1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నేను ధన్యజీవినే!

నేను ధన్యజీవినే!

Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : July
Issue Number : 12
Year : 2021

1963 మార్చి యస్.యస్.యల్.సి. పరీక్షలకి 23 రోజుల ముందు మా నాన్నగారు శ్రీ జన్నాభట్ల వెంకట రామయ్యగారు బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య తోటి జిల్లెళ్ళమూడి పంపారు. అదే నేను “అమ్మ”ని ప్రధమంగా దర్శించుకోవటం. అప్పటి నుంచి నన్ను “అమ్మ” చాలా విషయాలలో ధన్యుడిని చేసింది.

1970 మార్చి నెలలో షుమారు నెల రోజులపైగా జిల్లెళ్ళమూడిలో ఉండటం జరిగింది. బి.కామ్. డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం, సద్యోగం లేదు. ఒక రోజు “అమ్మతో” నేను గుంటూరు వెళ్ళతా అన్నాను. అప్పుడు “అమ్మ” 4 రోజులు ఉండి వెళ్లుదువుగాని లే అన్నది. కానీ, మరుసటి రోజు అన్నపూర్ణాలయంలో వడ్డన చేస్తుండగా కబురు పంపగా నేను “అమ్మ” దగ్గరికి వెళ్ళగా బొట్టు పెట్టి, ప్రసాదం ఇచ్చి గుంటూరు వెళ్లమన్నది. నేను మారు మాట్లాడకుండా నిన్న నా అంతట నేను వెళ్లతానంటే వద్దని ఈ రోజు తనంతట తాను వెళ్లమన్నది, నేను ఏమైనా తప్పు చేసానా నాలో నేను మధనపడుతూ గుంటూరు చేరుకున్నాను. ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు నిన్నటి నుంచి నీ కోసం ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడలో ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఉంది అని మన ఎదురింటి ఆయన చెప్పగా ఈ కబురు ఏ విధంగా నీకు చేరుతుందా అని ఆలోచిస్తున్నాను. (ఆ రోజుల్లో టెలిఫోన్ సర్వీస్ కూడా అంత అంత మాత్రమే.) ఇంతలో నువ్వు వచ్చావు అన్నారు. వెంటనే నేను రాలేదు “అమ్మ”యే నన్ను పంపినది అని అన్నాను. మర్నాడు విజయవాడ వెళ్ళి టైపిస్టు కమ్ ఆఫీసు ఇన్ఛార్జిగా సెలక్టు అయి రూ. 175/- జీతంలో చేరాను. అది నా జీవితానికి పునాదిరాయి. కాకపోతే 42 సం॥ ఒకే ప్రైవేటు కంపెనీలో అంచలంచలుగా పైకి ఎదుగుతూ ఉద్యోగం చేసాను. మరి నేను ధన్యజీవిని కానా!

1980 జనవరి 8 “అమ్మ” ఆదేశం మేరకు మా నాన్నగారిని జిల్లెళ్ళమూడి తీసుకురావటం జరిగింది. 9వ తేదీ నుండి ఎమ్ఎమ్ఎ్సలో ఉంచి “అమ్మ” నామ సప్తాహం జరిపించి 13వ తేదీన “అమ్మ” ఎమ్.ఎమ్.సి కి వచ్చి మా నాన్నగారికి, మాకూ భోగిపళ్లు పోసింది. ఒక రోజు (తారీఖు గుర్తులేదు) నన్ను తన గదికి పిలిచి ‘మీ నాన్నకు సన్యాసం తీసుకుందామని ఉంది అమ్మా! అన్నాడురా’ నాతోటి. కాబట్టి నువ్వు మీ నాన్న యజ్ఞోపవీతం, మొలత్రాడు తీసివేసి కుడి చెవిలో “అమ్మ సో హం” అని చెప్పునాన్నా! అని నాకు మంత్రోపదేశం చేసింది. మా నాన్నగారు సన్యసించాలనే కోరిక మాకే కాదు మా అమ్మకి కూడా తెలియదు. మాకు తెలియని ఆయన కోరికను నా చేత చేయించి తండ్రి కోరికను తీర్చిన తనయుడిని చేసిన నేను ధన్యజీవిని కానా!

నాన్నగారు ఆలయ ప్రవేశం చేసిన తర్వాత వచ్చిన మహాశివరాత్రికి అనసూయేశ్వరాలయంలో మన కాలేజీ లెక్చరర్ అయిన శిష్టి ప్రసన్నాంజనేయశర్మ, కుమారశర్మ తదితరులు లింగోద్భవకాలంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం “అమ్మ” సన్నిధిలో చేస్తున్నారు. (“అమ్మ” మంచం మీద కూర్చొని ఉన్నది) అభిషేకం బిల్వార్చన అయిన తర్వాత అందరికి తీర్థం ఇద్దామని తీర్థ పాత్ర తీసుకొని నేను గర్భాలయం నుండి బయటకి రాగానే “శాస్త్రీ ! నాకు తీర్థం ఇవ్వరా!” అని నా చేత తీర్థం స్వీకరించింది. మరి నేను ధన్యజీవిని కానా!

“అమ్మ” నెల్లూరులో డాక్టర్ శిష్ట్లా సుబ్బారావు గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు బిడ్డల ఆహ్వానంపై వెంకటగిరి వెళ్లింది. నేను మా కంపెనీ జీప్ లో నెల్లూరు నుండి వెంకటగిరి వెళ్లటం జరిగింది. నేను వచ్చేటప్పుడు నన్ను మా నాన్నగారిని తన కారులో రమ్మన్నది. దానిలో నేను మా నాన్నగారు “అమ్మ”, రామకృష్ణ అన్నయ్య, డ్రైవింగ్ సీటులో డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నాము. “అమ్మ” ఏదైనా జోక్ (హాస్యం) చెప్పండిరా ! అని అడుగగా నేను తెల్లాకుల జాలయ్య గారి మీద జోక్లు చెప్పటం జరిగింది. “అమ్మ”తో చెప్పిన మొట్ట మొదటి జోక్ తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కాలేజి, గుంటూరులో ఉన్నది. ప్రతిసంవత్సరం కాలేజి వాళ్లు సావనీర్ వేసేవారు. పోలిశెట్టి సోమసుందరంగారు స్వర్గస్థులు అయిన తరువాత కాలేజి వారు సావనీరు ఆవిష్కరిస్తూ “తెల్లాకుల జాలయ్య, కీ.శే. పోలిశెట్టి సోమసుందరం కాలేజి” అని ముద్రించి మొదటి కాపీ కాలేజి ప్రిన్సిపాల్గారు జాలయ్య గారికి ఇవ్వగా ప్రిన్సిపాల్తో-

జాలయ్యగారు: ఏమండీ ఇంకో 10 లక్షలు ఎక్కువ డొనేషన్ కావాలా ? ఎందుకు నన్ను తక్కువ చేస్తారు అని అన్నారు.

ప్రిన్సిపాల్ : ఖంగారుగా… అది ఏమిటండి అలా అంటారు.

జాలయ్యగారు: ఏవండీ సోమసుందరంగారికి కీ. శే. అనిపెట్టి నా పేరు ముందు ఎందుకు పెట్టలేదు అని అన్నారు. (జాలయ్య గారు చాలా తెలివైనవారు, గొప్ప రాజకీయ నాయకులుగా చిన్నతనంలో నవ్వుకోవటానికి చెప్పుకునే వాళ్ళం) ఆ జోక్ విని “అమ్మ”తో పాటు కారులో ఉన్నవారందరం డాక్టరు గారి ఇంటికి వచ్చేవరకు జోక్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ రావటం జరిగింది. ఆ రోజు నుంచి నేను కనబడ్డప్పుడల్లా ఏదో ఒక జోక్ చెప్పించుకొని హాయిగా నవ్వుకునేది. మరి “అమ్మ”ని ఆనందింప జేసిన నేను ధన్యజీవిని కానా!

నేను జిల్లెళ్ళమూడి వెళ్లినప్పుడల్లా నాన్నగారింట్లో సంచి పడేసి కాళ్లు కడుక్కొని “అమ్మ” గదిలోకి వెళ్ళేవాడిని. “అమ్మ” నన్ను చూడగానే (మంచం మీద పడుకున్నప్పుడు) రెండు పాదములు కదిలించేది. మొదట్లో నేను తెలుసుకోలేక పోయేవాణ్ణి. ఒకసారి వసుంధరక్కయ్య అది చూసి శాస్త్రి “అమ్మ” పాదాలు ఒత్తు అని చెప్పటం జరిగింది. అది మొదలుగా పాదాలు, వీపు, నడుములసేవ చేసుకోవటం, తను ఎంతో హాయిగా ఉండటం జరిగింది. నేను వెళ్లిన తరువాత సోదరీమణులతో వనజ, రమాదేవి. మొదలగు వారితో శాస్త్రి దగ్గర నేర్చుకొండే వాడు పాదాలు పిసుకుతుంటే (పాదపీడనం) చాలా హాయిగా ఉంటుంది. అని “అమ్మ” కితాబు ఇచ్చింది. మరి ఈ పాదసేవకుడు ధన్యజీవి కాదా!

నాకు ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత మా ఆవిడ మళ్లీ కడుపుతో ఉంది. అప్పుడు “అమ్మ” దగ్గరికి వెళ్ళి ఈసారి అన్న అబ్బాయిని ఇవ్వమ్మా అని అడుగగా వెంటనే ఎందుకురా అన్నది. కొడుకు అయితే తల కొరివి పెడతాడు గదా అమ్మా! అని అన్నాను. “అమ్మ” నువ్వు పోయిన తర్వాత ఎవరు పెట్టేది నీకు ఏమి తెలుస్తుందిరా? అని గీతోపదేశం చేసింది. యధావిధిగా నాలుగోసారి కూడా నాకు అమ్మాయి కలిగినది. మానాన్నగారు పోయేటప్పటికి ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళికి ఉన్నారు. నాకు నలుగురు అమ్మాయిలు. మొత్తం ఆరుగురు కన్యలు. ఒక కన్యాదానం చేస్తేనే నూరు యాగముల ఫలము నాకు ముందు 10 తరముల వాళ్లు నా తర్వాత 10 తరాల వారికి శాశ్వత బ్రహ్మలోక నివాసం జరుగుతుంది అని శాస్త్ర ప్రమాణం. అటువంటివి నా చేత ఆరు కన్యాదానములు చేయించినది. మరి నేను ధన్యజీవిని కానా!

జిల్లెళ్ళమూడిలో నిర్వహించిన మొదటి చండీయాగంలో నేను పారాయణకర్తని కాను, 10 మంది 40 రోజుల దీక్షతో సోదరులు రాచర్ల లక్ష్మీనారాయణ, కేశవశర్మ, పి.యస్.ఆర్, కామరాజు, ధర్మసూరి, ఐ. రామకృష్ణ, హనుమబాబు, మధుసూదనరావు, ఆయన బావగారు మరొకరు. నాకు మాత్రం యాగమునకు కావలసిన యాగ సంభారములు సమకూర్చే పని ఒప్ప చెప్పారు. అన్ని సంభారములు తీసుకొని ఒక రోజు ముందుగానే జిల్లెళ్ళమూడి చేరాను. 5 రోజులు యాగము. ఆ 5 రోజుల్లో ఒక రోజు మా నాన్నగారి ఆబ్దికం ఉండి నేను రాను మిగతా 4 రోజులు హోమంలో పాల్గొంటాను అని హనుమబాబు గారు లక్ష్మీనారాయణ అన్నయ్యతో అంటే ఆయన కుదరదు అని “ఒరేయ్ శాస్త్రీ ! మాతో పాటు నువ్వు హోమం చేయి” అని నాకు చెప్పటం నేను వెంటనే పారాయణం చెయ్యలేదు కదన్నయ్య అంటే తర్వాత చేయి అని అక్కడ ఉన్న కేశవ అన్నయ్య అనటం, నేను పాల్గొనటం జరిగింది. మిగతా 9 మంది తర్వాత పారాయణ చేస్తున్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం సుమారు 30 సంవత్సరముల నుంచి ప్రతి సం॥ము దసరాలకు 9 రోజులు సప్తశతి పారాయణ చేసి నవమి రోజు హోమం చేసుకోవటం జరుగుతున్నది. యాదృచ్ఛికంగా ప్రారంభమైన పారాయణ “అమ్మ” దయవలన అవిచ్ఛిన్నంగా జరుగుతున్నది. మరి నేను ధన్యజీవిని కానా! అమ్మ అవతారాన్ని చాలించి అనంతమూర్తిగా రూపెత్తబోయే చివరిరోజు రాత్రి అమ్మ నా ఒడిలోనే తలవాల్చింది. అమ్మ సేవలో తరించే భాగ్యాన్ని పొందిన నేను నిజంగా ధన్యజీవిని కానా!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!