(గత సంచిక తరువాయి)
గాయత్రీ జపం – లలితా పారాయణ
నేను చాగంటి వెంకట్రావు గారితో వెళ్ళి అన్నపూర్ణాలయంలో కమ్మటి భోజనం చేశా. వారి గదిలో నా సామాను పెట్టుకుని కాస్సేపు విశ్రమించా. అప్పటికి మధ్యాహ్నం 2.00 గంటలు దాటింది. ‘మధ్యాహ్నం మాట్లాడదాం’ అన్నది కదా అమ్మ! అమ్మతో మాట్లాడి సాయంత్రం బయలుదేరవచ్చునని ఆలోచనతో మేడపైకి దారి తీశాను. అమ్మ గది తలుపులు, వసుంధర అక్కయ్య వంటింటి తలుపులు మూసి ఉన్నాయి. ఎవరూ లేరు.
అమ్మ గది తలుపు నెట్టి చూద్దామని గుమ్మం దగ్గరగా వెళ్ళి చెయ్యి వెయ్యబోయి వెనక్కు తగ్గాను. అలా నాలుగయిదు సార్లు జరిగింది. మళ్ళీ వెళ్ళి తలుపు గడియ మీద చెయ్యి ఆన్చేలోగా తటాలున అమ్మ స్వయంగా తానే తలుపు తీసికొని నవ్వుతూ “ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇక్కడే తటపటాయిస్తున్నా వెందుకు?” అని అడిగింది. తలుపులు మూసి ఉన్నాయి. కదా! అమ్మ ఎలా చూడగలిగింది ఇదంతా నని నాకు విస్మయం కలిగింది.
అత్యంత ప్రసన్నంగా నున్న అమ్మ దివ్యవదనారవిందాన్ని దర్శిస్తూ గాయత్రీ ధ్యాన శ్లోకాన్ని స్మరించుకుంటూ వుండిపోయాను. “ఏం చేస్తూంటావు నాన్నా!” అని అమ్మ అడిగింది. ఉద్యోగ విషయాల్ని ప్రస్తావించడం అప్రస్తుతం అనిపించి “సంధ్యావందనం చేసుకుంటానండీ” అన్నాను. “అమ్మను ఎవరైనా అండీ అంటారా? ఇంట్లో అమ్మను ఏమని పిలుస్తావు?” అని అడిగింది. “అమ్మా! అంటాను గదండీ” అన్నాను. “అదిగో! మళ్ళీ ‘అండి’ అంటున్నావు. అమ్మను ‘అమ్మా!’ అని సంబోధించాలి.” అని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ ఆదేశించింది.
ఆ చూపులోని ఆప్యాయత, అనురాగం జన్మ జన్మల అనిర్వచనీయమైన ఆశీర్వచనం వలె గోచరించు తున్నాయి. ఆ అనుభవం అపూర్వం, అపురూపం. మాటలకి అందదు. ఆ మూర్తినుండి భాసిస్తున్న కాంతి పుంజాల ధారలలో తన్మయత్వం పొందుతున్నాను; పునీతుడనవుతున్నాను. ఆ లాలిత్యము, ఆ సంభాషణ శైలిలో కరిగిపోతూ తదేకంగా చూస్తూ ఎంతసేపు వున్నానో తెలియదు.
అమ్మ తనకు తానుగా కల్పించుకుని “సంధ్యావందనం అంటే గాయత్రి ఉపాసన కదా! నువ్వే గాయత్రివి …” అన్నది. “అమ్మా! అలా అనవద్దు. నేను గాయత్రి అన్నది అసంభవం … కదా!” అన్నాను. “అదేమిటి, నాన్నా? గాయత్రి అంటే పంచభూతాలకు ప్రతీక. శరీరానికి ఆధారం పంచభూతాలే కదా! తర్కిస్తే సామీప్యం లభ్యం కాలేదా? ఏమంటావు?” అంటూ ఒక వివరణ నిచ్చింది.
“నా మనస్సుకు అది కానేకాదు అని అనిపిస్తోంది. అంతకూ మించినది (స్థితి) నాకెలా లభ్య మవుతుంది?” అని అడిగాను. “పంచభూతాల సమ్మేళనమే గాయత్రి. ఆ విభూతులే మనలో ప్రజ్వరిల్లుతూ భాసిస్తున్నవి. సిద్ధాంతరీత్యా నువ్వే గాయత్రి అయివుండి కూడా ‘కాదు’ అనే శంక వుంది కదా! అదే నీ లోన అంతర్గతమైన సంధి. దాన్ని భేదించడమే సంధ్యావందనం” అంటూ ఒక మహోపదేశం చేసింది. ఆ విశ్లేషణ విని ఆ మాటలు మననం చేసుకుంటూ నిస్తబ్ధుడనైనాను.
ఇంతలో శ్రీ గరుడాద్రి సుబ్రహ్మణ్యం (అమ్మ దినచర్య లేఖకులు) పుస్తకం, కలం తీసుకుని గదిలోకి వచ్చి అమ్మకు నమస్కరించుకుని కూర్చోబోయారు. వారినుద్దేశించి అమ్మ “నాన్నా! కాలువ పొంగినట్లుంది. నువ్వెళ్ళి చూసిరా” అని అదేశించింది. అలాగేనమ్మా అంటూ ఆయన సెలవు తీసుకున్నారు. అతడ్ని పంపించడానికి ఏదో పని పురమాయించినట్లుగా అనిపించింది. అమ్మను చూస్తున్నంతసేపూ “గాయత్రీం వరదా భయ … హస్తెర్వహస్తీం భజే” శ్లోకం మనసులో జపం మాదిరిగ సాగుతోంది.
లలితా సహస్రంలో కూడా ‘గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా’ అని వస్తుంది కదా!” అన్నది. “నేనెప్పుడూ లలితా సహస్రం చదవలేదమ్మా. అయినా అది చదవకూడదు కదా?” అని అడిగాను. ఆశ్చర్యంగా చూస్తూ “చదవకూడదని ఎవరు చెప్పారు, నాన్నా, నీకు?” అని అడిగింది. “మా అమ్మమ్మ చెప్పింది” అన్నాను. చిరునవ్వుతో తల పంకిస్తూ “అలాగా నాన్నా! కొంచెం ఆలోచిద్దాం. అసలు ఎందుకు వద్దందిట మీ అమ్మమ్మ?” అని అడిగింది. ‘లలిత చేస్తే శాంతి కావాలి అని ఆమె చెప్తుంటే విన్నాను. శాంతి కావాలిట కదా!’ అన్నాను.
“చాలా బాగుంది నాన్నా – శాంతి కావాలి అని చెప్పిందిగా! అక్కడ – లలితా పారాయణ సమయంలో వున్నవి మూడు 1. చేసేది నువ్వు 2. చేయించుకునేది అది 3. కావలసినది శాంతి” అని వివరిస్తోంది అమ్మ. శ్రీలలితా పరాభట్టారికా స్వరూపాన్ని ‘అది’ అని సంభావించటంతో నిర్ఘాంతపోయి జాగ్రత్తగా వింటున్నాను. “లలిత శాంత స్వరూపం కదా! ఆలోచించు. శాంతి దానికి కావాలా? నీకు కావాలా? నా దృష్టిలో దానికి కాదు; శాంతి కావలసిందల్లా నీకు” అని నిర్ధారించింది. ఆ తర్కం, విశ్లేషణ అర్థం కాక “అమ్మా! అది సరే. శాంతికి ఏమి చెయ్యాలిట?” అని ప్రశ్నించాను.
“లలితా సహస్రం చదువుకుంటూ ఒక్కొక్క నామం అవగానే ఒక్కొక్క బియ్యపుగింజ వేరే పాత్రలో వుంచుతూ ఉండు. సహస్రనామాలు పూర్తి అయ్యాక, ఆ పాత్రలోని బియ్యం వండుకునే పాత్రలో వేసుకుని, అన్నం వండి దానినే నివేదన చెయ్యి. ఆ అన్నం వడ్డించుకుని భుజించడమే శాంతి” అని చెప్పింది.
అమ్మతో “సరే. నేను బయలుదేరుతాను” అని విన్నవించుకున్నా. “నీకు అభిషేకం అంటే మక్కువ కదా! రాత్రికి ఇక్కడే వుండి, ఉదయం అభిషేకం చేసుకుని వెళుదువుగానిలే” అని చెప్పింది. మారు మాట్లాడకుండా నేను హైమాలయం వైపు బయలుదేరాను.
(సశేషం)