జన్మజన్మల కాదియౌ మరుగు కావలివైపు
కావలిగానున్న కరుణమూర్తి
అసలైన శక్తిలో సిసలైన స్పందనై
సర్వసంకల్పములు ఐన శక్తి
మూడు దేహాలలో సౌందర్యలీలగా
అతిమానుషమ్మైన కాంతశక్తి
వేద శాస్త్రాదుల వేదికలెరుగని
నిత్యసత్యపు భేరి నిర్మలాత్మ
అన్వేషణనుసల్పి సద్విమర్శతో
వివరించి వినుపించు విజ్ఞురాలు
కాలకర్మల వలయంబు నరికివేసి
జన్మమరణము మార్పని జాలతెలిసి
భ్రాంతి లేనట్టి బ్రహ్మమే తెరగనున్న
నేను మరువగలేనట్టి విశ్వజనని
శ్రీరామరామేతి యన్న మాటలలోని
సుందరంబైనట్టి చురుకు చూపు
నిత్యవ్యవహారమే నివృత్తి పథమని
నిర్మలత్వము జూపు విశ్వజనని
ఆకలియె అర్హతగ అన్నమే మందుగా
అందరింటిని నిల్పుకొన్న తల్లి
శంకరాదులలోని శంకలన్నిటి దీర్చి
అద్వైత సారము చెప్పునమ్మ
సహనసామర్థ్యములతో
సమదర్శనము చేర్చి
స్వేచ్ఛ కై పోరాడు సర్వజనని
ఇట్టి త్రిపురాణి సౌందర్య సుమవిహారి
అర్కపురి వాసి అనివార్య మౌనదర్శి
క్రాంతిపథమును సుగతికై కన్నయమ్మ
నేను మరువగలేనట్టి విశ్వజనని