సంపదకు పరమార్థం ఇతరులకు పంచటమే! స్వార్థమే పరమార్థమైన ఈ కలికాలంలో ఈమాట చాలామందికి కొరుకుడు పడకపోవచ్చు. “పంచని కాడికి వుండటం దేనికి?” అన్నదీ అమ్మ మాటే!
మామూలు మాటలలో చెప్పాలంటే, మనం ఇచ్చిందే మనవెంట వస్తుందట. మనం దాచుకున్నది మనవెంట రాదు.
ఇతరులకు సాయపడటానికై సంపదనిమ్మని కోరుకోవాలి. దాచుకోవడానికి కాదు. కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో అంటారు. “త్యాగాయ సంభృతార్థానామ్” అని. రఘువంశ మహారాజులు అర్థాన్ని సంపాదించేది త్యాగం చేయటానికేనట. సంపదకు సాఫల్యం త్యాగమే.
లోకంలో మరో సామెత కూడా వుంది. “తనకు మాలిన ధర్మం పనికి రాదు” అని. మరి ఈ రెంటికీ సమన్వయం ఎట్లా అంటే, సమన్వయ స్వరూపిణి “అమ్మ” మనకు దారి చూపించింది. అమ్మ అంటుంది నీకున్నది తృప్తిగా తిను. అయితే అంతటితో ఆగకు. ఇతరులను కూడా ఆదరించు. వారిని భగవత్స్వరూపులుగా గుర్తించి నీకున్నది ఆదరంగా పెట్టుకో. “పెట్టుకో” అన్నది, కాని “పెట్టు” అనలేదు. “పెట్టుకోవటం” మనకోసమే! ఇతరులకు పెట్టుకోవటం మనకోసమే! ఎందుకంటే మనవెంట వచ్చేది అదే కదా! ఈలోకంలో సుఖంగా జీవించడానికి అదొక్కటే మార్గం.
లక్ష్మీదేవి పుణ్యాలరాశి. పుణ్యఫలమే లక్ష్మీకటాక్షం. పుణ్యఫలం అంటే మనం ఇచ్చిందే పుణ్యఫలం. మనం దాచుకున్నది కాదు. ఆదిశంకరులు తనకు ఉసిరికాయ దానమిచ్చిన ఇల్లాలి దారిద్య్రమునకు జాలిపడి కనకధారా స్తోత్రం జపించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఆమె అంటుంది “ఈ ఇల్లాలికి పుణ్యఫలం లేదు కదా! ఎలా అనుగ్రహించేది?” అని. తన పుణ్యాన్ని ధారపోసి ఆమెకు సంపదనిస్తాడు.
లక్ష్మీదేవిని “చంచలాయై నమః” అని పూజిస్తాము కదా! తామరాకు మీద నీటిబొట్టు ఎంత చంచలమో లక్ష్మీదేవి కూడా అంత చంచలము. మన పుణ్యఫలం అయిపోయిందంటే జారిపోతుంది. కాబట్టి సంపద పంచితే పెరుగుతుంది కాని దాచుకుంటే కాదు.
ఈ సందర్భంలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఒక అనుభవం గుర్తుచేసుకోవాలి. ఒకసారి స్వామివారు అమ్మను ఆవాహన చేసి అడుగుతారు “నా సాధన ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఇంకా తపస్సు ఎట్లా చెయ్యాలి?” అని. దానికి అమ్మ సమాధానం “నాయనా! రోజూ పదిమందికి బాగా అన్నం పెట్టు” అని. “అన్నం పెట్టటానికీ తపస్సుకీ సంబంధం ఏమిటి?” అని ఆయన అడిగితే “అలా చెయ్యి నాయనా! దానివల్ల కూడా తప్పకుండా వస్తుంది” అంటుంది. అలాగే అమ్మ బాల్యంలోనే చిదంబర రావు తాతగారి కుమార్తె భారతీదేవికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక సలహా ఇస్తుంది “అత్తయ్యా! నేను ఒకమాట చెబుతాను. చేస్తావా? – పిన్నికి జబ్బు తగ్గిపోతుంది. నూరు కొబ్బరికాయలు కొడతాననీ, వెయ్యిమందికి అన్నం పెడతాననీ దణ్ణం పెట్టుకో – తగ్గిపోతుంది” అంటుంది.
మనకున్నది నలుగురితో పంచుకోవడం ద్వారా కర్మ పరిపాకం చెందుతుందని అమ్మ సందేశం కావచ్చు.
“నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్న అమ్మ సందేశం సర్వ మతాలకూ అతీతంగా సమస్తమానవాళి సౌభాగ్యానికీ ప్రసాదించ బడిన ఒక అపురూప సందేశం.
ఈ ఒక్క సందేశం చాలు కదా! సర్వమానవులూ ఏ విధమైన పొరపొచ్చాలూ లేకుండా హాయిగా జీవించటానికి.