1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నిస్సీమమహిమాన్విత

నిస్సీమమహిమాన్విత

Chaganti Sarabha Lingam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : August
Issue Number : 1
Year : 2022

(గతసంచిక తరువాయి)

అమ్మకు – సకల ప్రకృతి, మన మనస్సులు, సంకల్పాలు, చేతలు, సుఖదుఃఖాలు – అన్నిటిపై అప్రతిహతమైన అధికారము ఉంది. అలా అని ఆయా సందర్భాల్లో అనుభవపూర్వకంగానే తెలుసుకోగలం.

ఒకనాడు అమ్మ వద్దకు వెళ్ళాను. మండు వేసవి. చాల ఉక్కగా ఉంది. గదిలోకి వెళ్ళగానే : చాలా గుబులుగా వుండి Fan switch వైపు చూస్తుంటే అమ్మ, “కరెంటు లేదు, నాన్నా!” – అన్నది. ఆ రోజుల్లో కరెంటు రాకపోకలు ఎవరికీ తెలియదు. కనుక విసనకర్ర తీసుకుని విసరటానికి సిద్ధమవుతూంటే అమ్మ “ఎప్పటి కొస్తుందో!!!” అని ప్రశ్నార్థకంగా చూసింది.

అమ్మకు స్వయంగా విసిరే సదవకాశం లభించిందని సంతోషంగా విసరటం మొదలు పెట్టాను. కాలం గడుస్తోంది, కరెంటు రాలేదు. ఒకవైపు చెయ్యి నొప్పి కూడా మొదలయింది. పట్టుదలగా ఆ చెయ్యి, ఈ చెయ్యి మార్చి మార్చి మరీ విసురుతున్నాను. నా పట్టుదలకి అమ్మ పెట్టిన పరీక్షా అనిపించింది. అమ్మను అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకోవటం తేలిక; అది అనంతతత్త్వాన్ని పరిమితత్వం అంచనా వేయటం. తల్లి బిడ్డని పరీక్షిస్తుందా? ‘నన్ను పరీక్షిస్తున్నావా, అమ్మా?’ అని అడిగితే అమ్మ “నిన్ను పరీక్షించటం అంటే నన్ను నేను పరీక్షించుకోవడమే” అంటుంది.

మాటి మాటికీ చేయి మారుస్తూంటే నవ్వుతూ అమ్మ “చాల్లే, నాన్నా!” అని లేచి మంచం మీద కూర్చున్నది. తలుపు తెరిచి ఉంచమని చెప్పింది. తన చూపుడు వేలుని, మధ్య వేలుని కలిపి రమ్మని ఒక సంజ్ఞ చేసింది. ఆ సూచన దేనికో? ఆ ఆజ్ఞ ఎవరికో? వెంటనే చల్లటి గాలి, ధనుర్మాసం తెల్లవారు జామున తిరుప్పావై పఠన సమయంలో సమీరం వలె రంగప్రవేశం చేసింది. అమ్మ సంజ్ఞ చేసింది వాయుదేవునికి అని అర్థమైంది.

అప్పుడు అక్కడ ఉన్న Air Conditioner పనిచేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన వచ్చినదే తడవుగా అమ్మ ” నాన్నా! దాని కేదో మరమ్మత్తు వచ్చినట్లుంది. ఈ మధ్య కాలంలో అది పని చెయ్యటం లేదు. ఏమైనా విశాఖపట్టణంలో బాగు చేస్తారేమో …. చేయించు” – అన్నది.

అందుకు సంతోషంగా అంగీకరించి, SVJP కార్యాలయానికి వెళ్ళి శ్రీ దినకర్ అన్నయ్యతో AC Machine తీయించమని చెప్పాను. కాస్సేపట్లో అన్నయ్య వచ్చి AC open చేయించి, Pack చేసి, Navata Transport లో పేరు మీద parcel book చేయించానని చెప్పారు. Parcel Number తీసుకుని విశాఖపట్టణం చేరుకున్నాను.

Crystal Engineering Company వారు దానిని శ్రద్ధగా పరిశీలించి వారి అంచనా ప్రకారం రెండు, మూడు వేలు ఖర్చవుతుందని చెప్పారు. మాటల సందర్భంలో అది నా సొంతం అనుకున్నారు. “అబ్బే. అది నాది

కాదు, జిల్లెళ్లమూడి అమ్మ గారిది. దాని మరమ్మత్తు పని నాకు అప్ప చెప్పారు” అని వివరించాను. రెండు రోజులలో పని పూర్తి చేసి, తిరిగి Navata Transport లోనే దినకర్ అన్నయ్యకి పంపించారు.

మరునాడు సొమ్ము తీసుకొని workshop కి వెళ్ళాను. వాళ్ళు ససేమిరా సొమ్ము పుచ్చుకోమన్నారు, “అమ్మగారికి ఉడతాభక్తిగా మేము అందించగల్గిన సేవకి మీరు మమ్మల్ని దూరం చేయడం భావ్యం కాదు” అన్నారు. “మరి అమ్మ నాకు అప్పగించిన కించిత్ సేవకి నన్ను దూరం చేస్తారా?” అని వాదించాను.

“మీరు ఎలాగైనా ఏదో విధంగా సేవ చేసుకుంటారు. మాకు ఇటువంటి అవకాశం ఎప్పుడో కాని లభించదు” అని మరల మరల సగౌరవంగా విన్నవించుకున్నారు.

ఇంతకీ గుర్తించవలసిన, గుర్తుంచుకోవలసిన సంగతి, వాస్తవం, ప్రబోధం ఉన్నాయి – ఇందులో నా ప్రమేయం ఎంతవరకు అని తరచి చూస్తే .”ఏమి లేదు” అని స్పష్టమవుతుంది. “విశాఖపట్టణంతో బాగు చేస్తారేమో చేయించు”-అని అమ్మ నన్ను ఆదేశించినంతనే ఈ ప్రణాళికారచనంతా అందులో సిద్ధం చేసింది. యంత్రాన్ని Navata Transport లో విశాఖపట్టణం దినకర్ అన్నయ్య పంపారు. Company వారు repair చేసి తిరిగి అదే Transport లో దినకర్ అన్నయ్యకి పంపారు. Repair charges తీసుకోలేదు. నా ప్రమేయం అసలు లేనే లేదు.

ఒక సందర్భంలో అమ్మ అన్నది “నాన్నా! ఎవరైనా అంతే. చేసేదేమిలేదు. ప్రక్కన ఉండటమే.” అని కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ శక్తివే, అమ్మవే. తర్వాత పది రోజుల వ్యవధిలో జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మ, గదిలో A.C. Machine కనిపించలేదు. మరల మరమ్మతుకు వెళ్ళిందేమో అనుకున్నాను. అంతలో అమ్మ, “నాన్నా! పదిమందికి ఉపయోగ పడుతుంది కదా అని మాతృశ్రీ మెడికల్ సెంటరులో పెట్టించాను. వెళ్ళి చూసి. “రా” అన్నది. ఎంత అనునయంగా చెప్పిందంటే నేను తెచ్చి ఇచ్చిన వస్తువుని తాను స్వతంత్రంగా వేరెవరికో ధారాదత్తం చేసినట్లు. నేను కళ్ళనీళ్ళతో, “అమ్మా! ఏం జరిగినా నీ సంకల్పమే. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదుకదా!” అన్నాను. “అలా కాదు, నాన్నా! అన్నింటిలోనూ అందరూ తనది అన్న భావనతో వున్నప్పుడే అందరిల్లు ఆశయం నేరువేరుతుంది” – అన్నది అందరమ్మ.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!