించు నైవేద్యమువై
“అమ్మ”కు సమర్పించు తాంబూలమువై
“అమ్మ”కు అందించు కర్పూరహారతివై
“అమ్మ”కు వినిపించు ఘంటారావమువై
అలా క్షణము మసలిన చాలును;
మన చరిత ధన్యము