(గతసంచిక తరువాయి)
తీవ్ర అస్వస్థతతో అమ్మ
1980లో అమ్మ తీవ్ర అస్వస్థత కారణంగా హైదరాబాద్లో వైద్య సహకారం నిమిత్తం ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా అమ్మను చూడాలన్న కోరిక బలీయంగా పెరిగింది. అమ్మ ఎక్కడ బస చేసిందో వివరాలు ఏమీ తెలియవు. అయినా ౧.రామకృష్ణ హైదరాబాదులో సంతోషనగర్ కాలనీలో వున్నాడు కదా అని ధైర్యం చేసి వెళ్ళాను. ‘అమ్మ వచ్చినప్పటి నుండి వాడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి వెడుతున్నాడు, అంతకు మించి వివరాలు తెలియవు’ అన్నారు వాళ్ళ నాన్నగారు. పంజాగుట్ట దగ్గర ఎక్కడో వుంది అమ్మ – అనీ తెలిసింది.
హతాశుడనై ‘ఇంక అమ్మ దయ’ అని చేయగలిగింది లేక పంజాగుట్ట దగ్గర చేరాను. ఆ మహానగరంలో ఎలాగ అని మనస్సుకు ఆందోళన. అంతలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ‘అమ్మ అన్నపూర్ణాదేవి కదా! అమ్మ దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం వుందాం’ – అని. ఇది అమ్మ మీద అలక కాదు, కనిపించని నా అంధవిశ్వాసానికి కనిపించే రూపం, ఒక అంతస్సూత్రం, తీవ్రవేదన, అభ్యర్థన, ఒక ఆత్మీయ ఆరాధనా విశేషం, సమర్పణ భావ వైభవం.
ఒక గట్టుమీద కూర్చొని అయోమయంగా వచ్చీ పోయే వాహనాలను చూస్తున్నాను – యాంత్రికంగా. మానవ జీవితంలో సాక్షీభూతంగా అలా స్థాణువులా నిలదొక్కుకోవటం కూడా ఒక గొప్ప సాధనే. మార్తాండుడు విజృంభిస్తున్నాడు. అమ్మ నామం చేసుకుంటున్నాను. కాలం నిర్ణయంగా కదులుతోంది.
అమ్మకు అంతలోనే అంతులేని కరుణ కలిగింది – నేను కూర్చున్న వైపుగా త్రిమూర్తుల వలె సుబ్బారావు అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొనగా పరుగు పరుగున వారిని చేరుకున్నాను. ‘ఇక్కడ కూర్చున్నావేమిటి, శరభలింగం?’ – అని రామకృష్ణ అన్నయ్య ఆప్యాయంగా పలకరించాడు. ‘అమ్మని చూద్దామని వచ్చాను. సరైన వివరాలు తెలియక ఇక్కడ కూర్చున్నాను’ అన్నాను.
జర్నలిస్టు కాలనీ శ్రీ రాజగోపాలాచారి గారి నివాసానికి వెళ్ళే గుర్తులు చెప్పి వారు వెళ్ళిపోయారు. అమ్మ దర్శనం కోసం అవధులు మించిన ఆనందంతో మనో వేగంతో అమ్మ నివాసానికి చేరుకున్నాను.
సరాసరి అమ్మ దర్శనం చేసుకుని నమస్కరించుకున్నాను. “వెళ్ళి భోజనం చెయ్యి, నాన్నా!!” అన్నది అమ్మ. నా వ్రతనియమం ఫలవంతం అయింది. భోజనానికి వెళ్లమని అమ్మ చేసే సైగ ఒక ‘మహాముద్ర’గా అని పిస్తుంది నాకు. ‘అలాగే నమ్మా. తొందర ‘లేదుగా’ అన్నాను.
“ఎందుకురా మొహమాటం ? ఇక్కడ మన అన్నం మనం తింటున్నాం.” అంటూ ఒక సోదరుని సాయమిచ్చి నన్ను భోజనానికి పంపింది. భోజనం పూర్తి అయింది. అమ్మ అనారోగ్యం గురించి సమాచారం తెలుసుకునే పనిలో మునిగిపోయాను. ఎవరిని అడిగినా, ఏమీ తెలియడం లేదు. ఏవేవో పరీక్షలు చేశారుట ఆయా reports గురించి అందరూ ఆందోళనతో ఎదురు చూస్తున్నారు.
వీలయినపుడల్లా అమ్మ సన్నిధికి చేరి ఒక మూల కూర్చుంటున్నాను. పాపక్కయ్య, వసుంధరక్కయ్య, కొందరు డాక్టర్లు అమ్మ చుట్టూ పరివేష్ఠించి ఉన్నారు. అంతలో నాన్నగారు కూడా అక్కడికి వచ్చారు. బహుశా reports వచ్చాయేమో! అనుకొని అక్కడే ఉన్నాను.
(సశేషం)