“సీమ అంటే అవధి. అవధుల్లేని మహిమలు కలది లలితాదేవి. అంటే శ్రీమాత మహిమలు అనంతం” భారతీవ్యాఖ్య.
మహాపురుషుల విషయంలో సామాన్యమానవులం అయిన మనం సర్వసాధారణంగా ముందు చూసేది వారి మహిమలు. మహిమలు ప్రదర్శించిన వారిని మహనీయులుగా, అవతారమూర్తులుగా, సిద్ధపురుషులుగా, భావిస్తూ ఉంటాం. ఎంత గొప్పవ్యక్తి అయినా ఏమహిమా ప్రదర్శించకపోతే, మనం వారిలోని ఔన్నత్యాన్ని గుర్తించలేం. ఎవరైనా చెప్పినా, తేలిగ్గా కొట్టి పారేస్తాం. సాక్షాత్తూ భగవంతుని విషయంలో కూడా మనం మహిమలకే ప్రాధాన్యం ఇస్తాం. ఏ దేవుడు మనం కోరిన కోరిక నెరవేరుస్తున్నాడో, ఆ దేవుడికి మ్రొక్కులు తీరుస్తూ, ఆ దేవుడి మహిమలను వేనోళ్ళ ప్రశంసిస్తాం. ఏ దేవుడైనా మనకోరిక తీర్చకపోతే, వెంటనే ఆ దేవుణ్ణి వదలివేసి, మరొక దైవానికి కోరిక విన్నవించుకుంటాం. అతనికి మ్రొక్కుకుంటాం. `అందుకే “మ్రొక్కిన వరమీని వేల్పు”ను “గ్రక్కున విడువంగ వలయు” అని సుమతీశతకకర్త చక్కని సలహాఇచ్చాడు. భక్తులమని చెప్పుకునే చాలమంది ఈ కోవకు చెందిన వారే. భక్తులకు తన అనంతమైన మహిమలను చూపించే తల్లి నిస్సీమ మహిమ.
“అమ్మ” నిస్సీమ మహిమ. అయితే “అమ్మ” చూపించిన మహిమలు పదిమందికి చెప్పి, ప్రచారం చేయడంకంటే కూడా ఎవరికివారే అనుభవించి, ఆనందించేవిగా ఉంటాయి. ఇతరులతో చెప్పినప్పుడు, వారు, ఇందులో ఏముందీ? ఎలాగైనా ఇది ఇలాగే జరిగి ఉండేది – అని తేలిగ్గా తీసుకునే విధంగా ఉంటాయి. “అమ్మ” మహిమలు అనుభవైకవేద్యాలు. అయితే, “అమ్మ” మహిమలను అంగీకరించదు. “మహాతత్త్వానికి మాహాత్మ్యాలతో పనిలేదు” అని మహిమలపట్ల తన విముఖతను స్పష్టం చేసింది. “మీ పనులు కావటమూ అనుగ్రహమే. కాకపోవటమూ అనుగ్రహమే”, “అయినపనీ, కాని పనీ అంతా ఆశీర్వచనమే,” “మీకు దారిద్ర్యం వచ్చిందని బాధపడవద్దు. ఆ దారిద్య్రం కూడా నేనే” ఇలాంటి వాక్యాల్లో “అమ్మ” మహిమలకు ఎంత తక్కువ ప్రాధాన్యం ఇచ్చిందో అర్థం అవుతుంది. “మంచిని మించిన మహిమలు లేవు” అని ప్రకటించిన “అమ్మ” “ఇతరులలో మంచిని చూడటమే మన మంచితనం” అని నిర్వచించింది. అయితే, “అమ్మ” తన మహిమాన్వితమైన అద్భుతశక్తులను ప్రదర్శించి, ఎందరినో సమ్మోహితులను చేసిన సంఘటనలు ఎన్నెన్నో. అయితే, “అమ్మ” మహిమలు చేస్తుందా ? అంటే, అవునని చెప్పలేం. శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు చెప్పినట్లు ‘అమ్మసన్నిధిలో మహిమలు జరుగుతాయి. అమ్మ మహిమలు చెయ్యదు’.
ఆబ్రహ్మకీటజనని అయిన అమ్మకు క్రిమికీటకాలూ, పశుపక్ష్యాదులూ కూడా బిడ్డలేకదా! అందువల్లనే వాటిని లాలించి, పాలించిన సంఘటనలతో పాటు వాటికి తన పాదాల చెంత మరణాన్ని ప్రసాదించి, మోక్షాన్ని అనుగ్రహించిన నన్నివేశాలు కూడా “అమ్మ” జీవితంలో మనకు తారసపడతాయి. “అమ్మ”ఉయ్యాలలో పాపాయిగా ఉన్నరోజుల్లోనే తన పాదాలచెంత మరణించేలా ఒక తేలును, ఒక పిల్లిని అనుగ్రహించి, తద్వారా వాటికి మోక్షాన్ని ప్రసాదించింది. అమ్మమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో అమ్మమ్మకు బాపట్లలో వైద్యం చేయించాలని అక్కడికి పంపుతారు. దారిలో ములుకుదురు గ్రామంలోని చెన్నకేశవస్వామి దేవాలయ శిఖరం మీద “అమ్మ” కనిపించి, నవ్వుతూ చేతులు చాపి పిలుస్తున్నట్లు అమ్మమ్మకు కనిపించింది. తల్లి తన పిల్లకోసం చేతులు చాపినట్లుగా తోచి, అమ్మమ్మ నిశ్చేష్టయై, తన ఒడిలోకి చూసుకుంటే అక్కడ “అమ్మ” పసిపాపగా మామూలుగా కనిపించింది. ‘నిస్సీమ మహిమ” అయిన “అమ్మ” తన దివ్యరూపదర్శన భాగ్యాన్ని అమ్మమ్మకు ప్రసాదించి, తనలోకి రాబోతున్న విషయాన్ని ముందుగానే సూచన చేసింది.
శ్రీ వీరమాచనేని ప్రసాదరావుగారి కొడుకు, కోడలు ఒక జీపులో ప్రయాణం చేస్తుంటే, ఒకలారీ ఢీకొని ప్రమాదం జరిగింది. ఆయన కుమారుడు కొద్దిగాయాలతో బయటపడ్డారు. కాని కోడలుకు మాత్రం ప్రాణాపాయపరిస్థితి ఏర్పడింది. ముఖంలో నుదురు భాగంలోని ఎముకలు విరిగి, మెదడుకు గ్రుచ్చుకుని, మెదడు దెబ్బతింది. స్పృహకోల్పోయింది. హాస్పిటల్లో చేరిస్తే, ఆపరేషన్ చేయాలని, అయినా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, మానవ ప్రయత్నం చేస్తామని, ఆపైన దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో జమ్మి వెంకటరత్నంగారు “అమ్మ” వద్దనుంచి ప్రసాదమూ, తీర్థమూ తీసుకుని వెళ్ళి ప్రసాదరావుగారికి ఇచ్చారు. ఆయన ఆ | తీర్థం ఆమె గొంతులో పోశారు. స్పృహలేకపోయినా ఆమె ఆ తీర్థం త్రాగింది. ఆపరేషను చేయడానికి ఆమెను ధియేటర్లోకి తీసుకు వెళ్తున్నారు. ప్రసాదుగారికి ఒక దృశ్యం గోచరించింది. “అమ్మ” డాక్టరు డ్రస్సులో ధియేటర్లోకి వెళ్ళింది. “అమ్మ” నడకలోని ఠీవికి వారు ఆశ్చర్యచకితులైనారు. “అమ్మ” వెనుకే వారి కోడలిని స్ట్రెచర్మీద ధియేటర్లోకి తీసుకువెళ్ళారు. ఆయన ఆనందానికి అవధుల్లేవు. కాసేపటికి వారు మామూలు స్థితిలోకి వచ్చి, విచారిస్తే, అప్పుడే వారి కోడలిని లోపలికి తీసుకుని వెళ్ళినట్లు చెప్పారు. వారు ఆసమయంలో నిద్రించలేదు. నిద్రపోతే కదా కలవచ్చేది. కాబట్టి కలకనలేదు. ధ్యానావస్థలోనూ లేరు. మరి వారికి “అమ్మ” ఎలా కనిపించింది. అనేది వారికి ఎంతో ఆశ్చర్యాన్నీ, ఆశాభావాన్నీ కలిగించింది. ఆపరేషన్ విజయవంతమయింది. వైద్యులకు కూడా ఈ విజయం విస్మయాన్నే కలిగించింది. ఒకవేళ ఆపరేషన్ సఫలమై, రోగి బ్రతికినా మెదడు సరిగ్గా పనిచేయటం, జ్ఞాపకశక్తిరావటం, మాట్లాడటం చాలకష్టమయిన విషయమని వారు ఆశ్చర్యపోయారుట. అన్నీ సక్రమంగా జరగడం “అమ్మ” దివ్యాశీస్సుల ఫలమని, అంతా “అమ్మ” మహిమే అని ప్రసాదరావుగారి ప్రగాఢ విశ్వాసం. ‘నిస్సీమ మహిమ’ అయిన “అమ్మ”కు సాధ్యంకానిది ఏం ఉంటుంది?
అమ్మ” జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. ‘నిస్సీమ మహిమ’ అయిన “అమ్మ” ఆశీస్సులు మనందరిపై వర్షించాలని సదా “అమ్మ”ను ప్రార్థించుకుందాం.
(“కృతజ్ఞతలు : శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్యకు, అయ్యగారి కుసుమక్కయ్యకు…)”