1. Home
  2. Articles
  3. Mother of All
  4. “నేను వింటున్నా వినకపోయినా నీమొరే నిన్ను రక్షిస్తుంది” – అమ్మ

“నేను వింటున్నా వినకపోయినా నీమొరే నిన్ను రక్షిస్తుంది” – అమ్మ

V. Satya Narayana Murthy
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : July
Issue Number : 3
Year : 2017

అవును. అమ్మకు మనం పెట్టుకున్న మొరే (ఆర్తితో కూడిన విజ్ఞాపన) మనలను రక్షిస్తుంది. మడుగులోగల మొసలి పట్టు నుంచి విడిపించుకునేందుకు గజేంద్రుడు విష్ణువుకు చేసింది అదే గదా!

తానొక కలుషిత మనస్కుడననీ అటువంటి తన మొరను అమ్మ వింటుందో, వినదోనన్న శంకతో అమ్మ పటం ముందు మొర పెట్టుకున్న భక్తునికి ‘అమ్మ’ కలలో ఇచ్చిన సమాధానం ఇది.

పైన ‘అమ్మ’ ఇచ్చిన సమాధానానికి దృష్టాంతమే కలుషిత మనస్కుడనైన నాకు కూడా ఆ మధ్య రైల్లో బెంగళూరు నుంచి బాపట్ల వస్తున్నప్పుడు నేను అమ్మకు పెట్టుకున్న మొరకు ఫలితంగా కలిగిన దివ్యానుభవం ఇది!

సాధారణంగా నేను బాపట్ల నుంచి బెంగళూరులో నున్న మా బావ మరది ఇంటికి శేషాద్రి, లేదా హౌరా – యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో వెళ్ళివస్తున్నప్పుడు రెండువైపులా అర్థరాత్రి దాటాక తిరుపతి స్టేషన్ తగులుతుంది. అప్పుడు లోయర్ బెర్తులో నున్న నేను లేచి రైలు కిటికీలో నుంచి తిరుమల పర్వత శ్రేణుల మధ్య విద్యుత్ కాంతుల వెలుగులలో దేదీప్యమానంగా మెరిసిపోయే తిరుమల మెట్లదారినీ, ఆ దారి చివరలోనున్న గాలిగోపురం పైన కన్నుల పండువుగా తెలుపు, కుంకుమ రంగులలో వెలిగిపోయే తిరుమలేశుని తిరునామాలనూ చూచి తరించటం అలవాటు. చూడాలి. అందులోనూ ఆ కమనీయ దృశ్యం రాత్రి పూటనే

నిజం చెప్పాలంటే ఎన్నో ప్రయాసలు పడి చివరలో ఒక్క క్షణం సేపు పొందే శ్రీశ్రీనివాసుని దర్శనం కంటే నాకు ఇదే ఎక్కువ తృప్తినిచ్చే అనుభవం! రైల్లో ముందుకు వెడుతున్న నేను ఆ దృశ్యం కనుమరుగయేవరకూ వెనక్కు వెనక్కు, మెడనొప్పెట్టే వరకూ తిరిగి తిరిగి చూస్తాను.

అయితే క్రిందటి మార్చి 20వ తేదీన నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు నాకు అప్పర్ బెర్త్ వచ్చింది. అందువల్ల క్రింద లోయర్ బెర్త్ డోర్ల నుంచి స్టేషన్ ను గుర్తు పట్టడం క్రిందకు దిగితేనే గాని వీలవదు. అందులోకి అది ఎ.సి. బోగీ కావటంవల్ల వచ్చేపోయే స్టేషన్ల ఎనౌన్స్మెంట్ కూడా వినబడదు. బెంగళూర్లో రైలు బయల్దేరినప్పటి నుంచి నేనీసారి తిరుమలేశుని తిరునామాలను చూడలేనేమోననే మధన పడ్డాను.

అందుకే – “శ్రీనివాసా! నీ దివ్య ప్రభలను చూచే అదృష్టం నాకీ సారికి లేదా?” అని అటుకొండలలో నెలకొన్న కోనేటిరాయుడికి “అమ్మా! నీకు నాపై దయవుంటే నాకా అదృష్టాన్ని కలిగించు” అని ఇటు అమ్మకు మొరపెట్టుకున్నాను. (‘ఇటు’ అని ఎందుకన్నానంటే అమ్మ ఎప్పుడూ నా ప్రక్కనే వుంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం!)

అలా చింతిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. అయితే ఆ నిద్రలో ఒక చక్కటి కల! పై బెర్తుపైనున్న నాకు పైన రైలు పెట్టె టాపులేదట. అంతేకాదు, చుట్టూ రైలు పెట్టె కూడా లేదట. అంటే – నేను పడుకున్న పై బెర్తు అలా అలా గాల్లోకి లేచి సాగి పోతోందన్న మాట! దాంతో బాటు నేనూ అలా అలా ఆకాశంలోకి తేలిపోతున్నాను. పైగా పండు వెన్నెలకాంతులు అరటి తోట పైబడి ఆకు పచ్చని మరకత కాంతులుగా మారిపోయి, ఒక్క దివ్యలోకాన్ని కళ్ళ ముందు నిలబెట్టాయి. రైలు పరుగెడుతూనే వుంది. నేనా మరకత కాంతుల తళతళలలో మైమరచి పోతూ వుంటే – ‘ఇక్కడేం చూస్తావు? అటు చూడు” అన్న మాటలు వినిపించి అటువైపు తిరిగి చూస్తే ఇంకొక అద్భుత దృశ్యం !

తిరుమల కొండల మధ్య తెల్లని విద్యుద్దీపకాంతులతో వెలిగి పోతూ సాగిపోయే తిరుమల మెట్లదారి! ఆ దారికి చివరలో పైన ఎత్తుగా – మధ్యలో కుంకుమరంగు, అటు ఇటు తెల్లని కాంతులతో తళతళ లాడిపోయే తిరుమలేశుని తిరునామాలు !

ఓహ్ ! ఏమి దృశ్యమది?! క్రింద ఆకుపచ్చని మరకత కాంతులు ! పైన ధవళకాంతులతో వెలుగొందే పరమపద సోపాన మార్గం! ఆపైన తెలుపు ఎరుపు రంగుల్లో పరమ పదాన్ని మరపించే, అసలు అదే పరమపదమనిపించే తిరునామ దృశ్య వైభవం! ఈ జన్మకిది చాలుననిపించింది.

అది కలా? కాదు. “అటు చూడు” అంటూ అమ్మ చూపించిన అద్భుత కమనీయ దృశ్య తరంగము !

అయితే అప్పుడే ఆ బోగీలో ప్రయాణీకుల సందడి మొదలవటంతో ఆ కమనీయ దృశ్య తరంగము చెదరిపోగా కలలోంచి ఇలలోనికి జారి పోయాను. రైలు ఆగివుంది. సామాన్లు సర్దుకుని త్వరత్వరగా క్రిందకు దిగి పోతున్న ప్రయాణీకుల్ని చూసి “ఏ స్టేషన్ బాబూ ఇది?” అని అడిగాను. వాళ్ళు ‘తిరుపతి’ అని చెప్పగానే నాకు ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. దేనికంటే – అంతకు కొన్ని క్షణాల ముందు వరకు నేను కలగన్న దృశ్యం – రైలు సరిగ్గా తిరుమల పర్వత సానువుల ప్రక్క నుంచి పోతున్నప్పుడే కలిగిందన్న మాట! అంటే అది అమ్మ చూపించిన లైవ్ షో క్రింద భావించాలా !

తరువాత నేను మెల్లగా సర్దుకుని క్రిందకు దిగి ఖాళీగా వున్న సైడ్ బెర్త్ పై కూచుని కిటికీ గ్లాస్ ద్వారా ప్రక్కకు చూసాను. అయితే స్టేషన్ అడ్డుగా వుండటంవల్ల స్టేషన్ బైట దృశ్యమేమీ కన్పించలేదు. రైలు బయలు దేరేవరకు వేచి ఉండి అది బయలుదేరాక తిరుపతి టౌన్ దాటాక తిరుమల పర్వత పంక్తులు వైపు తిరిగి చూస్తే అక్కడేమీ కనిపించలేదు.

“ఇదేమిటి? చీకట్లో ధగధగ మెరిసి పోయే ఆ మెట్ల దారీ, దానిపైన సాక్షాత్తూ ఆ దేవదేవుడే చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా అనిపించే ఆ తిరునామ శోభా ఏవీ?” అనుకుంటూ వెనక్కు తల త్రిప్పి చూస్తే వెనుక చాలా దూరంలో కనుపించింది పరమపద సోపాన మార్గం! కానీ, కలలో కనుపించినంత స్పష్టంగా, శోభాయమానంగా లేదా దృశ్యం. కారణం – రైలు అప్పటికే చాలా దూరం వచ్చేయటం, ఇంకొకటి అది దట్టమైన ఎ.సి.గ్లాస్ డోర్ కావటం.

ఇలలోకనిపించిన దృశ్యం ఒకింత నిరాశ కలిగించినా – అంతకు ముందు నేను ఊహించినట్టుగా నాకు వచ్చిన కల నిజంగా రైలు తిరుమల మెట్ల దారి ప్రక్క నుంచి వస్తున్నప్పుడు కలిగిందేననీ, పైగా ఆ అద్భుత దృశ్యం నిజంగా ‘అమ్మ’ చూపించిన లైవ్ షోయేనని నిర్ధారణ అయాక మనసు మరొకసారి ఆనందంతో పులకరించి పోగా ఇలలో ఇంకొకసారి ఆ పరమపదసోపాన మార్గానికి, దాని చివరనున్న ఆ దేవదేవుని తిరునామాలకూ మనసారా నమస్కరించుకున్నా.

॥ జయహోమాతా ||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!