ఆయన పేరు శ్రీ శిష్ట్లా వెంకటసుబ్బారావుగారు. ‘అందరింట’ ఆయన్ని ‘నెల్లూరు -డాక్టరు’ గారంటూ అంతా సంబోధిస్తారు. వీరి స్వస్థలం ‘పొన్నూరు’ నుంచి గుంటూరుకు వెళ్ళే ప్రధాన రహదారిలో కనిపించే ‘మంచాళ’ గ్రామం. తల్లిదండ్రులు గుంటూరులో స్థిరపడటాన విద్యాభ్యాసం దాదాపు గుంటూరులోనే సాగింది. మెడిసిన్ పూర్తి చేశాక నెల్లూరు పట్టణంలో స్వంతంగా వైద్యవృత్తిని చేపట్టారు. అనతికాలంలోనే మంచి ఫిజిషియన్గా పేరుగడించి ఆ పట్టణంలో అందరి మన్ననలను పొందారు.
అది 1969 సంవత్సరం, బాపట్ల ‘మాతృశ్రీ ప్రింటర్స్’లో నేనూ సేవలందించే రోజులవి. సెప్టెంబరు మాసం చివరిరోజులు కావటాన సన్నగా వానతుప్పరలు పడుతున్నాయి. ఆ చిరుజల్లులలో ముస్తాబయిన ఇద్దరు యువకులు ‘మాతృశ్రీ ప్రింటర్స్’లోకి అడుగుపెట్టారు. వారు కొంతసేపు శ్రీ కొండముది గోపాలన్నయ్యతో మాట్లాడారు. ఆ తర్వాత శ్రీ గోపాలన్నయ్య నన్ను వారివెంట ఉండి, జిల్లెళ్లమూడికి తీసుకువెళ్ళి, అమ్మ దర్శనం చేయించి, తిరిగి వారితో బాపట్ల రావలసిందిగా కోరారు.
శ్రీ భద్రాద్రిరామశాస్త్రి తాతగారి ఆహ్వానం మేర అమ్మకు నిరంతరం సేవలందించే అన్నపూర్ణక్కయ్యను పెండ్లిచూపులు చూసే నిమిత్తం ఆ అన్నదమ్ములు వచ్చారని తెలిసింది. అందులో పెద్దవారు డా॥ ఎస్.వి.సుబ్బారావు గారయితే, తమ్ముడు Indian Army లో Captain గా సేవలందిస్తున్న శ్రీ శిష్టా దక్షిణామూర్తిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మొదటిసారి వీరు జిల్లెళ్లమూడికి వస్తున్నారని వారి సంభాషణలద్వారా తెలిసింది. ఆ వానజల్లులలోనే ‘బాపట్ల’ నుండి ‘పెదనందిపాడు’ వెళ్ళేబస్సులో ముగ్గురం 7వ మైలవద్ద దిగాం. ఒకవైపు ఎడతెరిపిలేకుండా చిత్తడివాన, మరోవైపు జిల్లెళ్లమూడికి చేరే మట్టిరోడ్డు వర్షానికి బంకమట్టి బురదగా మారి, కాళ్ళుజారుతూ నడక కంట్రోల్ లేని స్థితి. అందరం మోకాళ్ళవరకూ ప్యాంట్లు మడిచి, చెప్పులు చేతబూని మెల్లిగా ఎట్టకేలకు అమ్మ సన్నిధికి చేరాం. తర్వాత పెండ్లిచూపుల తతంగం ముగిసి అనతికాలంలో 21-11-1969 న జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధిన, అమ్మ ఆశీస్సులతో కనుల పండుగగా శ్రీ దక్షిణామూర్తి, అన్నపూర్ణక్కయ్యల వివాహం జరిగింది.
ఈ వివాహం జరిగేక్రమంలో డా|| ఎస్.వి.సుబ్బారావుగార్కి క్రమంగా అమ్మయందు భక్తివిశ్వాసాలు పెంపొందసాగాయి. తమ్ముని వివాహం అయ్యాక కూడా, శ్రీ సుబ్బారావుగారు తరచు తమ కుటుంబ సభ్యులతో, బంధుగణాలతో, స్నేహితులతో కలిసివచ్చి అమ్మని దర్శించసాగారు. అమ్మ వర్షించే ప్రేమాదరణలకు, పరవశించి పులకించి పోయేవారు. క్రమంగా అమ్మతో వారికి సాన్నిహిత్యం పెంపొంద సాగింది. అమ్మకెపుడైనా ఆరోగ్యసమస్యలెదురైతే అమ్మకి వైద్యసేవలందించసాగారు. ఆ అవకాశాన్ని కూడా అమ్మే ఆయనకు అనుగ్రహించింది. నెల్లూరులో అవిశ్రాంతంగా తమ Nursing Home, Practice లను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే తమకు ఎప్పుడు అమ్మని చూడాలనిపించితే, అప్పుడు, పగలనక, రాత్రనకా స్వయంగా కారు Drive చేసుకొంటూ వచ్చి అమ్మని దర్శించి ఆనందించేవారు శ్రీ ఎస్.వి.సుబ్బారావుగారు.
ఒక్కోసారి అమ్మే వారిని రావలసిందిగా పిలవనంపేది. ఎన్ని Urgent పనులున్నా వాటిని ప్రక్కనుంచి, అమ్మపైనే ఆ పనుల బరువు, బాధ్యతలను మోపి, అమ్మ పిలుపునందుకొన్నవెంటనే బయలుదేరివచ్చి అమ్మను దర్శించిన అనంతరం తిరిగి నెల్లూరుకు వెళ్ళేవారు. తాము అలా అర్థాంతరంగా వదిలివచ్చిన ఏ పనీ, ఎంతటిదైనా కూడా ఏనాడూ, ఏ రకమైన కష్ట, నష్టాలను కలిగించకపోవటం ఆయన్ను ఆశ్చర్య ఆనందాలకి గురిచేసేది. అంతా అమ్మ అనుగ్రహ ప్రభావమేనని వారి విశ్వాసం. అమ్మకి ఎప్పుడైనా సుస్తిచేసి అమ్మకి ఆయనే మందు ఇవ్వాల్సివస్తే, టాబ్లెట్స్ని ఒక చిన్న వెండి ప్లేట్లో ఉంచి, ఎంతో భక్తి ప్రపత్తులతో, అణకువతో, వినయంగా, దేమునికి నైవేద్యం సమర్పించే రీతి వాటిని అమ్మకి సమర్పించేవారు. అది గమనించిన ఎవరైనా, ఆ తర్వాత అదేంటండీ! డాక్టరు గారు! అలా టాబ్లెట్స్ని కూడా ఏదో నివేదన చేసినట్లు అమ్మ కిస్తున్నారంటే! చిరునవ్వులు. ఇందులో మనం ఇచ్చేదేముందండీ! శక్తి ఒక రూపుదాల్చి మనమధ్యన మనతో ఉంటూ, మనలాగానే తన శారీరక బాధలని అనుభవిస్తున్నపుడు, అందరి బాధలూ తీర్చే శక్తి స్వరూపిణిని, తన బాధను తానే తగ్గించుకోమని వేడు కొంటూ, నాకు ఆమె తోపించిన మందులను, నిమిత్త మాత్రుడనై, అలా నివేదన చేస్తాను, అని చెబుతుంటే, ఆ కళ్ళలో తొణికిసలాడే వినమ్ర, భక్తి భావాల్ని చూచిన ఎవరైనా అచ్చెరువొందక తప్పదు.
అలా పిలుపునందుకొని రాత్రి 7 గం. సమయాన ఒక్కరే కారులో జిల్లెళ్లమూడి చేరారు. అమ్మ దర్శనం అయి, సంభాషించేసరికి రాత్రి 9 గం. అయింది. వెంటనే నెల్లూరు తననే చూస్తూ, చిరునవ్వుతో, చేతిలో వేడి వేడి కాఫీ కప్పుతో తిరుగు ప్రయాణానికి అమ్మ అనుమతి కోరారు. అన్నంతిని, ఆ రాత్రికి అక్కడే పడుకొని మర్నాడు ఉదయం మంచంపై కూర్చొన్న అమ్మ నీ కోసమే ఎదురు బయలుదేరమంది అమ్మ. తమ Nursing Home లో 1, 2 రోగుల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, తమ అవసరం వారికేక్షణాన్నయినా కలగ వచ్చని, తాము వెంటనే బయలుదేరి వెళతానని అమ్మతో విన్నవించారు. ఆ రాత్రిసమయాన కారునడుపుకొంటు ఆయన ప్రయాణం చేయటానికి అమ్మ అంగీకరించలా! వసుంధర పెరుగన్నం పెడుతుంది నాన్నా! నీవది తిని ఈ రాత్రికి ఇక్కడే హాయిగా పడుకొని, నీకంత తొందరయితే, తెల్లవారుఝామునే లేచి కాఫీ తాగి బయలుదేరవచ్చు అంది అమ్మ. అక్కడ Patients పరిస్థితి బాగాలేదమ్మా! అదీకాక నేనుకూడా బాగా అలసిఉన్నాను. ఇపుడు ఇక్కడ నిద్రిస్తే, నాకు మెలకువ రావటం కష్టం. అక్కడ Patients అవసరసమయాన నేను అందుబాటులో లేకుంటే అటు వాళ్ళకీ, ఇటు నాకూ అందరికీ ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. తాము వెళ్ళేందుకు అనుమతించమని అమ్మని వేడుకొన్నారు. అమ్మ చిరునవ్వుతో “నీ Patientsకు ఏమికాదు నాన్నా! నీకు నేను హామీ ఇస్తున్నాను. నిన్ను తెల్లవారుఝామున నేనే స్వయంగా వచ్చి నిద్రలేపుతా! సరేనా!” అని గోముగా ఆయనను అనునయించి తానే స్వయంగా ఆయనచే అన్నం తినిపించింది. వసుంధ రక్కయ్య చాపా, దిండూ తెస్తే ఆయనకిచ్చి, నాడు వాత్సల్యాలయానికి దక్షిణ దిక్కుగల ఖాళీ ప్రదేశంలో పడుకొని హాయిగా నిద్రపొమ్మంది అమ్మ. అలాపడుకొన్న మరుక్షణంలో నిద్రలోకి జారుకొన్నారు డాక్టర్ గారు.
ఆదమరచి ఒళ్ళుతెలియని మంచి గాఢనిద్రలో మునిగి ఉన్న సమయాన చెవికిదగ్గరగా మ్యావ్! మ్యావ్! అన్న పిల్లి అరుపుకు మెలకువచ్చింది. చూస్తే సమయం తెల్లవారుఝామున 3.15 ని. అయింది. మెల్లగా లేచి కూర్చునేసరికి, చల్లగా ఒక పిల్లి ఆయన ప్రక్కనించి మెల్లగా జారుకుంది. అమ్మ ఈ పిలిచేత నన్ను నిద్రలేపించిందన్నమాట! ఏదో తెలియని ఆనందంతో లేచి Brush చేసుకొన్నాక, ఇక అమ్మవద్ద శలవు తీసుకొందామని అమ్మగది తలుపుతెరిచారు. ఎదురుగా చూస్తున్నానంటూ ఆయన చేతికి కాఫీ కప్పునందించింది. కాఫీ తాగటం అయ్యాక నొసట కుంకుమబొట్టు అదిమి చేతిలో పండ్లు ప్రసాదంగా ఉంచింది. అమ్మ అనంత వాత్సల్యానికి పరవశులైన డాక్టరుగారి కనులు ఆనందాశ్రువులతో వర్షించాయి. అమ్మ ఆయన శిరస్సును తన మృదు కరంతో స్పృశించింది. అమ్మవద్ద శలవు తీసుకొని ఆ తెల్లవారు జాముననే తిరిగి నెల్లూరుకు కారులో ప్రయాణం అయ్యారు డాక్టరుగారు. త్రోవపొడవునా అమ్మను గురించిన ఆలోచనలతో మనసున ఆనందం ఉన్న డాక్టరుగారిని నెల్లూరులోని వారింటి ముందుకు చేర్చి ఆగింది. Doctor గారు Nursing Home లోని Patients కి అవసరమైన చికిత్సలందించారు.
డా॥ సుబ్బారావుగారు అమ్మకే కాక, ‘అందరింట’ ఎందరో అవసరమైన సోదరీసోదరులకూ వైద్యసేవ లందించారు. అందరింట వైద్యసదుపాయంతోపాటు మరికొందరు వైద్యులున్నా, ఒక్కొక్కసారి అంతుబట్టని రుగ్మతలతో బాధపడే కొందరు సోదరీసోదరులకు సైతం అమ్మ డా॥ సుబ్బారావుగారిచేత వైద్యం చేయించేది. చిత్రం. ఆయన వారికి వైద్యసేవలందించాక దీర్ఘకాలిక రుగ్మతలనుంచి వారు త్వరితగతి కోలుకొనేవారు. అదీ అమ్మ అనుగ్రహమే అంటారాయన.
1975 లో అమ్మకి బాగా సుస్తి చేసింది. డా॥ ఎస్.వి.సుబ్బారావుగారి అభ్యర్థనను మన్నించి అమ్మ తన వైద్యనిమిత్తం నెల్లూరులోని డాక్టరుగారింట కొన్ని నెలలు ఉండి, ఆయన వైద్యసేవలు స్వీకరించి, వారిని అనుగ్రహించి, ఆశీర్వదించింది. ఎప్పుడూ జిల్లెళ్లమూడిని వీడని అమ్మ నెలల తరబడి జిల్లెళ్లమూడిలో లేకపోవటాన్ని భరించలేని వివిధ ప్రాంతాలలోని అమ్మ బిడ్డలు, ఆనోటా ఆనోటా అమ్మ నెల్లూరులో డా॥ ఎస్.వి.సుబ్బారావు గారింట ఉందని తెలుసుకొని, అన్ని ప్రాంతాలనుండి అనూహ్యంగా వందలాదిమంది నెల్లూరులోని డాక్టరుగారింటికే సరాసరి అమ్మను చూచేందుకు రాసాగారు. అలా వచ్చే సోదరీ సోదరులందరినీ ఎంతో ఆదరంతో ఆప్యాయంగా డాక్టరుగారు ఆహ్వానించి ఆదరించారు. అందరికీ అమ్మ దర్శన ఏర్పాట్లతోపాటు వారికి కావలసిన భోజన, వసతి సదుపాయాల్ని కల్పించారు. అమ్మ సన్నిధిన వారంతా జరుప తలపెట్టుకొన్న పిల్లల అన్న ప్రాసనలు, అక్షరాభ్యాసాలు, పుట్టినరోజులు, నామకరణాలు, ఆబ్దికాలు, ఇలా ఒకటేమిటి? అమ్మ జిల్లెళ్లమూడిలో ఉంటే అందరూ అమ్మ సన్నిధిన జరుపుకొనే అన్ని వేడుకలూ, తమ ఇంటకూడా అందరూ స్వేచ్ఛగా వారి ఇష్టమైన రీతి జరుపుకొని ఆనందించే విధంగా, అందరికి ఆయన అవకాశాన్ని కల్పించారు. తమ ఇంటికి అమ్మ దర్శనానికివచ్చే అందరినీ తగురీతి ఆదరిస్తూనే తమ ఇంటినే మరో “అన్నపూర్ణాలయం”గా మార్చి, అందరికీ భోజనవసతిని కల్పించి, అమ్మ తత్త్వాన్ని ఆచరణాత్మకంగా అందరికీ ఆచరించి చూపిన ఆదర్శమూర్తి శ్రీ ఎస్.వి. సుబ్బారావు గారు.
ఆరోజులలో Patients దగ్గర ఫీజు రూ. 3/ తీసుకొనేవారు. పేదవారైతే వైద్యంతోపాటు, మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవారు. ఎవరైనా డాక్టరుగారూ! అమ్మ మీ ఇంటవుండినన్నాళ్ళూ వచ్చిపోయే వందలాది అమ్మ దర్శనార్థులకు, ఎంతో ఓర్పుతో, ఉదారంగా, నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా, ఎంతబాగా నిర్వహించా రండీ! అంటూ అభినందించితే అందులో నాదేమీ లేదండీ! అదంతా అమ్మ కరుణే! అమ్మ మా ఇంట ఉండినన్నాళ్ళూ అమ్మ అనుగ్రహంతో ఆ నిర్వహణకు అవసరమైన ధనం ఏదోవిధంగా సమయానికి సమకూడేది. నా ప్రాక్టీసు ద్వారా ఎప్పుడూ ఎరగనంతగా, వద్దన్నా డబ్బు వచ్చేది. అమ్మ నిరంతరం నా వెన్నుదట్టి, నా వెంట అండగా ఉంటూ నన్నలా నడిపించిందంటూ, ఎంతో వినయంతో అమ్మయందు తమకుగల భక్తివిశ్వాసాలను నిరహంకారంగా విశదపరిచిన మహనీయుడు డా॥ ఎస్.వి.సుబ్బారావు గారు.
‘అందరింటి’ చరిత్రలో అమ్మయందలి వారి భక్తివిశ్వాసాలు, అమ్మకీ, అందరింటికీ ఆయన ఒనర్చిన నిరుపమాన సేవలు, ఆయన వ్యక్తిత్వం, చిరస్మరణీయమై నిలుస్తాయన్నది అతిశయోక్తికాదు. నిన్నమొన్నటిదాకా మనందరితో అమ్మ ప్రేమానురాగాలను పొంది మనమధ్యనే సంచరించిన శ్రీ శిష్ట్లా వెంకటసుబ్బారావు గార్ని అమ్మ 18-05-2021న తనలో లీనం చేసుకొంది. భౌతికంగా ఇక ఆయన మనతో లేరు అన్న విషయం వారి గురించి తెలిసిన వారందరినీ బాధకు గురిచేసే విషయమే అయినా, ఆయన గురించిన అనేక మధురస్మృతులు అలనాటి సోదరీసోదరులందరి మనసులలో కలకాలం పదిలంగానే ఉంటాయి. ‘అందరింటి సభ్యుల’ చరిత్ర పుటలలో మరొక అధ్యాయం ముగిసింది. డాక్టరుగారి కెలానూ అమ్మ సద్గతినే ప్రసాదిస్తుంది. అయినా వారి కుటుంబసభ్యు లీ విషాద సంవుటననుంచి త్వరగా కోలుకొని స్వస్థత నొందగలందులకై అమ్మని సదా ప్రార్థిస్తూ… “సర్వేజనాః సుఖినోభవంతు”! జయహో మాతా!