తొలిసారి అమ్మ దర్శనం:
అనురాగమూర్తి కారుణ్యావతారమూర్తి అమ్మను 1979 లో దర్శించుకున్నాను. 1963 లోనే ‘ప్రజాశక్తి’ పత్రికలో అమ్మను గురించి ‘నిత్యాన్నదానేశ్వరి’ అనే వ్యాసాన్ని చదివినప్పుడే జిల్లెళ్ళమూడి క్షేత్రం గురించి బీజం పడింది. 1979 లో పుష్కరాలకు రాజమండ్రిలో ఉన్న మా పిన్ని గారింటికి వెళ్ళాను. అక్కడ ‘అమ్మ అమ్మ మాటలు’ పుస్తకం లభించింది. ప్రతి వాక్యం ఒక జ్ఞానగుళిక – బ్రహ్మసూత్రం అని నా మనస్సుపై చెరగని ముద్రవేసింది.
నేను పనిచేసే HZL లో సో॥ ఐ.రామకృష్ణారావు గారు ఉండేవారు. వారు అప్పటికి బ్రహ్మచారి, మా శ్రేయోభిలాషి. మాటల సందర్భంలో తాను తరచుగా అమ్మ వద్దకు వెళ్ళి వస్తూంటానని చెప్పేవారు. మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ విశేషంగా జరుగు తుండేది. ఒకనాటి పూజకి వారిని ఆహ్వానించాను. భోజనాల అనంతరం అమ్మ ప్రసాదం (కుంకుమ పొట్లాలు) నాకు ఇచ్చి “నువ్వుకూడా ఒకసారి అమ్మ దర్శనం చేసుకోవాలి” అని చెప్పారు. నాటికి నేను నిత్యం సంధ్యావందనం, గాయత్రీ జప చేస్తూండేవాడిని. “అదేమిటి, గాయత్రీ స్వరూపం అమ్మేకదా” అని అంటే, “అవును. ఒక్కసారి అమ్మ దర్శనం చేసుకో” అని పదేపదే చెప్పారు.
సరే. అమ్మ వద్దకు వెళ్ళటానికి సిద్ధం అయ్యాను. కానీ, ఏటా తిరుపతి ప్రయాణం ఉన్నదికదా – తర్వాత చూద్దామని అప్పటికి వాయిదా వేసుకున్నాను ఆశ్చర్యం. ఆనాటి రాత్రి మా శ్రీమతి సువర్చలకు మెలకువలోనే 8-10 సంవత్సరాల అమ్మాయి పెద్దబొట్టు, ఎర్ర అంచు తెల్లని పట్టు పరికిణీ జాకెట్ ధరించి మేజాపైన చెయ్యి ఆన్చి “మీ ఇంటికి వచ్చాను” అని చెప్పింది. మరొక విచిత్రం. 5 ఏండ్ల మా అమ్మాయి ఇందిర “ఎక్కడికో ప్రయాణం పెట్టుకుని మాను కున్నారెందుకు?” అని సూటిగా ప్రశ్నించింది. “ఏమో! నీ కెందుకు?” అని సమాధానం చెప్పి వూరుకున్నాను.
అది జరిగిన నాలుగు రోజులకు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు నిర్మాణం కోసం Chief controller of explosives – Nagpur 8 ముఖ్యమైన ధృవపత్రాలు (Approvals) తెచ్చుకోవాలి. ఆ పని మా శాఖకు సంబంధించినది కాదు; అయితే నన్ను వెళ్ళమన్న అధికారుల ప్రోద్బలంతో నాగపూర్ వెళ్ళాను. వారం పదిరోజులుండి తలక్రిందుగా తపస్సు చేసినా పని అవుతుందో కాదో తెలియని పరిస్థితి. ఆశ్చర్యం. మర్నాటికే ఫలప్రదం కావటంతో స్తబ్ధుడనైనాను. ఇక జిల్లెళ్ళమూడి ప్రయాణానికి ప్రయత్నం.
రైలులో ప్రయాణించి బాపట్ల స్టేషన్లో దిగాను. అక్కడ వాకబుచేశా. పెదనందిపాడు బస్సు ఎక్కి 7 వ మైలు వద్ద దిగాను. ఉ॥ గం.9.00లు. ఒక్క మనిషి కానరాలేదు. Luggage కొంచెం ఎక్కువగానే ఉంది. దిక్కుతోచక ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. నేను దిగిన బస్సు బయలుదేరి 100 గజాల దూరంలో మళ్ళీ ఆగింది. మరో ముగ్గురు వ్యక్తులు దిగి జిల్లెళ్ళమూడి దారి వైపు వచ్చారు. 3 కి.మీ.లు పోవాలి. వాళ్ళని అడిగాను. “ఇక్కడ రిక్షాలు, జట్కాలు వస్తూంటాయా?” అని. వాళ్ళు నవ్వుకుంటూ “అవేమి ఇక్కడ ఉండవు. ఎక్కడినుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి?” -అని ప్రశ్నించారు. “విశాఖపట్టణం నుంచి వస్తున్నాను. అమ్మగారి దర్శనంకోసం” అన్నాను. అంతే. సామాన్లు వాళ్ళు తీసుకుని ‘నడిచి పోదాం. పదండి’ అని ఎంతో ఆప్యాయంగా అమ్మ నివాసానికి చేర్చారు. వాళ్ళు ధరించిన దుస్తులు చక్కగా ఇస్త్రీ మడతలు సైతం నలగకుండా ఉన్నాయి.
కృతజ్ఞతా పూర్వకంగా పదిరూపాయలు తీసి వాళ్ళకి ఇవ్వబోయాను. “మేము బాడుగకి సామాన్లు మోసేవాళ్ళం కాదు; అమ్మగారి కోసం వచ్చావని సాయం చేశాము” అన్నారు. పొరపాటు అయిందనీ, వారిని కించపరచానని బాధపడ్డాను. ఆఫీసు వద్ద శ్రీకొమరవోలు గోపాలరావు గారు ఉన్నారు. వారు “సామాన్లు ఇక్కడ అని సూచించింది. ఉంచి, స్నానంచేసి అమ్మ దగ్గరకి వెళ్ళండి” అని దారి చూపారు. స్నానంచేసి బట్టలు మార్చుకుని అమ్మగది వైపు వెళ్ళాను. తెల్లవారింది; మంచి కాఫీ దొరకలేదు అనుకుంటూ.
అమ్మ గదిలోనుంచి మాటలు వినిపిస్తున్నాయి. తొంగి చూశాను. కమలాపండు రంగు పట్టుచీరతో ప్రసన్నవదనంతో అమ్మ మంచం మీద ఆసీన అయి ఉన్నది. పది, పదిహేనుమంది పండితులు అమ్మ మంచం చూట్టూ ఉన్నారు. తదేకంగా అమ్మను చూస్తూ ఉండిపోయాను.“లోపలికి రా, నాన్నా!” అమ్మ మృదు మధురంగా పిలిచింది. లోనికి వెళ్ళి ఓ వైపు కూర్చున్నాను. “నాన్నా! ఏడవమైలు దగ్గరనుంచి సామానుతో రావటంలో ఇబ్బంది ఏమీ లేదు కదా!” అని కుశల ప్రశ్నవేసింది. నేను సామానుతో ఇబ్బంది పడటం, సుఖంగా క్షేమంగా చేరటం ఇవన్నీ అమ్మకు ఎలా తెలుసు? అనుకున్నా. ఇంతలో వసుంధర అక్కయ్య అక్కడకు వచ్చింది. “ఎప్పుడు తాగాడో, ఏమిటో! కాఫీ తీసుకురా” అని అక్కయ్యను ఆదేశించింది అమ్మ.
అమ్మ స్వహస్తాలతో కాఫీ అందించింది. రుచి చూసిందే తడవుగా ‘పంచదార సరిపోయిందా?’ అని ఆదరంగా ప్రశ్నించింది. ‘సరిపోయిందమ్మా’ అంటూ అమ్మ దర్శన, స్పర్శన, సంభాషణ, ప్రసాద స్వీకరణ భాగ్య విశేషంతో పరవశిస్తూ ఉన్న నాకు అక్కడ ఉన్న పండితులు అమ్మతో చేస్తున్న ఆ గోష్ఠి పలుకులు నా చెవిని దూరలేదు. కాస్సేపటికి వారంతా నిష్క్ర మించారు. ప్రక్కనున్న ఆయనతో అమ్మ ఇలా అంది “వాడూ మీ వాడే. కొంచెం మొహమాటస్థుడు. ఎవరినీ ఏమీ అడగడు. నీతోపాటుగా భోజనానికి తీసికెళ్ళు”
అసలు నేనెవరో అమ్మకి చెప్పలేదు. సరిగదా ఆయన ఎవరో నాకు తెలియదు. “ఆయన మీవాడు’ అని నన్ను పరిచయం చేసింది. ఆయన వెనుకగా నేను వెళ్తున్నాను. ఆశ్చర్యంగా అమ్మ “నాన్నా! మధ్యాహ్నం భోజనం అయిన తరువాత మాట్లాడుదాం” అన్నది. అలాగేనమ్మా అని బయలుదేరాను.
అప్పుడు వారి పేరు అడిగితే ‘చాగంటి వెంకట్రావు, పోలీస్ డిపార్ట్మెంట్, ఏలూరు’ అని చెప్పారు. “మేమూ చాగంటి వారమేనండీ” అన్నాను. “అందుకే గదా అమ్మ ‘మీ వాడు’ అని పరిచయం చేసింది” అన్నారు.
(సశేషం)