అవును అమ్మ చెప్పింది నిజమే. మనకు సాధ్యమైనదే సాధన. ఇక్కడ సాదన అంటే ఏమిటి? మనం దేనిని సాధించాలి? దేనికోసం సాదన చేయాలి? అసలు జంతువులకు, మనుషులకూ గల తేడా అదే. పశుపక్ష్యాదులు అవి పుట్టినదాదిగా తమ సహజ ధోరణిలో, అంటే తమ శారీరకపుటలవాట్లతోనే, అవసరాలకొరకే తమ జీవన యానం సాగిస్తుంది. కాని, మనిషి అలాక్కాదు. అతనికి సహజత్వం అనేది ఉన్నా దానిని గురించి అవగాహనలేదు.
అతడు పుడుతూనే, నేలమీద పడుతూనే అరిషడ్వర్గాల మాయలోపడి ఏదోకావాలన్నట్టుగా, దేనికోసమో తపన పడుతున్నట్టుగా “ఉంగా! ఉంగా!” అనే వింత శబ్ధంతో ఏడుపులంకించుకుంటాడు. బహుశా సృష్టిలో ఏ జీవకోటికీలేని ‘తపన’ మనిషికి పుట్టుకతోనే ప్రారంభమైనదని అనుకోవాలి. దానికి కారణం ఈ భూమండలంపై దేవుని ప్రతినిధి అయిన తనతో ఆ లీలా మానుష విగ్రహుడు ఆడుతున్న నాటకమని తెలియక మనిషి, తన జీవితంలో కలిగే ప్రతీ జయానికీ, అపజయానికీ తానే కారణమనే అహంకారంతో పొంగిపోయి, కృంగిపోతూ ఉంటాడు.
అతనిని ఆ మాయలోనుంచి బయట పడవేసేందుకే “నువ్వు చేసే, నీకు జరిగే ప్రక్రియకూ, సంఘటనకూ నీవు కారణం కాదు. అవన్నీ నీచేత చేయించేవాడు వేరే ఉన్నాడనుకో” అంది అమ్మ ఆ వేరే వాడే భగవంతుడు. ఇక్కడ భగవంతుడంటే అమ్మ! అంటే ఆమె ఆడిస్తున్న ఈ జగన్నాటకంలో మనం ఈ పాత్రధారులం అన్నమాట. నాటకంలో ఏ పాత్ర అయినా సూత్రధారి ఆడించే విధంగా ఆడకపోతే ఆ నాటకం అనురక్తినీ, అనువర్తినీ కోల్పోతుంది. ఎందుకంటే “మనం చేసే మంచి చెడ్డలన్నిటికీ మనల్ని నడిపించే సూత్రధారునిదే బాధ్యత” అని, మనం మన స్వార్థంకోసం చెడుకార్యాలను చేస్తే మంచికీ చెడుకీ మధ్యనున్న గీత చెడిపోతుంది. అందువల్ల లోకంలో మంచికన్నా చెడు ప్రబలిపోతుంది. ఇదే విషయాన్ని ఒక భక్తుడు అమ్మను అడుగగా అమ్మ ఒక కత్తిని తీసి అతనికి చూపిస్తూ – “నాన్నా! వెళ్ళి ఈ కత్తితో ఒకర్ని పొడిచి రమ్మంటే అలాచేస్తావా?” అని అడిగిందట. అంటే దానర్ధం, మనం ఏ పని చేసినా వివేకాన్ని యుక్తా యుక్త విచక్షణ జ్ఞానాన్నుపయోగించి చేయాలని. స్థూలంగా చెప్పుకోవాలంటే భగవంతుని తరుపున, భగవంతుని కొరకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలనీ, ఆయన ఆశయం మేరకు ఆయన ఆశయ సాధన కొరకు ఆయన ఆడించేటట్లుగా మన జీవన నాటకంలో మన పాత్రను మనం సమర్ధవంతంగా పోషించాలని.
అలా చేయాలంటే మన జీవితంలో మనం సత్యసాధన, సత్యశోధన చేయాలి. ఈ సాధన, శోధన అనేవి త్రివిధరూపాలతో ఉంటాయి. ఈ సాధనా త్రయమే భగవంతుడు మానవుని ముముక్షువుగా చేయ సంకల్పించిన మూడు మార్గాలు. అవి శ్రవణ, (భగవంతుని నామశ్రవణము), మనన, (మనసులోనే భగవంతుని నామోచ్ఛారణ) నిధిధ్యాస (భగవంతుని దివ్యరూపాన్ని మరిమరి తలచుట)లు.
పై మూడింటినీ మనం అను నిత్యం చేస్తూపోతే భగవంతునికి మరింత చేరువలో ఉండగలం. అవే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు. వాటిని గురించి సరియైన అవగాహన లేక, వాటిని ఆచరింపసాధ్యం కానివారు
అమ్మ చెప్పినట్టు వారికి సాధ్యమైన సాధన చేయాలి. అటువంటి వారికి సాధ్యమైనది ఆలయ సందర్శన, గర్భాలయ ప్రదక్షిణ.. ఆ ప్రదక్షిణలను ఎలా చేయాలంటే – భక్తుడు తనగుండె నిండా ఆధ్యాత్మభావనను నింపుకొని, వినయంగా చేతులు జోడించి, గర్భగుడిలో అర్చకుని మంత్రోచ్ఛారణల శ్రవణం, మనసారా దైవనామ మననలను చేస్తూ ఆ దేవుని రూపాన్ని తన హృదయ గర్భములో మరి మరి వీక్షించుకుంటూ (నిధిధ్యాస), ప్రదక్షిణానంతరము చివరిగా తన ఎదురుగా వున్న ఇష్టదైవరూపాన్ని కనులారా వీక్షించి, అణకువ, ఆరాధన, అంకిత భావాలతో కళ్ళు మూసుకుని ఆయనలో సాయుజ్యమైనట్లుగా భావించాలి. అది ఒక సాధన.
అంతేకాని నాకిదే సాధ్యమైనదనుకుని, నియమం ప్రకారం తను చేస్తున్న ప్రదక్షిణలను లెక్కించుకుంటూ, ఎవరో తరుముకుని వస్తున్నట్టుగా పరుగులు పెడుతూ, చేతులూపుకొంటూ, కొండొకచో ప్రక్కనున్న వారితో లౌకిక వ్యవహారాలు మాట్లాడుతూ అదే సమయంలో మ్రోగిన సెల్ఫోన్ సొల్లు కబుర్లకు సమాధానమిస్తూ చేయడం కాదు – ప్రదక్షిణచేయడమంటే.
నిజానికది ప్రదక్షిణకాదు. మొక్కుబడిగా తీర్చుకున్న దేవుని మొక్కు మాత్రమే. దాని వలన మనకు ఒనగూడేది ఏమీ ఉండదు. వృథాప్రయాస తప్ప. యథాక్రియ! తథా ఫలితం!
అసలు ప్రదక్షిణ అనేది ఒక నిండు గర్భిణి గుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉండాలని భగవాన్ శ్రీరమణుల ఉవాచ. కనుక, భక్తమహాశయులారా! ప్రదక్షిణ సమయంలో మనం భగవంతుని నిండు రూపాన్ని మన గుండెలలో మోస్తూ నిండు గర్భిణిలా వినయంగా, అనునయంగా ‘ఆయనే’ మనలను అక్కడ నడిపిస్తున్నాడన్న అంకిత భావంతో ప్రదక్షిణను కొనసాగిస్తే ‘ఆయన’కు తృప్తి! మనకు ముక్తి! – జయహోమాత! ఓం హైమ!
(ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారి స్ఫూర్తితో)