1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నేనూ మీలాంటి దాననే

నేనూ మీలాంటి దాననే

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : November
Issue Number : 4
Year : 2015

(సంచిక తరువాయి)

  1. కాలం:

భగవంతుడు కాలస్వరూపము. ‘కాళి’ అంటే కాలస్వరూపం కనుకనే కొందరు విజ్ఞులు అమ్మను ‘కాళి’ అని కీర్తించారు. కాలాన్ని గడియారము, పంచాంగము, చరిత్ర, కాంతి సంవత్సరములు…వంటి సాధనాలతో గణన చేయలేము. మానవుని సహజస్థితి ఏమంటే …గతం గుర్తు ఉండదు, వర్తమానం గురించి ఆలోచనలేదు, భవిష్యత్ గురించి ఆలోచన, ఆవేదన తప్పదు.

అమ్మకి భూత భవిష్యద్వర్తమానములనే త్రికాలములు లేవు. ‘నాజీవితం అబద్ధం’ అని అన్నది అమ్మ. అంటే అమ్మ కాలానికి కట్టుబడదు. అమ్మకి అంతా వర్తమానమే. ఈ సత్యాన్ని అమ్మ “నాకు ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఇప్పుడే” అని నిసర్గసుందరంగా ప్రకటించింది. “నాకు ఈ గోడలు అడ్డులేవు” అన్న వాక్యంలో – రెండు విభజనరేఖల్ని గీసి కాలాన్ని మూడు ఖండాలు (water tight compartments) గా తాను చూడటం లేదని విశదీకరించింది. అంతేకాదు. అమ్మకి సహజం మనకి విశేషం అయిన ఈ సంపూర్ణ దృక్పధాన్ని కొందరు అదృష్టవంతులకి అనుభవంలో దర్శింపచేసింది. కొందరు సోదరీ సోదరుల్ని పసిపాపలు చేసి చంకన వేసికొని, కాలచక్రాన్ని కొన్ని ఏళ్ళు వెనక్కి, తిప్పి, నిలబెట్టి, ఒకనాటి సంభాషణల్ని సన్నివేశాలని ప్రత్యక్షంగా వినిపించింది, దర్శింపజేసింది. శ్రీ భాస్కరరావు అన్నయ్య, శ్రీరాజుబావ గారలు ప్రత్యక్షసాక్షులు. అమ్మకి దాపరికం, అరమరికలు, అంతరాలు… లేవు. తన దివ్యవిభూతిని, ఐశ్వర్యాన్ని బిడ్డల (మనకి)కి పంచటంలో ఎంతమాత్రం వెనుకాడదు. మానవ ప్రతినిధిగా హైమక్కయ్యకు దైవత్వాన్నిచ్చి, వరాలజల్లుగా అద్వైతసిద్ధి ప్రదాయినిగా ప్రతిష్ఠించింది.

  1. తెలివి:

చేపలు ఈదుతాయి; పక్షులు గూడులు కట్టు కుంటాయి. వాటికి అది సహజాతలక్షణం – అభ్యసనం కాదు. కానీ మనుష్యులు ఈతనేర్చుకోవాలి. ఒకసారి పొందిన జ్ఞానాన్ని మరిచిపోకుండా నిలుపుకొని వినియోగించుకోవడం తెలివి.

జ్ఞానసముపార్జన అంతసులభం కాదు. ‘జ్ఞాన మొసగరాదా!’ అని వేడుకున్నారు త్యాగరాజు స్వామి. ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు అనే మాటలు అర్థరహితం. అయస్కాంతం (magnet) పైనున్న ‘N’ అంటే North-pole అనీ, ‘S’ అంటే South-pole అనీ అనుకుంటే అది అజ్ఞానం. ఆంధ్రభాషలో ‘ఫలము’ అనే పదంలో ‘ఫ’ శబ్దాన్ని ఆంగ్లభాషలోని forest అనే పదంలోని ‘ శబ్దంగా ఉచ్చరించటం మరియు Wool అనే పదాన్ని ‘ఊల్’ అని పల్కటం అవగాహనారాహిత్యానికి చిహ్నాలు.

అమ్మ ప్రాధమిక పాఠశాలకి కూడా వెళ్ళలేదు; ఎక్కడా ఏమీ నేర్చుకోలేదు. వేదాలూ, శాస్త్రాలూ, సకలభాషలూ జ్ఞానసర్వస్వం అమ్మ స్వరూపమే. మన పరిమిత జ్ఞానాన్ని ఊతంగా చేసికొని సత్యాన్వేషణలో ఎంత లోతుకుపోతే అమ్మ అంతవరకూ వస్తుంది. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు’ అన్నారు. శ్రీ అన్నమాచార్యులు. కాగా కళ్ళు తిరిగి, కాళ్ళు లాక్కొచ్చి అక్కడ మనం చతికిల పడతాం; అమ్మ శరవేగంతో ముందుకు దూసుకుపోతుంది. అమ్మ స్థాయి సామాన్యుని గణనకి అందేది కాదు అమ్మ కృష్ణుడు.

“నాది తెలిసీ తెలియని స్థితి” అని తనను గురించి తాను వివరించింది అమ్మ. అంటే అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు ఉండటం ఒక ఉదాహరణ. తన పాండిత్య ప్రకర్షను చాటుకుంటూ ‘వేదాలు పౌరుషేయాలా? అపౌరుషేయాలా?’ అని అమ్మను ప్రశ్నించారు ఒక సోదరులు. “నాకేమీ తెలియదు, నాన్నా!’ అన్నది అమ్మ. ఆ ప్రక్కనే ఉన్న మరొక సోదరుడు సవినయంగా ‘వేదమాతవు నువ్వు చెప్పకపోతే మాకు దిక్కెవరు?’ అని వేడుకున్నారు. సోక్రటీస్ పంధాలో అమ్మ ఒక ప్రశ్న వేసింది ‘నాన్నా! అసలు వేదం అంటే ఏమిటి?’ అని. ‘తెలుసు కోవటం’ అన్నారాయన. వెంటనే అమ్మ, “తెలుసుకున్ననాడు పౌరుషేయాలా అపౌరుషేయాలా అనే ప్రశ్న ఉండదు” అన్నది అమ్మ. “వేదం అంటే తెలుసు కోవటం, చదవటం చెప్పటం కాదు” అని విశదీకరించింది. “బ్రహ్మ విదాప్నోతి పరం” కదా! అణువణువూ తానే అయిన సృష్టిలో పౌరుషేయం అనేది లేదు; తత్త్వతః సర్వం అపౌరుషేయమే. సున్న (0) ధనాత్మకమూ కాదు, ఋణాత్మకమూ కాదు. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు, సాకారుడూ నిరాకారుడూ. అమ్మలో వేదవ్యాసుడు, Milton, కాళిదాసు, పోతన, Einstein మీరూ నేనూ అంతా ఉన్నాం. అమ్మ అనిర్వచనీయమైన తత్త్వం, శక్తి; కాగా మన కళ్ళ ఎదుట నిర్వచనాలతో ఉన్నది.

“మరుపే మరణం” అన్నది అమ్మ ఒక సందర్భంలో. Car driving, Type writing వంటి యాంత్రిక నైపుణ్యాలు (Mechanical skills) జీవితాంతం నిల్వ ఉంటాయి. కాగా ఒక విద్యనభ్యసించి మరచిపోయినవానికి, దానిని అభ్యసించని వానికీ పెద్ద తేడా లేదు. ఇంతేకాదు. ‘మరుపే మరణం’ అన్న అమ్మ వాక్యంలో మట్టిలో మాణిక్యంలా, మేఘాల మాటున చంద్రునిలా నిగూఢంగా ఒక సత్యం ప్రకాశిస్తోంది. అన్నివేళలా ‘అన్నినేనులూ నేనైన నేను’ అనే తాదాత్మ్య స్థితిలో సహజంగా ఉంటుంది అమ్మ. ‘మేను’ (ఈశరీరం) నేను అనే దేహాత్మ భావనతో స్వస్వరూప జ్ఞానం మరుగున పడటం ఆ మరుపే మరణం అనే అంటారు తత్త్వవేత్తలు.

స్మృతి భ్రంశము వలన బుద్ధినాశము, వినాశము కలుగుతాయి. ‘శుచి అశుచిరివ, స్తూప మివ జాగృతం’ అంటే స్నానం చేసిన వ్యక్తి చేయని వానిని, మెలకువగా ఉన్న వ్యక్తి నిద్రమత్తులో ఉన్నవానిని హీనంగా చూస్తారు. అలాగే పామరులను చూస్తే పండితులు ఈసడిస్తారు, నవ్వుకుంటారు. కానీ అమ్మ, “మీరంతా అజ్ఞానంతో ఉన్నారు. మీకు జ్ఞానబోధ అవసరం, చేయాలి – అని నాకు అనిపించటం లేదు” అన్నది. అమ్మ శరీరంలో మన శరీరంలో వలెనే రక్తం, మాంసం, ఎముకలు వగైరాలు ఉంటాయి. కాగా అమ్మ పోత పోసిన సత్యం, జ్ఞానం, దయ, మమకారం.

మానవులకి తార్కికమైన ఆలోచన, విచక్షణా జ్ఞానం ఉన్నాయి; మానవజన్మ ఉత్తమమైనది’ – అని అంటారు. కానీ కుక్క నుంచి విశ్వాసాన్ని; చీమ-తేనెటీగల నుంచి క్రమశిక్షణ దీక్ష, జవాబుదారీతనాల్ని, ఎద్దు, ఏనుగు, ఒంటె వంటి జంతువుల నుంచి సహనాన్ని. ఇలా ఆదర్శగుణాల్ని సాధారణ వ్యక్తి నేర్చుకుంటాడు. మానవుని అతి తెలివి కేవలం స్వార్థప్రయోజన లబ్ధికోసమే ఉపయోగ పడుతుంది. Ecological Balance ని తృణీకరించి, ‘తమకై అన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్’ అనే లక్షణంతో రాక్షస ప్రవృత్తి సర్వత్రా ప్రజ్వరిల్లుతోంది. Alfred Nobel అనే శాస్త్రవేత్త జనకళ్యాణకారక కృత్య నిర్వహణ నిమిత్తం. కొండలని పిండి చేసే శక్తి గల ప్రేలుడు పదార్థాన్ని (Dynamite) కనుగొన్నాడు. దుష్టమానవులు దానిని రణంలో దారుణ మారణహోమానికి ఉపయోగించారు. అది చూచి ఆయన కన్నీళ్ళు కార్చాడు. కనుకనే Bernard shaw ‘There is great common sense in the minds of beasts, let me tell you, and at time foolishness in minds of great scholars’ అని అన్నారు.

మనిషి కంటే ఒక జంతువు, ఒక జంతువు కంటే ఒక చెట్టు, ఒక చెట్టు కంటే జడపదార్థం అని పిలువబడే ఒక రాయి – రప్ప ఎంతో ఉత్కృష్టమైనవి. అవన్నీ విధి – విధానాన్ని అనుసరించి శిరసావహించి తమకి నిర్దేశించబడిన పాత్రలకి శీతోష్ణ సుఖదుఃఖాది క్లేశాల్ని ఆ జన్మాంతం అనుభవిస్తూ నూరుశాతం న్యాయం చేస్తున్నాయి. There’s not to reason why, There’s but to do and die – అన్న రీతిగా శ్వాసించి అంతరించిపోతున్నాయి; జీవించటం లేదు. త్యాగస్వరూపరూపాలవి. సీతాసాధ్వి భూదేవి కడుపున, పార్వతీదేవి పర్వతరాజు (ఒక కొండ) కడుపున అవతరించటంలో పరమార్థం ఇదే; “మానవజన్మే ఉత్తమ జన్మ అని అనను” అని అమ్మ స్పష్టీకరించటంలో యథార్థం ఇదే.

‘అసలు మూలానికి వెడితే అజ్ఞానమే జ్ఞానానికి ఆధారం అని తెలుస్తుంది. ఖాళీగా నున్న పాత్రనే ఒక పదార్థంతో నింపవచ్చు. జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. ‘జ్ఞానాన్ని జ్ఞానంతో కొలుస్తారు’ అని అంటే, అమ్మ, “మరి వెళ్లినో?” అని తిరగేసింది. “తెలుసుకోగా…. తెలుసుకోగా… తెలుసుకోగా… చివరకు ఏమీ తెలియదు అని తెలుస్తుంది” అనే పరమసత్యాన్ని సరళంగా సుందరంగా ఆవిష్కరించింది. సృష్టి సంచాలక రహస్యాల్ని ఛేదింప పూనుకోవడం నిచ్చెన వేసుకొని గగనాధిరోహణం చేయ సంకల్పించినట్లే.

  • (సశేషం)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!