అమ్మ అప్పుడప్పుడు చేసిన సంభాషణలు సకల ఉపనిషత్తుల సారాలు. అమ్మ సన్నిధిలో పలుకుపలుకునా రత్నాలు రాలుతాయి. ఏరుకున్నంత వారికి ఏరుకున్నంత! అమ్మది మనందరి లాంటి తోలునోరు కాదు గదా, తాలుమాటలు పలకటానికి !
అమ్మ వాక్యాలన్నీ మహావాక్యాలే. “నేను నేనైన నేను” అనే అమ్మ వాక్యం, అమ్మ హృదయానికి ఆమె అస్తిత్వానికి మణిదర్పణం. ఆమె విశ్వవ్యాపకత్వానికి మహనీయమైన శబ్దరూపం. ఈ ప్రవచనం ద్వారా సర్వజీవరాసులలోను నేను “నేను” అని ప్రకాశించే చైతన్యమే తానని మనందరికి, మర్మగర్భంగా తెలియజేసింది అమ్మ. చెడ్డవారని, మంచివారని, పండితులని, పామరులని, ధనికులని, బీదవారని తేడా లేకుండా అందరి హృదయాంత రాళాలల్లో వెలుగుతున్న పరంజ్యోతిస్వరూపమే తానని మనందరికి గుర్తుచేయటమే ఈ మాటలలోని ఉద్దేశ్యం.
“మీరంతా నేనే మీదంతా నేనే, ఇదంతా నేనే” అని చాలాసార్లు అమ్మ ప్రవచించేది. ‘మీరంతా నేనే’, అనటంలో మనస్వంతం అనుకునేది వాస్తవానికి అదంతా తన పరిస్పందనయేనని, ‘ఇదంతానేనే’ అని చెప్పటం వల్ల విశ్వాంతరాళ సర్వస్వము తానే వ్యాపించియున్నట్లుగా అమ్మ చెప్పకనే చెప్పినట్లయింది.
“నేను నేనైన నేను” అనేది తెలుగులో వచ్చిన తొలి మహావాక్యం. ఇదే అర్థం వచ్చేటట్లు “అన్ని నేనులు నేనైన, నేను” అని గూడా అమ్మ ఒక సందర్భంలో చెప్పింది.
ఇంతవరకు నాలుగు మహావాక్యాలు సంస్కృతభాష లోనే వచ్చాయి. మన వేదకాలపు ఋషులు, నాలుగు వేదాల నుండి నాలుగు వాక్యాలను నాలుగు మహావాక్యాల రూపంలో సర్వవేదాంతసారంగా మనందరికి అందించారు. ఆ మహావాక్యాలే
“అహం బ్రహ్మాస్మి”
“తత్వమసి”
“అయమాత్మా బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ”
పై నాలుగు మహావాక్యాలు అద్వైత వేదాంతమంది రానికి నాలుగు సింహద్వారాలు. కొన్ని తేడాలు మినహాయిస్తే ఈ నాలుగు మహావాక్యాల సారము గూడా ఒక్కటే. ఈ మహావాక్యాలసారాన్నే సరళ సుందరంగా, తేట తెలుగు భాషలో అమ్మ “అన్ని నేనులు నేనైన నేను” అనే మహావాక్యంలో పొందుపరిచారు.
ఇదే భావాన్ని మరొక సందర్భంగా అమ్మ “నేను నేనైన నేను” అని చెప్పి అన్ని నేనులు నేనే’ అని “అహం బ్రహ్మాస్మి” అనే వేదవాక్యాన్ని మనకు స్ఫురింపజేసారు.
సర్వజీవుల హృదయాంతరాళ మందు నిత్యమూ స్ఫురించే ‘నేను’ ‘నేను’ అనే ‘అహం’ స్ఫురణను గ్రహించి, అహంకారములోని కారం గూడా నశించి కేవలం అహంమాత్రునిగా మిగలటమే సకలసాధనలకు పరమావధి. సకలజీవులను సర్వకాల సర్వావస్థలలోను నిత్యమూ స్ఫురించే ‘నేనే’ నాలోనున్న అహంస్ఫురణ రూపంలో గూడా ప్రకాశిస్తూ ఉన్నాననే విషయాన్ని సాకల్యంగా గ్రహించటమే, వాస్తవమైన అద్వైతసిద్ధి అని, ఆ స్థితియే అమ్మ నిజస్థితి అని మనమంతా గ్రహించాలి. ఈ విషయాన్నే అమ్మ నర్మగర్భంగా చెప్పటం జరిగింది.
“తత్త్వమసి” అన్నది మరొక మహావాక్యం.
ఒక సోదరుడు అమ్మకు పాదసంవాహనం చేస్తూ “అమ్మా! బ్రహ్మ కడిగిన పాదాలు ఇవేనా?” అనే ప్రశ్న వేస్తే, అమ్మ వెంటనే “మీరంతా బ్రహ్మలు కాకపోతే గదా నాన్నా!” “మీరు రోజూ కడుగుతూనే ఉన్నారుగా అన్నది అమ్మ. ఎంత దివ్యదర్శనం ? అంటే అంతా దివ్యంగా కనిపించటమేనట ! అంటే కేవలం అమ్మను మనం దర్శించటంగాదు. మననే ఆమె దర్శించుకుంటున్నట్లుగా భావన. ఈ భావన ఎంత వీలక్షణమైనది | డాక్టరు శ్రీపాద అన్నయ్య అమ్మను పూజ చేసుకుంటూ “అమ్మా నీవు అంతర్ముఖివై నీవు నీవై ఉండవలసిన సమయంలో, మేము పూజలు చేసి, ప్రార్థనలు చేసి, నీ దృష్టిని మావైపు త్రిప్పుకుంటున్నాము గదా!” అని అంటే.
అమ్మ “నాన్నా మీలో నన్ను చూచుకోనప్పుడు గదా చిక్కు” అని ప్రశ్నించింది. అది అమ్మ యదార్ధస్థితి. అన్ని రూపాలు, అన్ని నామాలు అన్ని క్రియలూ తనవే, తానేనని చెప్పి “తత్త్వమసి” తత్త్వాన్ని మనకు ఆవిష్కరించింది.
ఒక భక్తుడు “మీరు శ్రీ రాజరాజేశ్వరి అవతారం గదా!” అంటే “మీరు కానిది నేను ఏమీ కాదు నాన్నా!” అన్నది అమ్మ.
“అయమాత్మా బ్రహ్మ” ఇంకొక మహావాక్యం. అమ్మ ఒకసారి “నా దృష్టిలో అందరూ దైవస్వరూపులే” అంది. “ఎంత వెతికినా అది కానిది నాకుకనిపించటం లేదు” ‘అంతా అదే”..
సృష్టి అంతా దైవమే మనమంతా దేవతాస్వరూపులమై ప్రకాశించటమే గదా ‘అన్ని నేనులు నేనైన’ తత్త్వం.
“ప్రజ్ఞానం బ్రహ్మ” నాలుగవ మహావాక్యం. అయితే ఇక్కడ అమ్మ ఇంకొక అడుగు ముందుకే వేసింది.
“ప్రజ్ఞానం బ్రహ్మ అయితే మరి అజ్ఞానమో?”
“శబ్దము బ్రహ్మమయితే మరి సైలెన్సో?”
“ఆనందము బ్రహ్మమయితే మరి దుఃఖమో?”
“సత్యం దైవస్వరూపమైతే మరి అసత్యమో?”
అని కుహనాపండితులను నిలదీస్తారు. పండా’ అంటే బ్రహ్మజ్ఞానం అని అర్థం. బ్రహ్మజ్ఞానిగా నుండి అద్వైతస్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నవాడే నిజమైన పండితుడు.
అమ్మ చెప్పనే చెప్పింది “అనుభవం లేకపోతే మహావాక్యాలు గూడా మన వాక్యాలే” ! నాన్నా!
అన్ని ‘నేను’ లలోను నేనుగా వెలుగొందుతున్న ‘నేను’ ‘నేను’ అనే శుద్ధ చైతన్యమే తానుగా నున్నానన్నదే అమ్మ సందేశం. అదే అన్ని సందేశాలకు అంతిమ సందేశం.
ఆశీర్వచనం అంటే మాటలకందని స్థితి.
అంతా నేనే అనుకున్నప్పుడు తానే భగవత్స్వరూపం – అంతా ఎవరో అనుకున్నప్పుడు తనను తాను మరచిపోవటం.