తంగిరాల కేశవశర్మ గురించి తెలియని అమ్మబిడ్డ లుండరన్నది అతిశయోక్తి కాదు. నిస్వార్థజీవి. నిరాడంబరుడు. ఇతరుల ఉన్నతిని ఆనందించే స్వభావం. ఏదైనా పని వుంటే దానిని సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేసే కృషీవలుడు. రామకృష్ణపరమహంస, వివేకానందుని సాన్నిహిత్యాన్ని అధ్యయనం చేసి బ్రహ్మచర్యం మీద మక్కువ పెంచుకున్నాడు. కానీ జీవితంలో స్థిరపడాలనే కోరిక ఉండేది.
కేశవశర్మగారు వైజాగ్ ట్రాన్స్ఫర్మీద వచ్చారు. ఆయన వచ్చిన తరువాత అమ్మ బిడ్డలలో ఒక చైతన్యాన్ని తెచ్చాడు. వైజాగ్ అధ్యయన పరిషత్కు రూపురేఖలు తీర్చిదిద్దాడు. మొదటి నుంచి సనాతన సాంప్రదాయాల మీద మక్కువ ఎక్కువ. వైజాగ్ రాక ఆయన జీవితాన్నే మార్చేసింది పూర్వంలా కాక. ఎప్పుడు పూజలమీదే అన్నయ్య దృష్టి. ప్రతి పౌర్ణమికి లలితా లక్ష నామార్చనలు, త్రిశతి, ఖడ్గమాల, లలితాష్టోత్తరం, అంబికాష్టోత్తరంతో మారు మ్రోగిపోతుండేది. విశాఖ మాతృశ్రీ పరిషత్ అన్నయ్య వచ్చిన తర్వాతే ఏర్పడింది. వైజాగ్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి జిల్లెళ్ళమూడిలో ‘శ్రీ మాతా’ గెస్టుహౌసన్ను అన్నయ్య ప్రోత్సాహంతోనే నిర్మించుకున్నాము. ఇక్కడ వున్న భక్తులు కొందరిచేత బ్యాంకులో లోను పెట్టించి ‘శ్రీమాతా’ బిల్డింగ్ను పూర్తి చేయించాడు. తాను డబ్బుకు ఇబ్బంది పడుతూ కూడా అమ్మకోసం, సంస్థ కోసం ఎంతో తాపత్రయపడేవాడు.
అమ్మ వత్రోత్సవాలకు వైజాగ్లో లక్షరూపాయిలు వసూలు చేయాలని అనుకున్నాము. మొదట్లో కార్యక్రమాలు అనుకున్నంతగా జరగలేదు. అమ్మతో “అమ్మా ! మంత్రోపదేశం తీసుకుంటానమ్మా ! అని వాళ్ళ నాన్నగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు. వైజాగ్ వచ్చాక “ఇష్టకామ్యసిద్ధి” అని పేరు పెట్టి శ్రీ కమలాలయా మంత్ర సంపుటీ కృత శ్రీ సూక్తమ్” మొదటిసారిగా మా అందరి చేత చేయించారు. ఏది చేసినా, చేయించినా మనస్ఫూర్తిగా, నిష్ఠగా పద్దతిగా చేయించటం అన్నయ్య ప్రత్యేకత.
అమ్మ సిద్ధిపొందినపుడు అమ్మ లేకుండా బ్రతకగలనా అని అలమటించాడు. అమ్మ విగ్రహ ప్రతిష్ఠకు ముందుగా మండలం రోజులు పంచదశీ మంత్రం జపం చేయాలని వాళ్ళ నాన్నగారి ద్వారా ఉపదేశం పొందాలనుకున్నాడు. కేశవన్నయ్య వాళ్ళ నాన్నగారు శ్రీ చక్రాదీక్షాపరులు. నిత్యానుష్ఠానుచేసిన మహోన్నత వ్యక్తి. ఆయన వదనమండలం మంత్రానుష్ఠానంతో వెలిగిపోతుండేది. తన పిల్లలలో నిత్యానుష్ఠానం చేయగలిగినవాడు అన్నయ్యే అని, ఏది చేసినా ఎంతో నియమ నిష్ఠలతో చేస్తాడన్న నమ్మకం కలగటంతో అన్నయ్యకు పంచదశి చెప్పకుండానే షోడశి మంత్రోపదేశం చేశారు. షోడశికి నియమాలు పాటించవలసిన అవసరం ఎంతో వుంది. అన్నయ్య దీక్షగా మంత్రానుష్ఠానం చేశాడు. అమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఎటువంటి విఘ్నాలు కలుగకుండా జరిగిపోయింది. లక్షలాది మంది అనసూయేశ్వరా లయంలో, హైమాలయంలో అర్చనచేసుకొని లబ్దిని పొందుతున్నారు.
ఏది ఏమైనా విశాఖలో అన్నయ్య మాతృశ్రీఅధ్యయన పరిషత్ ప్రెసిడెంట్ గారైన ఎ.వి.వి.ప్రసాద్ గారు మిగిలిన సభ్యులతో కలసి భారతీ వ్యాఖ్య, తొలిమాట, అక్షరాంజలి మొదలగు అనేక పుస్తకాలను వెలుగులోకి తీసుకు వచ్చాడు.