(గతసంచిక తరువాయి)
స్వయంగా అమ్మ చేసిన వివాహం
ఏ శుభకార్యక్రమ నిర్వహణలో తరచి చూసినా, కర్త-కర్మ-క్రియ అమ్మే అని తెలుస్తుంది. అమ్మ అంటే సర్వమంగళ, పార్వతీ దేవి, సౌభాగ్య దేవత.
ఈ సత్యం అక్షరాల విశదీకరించటానికి ఒక ఉదాహరణ –
ఒక ఏడాది మే 5 అమ్మ కళ్యాణోత్సవానికి మేము మూడు రోజులు ముందుగా వెళ్ళాం. నాల్గవ తేదీన ఒక పెద్దమనిషి ( 60-65 సం.లు) కళ్ళ నీళ్ళు పెట్టుకుని అమ్మ దర్శనానికి వచ్చారు. అతని మాటల ద్వారా తెలిసింది వారు మొదటిసారి రావటం అదేనని.
వారు అమ్మకు సమస్కరించుకుని దుఃఖాన్ని దిగమింగుతూ తన కన్నీళ్ళను తానే తుడుచుకుంటున్నారు. అమ్మ వారి చుబుకం పట్టుమని “చెప్పు నాన్నా! అట్లా ఉన్నావేమిటి?” అని అడిగింది ప్రేమగా.
ఆయన తన గోడును విన్నవించుకున్నాడు “బడి పంతులు చేసి కుటుంబాన్ని పోషించాను. భార్య చనిపోయింది. కూతురు స్కూల్లో పని చేస్తోంది. దానికి పెళ్ళి చెయ్యాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. నా కూతురే నన్ను పోషిస్తోంది. తను పనిచేసే పాఠశాలలో మరో ఉపాధ్యాయుడు దాన్ని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. వారిరువురినీ నీ దగ్గరకి తీసుకు వచ్చాను”- అని.
అలాగా అని వారిని పిలుచుకురమ్మన్నది. వెంటనే వారిరువురూ వచ్చారు. అమ్మ ఆ అమ్మాయి గడ్డం పట్టుకుని “ఆ అబ్బాయి నచ్చాడా?” అని అడిగింది. ఆ అమ్మాయి అంగీకారంగా తల ఊపింది. అమ్మ ఆ అబ్బాయి వైపు చూసి “నాన్నా! పిల్లలకు పాఠాలు చెప్తావు కదా! భార్యను ఎలా చూసుకోవాలి? భర్తగా నీ బాధ్యత ఏమిటి?” – అని ప్రశ్నించింది.
“ఆమె సుఖదుఃఖాలు నా బాధ్యత. ఆమె మనస్సులో కలత చెందకుండా చూసుకోవలసినదంతా నా బాధ్యత. ఒకరి కొకరం తోడు-నీడగా వుండి సంసారం సాగించడమే మా బాధ్యత” అని క్లుప్తంగా చెప్పాడు.
అమ్మ ఆ పెద్ద మనిషి వైపు చూస్తూ “ఇంకేం, నాన్నా! పిల్లా పిల్లాడూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు కొంత కాలంగా అర్థం చేసుకున్నారు. నీకూ బాధ్యత తీరి పోతుంది. ఇంతకన్న ఏం కావాలి?” అని అడిగింది.
ఆయన దైన్యంగా మరల “ఆ మూడు ముళ్ళు పడితే అలాగే అనుకోగలనమ్మా. ఆర్థిక పరిస్థితి అందుకు ఏమాత్రం సహకరించట్లేదు” – అంటూ రిక్త హస్తాలను అమ్మ వైపు చూపించాడు.
వెంటనే “ఓస్. అంతేనా ! ఆ మూడు ముళ్ళూ కదా !! రేపే వేయిద్దాం” – అన్నది అమ్మ: అలా అభయప్రదానం చేసింది. ఆ వివాహం పరిపూర్ణం కావటానికి తనే పెళ్ళి పెద్దగా సర్వ బాధ్యతల్ని స్వీకరించింది. వధూవరుల మనోగత భావాల్ని తెలుసుకుంది, వారికి గల గృహస్థాశ్రమ పరమార్థాన్ని ప్రశ్నించింది. సంతృప్తి చెందింది. కనుకనే తన కళ్యాణోత్సవ శుభతరుణాన వారిరువురిని ఏకం చేసి, ఆ వృద్ధుని కన్నీటిని తుడిచి గట్టెక్కించాలని సంకల్పించింది. అది అకారణ కారుణ్యం, ఆశ్చర్యకర వాత్సల్యం, దీనజనావన తత్వ విశేషం.
(సశేషం)