అమ్మ కళ్యాణోత్సవం – ఆశీః పరపర
May 5 వ తేదీ. అవరణంతా సందడి – పచ్చని మామిడి తోరణాలు, దీపాలంకరణలు, మంగళ తూర్యారావాలు. అనసూయేశ్వరాలయ ఉపరిభాగాన్ని చేరుకోవటానికి వెదురు బాదులతో మెట్లు, వాటి కిరువైపుల అరటి బోదెలు వాతావరణం కన్నుల పండువుగా ఉంది.
అమ్మ, నాన్నగారు దేవాలయ ఉపరిభాగానికి చేరుకుని గుమ్మడికాయలు, కొబ్బరికాయలు పగులకొడుతూ పైనుంచి క్రింద నున్న జన సమూహంపై పసుపు – కుంకుమ, పూలు జల్లుతూ పులకింప జేస్తున్నారు. విశ్వకళ్యాణ కారక శుభాశీస్సులను జగత్తుపై వర్షింపజేసే మనోజ్ఞ సందర్భం అది.
తర్వాత అమ్మ గర్భాలయంలోకి వెళ్ళి ప్రస్తుతం అమ్మ విగ్రహం ఉన్నచోట నిలబడి చేతులుచాచి ‘రా, నాన్నా!’ అనే పిలుపుకు ప్రతీకాత్మకంగా నిలువెత్తు ఆదరణ, ఆప్యాయత, అనుగ్రహస్వరూపంగా దర్శనం ఇచ్చింది. ఒక కొబ్బరి చిప్ప నిండుగా ముద్దకర్పూరం నింపి వెలిగించి అమ్మకు మంగళహారతి పట్టారు. ఆ సమయంలో దివ్యమంగళమూర్తి అమ్మ దర్శన దీప్తిని వైభవాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఆదృశ్యం ఇప్పటికీ ఎప్పటికీ నా కళ్ళముందు గోచరిస్తూనే ఉంటుంది.
నాటి సాయం సమయం. మేడమీద ఆరుబయట అమ్మ సన్నిధిలో ఒక సంగీత విద్వాంసురాలు ‘హిమగిరి తనయే హేమలతే’ కృతిని శ్రావ్యంగా గానం చేస్తున్నది. అమ్మ తన చేతి వేళ్ళను వీణ మీటిన రీతిలో కదిలించిన స్మృతి ఎంతో మనోజ్ఞమైనది.
అన్నపూర్ణాలయ ఘంటారావము వినినంతనే అమ్మ అందరిని భోజనాలకి వెళ్ళమని సంజ్ఞ చేసింది. వెళ్ళి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించబోతున్నాం. మెట్లమీంచి కిందికి అమ్మమ్మ గబగబా దిగుతూ “ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ అమ్మ నాన్న గారలు కూర్చొని ఉన్నారు. వెళ్ళండి” అని చెప్పింది.
వెంటనే మేడపైకి చేరుకున్నాం. ఆరబోసిన వెన్నెల కాంతిలో కళ్యాణ దంపతులు ఆదిదంపతులు అమ్మ నాన్న గారలు దర్శనం ఇస్తున్నారు. ఆకాశంలో తారలు ఆరబోసిన వజ్రాలులా గోచరిస్తూన్నాయి. ప్రకృతి పరవశించి అంజలి ఘటిస్తోంది.
దాదాపు ఏభై అరవై మంది ఉన్నారు. కొందరిని పేరుపెట్టి పిలుస్తున్నారు, వారు వెళ్ళి అమ్మను పుష్పమాలాలంకృతను చేసి అమ్మ, నాన్న గారలకు నమస్కరించుకుని వారి ఆశీస్సులను పొందుతున్నారు. వారి అదృష్టానికి అనందిస్తున్నాను, కానీ నాకా అదృష్టం లేదేనని చింతిస్తున్నాను.
ఇంతలో రామకృష్ణ అన్నయ్య నన్ను, నాభార్యను రమ్మని పిలిచారు. ఎంతటి సౌభాగ్యమో!! ఎన్ని జన్మల తపః ఫలమో !!! అమ్మ, నాన్న గారలకు సాష్టాంగ ప్రణామం చేశాను. అంతలో అమ్మ గళసీమలోని గజమాలను తీసి సున్నితంగా మెలితిప్పుతూ మా దంపతులను ఆ మాలతో కట్టి పడేసినట్లు ఆశీఃపూర్వకంగా మామెళ్ళో వేసింది. నా అదృష్టం, సౌభాగ్యం కట్టెదుట సాక్షాత్కరించాయి. ఆనందాతిరేకంతో నాకళ్ళు చెమర్చాయి. ఆ అనుభూతి అలౌకికం, అపూర్వం.
మనసెరిగిన తల్లికి, మానవ సౌభాగ్యదేవతకి, సర్వమంగళకి విశ్వజననికి త్రికరణశుద్ధిగా హృదయ నీరాజనాల నర్పించాను.
- (సశేషం)