1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నీ బంధాల ఒడిలో

నీ బంధాల ఒడిలో

K S N Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : June
Issue Number : 11
Year : 2013

బంధరహితమైన ఓ అమ్మా !

నేను సాగిస్తున్న ఈ వ్యాసంగంలో నా కర్తృత్వం ఏ మాత్రము లేదమ్మా ! నీవు నన్నింతగా వెంటాడుతూ పిచ్చివాడ్ని చేస్తూ యితర వ్యాపకం లేకుండా నీ ధ్యాసలోనే మునిగిపోవాలన్న నా కోరికను మన్నించి, నీ నాతో ముడిపడి ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంటే నాకేమనిపిస్తుందో చూడమ్మా

నీవు నామ, రూప, గుణ రహితవే గాదు. బంధరహితవు గూడ. ఎన్ని బంధాలతో నీవు నన్ను నీ దరి జేర్చుకున్నావో నని ఆలోచిస్తే, నీవు

నా కన్నతల్లివో – తండ్రివో,

గురువువో – మరి దైవానివో,

ప్రాణ సఖుడవో – పరిహాసాల భావవో,

నా అగ్రజుడవో – అసలు నీవు నేనే నేమో !

ఈ తికమకలో ఉఱూతలూగుతున్న ఆనందంతో కాలక్షేపం చేస్తున్నాను- కానరాక.

“నేనే మిమ్మల్ని గని, మీ తల్లులకు పెంపుడిచ్చా” నాన్నవు. నా పెండ్లినాడు (26.5.1974) స్నాతకపు పీటల మీద, నీవు నా ప్రక్కన కూర్చుని, నా తల్లి కోర్కె దీర్చి, నా జీవితాని కొక వినూత్నశోభను కలిగించి ఎప్పుడూ నా వెంట ఉండి కనిపెట్టి ఉంటూ, నీ యదార్థస్థితిని బహిర్గతం జేసిన నా కన్నతల్లివో ?

నా చెల్లెలి పెండ్లి చేయవలసిన బాధ్యత నన్ను వెన్నంటుతుంటే “అమ్మా! ఆమె వివాహం తండ్రిలేని లోటు తోడిది కాకూడ” దని నీ దగ్గరబడి ఏడిస్తే నన్ను కరుణించి, నీ చల్లని చూపులతో, సలక్షణ సంపన్న వరుణ్ణి నీవే వెతికి చూచి, నా చేత ఆమె పెండ్లి చేయించిన నా కన్న తండ్రివో?

నాకూ, నా తమ్మునకూ ఉపనయనాలు చేసి ఉపదేశించావు. అంతేకాక నాకు సుప్రభాత, సంధ్యా వందనాలు గూడ జేసుకోమని ప్రబోధించావు. ఇంకా వైద్య వృత్తిలో ఉన్న నాకు “వైద్యుడు రోగికి నారాయణ స్వరూపుడే గాదు రోగి కూడా వైద్యుడికి నారాయణ స్వరూపుడే” అని నిర్వచించి గురుస్థానాన్ని అలంకరించిన గురువువో?

నీవు ప్రబోధించిన సుప్రభాత సంధ్యావందన పఠనమననాల మహిమలను అనుభవింప జేసిన దైవానివో?

నీవు నాకు వైద్యవృత్తిలో అనేక సలహాలిస్తూ నా కీర్తి ప్రతిష్ఠలు ఎక్కడ దెబ్బతింటాయోనని ఒక రోజున, “అర్జంటుగా వెళ్లవలసిన పని ఉన్నదన్నావు గదా, నాన్న! ఆలస్యం చేయక వెంటనే బయలుదేరి వెళ్ళు. ఎవరైనా వైద్యానికి వస్తుంటారు గదా ! ప్రయాణం కుదర”దని సలహా ఇచ్చి, నా చేత ప్రయాణం చేయించిన నా ప్రాణ సఖుడవో? (పాఠకులకు : నేను ఊరు వదలి వెళ్ళిన తర్వాత ఒక రోగి రావటమూ, నా కొఱకు వెతుక్కోవటం – నేను లేనిని తెలుసుకొని మరొక వైద్యుని దగ్గరకు వెళ్లటమూ ఎక్కడికి వెళ్ళినా ఆమెకు మరణమే శరణ్యం కావటమూ జరిగనై.)

అమ్మా ! భక్త మానసలోలవైన నీవు, దేవత గానే గాక, దేవుడిగా మా అక్క హృదయ కుహరంలో స్థావర మేర్పరచుకొని, ఆమె కాగుర్తు నొసగి యావజ్జగతిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తి అంతశ్శుద్ధిగానూ బాహాటం గానూ వేదిక పై (5.5.1966న) వివాహమాడి, మా యింటికి పెద్దల్లుడవై, నాకు బావపై “ఒరేయ్, బావా! నీ పని పడతారా” అంటూ నాతో పరిహాసాలాడిన బావవో?

అంత్యదశలో నీ చరణ సన్నిధిలో కాలం గడిపిన మా అమ్మ మరణించినదని నిర్ధారణ జరిగిన తర్వాత నీవు ముసి ముసి నవ్వులతో ఆమెను సమీపించి, ‘అమ్మా’ అన్న నీ పరామర్శకు బదులుగా ఆమె కళ్లు తెరిస్తే, “ఇంకేం తెరుస్తావ్, ఇక మూసేయ్” అని నీవు జారీ చేసిన ఫైనల్ ఆర్డరుతో దివ్యలోకాన్నలంకరించిననాడు (2.1.1968) ఆమె భౌతిక కాయానికి, ఆమె చితికి నీవే స్వయాన నిప్పంటించి, ఆ నా బాధ్యతను నిర్వర్తించిన నా అగ్రజుడవో?

ఇక ఈనాడు నాతో నీకు బంధమేమిటిని అడుగుతున్న ఈ సత్తిగాడైగా ఎట్లు చెలామణి అయినావో నీవు ప్రవచించిన “నేను నేనైన నేను” సిద్ధాంతమే చెప్తుంది. దానికి నా పెండ్లిచూపులే నిదర్శనం.

పెండ్లి నూరేండ్ల పంట. నీవు చెప్పినట్లుగా నాకు కనిపించే రూపం కన్నా – నీవు చూసే గుణమే మిన్న. ఆ గుణాలు మాకు కనబడేవి కావు. నా భావి జీవితం గూడ ఎట్లా నడపవలసి ఉన్నదో నీకే తెలుసునని నమ్ముకుని ఉన్నానిక్కడ నీ దగ్గర. దాని కనుగుణంగా నీవు ఎవరిని చేసుకోమంటే వాళ్ళను పెండ్లి చేసుకుంటాననీ, ఆ బాధ్యత నీదే ననీ, నీవు స్వయాన నిర్ణయించకపోతే, నేను పెండ్లి చేసుకోననీ మారాం చేస్తే, వీవే మన్నావో గుర్తుందా? “కుంటిపిల్లనైనా, గుడ్డి పిల్లనైనా చేసుకోమంటే చేసుకుంటావా, నానా” అని అడిగావు. నా జీవితం వాళ్ళతో ముడిపడి ఉన్నదని నీవు నిర్ణయిస్తే, మహా ప్రసాదంగా స్వీకరిస్తానని నీ సరండరైన సంగతి నీవు మర్చిపోయి. ఉండవు. అపుడు “ఓరేయ్, ఇంత బాధ్యత నా మీద వేస్తేనే తట్టుకోవటమెట్లారా?” అని అడిగావు గుర్తుకొచ్చిందా?

ఇక చేసేది లేక, మూడు నాలుగు సంబంధాలు వస్తే ఏదో కారణాన వాటికి నీవు విముఖత కలిగేటట్లు చేశావు. జాతకాలు కుదరలేదనో, మరొకటనో. ఎప్పుడో ఎక్కడో నీవే చూచి వరించిన కన్యకు బట్టలు పంపి, పిలిపించి, నాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసినపుడు, నీ నిర్ణయం కోసమే నే తలవంచుకుంటే నా చూపులుగా నీవే చూచి, నా ఒప్పుదలను గూడా నీవే ప్రకటించావు.

మొదటిసారిగా చూచినపుడు మరి, నీవు ఆ పిల్లను అమ్మగా ఆదరించావో, లేక సత్తిగాడు గానే వరించావో గానీ, పెండ్లిచూపులు నాడు నీ చేష్టలే నావి కాబట్టి, నీ నిర్ణయాలే నావి కాబట్టి, నీవు నేనే నేమో?

అమ్మా విన్నావుగా – మరి నీవు తల్లితండ్రులుగా కనిపెట్టి దీవించనున్నావో, గురువుగా ఇంకేదన్నా ఉపదేశించనున్నావో, సఖుడవుగా మరేమన్నా సూచించ నున్నావో, అన్నవో మరింత అండన ఉండనున్నావో, మరి పరిహాసాల బావగా – నిన్ను తలచుకుంటేనే తరుక్కుపోతన్న నా కడుపును చూచి పరిహసించనున్నావో, మరి ఏమో?

నాతో ఇన్ని బంధాలను ఏర్పరచుకున్న నీవు ఇకపై ఏ బంధంతో నన్నింటి పెట్టుకొని నీ అక్కున జేర్చుకుంటావోనని ఎదురు జూస్తూ….

నీ  బంధాలలో ఒడిలో సత్తిగాడు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!