1975వ సంవత్సరం ఆ ప్రాంతంలో 11 సంవత్సరముల వయస్సు గల నేను కస్తూరిగా జిల్లెళ్ళమూడి నా కంటే 3 సంవత్సరములు చిన్న తమ్ముడు రామకృష్ణ కూడా. సంప్రదాయ సంపన్న కుటుంబంలో చేరాను. జన్మించి కూడా మా అమ్మ అస్తవ్యస్త జీవితంతో బాధలు పడిపడి అమ్మవద్దకు వచ్చి, అర్కపురిలో అమ్మ మా అమ్మచే కేన్సర్ వ్యాధి నివారణ కొరకు హైమాలయములో ప్రదక్షిణలు చేయించిన తరువాత పూర్తిగా కేన్సరు తగ్గినది. ఉపశమనము పొందియున్నది. అప్పుడు అమ్మ.. మా అమ్మతో “నేనున్నాను – నేను చూసుకుంటాను” అనే మాట సుదర్శన చక్రమువలె, త్రిశూలము వలె ఈ నాటికిని పనిచేస్తూనే ఉన్నది.
ఎలిమెంట్రీ, హైస్కూల్, కళాశాల విద్యలవరకు (కెజి టు పిజి) అన్నట్లుగా అమ్మ అనుక్షణం వెంట యుండి అనారోగ్యము కలిగినా, మానసిక బలము నీరసించినా ఎప్పటికప్పుడు నూతనోత్సాహము కలిగిస్తూ విద్యపై అకుంఠిత శ్రద్ధ కలిగించి, విద్యయందు మక్కువ ఎక్కువై రిలాక్స్ హైమాలయములో పరిశుభ్రత, అభిషేకములు, శ్రీ సూక్త, లలితా సహస్ర పారాయణము చేయిస్తూ తొలిసారిగా బంగారు ఆభరణములు చూసానంటే హైమక్కవే. వాటిని ధరింపజేసి అలంకరణ చేసే భాగ్యము కలిగించింది. అమ్మ ఆశీస్సులతో కళాశాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ బహుమతులు పొందగలిగాను. రామకృష్ణ అన్నయ్యతో, వసుంధర అక్కయ్యతో, మా పిన్నిగారు కమలక్కయ్యతో అమ్మ అన్నది – “కస్తూరికి ఉద్యోగం వచ్చిందిరా, 1200 రూపాయిలు జీతంతోరా!” అన్నది. అప్పుడు రామకృష్ణ అన్నయ్య … అమ్మా! మీ రికమండేషనే కదా? అంటే అప్పుడు అమ్మ నవ్వి- సరే అన్నది. మున్ముందుగానే ఉద్యోగం, జీతం సూచించింది. తరువాత ఆ ప్రకారమే జరిగినవి. అప్పుడప్పుడు సరదాగా కస్తూరక్కయ్యా అనేది అమ్మ. నాన్నగారు సిద్ధి పొందిన 11 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, లలితా సహస్ర నామపారాయణలతో పూర్తిగా కార్య నిమగ్నులమై అందరూ ఉన్న సమయంలో నా సహ విద్యార్థి వి. భాస్కరశర్మను చూపించి, అతనికి గొంతు సరిగా లేదేమో! నీరు ఇవ్వమని సైగచేసింది. నాకెందుకులే – అని ఊరుకున్నాను. అతనితోనే వివాహమైన తరువాత అమ్మసైగ కళ్యాణకారిణి మహిమ అని గుర్తించాను. తరువాత మా తమ్ముడు రామకృష్ణ జిల్లెళ్ళమూడిలో సరిగా చదివి, చదవకా తిండి తినీ తినకా పగలు రేయి సమానముగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండే ఆ పిల్లవాడిని అమ్మవద్ద ఓ రోజు కూర్చోబెడితే అమ్మ స్పర్శ ప్రభావము వలన వాడు సక్రమ స్థితికి వచ్చి కొద్దిరోజులు మాత్రమే జిల్లెళ్ళమూడిలో చదివి, ఆ తరువాత బి.కాం. డిగ్రీ చేసినా కూడా సంస్కృతోపన్యాసకులు గానే ఇప్పటికీ ప్రభుత్వేతర కళాశాలలో ప్రధమశ్రేణి అధ్యాపక వృత్తితో అమ్మ ఆశీఃఫలంగా బ్రతుకు సాగిస్తున్నాడు. ఆమె చూపులు ఎంత నిశితమో? వారి వివాహ విషయంలో పిల్లవాడికి జన్మనిచ్చి కూడా వివాహ జీవితం ఛిన్నాభిన్నమై పోలీస్, కోర్టు గొడవలలో మనస్సు అతలాకుతలమై పోతూ ఉంటే అమ్మ దివ్య ఆపన్నహస్తం సూచిస్తూ ఏ బాధా లేకుండా నవ్యస్థితిని చేర్చి, రెండవ వివాహము, మరియొక మగబిడ్డ, వారి విద్యా ఉద్యోగ స్థితిగతులు అమ్మచలవే అని తప్పక చెప్పాలి. కారణం ఆమె “నేనున్నాను” అని అన్నది కనుక. అమ్మ నామ జవ మంత్రం మహిమాన్వితం. అమోఘమైన శక్తిని ప్రసాదిస్తుంది. నా కళ్ళు, కాళ్ళు, పళ్ళు విషయంలో శస్త్ర చికిత్సలు అమ్మే నేనున్నానని నిర్భీతిగా కొనసాగించింది. నా జీవితం గురించి సామాన్యముగా ఆలోచిస్తే “లక్ష” అన్న పదం విడ్డూరం. అటువంటిది లక్షాధిక ధనస్థాయికి నేనున్నాను అని తీసుకురాగలిగింది. “అమ్మావతారం” గూర్చి చెప్పాలన్నా, రాయాలన్నా మనమెవరమూ సరిపోము.
ఒకసారి అమ్మ మా విద్యార్థులతో ముచ్చటైన సమావేశం ఏర్పాటు చేసినది. అందరూ వారి వారి పరిధిలో అమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అమ్మ వారి సందేహాలు అడిగి సంతోషం వ్యక్తం చేసారు. అందరికీ అమ్మ ఒకటి రెండు నిమిషములు సమయం ఇచ్చింది. నాతో ఐదు ఆరు నిమిషములు గడిపి చివరగా అందరికీ వూవులు తలనిండా జల్లింది. నాకు వెయ్యలేదు. అమ్మని వెంటనే అడిగా! అమ్మా అందరికీ పూలు వేసి నాకెందుకు వేయలేదని, అప్పుడు అమ్మ “నాన్నా… వాళ్లు నాతో మాట్లాడారు. నేను నీతో మాట్లాడాను. ఎన్నో మంచి విషయాలు చాలా తెలుసుకున్నావు. నువ్వే గొప్పకదూ? సరే చదివి ఏం చేస్తావు?” అని అన్నది. ఉద్యోగం అని అన్నాను. ఉద్యోగం చేసి ఏం చేస్తావు? ధనం సంపాదిస్తాను. “అందరికీ సహాయం చేస్తాను.” అందరికీ అంటే నీ కుటుంబం వరకేనా? కాదు కుటుంబమునకు సరే, అది కాక తారతమ్యము లేకుండా అందరికీ సహాయం చేయాలనే ఉందమ్మా.. అనగానే ‘నీవనుకున్నట్లు జరుగుతుందిలే! అని ఆప్త అభయ వాక్యము ప్రసాదించిన అనసూయమ్మకు నేను నేనైన తల్లికి అన్నీ తానైన తల్లికి నేనున్నానని శృంగవరపుకోట విచ్చేయుచున్న తల్లికి మనఃపూర్వక నమోవాకములు అర్పిస్తూ… జయహోూ మాత!