1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నేనూ మీలాంటి దాననే

నేనూ మీలాంటి దాననే

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : February
Issue Number : 7
Year : 2014

(అక్టోబర్ 2012 సంచిక తరువాయి)

  1. లక్షణం:

మానవులూ సకల జంతుజాలమూ పరపోషకాలు (Parasites); మొక్కలు స్వయంపోషకాలు జంతువులన్నీ ఆహారం ఇతరత్రా అవసరాల నిమిత్తం మొక్కలు ఇతరత్రా వాటిపై ఆధారపడిజీవిస్తున్నాయి.

‘దీవ్యతే ఇతి దైవః’- దైవం స్వయం ప్రకాశమాన మూర్తి. ‘యయా ప్రాణినఃప్రాణవంతః – అని కాళిదాసు మహాకవి అన్నట్లు ఏ దివ్యశక్తి ప్రభావం చేత ప్రాణులు ప్రాణశక్తిని పొందుతున్నాయో ఆ శక్తి యొక్క సాకారరూపం అమ్మ.

‘అడగనిదే అమ్మైనా పెట్టదు’ అనే జగమెరిగిన అసహజ ధోరణిని ఖండించి, “అడగనిదే అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ”- అనే వాస్తవాన్ని చాటింది; తన లక్షణాన్ని వివరించింది. సర్వార్థప్రదాయిని అమ్మ సకలజీవకోటినీ ఐచ్ఛికంగా ఉద్దరిస్తోంది. అదిమనం ప్రార్థిస్తేనో,అర్థిస్తేనో కాదు.

16 మనస్సు:

దైవం అవాఙ్మనసగోచరుడని అంటారు. కానీ అనంతశక్తిని పరిమితరూపంగా ‘అమ్మ’గా జిల్లెళ్ళమూడిలో చూడటం, ఆస్పందనల్ని అనుభవించటం అందరి అనుభవం. అమ్మ దివ్యసాన్నిధ్యమహిమ అనుభవైక వేద్యమే కాదు. వర్ణనాతీతము కూడా.

మానవ మనస్తత్వశాస్త్ర (Human psychology) ప్రకారం ఒకరి మనస్సు మరొకరికి అర్థం కాదు. వాస్తవం ఏమంటే ఎవరి మనస్సు వారికే అర్థం కాదు. ఈసత్యాన్నే అమ్మ, “తనను తాను తెలుసుకున్ననాడు సర్వాన్నీ తెలుసుకుంటాడు” అని ప్రబోధించింది.

భార్యాభర్తలు, తల్లీబిడ్డలు, అన్నదమ్ములు, స్నేహితులు, గురుశిష్యులు…. ఎవరైనాకానీ వారి మధ్య ఎంతటి అనుబంధం ఉన్నాగానీ ఒకరి మనస్సు మరొకరికి తెలియనే తెలియదు. దీనినే T.S. Eliot అనే కవి ‘The cocktail party’ అనే నాటకంలో ‘Two people who do not understand each other

Bearing children whom They do not understand And who will never understand them ” అని అంటారు.

“అసలు మనస్సు తెలిస్తే బోధ లేదు” – అంటుంది అమ్మ.

మానవ మనస్తత్వ శాస్త్రాన్ని మధించి అమ్మ ఒక రహస్యాన్ని చక్కగా విప్పి చెప్పింది. “భార్యాభర్తలుగానీ తల్లిదండ్రులు గానీ అన్న దమ్ములు, అక్కచెల్లెళ్ళు, ‘ స్నేహితులు, గురుశిష్యులు…. ఎవరైనా ఇద్దరిలో (రెండు వ్యక్తిత్వాల్లో) ఒకరిది ఎప్పుడూ పై చేయి, రెండవ వాడు వీనికి సరెండర్ కావాల్సిందే” – అని. ఇది అమ్మ ప్రవచించిన మానవసహజ సహజీవన వేదం. అంటే సర్దుబాటు (adjustment). పరిస్థితులకు తలవంచటం అనేది ప్రతి ఒక్కరు నేర్వవలసిన గుణపాఠం. లేకపోతే ఎడమొహం- పెడ మొహం. సర్దుబాటు అనేది psychology లో ఒక పెద్ద విభాగం. మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యం కంటె ప్రమాదకరం. ఈ ప్రమాదం నుండి బయట పడటానికి దైవం రక్షకతంత్రాలు (Defence mechanism) అనే వాటిని ఏర్పాటు చేశాడు. ఉదా: అత్తమీది కోపం దుత్తమీద చూపటం, పగటి కలలు కనటం.

నేను నల్లజర్ల హైస్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న రోజులలో ప్రయోగశాలలో ఒక రసాయన ప్రయోగం చేస్తున్నాను. అకస్మాత్తుగా పరీక్షనాళిక పేలి మరుగుతున్న ఆమ్లం ఇంకా రసాయన పదార్థాల మిశ్రమం ఎదురుగా ఉన్న ఒక బాలుని కళ్ళలో పడింది. వానిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మర్నాడు ఉదయం ‘నాకేమీ కనిపించటం లేదు’ అన్నాడు వాడు. దైవసహాయం కోసం తక్షణం జిల్లెళ్ళమూడి వచ్చాను. అంతా విని అమ్మ, “నాన్నా! వాడి బాధ కంటె నీ బాధ ఎక్కువగా ఉన్నది” అన్నది.

400 కి.మీ. ల దూరంలో ఉన్న వాని మానసికస్థితి, ఎదురుగా ఉన్న నా మానసిక స్థితిని స్పష్టంగా చూస్తోంది, అంచనా వేస్తోంది అమ్మ. ఇదీ అమ్మ అలౌకికతత్త్వం. అమ్మ తన సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ లక్షణాన్ని విభూతుల్ని మాతృత్వానికి, సంతాన పరిరక్షణకి వాడు కుంటుంది. అందులో కోటవవంతు శక్తి సామాన్యుడికి ఉంటే కోట్లు సంపాదిస్తాడు, ప్రళయం సృష్టిస్తాడు. కనుకనే ఎంతగా ప్రాధేయపడ్డా దివ్యశక్తుల్ని అమ్మ పంచిపెట్టలేదు ఎవ్వరికీ. “లడ్డు కావటం కంటే లడ్డుతినటం లోనే హాయి ఉందని” చెప్పి భుజం మీద పడుకోబెట్టుకొని జో కొట్టింది. నేను చేసిన ప్రయోగ ఫలితం చెప్పాలి. ప్రమాద బారినుండి బయటపడ్డాడు ఆ విద్యార్థి. క్రమేణా చూపువచ్చింది. S.S.C పరీక్షలో ద్వితీయ శ్రేణిలో కృతార్థుడైనాడు. తర్వాత మంచి ఉద్యోగస్థుడైనాడు. ముఖ్యంగా నా కళ్ళు తెరిపించాడు. ప్రేమైకరసస్వరూపిణి అమ్మ దయవలనే వాడూ, నేనూ ఒడ్డున పడ్డాం – అనేది నా విశ్వాసం.

  1. కర్తవ్యం:

పంచయజ్ఞాలకు లోబడి దేవ ఋషి పితృమనుష్య ఇత్యాది ఋణాలను తీర్చుకుంటూ సంసార బాధ్యతలు నెరవేరుస్తాం. జీవిత విలువల లక్ష్యదిశగా పయనిస్తూ ఆశ అసంతృప్తుల కలయికతో సాగర కెరటంలా పడుతూ లేస్తూ నిర్విరామంగా జీవన పోరాటాన్ని కొనసాగిస్తాం. పురుషకారాన్ని విశ్వసించి మానవ ప్రయత్నం ఉన్నదనుకుంటూ కర్తృత్వాన్ని శిరసావహించి అశాంతికి లోనవుతాం.

ఇంతకీ ఒక వ్యక్తి కర్తవ్య ఏమిటి? స్వధర్మమే పరమో తృష్టమైనదని ప్రబోధిస్తుంది అమ్మ. ఒక ఉపాధ్యాయునితో, “నీ పిల్లలే (విద్యార్థులే) నీకు అన్నం పెడుతున్నారని నువ్వు పాఠాలు చెప్పు నాన్నా! నీకు వేరే పూజలూ…. అవీ అవసరం లేదు.” అన్నది. ఒక యజమానితో, ఒక ఇల్లాలితో “సంసారబాధ్యతలూ ఆధ్యాత్మిక సాధనే” అని తేటతెల్లం చేసింది.

అనూచానమైన ఆచారాలూ సంప్రదాయాలూ మంచివే అయినా కాలానుగుణంగా మనిషి ఆలోచనలు, పద్ధతుల్ని మార్చుకోవాలని అమ్మ స్పష్టం చేసింది. పలుసందర్భాల్లో అమ్మ అనేకానేక అపోహలను, అపార్థాలను నిర్ద్వంద్వంగా ఖండించింది. సో॥ శ్రీవల్లూరి వీరభద్రశర్మ గారు టెలికమ్యూనికేషన్స్లో డివిజనల్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగంలోని బాధ్యతల ఒత్తిడి వల్ల నిత్యం విధిగా చేయదలచిన దేవతార్చన నిర్వర్తించలేక ధర్మ సంకటానికి లోనై ఒకరోజు అమ్మ వద్ద, “గాయత్రీ జపం అయినా చేయలేక పోతున్నానమ్మా! ప్రయాణం చేస్తూనో కుర్చీలో కూర్చునో స్మరిస్తాను” అని బాధపడ్డారు. అందుకు అమ్మ, “కాలం మారిపోయింది, నాన్నా! కాలాన్ని అనుసరించి మన ఆలోచనలూ పద్ధతులూ మారాలి. నువ్వు పుట్టిన కులాన్ని బట్టి జపతపాలు నీ స్వధర్మం అనుకుంటున్నావు. కులాలు వృత్తిని బట్టి ఏర్పడినై. ఇప్పుడు నీ వృత్తి వేరు. దానిని బట్టే నీ ధర్మం. నీ ఉద్యోగంలో నీతి నిజాయితీలతో ఉండడమే నీధర్మం. నీకు వీలైనట్లు చేసుకో, నాన్నా! సంకోచం వద్దు” అని సమాధానపరిచింది, సత్య సందర్శనం చేయించింది.

మన కర్తవ్యం ఏమిటో తెలిపింది. అమ్మ కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం. పూజ్య శ్రీశివానంద మూర్తిగారు చెప్పినట్లు- ‘అమ్మ ప్రసాదించిన ఒక్కొక్క అన్నపు మెతుకు ఒక్కొక్క జన్మ కర్మ ఫలాన్ని హరింపజేస్తుంది- అనే దర్శనం ద్వారా. ‘అసాధ్యము దుర్లభమూ అని తలపోసే పునరావృత్తి రహిత కైవల్య పదాన్ని అమ్మ అందరికీ అయాచితంగా కరతలామలకం చేస్తోంది’- అని స్పష్టమౌతోంది. దీనిని అమ్మ అకారణకారుణ్యం అని అంజలి ఘటించవచ్చు. కానీ తన కర్తవ్యం అని అమ్మ భావిస్తుంది సర్వాత్మనా. ఒక సందర్భంలో నేను, “అమ్మా! మా భారాన్ని నీ మీద వేస్తాం. మేము హాయిగా ఉంటాం. మాకే విచారం లేదు” అని అన్నాను. “వెయ్యండి, నాన్నా! నేనే భరిస్తాను. అయినా ‘భారం’ అని నువ్వు అన్నావు కానీ నేను అనలేదు” అన్నది అమ్మ నవ్వుతూ. అది భారం కాదు, బాధ్యత అనుకుంటుంది ఆశ్రిత కల్పవల్లి చల్లని తల్లి మన అనసూయతల్లి. చెట్టుకు కాయ, తల్లికి బిడ్డ భారం కాదు కదా!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!