(గతసంచిక తరువాయి)
తీవ్ర అస్వస్థతతో అమ్మ
అమ్మకి చేసిన వైద్య పరీక్షల నివేదికలను విశ్లేషించి వైద్యనిపుణులు చెప్పిన సంగతులు నాన్నగారికి తెలిసినట్లు ఉంది. వారు ఒకింత ఆందోళనగా ఉన్నారు. అయితే నాన్నగారు అమ్మయొక్క దైవీశక్తి గురించి బాగా తెలిసిన వారు కనుక, అమ్మ తనంతట తానుగా తన ఆరోగ్యం గురించి పలికితే మరి ఏ ఇతర ఆందోళన అవసరం లేదు; వైద్య నిపుణుల అభిప్రాయాలు కూడా పరిగణించ నవసరం లేదు . అని వారి నమ్మకం. ఇక వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
నాన్నగారు : అనసూయా! ఆరోగ్యం ఎలా ఉంది?
అమ్మ : చూస్తూనే ఉన్నారుగా వచ్చిన దగ్గర్నుంచీ.
నాన్నగారు : అది సరే అనుకో. వచ్చిన దగ్గర్నుంచీ తగ్గుముఖం పట్టినట్లుందా ? గుణం కనిపిస్తోందా ? నీ మట్టుకు నీకు తెలుస్తూ ఉంటుంది కదా!
అమ్మ : తగ్గిస్తామని తీసుకువచ్చారు. ఏదో ఒక మిషమీద దగ్గిస్తూనే వున్నారు కదా!
నాన్నగారు : ఛాతీలో ఏమైనా తేడా వుందేమో నని వైద్యులు దగ్గమని అంటున్నారు.
అమ్మ : అదే నేనూ గమనించాను. తగ్గిస్తామని ఏవో పరీక్షలు చేస్తున్నారు. ప్రతిసారీ దగ్గిస్తూనే వున్నారు.
నాన్నగారు : (కొంచెం చిరాకుగా) వచ్చిన తర్వాత గుణం కనిపిస్తున్నదా? అని రెట్టించి అడిగారు. వారి గొంతులో తడబాటు కనిపిస్తున్నది. వారికి అమ్మ ముఖతః రావలసిన సమాధానం కోసం ఎంతగా ఎదురు చూసినా, కావలసిన రీతిలో పొందలేక పోతున్నారు.
వారి సహనం తగ్గి, కాస్త కోపం చోటు చేసుకుంది. కనుకనే “ఎప్పుడూ ఇంతే. ఒక్క విషయం సూటిగా చెప్పవు. అన్నిటికీ డొంక తిరుగుడుగా సమాధానం ఇస్తావు?” – అంటూ విసుగు ప్రదర్శించారు. ఆ గదిలో సుబ్బారావు అన్నయ్య, వసుంధర అక్కయ్య, డా॥ పాప అక్కయ్య, నేను ఇంకా నలుగురం వున్నాం. అటువంటి ముఖ్యమైన విషయాలు నాన్నగారు చర్చిస్తున్నపుడు నేను అక్కడ వుండడం సమంజసం. కాదేమోనని మెల్లగా నిష్క్రమించేందుకు ఉపక్రమించాను. లేచి నిలబడ్డాను. అమ్మ నా వంక తిరిగి నన్ను ఉద్దేశించి “నువ్వు ఎక్కడికి బయలుదేరావు? కూర్చో!!” అంది. “అదికాదమ్మా!”
అని నీళ్ళు నములుతూ మెల్లగా “నాన్నగారు, ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నారు కదా! “నేను” అని నసుగుతున్నాను. “నేను చెపుతున్నాను… కూర్చో!! నువ్వు ఈ కుటుంబంలో వాడివి. పరాయివాడిగా ఎప్పుడూ అనుకోకు”- అన్నది. అమ్మమాటలు, చేతలు, విశ్వజనీన మాతృతత్త్య వైభవాలను తలచుకుంటూ మనస్సులోనే కోటి కోటి నమస్సుమాంజలులు- సమర్పిస్తూ కళ్ళనుండి స్రవించే ఆనందబాష్పాలను తుడుచుకుంటూ ఒక తన్మయత్వంతో అమ్మను చూస్తూ అక్కడే ఉండి పోయాను.
వాస్తవం ఏమంటే- నా స్థానంలో ఎవరున్నా అమ్మ అదే మాట అంటుంది. విశ్వకుటుంబినికదా!! కలలోనైనా కానరాని ఆ దివ్య వాత్సల్యామృతమూర్తిని కళ్ళారా చూసి పరవశించిన మనందరం ధన్యులం, కృతార్థులం, చరితార్థులం, సార్థక జీవనులం, భాగ్యశాలురం.
(సశేషం)