ఒకసారి పాలకొల్లు పట్టణ ప్రఖ్యాత ఆడిటర్ శ్రీకాశీనాధుని రాజగోపాలకృష్ణమూర్తి (గోపీ) అమ్మతో, ‘అమ్మా! నా జీవితంలో గొప్ప విషయం ఏమిటి?’ అని అడిగారు. అందుకు అమ్మ, “నన్ను చూడటమే” అన్నది. ఈ వాస్తవం ప్రతి ఒక్కరి విషయంలోనూ అక్షర సత్యమే. ‘జన్మ కర్మచ మే దివ్యం’ అన్నారు శ్రీకృష్ణపరమాత్మ. కారుణ్యావతారమూర్తి అమ్మను దర్శించుకోవటమే పుణ్యం. అంతేకాదు. అది ఆవ్యక్తి తన జీవన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవటం; జీవన్ముక్తిని పొందటం. “నన్ను చూడటమే నన్ను పొందటం” అని అమ్మ మాత్రమే వరాన్ని ప్రసాదించింది. కాగా అమ్మ, “నేనూ మీలాంటిదాననే” అని అంటుంది. కైవల్యదాత్రి అమ్మ మనలాంటిదేనా?
“మరుగే నా విధానం” అని ప్రకటించింది కదా! బ్రహ్మాది దేవతలు సైతం అధిగమించరాని తన వైష్ణవమాయను కప్పేస్తుంది. ఒకనాటి సాయం సంధ్యా సమయం. సోదరసోదరీ బృందం ముక్తకంఠంతో సంధ్యావందనం చేస్తున్నారు. ‘తవ శుభ నామ స్మరణం తాపత్రయ హరణం జయ జయ అనసూయే’ అని గానం చేస్తున్నారు. సోదరులు శ్రీ చాగంటి వెంకట్రావు గారితో అమ్మ నవ్వుతూ, “నాన్నా! నాకే తాపత్రయం పోలేదు. మీకేం పోగొడతాను?” అన్నది. అమ్మకి తాపత్రయం ఉన్నమాట నిజమే. అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయం … అన్నీ పరిపుష్టిని సంతరించుకుని బిడ్డలకు తగుసేవలు అందించాలనే తాపత్రయం అమ్మకి. అమ్మకి పరమార్థమే స్వార్థం. అట్టి సర్వార్ధ ప్రదాయిని అమ్మ మనలాంటిదేనా ?
శాస్త్ర జన్య జ్ఞాన ప్రపూర్ణులు, పాండిత్య ప్రకర్షు డయిన ఒక సోదరుడు అమ్మతో, ‘అమ్మా! ఇది జడం అనీ, ఇది చైతన్యం అనీ మాకు తోస్తున్నది. మీరు “అంతా చైతన్యమే, సజీవమే” అని అంటే నాకు అర్థం కావటంలేదు’ అని అంటే అమ్మ అదే మాటను తిరిగి అప్పగిస్తూ, “మీరు ఇది చైతన్యం ఇది జడం’ అని అంటూంటే నాకూ అర్థం కావటం లేదు” అన్నది. అంతేకాదు. అమ్మకి దేవుళ్ళూ బిడ్డలే, బిడ్డలూ దేవుళ్ళే. అట్టి అద్వైతామృతవర్షిణి అమ్మ మనలాంటిదేనా ?
ఒకసారి నేను అమ్మతో, “అమ్మా! నేను కంచికామకోటి పీఠాధిపతుల్ని చూసి వస్తాను” అని అంటే అమ్మ, నాన్నా! తిరువణ్ణామలై కూడా పోయిరా” అన్నది. కంచిలో పదిరోజులు ఉన్నాను. శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారితో అప్పుడప్పుడు మాట్లాడేవాణ్ణి. కలవైలో ఒక రోజు ఉన్నాను. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారిని దర్శించాను. వారు మౌనంగానే సంజ్ఞలతో నాతో సంభాషించారు. తర్వాత తిరువణ్ణామలై వెళ్ళి శ్రీ రమణాశ్రమంలో రెండు రోజులున్నాను. అరుణాచలానికి ప్రదక్షిణ చేశాను. పిమ్మట జిల్లెళ్ళమూడి తిరిగి వచ్చాను. రాగానే అమ్మ, “నాన్నా! మా అబ్బాయిలు ఎట్లా ఉన్నారు?” అన్నది. జగద్గురువుల్ని, భగవాన్ రమణ మహర్షులను తన బిడ్డలుగా భావించే జగన్మాత అమ్మ మనలాంటిదేనా?
ఒక ఏడాది మే నెల రోహిణి కార్తె. సాయంకాలం గం.4-00ల ప్రాంతం. అమ్మ దర్శనం ఇచ్చే హాలులో పట్టెమంచం మీద పడుకుని ఉన్నది. ప్రక్కనే నేను ఒక్కడనే ఉన్నాను. నేను తలవైపు కూర్చున్నాను. అమ్మ పాదాలు గుమ్మం వైపు ఉన్నాయి. 14, 15 ఏళ్ళ ప్రాయంగల ఇద్దరు బాలురు అమ్మ దర్శనార్థం వచ్చారు. వారి వెంట చెరియొక కొబ్బరికాయ తెచ్చుకున్నారు. పోర్టికోలో వాటిని కొట్టి తెచ్చారు. అమ్మకి వాటిని తాకించి కొబ్బరి చెక్కలూ, కుంకుమ పొట్లాలూ ప్రసాదంగా ఇచ్చాను. వారిరువురూ అమ్మ పాదాలకు నమస్కరించుకొని వెంటనే వెళ్ళిపోయారు. ఇది అంతా ఏడెనిమిది నిమిషాలలోపు జరిగింది. వాళ్ళు అమ్మతోగానీ, అమ్మవాళ్ళతో గానీ ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత నాతో అమ్మ, నాన్నా! వాళ్ళు ప్రతి సంవత్సరము వస్తారు. ప్రతిసారీ పరీక్ష పాస్ అవుతున్నారు. ఈ ఏడాది పరీక్ష తప్పారు” – అన్నది. నాకు ఆశ్చర్యమేసింది. ఆ పసితనంలో స్థితప్రజ్ఞ లక్షణాన్ని కలిగి ఉండటం. వాళ్ళు పరీక్ష ఫెయిల్ అయిన విషయాన్ని అమ్మకి ఎవరు చెప్పారు? అక్కడే ఉన్న నాకేమీ తెలియదు. అమ్మ సర్వజ్ఞ అని తేటతెల్లం అవుతోంది కదా! సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తి మత్వ లక్షణాలు అమ్మ దినచర్యలో భాగాలే. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. అట్టి అమ్మ మనలాంటిదేనా?
శ్రీ పోతరాజు నారాయణగారు నరసాపురం డాక్టర్ ఆచంట కేశవరావుగారి అన్నగారి అల్లుడు. ‘అమ్మలు, బాబాలు అంటే నాకు నమ్మకం లేదు’ అనేవారు. డాక్టర్ గారి మీద అభిమానంతో వారు జిల్లెళ్ళమూడి వచ్చారు. అన్నపూర్ణాలయంలో Rubbing Machine ని అమర్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ ఆయన. భోజనం చేసి గదిలో నిద్రపోతున్నారు. నాటి రాత్రి గం.9-00ల సమయం. నేను అమ్మ మంచం దగ్గరే పడుకుంటాను కదా! అమ్మ నాతో, “నాన్నా! వెళ్ళి ఇంజనీరు తీసుకురా” అన్నది. వారిని తీసుకుని వచ్చాను. వారు. అమ్మ మంచం ప్రక్కనే ఆసీనులయ్యారు. అమ్మ వారికి ఒక గ్లాసెడు పాలు తెప్పించి తన చేత్తో ఇచ్చింది. ఆ గ్లాసును అందుకొని ఆయన పాలు గటగటా త్రాగేశారు. వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు.. ఆశ్చర్యం. ఆయనకి పాలు ఎలర్జీ. పాలు త్రాగితే వాంతులు అవుతాయి. జ్ఞానం వచ్చాక ఎన్నడూ పాలు త్రాగలేదు. తర్వాత కాలంలో అనారోగ్యరీత్యా వారు రోజుకు రెండు గ్లాసుల పాలు త్రాగాల్సి వచ్చింది. వైద్యులకు మందులకు అసాధ్యమైన మార్పుని అమ్మ తన పావనకర స్పర్శచే సుసాధ్యం చేసింది. ఆయన ఊపిరివిడిచే వరకూ అమ్మకు కృతజ్ఞతాంజలిని ఘటిస్తూ తన మనోమందిరంలో అమ్మను అర్చించుకున్నారు. అట్టి ఘటనా ఘటన సమర్థ అయిన అమ్మ మనలాంటిదేనా ?
అమ్మ స్వీయచరిత్రని శ్రీ యార్లగడ్డ భాస్కరరావు అన్నయ్యకి చెప్పేది. అన్నయ్య వ్రాసేవారు. అంతే. కానీ అది కేవలం ఉక్తలేఖనం (Dictation) మాత్రమే కాదు.. అమ్మ ఆయా సంఘటనలను వివరిస్తున్నప్పుడు అలనాటి వ్యక్తుల సంభాషణలు వారి వారి కంఠ ధ్వనులతో యధాతధముగా అన్నయ్యకి వినిపించేవి. ఇది అసాధారణం, అసంభవమైన సంగతి. అసంభవాన్ని సంభవం చేసే అమ్మ మనలాంటిదేనా?
అమ్మ స్వీయఅనుభవాల్ని శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ (రాజుబావ) గార్కి చెప్పేది. వాటిని వింటున్న రాజు బావ గార్కి అమ్మ అనుభవం తన అనుభవం అయ్యేది. ఆ సన్నివేశంలో తానూ ఒక పాత్రధారిగా, ప్రత్యక్షసాక్షిగా ఉండటం అంటే తన కళ్ళముందే ఆ సంఘటన జరుగుతున్నట్లు సర్వం అవగతమయ్యేది. అంటే అమ్మ రాజుబావగార్ని తన శరీరంలో ఒక భాగంగా చేసికొని ఇరవై, ముప్ఫై ఏళ్ళు కాలచక్రాన్ని, చరిత్ర పుటల్ని వెనక్కి త్రిప్పి (DVDని T.V. పై Rewind చేసినట్లు ప్రత్యక్ష అనుభవాల్ని కలిగించింది. అమ్మకి త్రికాలములు లేవు; భూత భవిష్యద్వర్తమానములు వర్తమానమే. కానీ తన అనుభవాల్ని మరొక వ్యక్తిని పసిపిల్లవానిగా, ఎడపిల్లవానిగా చేసి చంకన వేసుకుని వానికి – పంచడం అపూర్వం అనితర సాధ్యం. అట్టి అమోఘశక్తి సంపన్న అమ్మ మనలాంటిదేనా?
అలవాటు ప్రకారం అమ్మ మంచం ప్రక్కనే చాపమీద పడుకున్నాను. ఒకనాటి తెల్లవారుఝామున గం.4.00ల ప్రాంతం. అమ్మ లేచి కూర్చున్నది. తాను వాత్సల్యయాత్రగా మద్రాసు, కంచి, కలవై, తిరువణ్ణామలై వెళ్ళిన విశేషాల్ని వివరిస్తోంది. అంత రాత్రివేళ విశ్రాంతి తీసుకోకుండా ఈ అల్పునికి పనిగట్టుకొని ఆ సంగతుల్ని చెప్పటం అనుగ్రహ విశేషమే. హఠాత్తుగా “నాన్నా! లలితా సహస్ర నామాల్లో ‘స్వభావ మధుర’ అనే నామం ఉన్నది కదా. దాని అర్థం. ఏమిటి?” అని ప్రశ్నించింది. ‘ఆ లలితాదేవి స్వభావం మధురం అంతకు మించి తెలియదు’ అన్నాను. అందుకు అమ్మ, “నాన్నా! నేను ఏమనుకుంటున్నాను – అంటే – స్వ అంటే తన యొక్క భావం – తన భావమే తనకి మధురం. అది దైవం) తన ఇష్టప్రకారం మనల్ని నడిపిస్తూ, మన ఇష్టప్రకారం నడుస్తున్నట్లు అనిపింపచేస్తుంది” – అంటూ వియద్గంగా ప్రవాహంలా చెపుతున్నది. ఆ క్రమంలో ఆగి, “నాన్నా! అర్థం అయిందా?” అని అడిగింది. ఆ వేళ అమ్మ వేగాన్ని నేను అందుకోలేక పోయాను. “అర్థం కాలేదమ్మా! అన్నాను. అమ్మ ఒక క్షణకాలం నా కళ్ళలోకి చూసి, “ఇప్పుడు అర్ధమైందా?” అని అడిగింది. ‘అర్థమైంది’ అన్నాను. ఇది ఒక అద్భుత అనుభవం. మాటలతో నిమిత్తం లేకుండా కేవలం సంకల్పంతోనే జ్ఞాన ప్రసారాన్ని (transmission of Wisdom) చేసే దక్షిణామూర్తితత్త్వం అమ్మ. అట్టి అమ్మ మనలాంటిదేనా ?
ఇలా చెప్పుకుపోతే వందల ఉదాహరణల నివ్వవచ్చు. ‘అమ్మ మనలాంటిదేనా ?’ అని అంటే నా దృష్టిలోనే కాదు. అమ్మకీ మనకీ ఏ విషయంలోనూ ఏ విధమైన పోలికా లేదు. ఈ వాస్తవాన్ని రూపం, శరీరం, స్పర్శ, దృష్టి, ఆకలి, నిద్ర, మెలకువ, భర్త, బిడ్డలు, శ్వాస, శక్తి, మాట, సంకల్పం, రాగం, ద్వేషం… వంటి పలు అంశాల్ని ఆధారంగా చేసికొని వివరిస్తాను. ప్రస్తుతానికి ఒక ఉదాహరణ:
శరీరం : మనం అన్నగత ప్రాణులం. మన శరీరం పాంచభౌతికమైనది. మన దేహం సందేహమయం. మానవదేహాన్ని అన్నమాచార్యులు ‘బొంకులదేహం’ అని అన్నారు. ఈ ఆకారం వికారంతో వచ్చింది.
అమ్మ శరీరం దివ్యమైనది; పంచభూతాలను జయించినది. అమ్మ పాదతీర్థం అనేక ఆధివ్యాధులకు దివ్యౌషధం. ‘నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం’ అన్నట్లు కార్తీకదీపం వలె అమ్మ శరీరంలోని ప్రతి అణువు నుండి స్వయం ప్రకాశమాన దివ్యదీధితులు దిగ్దిగంతాలకు సర్వదా పరివ్యాప్తమౌతాయి. శ్రీ అనసూయేశ్వరాలయంలో ప్రతిష్ఠితమైనది. స్వయంభువ జగజ్జనని శక్తిరూప అమ్మ దివ్యశరీరమే.