(సంచిక తరువాయి)
- సంకల్పం;
మన, మనస్సుకి సంకల్ప వికల్పాలు రెండూ సహజం. సంకల్పం అంటే ఒక ఆలోచన కలిగినది అనీ, వికల్పం అంటే మారినది అని అర్థం. తాను ఉన్నాననే గుర్తు కలిగించడం కోసమే దైవం ఆ రెండు రకాల (జరిగేవి – జరగనివి) ఆలోచనల్ని కలిగిస్తాడు.
అమ్మ, సిద్ధసంకల్ప అమ్మ సంకల్పం ‘సంకల్పరసహితమైన సంకల్పం’. సకల కార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలనూ నడిపే సగుణమూర్తి మన తల్లి అనసూయమ్మ. ఒక సున్నిత హృదయుడు మన కళ్ళ ఎదురుగా తటస్థించే అనుమానాలు అవమానాలు, అపజయాలు – ఎదురుదెబ్బలు, రక్తపాతం – దారుణమారణకాండ – ఇత్యాదులకు చూచి చలించి పోయి ‘మార్పు చేయరాదా?” అని అర్థిస్తే అమ్మ, “అవసరం అయితే మారుస్తాను” అని అన్నది. సకల సృష్టికారిణి కాక ఎవరు ధీమాగా ఈ మాట అనగలరు? విధాతరాతను సైతం తిరిగరాయగల అసదృశశక్తి సంపన్న అమ్మ.
నరకాసుర సంహార ప్రస్తావనలో శ్రీ చిదంబరరావు తాతగారు “పురాణాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ అని రెంటినీ చెపుతున్నాయి” అని అన్నారు. ఆ సందర్భంగా అమ్మ, “భగవంతునిగా పూజింపబడే వారిలో ఇంతవరకూ ఎవరైనా ఆ ద్వంద్వం లేని వారున్నారా?” అని ప్రశ్నించింది. ‘ఇప్పటికి రాలేదు. ఇక వస్తారేమో తెలియదు’ అన్నారు తాతగారు. ఆ విధంగా ద్వంద్వం లేని అవతారమూర్తి అకారణకారుణ్య మన అమ్మే. కనుకనే “తెలిసినవాడికి – తెలియనివాడికి, నమస్కారం చేసిన వాడికి – చెయ్యనివాడికి, నమ్మినవాడికి – నమ్మనివాడికి, విన్నవాడికి-విననివాడికి, వచ్చినవాడికి – రానివాడికి…… అందరికీ ఒకే గతి – సుగతి. నేను ఇవ్వదలచుకున్నాను” అంటూ అమ్మ మాత్రమే లోకోత్తరమైన వరాన్ని బేషరతుగా సర్వులకూ అనుగ్రహించింది. అట్టి అమ్మ సంకల్పమే శివసంకల్పం, సత్సంకల్పం.
- ఆశయం:
ప్రతి వ్యక్తికి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, వైజ్ఞానిక, వేదాంత భాష ఇత్యాది ఒకటి లేక అనేక రంగాలలో అసామాన్య ప్రజ్ఞాపాటవాల్ని సామర్థ్యాన్ని సాధించి అధికారం ఐశ్వర్యంతో పదిమందిలో మెప్పు గుర్తింపు (social recognition) పొందాలని ఆశించటం; జన్మకర్మ బంధాల నుండి వినిర్ముక్తుడై కైవల్యపదాన్ని పొందాలని తపించటం రెండూ సహజమే. కాగా మొదటిది. ఐహికము రెండవది ఆముష్మికము.
అమ్మ ఆశయం వేరు. “మీరే నా ఆరాధ్యమూర్తులు” అని మనల్నందరినీ సేవించటమే అమ్మ ఆశయం. లోకోత్తరమైన అపూర్వమైన అసాధారణమైన అమ్మ ఆశయం మరొకటి ఉన్నది – “మీరంతా నాలా హాయిగా ఉండాలి” అనేది. నిత్యసత్య సద్వస్తువు ఒక్కటే ఆనందస్వరూపం. ‘ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్’ అని ఆప్తవచనాలు వివరించే ఆనందమయ కోశంలో విరాజిల్లేది ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మే; మన అమ్మే. అంటే మనల్నందరినీ తన స్థాయికి తీసుకొని వెళ్ళాలనేది అమ్మ అమృతాశయం, అనితర సాధ్యమైన ఆకాంక్ష, ఆశ్చర్యకరవాత్సల్య అమ్మ హృదయఆలాపన నిరంతర తపన.
‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః॥ అని హామీ నిచ్చారు జగద్గురువులు. అంతటి దీక్ష, అచంచల విశ్వాసం నాకు ఉంటే అదే నన్ను రక్షిస్తుంది. జాలిదలచి కన్నీరు చిలికే దాత, అనసూయమాత ‘ఆవిశ్వాసాన్ని కలిగించాల్సిందీ పరమాత్మే’ నని ఉద్ఘాటించింది. కొబ్బరికాయ కొట్టించేదీ, ప్రదక్షిణలు చేయించేదీ, కోరికలను సిద్ధింపజేసేదీ తానే (దైవమే) నని స్పష్టం చేసింది. తాను తరింపజేసేతల్లి కాబట్టి మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నది. అమ్మ దృష్టిలో పాపలే కానీ పాపులు లేరు. కారుణ్యరసాధిదేవత కనుకనే అమ్మ ‘జీవన్ముక్తి’ని, ‘అఖండానందప్రాప్తి’ని అయాచితంగా అనుగ్రహిస్తోంది. రహస్యం ఏమంటే ‘శాసించే తండ్రిగా’ కాక ‘లాలించే తల్లి’గా వచ్చింది కనుక.