పిలిచినా పిలవకున్నా పలికే అమ్మ
‘అడిగితే కానీ అమ్మైనా పెట్టదు’ అనేది లోకం నానుడి కానీ అందరమ్మ అనసూయమ్మ. “అడగకుండానే అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ” అంటూ తన లోకోత్తర వాత్సల్య దీప్తిని చాటింది.
వాస్తవం ఏమంటే – మన ఆర్తి, కన్నీళ్ళు, వెతలు, కడగండ్లు వీటికే అమ్మ కదలి వస్తుంది, ఆదుకుంటుంది; మన ప్రార్థన ఆక్రందనలను విని కాదు. ఇందుకు నా అనుభవం ఒకటి వివరిస్తా.
ఒకసారి నన్ను ఒరిస్సాలోని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్కి బదిలీ చేశారు. అక్కడ ఎటువంటి సౌకర్యం లేదు. కాకులు దూరని కారడవి. అన్నట్లుండేది. ఉత్తరం వ్రాస్తే వారం రోజులకు కూడా అందేది కాదు. ఈ అయోమయ స్థితిలో అమ్మను అడిగాను, “అమ్మా! ఒక సామెత ఉంది – అడవిలో ‘అమ్మా!’ అంటే, ఎవరికి పుట్టావురా? అడుగుతారట” – అని.
అందుకు సమాధానంగా సూటిగా అమ్మ “పిలిచి చూడు నాన్నా! అప్పటికి గాని తెలియదుగా?”- అంది. అది ఒక సవాలు కాదు, ఆపన్నహస్తం.
నేను గమ్యం చేరుకోవాలంటే ఝార్సుగూడాలో దిగి సుందర్ ఘర్ దాటి సర్గిపల్లి అనే పల్లెకి పోవాలి. ఆ ఊరు చేరే ముందు ఒక ఏరు దాటాలి. అది వర్షాకాలంలో ఎగువనున్న కొండలలో కురిసిన వర్షానికి పొంగుతుంది. ఫలితంగా ఆ సమయంలో రాకపోకలు స్తంభించిపోతాయి. సరే. ఉద్యోగంలో చేరాను. ఒక పాకవంటి వసతిని ఏర్పాటు చేసుకుని పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్చాను.
ఉద్యోగరీత్యా అక్కడకు 120 కి.మీ.ల దూరంలో ఉన్న రూర్కెలా తరచుగా ఉ॥ గం 9.00 లకు బయలు దేరి వెళ్ళి రాత్రి గం. 8లకు తిరిగి మా Camp కు చేరుకునేవాడిని. అదే విధంగా ఒకనాడు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంటే ఏరు పొంగి, వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
‘ఆ వాగులో జీపు దిగితే ఇంజన్లోకి నీళ్ళు పోయి ఆగిపోతే ఏమీ చేయలేము” అన్నాడు మా డ్రైవర్. ఏటి ఒడ్డున గడపాలంటే పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు తిరుగుతుంటాయి. ఏటిలో నడిచి పోదామని అన్నాడు మా డ్రైవర్. సరేనని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఎలాగో అవతలి, ఒడ్డుకు చేరాం. అక్కడ 20 మంది జనంతో ఒక లారీ కదలటానికి సిద్ధంగా ఉంది. వారు మావైపు ప్రశ్నార్థకంగా చూశారు- ‘ఈ ప్రవాహాన్ని ఎలా దాటారు?’ అన్నట్లు. మాకు ఆశ్చర్యం ఏమంటే మోకాలు దాటి లోతు వున్నట్లు తెలియలేదు. వాళ్ళు చెప్పటం నిలువెత్తు నీళ్ళు – – ఉన్నాయని. నేను మహదానందంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నా.
ఏరు పొంగినదని తెలిసి, నా శ్రీమతి, దిక్కు తోచక దీనజనావని అమ్మను “ఏం చేస్తావో నాకు తెలియదమ్మా. క్షేమంగా ఇంటికి చేర్చు” – అని ప్రార్ధిస్తూ ఉన్నది. లోగడ ఒక సంశయంతో ఆపదలో పిలిస్తే అమ్మ వచ్చి ఆదుకుంటుందా అని అమ్మ సమక్షంలోనే ఎగతాళిగా మాట్లాడాను. “పిలిచి చూడు, నాన్నా! అప్పటికి గాని తెలియదుగా?” అన్న అమ్మ మాట, భరోసా, నిగూఢార్ధం అప్పటికి బోధపడింది. నా అజ్ఞానానికి సిగ్గువేసింది. అలనాటి వసుదేవుని అనుభవం, లీల, దైవమాయ నా స్మృతిపథంలో మెదిలాయి. పురాణాల్లో విన్నాను, అనుభవంలో కన్నాను.
అక్కడ మా Camp లో అన్నీ మట్టి గోడలు- ఇంటి కప్పులు వెదురు, సరుగుడు కర్రలతో ఉండి, పైన మట్టి పెంకులు కప్పి ఉండేవి. తలుపులు, కిటికీలు నామమాత్రం; ఈదురు గాలికి, వర్షానికి రెపరెపలాడేవి. సందుల్లోంచి పాములు, తేళ్ళు వచ్చి పలకరిస్తూండేవి. పిల్లలు పసివాళ్ళు – నాలుగేళ్ళు, ఆరేళ్ళు. భయపడ్డాం కానీ ప్రమాదం వాటిల్ల లేదు. ప్రతి శుక్రవారం అమ్మ పూజ చేసుకునే వాళ్ళం. ఎవరో ఒకరు సమయానికి పూలు – పండ్లు సమకూర్చేవారు.
ఆపత్సమయంలోను, అనుక్షణం ప్రార్థించక పోయినా అనుక్షణం అమ్మ మా వెన్నంటి ఉండి మమ్మల్ని కాపాడింది కంటికి రెప్పలా.
“పిలిచి చూడు, నాన్నా! అప్పటికి గాని తెలియదుగా?” అని అమ్మ అన్నట్లు ఆ అవసరం రానేలేదు. ఏమంటే- పిలవకుండానే ఆదుకునే ఆప్తబాంధవి, ఆపదుద్ధారిణి కదా మన అమ్మ! కన్నీటికి కరిగిపోయే కారుణ్యామృత వర్షిణి మన అమ్మ !!
(సశేషం)