1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నేనూ మీ లాంటి దాననే

నేనూ మీ లాంటి దాననే

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : September
Issue Number : 2
Year : 2012

(గత సంచిక తరువాయి)

  1. స్వరూపం : జీవులు మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో కలిసిపోతాయి. అమ్మ విశ్వరూపాన్ని అవగాహన చేసికొంటే అమ్మకి రెండు స్వరూపాలున్నాయని తెలుస్తోంది. ఒకటి Involution (నిర్వికల్పస్థితి) -అంటే అణురూపంగా ఉన్న సృష్టి, రెండవది Evolution (సంకల్పరహిత సంకల్ప స్థితి) అంటే అనంతరూప సృష్టి. ఈ రెండూ ఒక దాని తర్వాత ఒకటి (చక్రవత్ పరివర్తంతే) వస్తుంటాయి. “మీరంతా నా సంకల్పంతోనే జన్మ ఎత్తి నాలోనే లీనం అవుతారు” అని ఈ రహస్యాన్ని సువిదితం చేసింది. 

నా దృష్టిలో దృశ్యమాన ప్రపంచమంతా అమ్మ ఒడిలోనూ, లయం అయిన సృష్టి అంతా కుక్షిస్థాజాండ భాండ అయిన అమ్మ బొజ్జలోనూ ఉంటాయి. సూటిగా చెప్పాలంటే అమ్మ బొజ్జ Involution ని, అమ్మ ఒడి Evolution ని సూచిస్తాయి.

  1. జననం – మరణం : మనిషి (మర్త్యుడు) జన్మించినపుడు భూమి మీద ‘పడ్డాడు’ అంటారు. అంతిమ శ్వాస విడిచినపుడు ‘చనిపోయాడు (వెళ్ళిపోయాడు’ అంటారు.

అవతారమూర్తి ఉదయించినపుడు దివి నుంచి భువికి ‘దిగివచ్చింది’, అవతరించింది – అని అంటారు; శరీరత్యాగం చేసినపుడు ‘నిజధామానికి నిష్క్రమించింది’ అని అంటారు. ఈ రహస్యాన్ని తెలియజేస్తూ పూజ్యశ్రీ లక్ష్మణ యతీంద్రులవారు అన్నారు, “ఒకడు చీకటిలో నడుస్తూ ప్రమాదవశాత్తూ ఒక బావిలో పడ్డాడు. వాని ఆక్రందన విని ఒక ధీరుడు ఆ బావిలో దూకి వానిని రక్షించాడు, ఉద్ధరించాడు, గట్టున పడేశాడు. బావిలో పడ్డవానికి క్షేమంగా బయట పడేశక్తి లేదు. దూకిన వానికి తాను వెలుపలికి క్షేమంగా రావటమే కాక కొట్టుమిట్టాడుతున్న వానిని కూడ మోసుకుని క్షేమంగా బయటపడ వేయగలడు.

ఈ ఉదాహరణలో బావిలో పడ్డవాడు మానవుడు, వానిని ఉద్ధరించింది అవతారమూర్తి” అని దీనినే – ‘శాన్తో మహన్తో నివసన్తి సన్తో వసంతవత్ లోకహితం చరంతః

స్వయం తీర్ణ్య భీమ భయార్ణవం జనాః నహేతు నాన్యానపి పరాన్తార యంతః॥

అని అంటారు. 14.6.85 తేదీన అమ్మ నిజ సహజ దివ్యదీధితులతో మహిమాన్విత విభూతులతో అద్వైత దీప ప్రభలా సువర్ణజ్యోతిలా నాన్నగారి సరసన ఆలయప్రవేశం చేసింది. అదే శ్రీ అనసూయేశ్వరాలయం – శాంతిసాగరం.

ఈ సందర్భంలో అత్యంత ప్రధానాంశం ఏమంటే – శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమఅవతార పరిసమాప్త్య నంతరం స్వస్వరూపంతో వైకుంఠధామానికి అరుదెంచారు.

కానీ అమ్మ నిజధామానికి వెళ్ళలేదు. అమ్మ నిష్క్రమించలేదు. “అమ్మ” కాబట్టే ఎక్కడికీ వెళ్ళలేదు. ఏ అవతారమూర్తీ అలా చేయలేదు. మన కోసం మన మధ్య అనుగ్రహస్వరూపంలో కారుణ్యరసాధిదేవతలా శ్రీ అనసూయేశ్వరాలయంలో కొలువై ఉన్నది.

  1. మాతృత్వం : నిజానికి లోకంలోని తల్లులంతా యశోదాదేవికి ప్రతిరూపాలే; పెంపుడు తల్లులే. శిశువు గర్భంలో ఉన్నంత వరకే మాతాశిశువులు అభిన్నత్వం. శిశువు భూపతనం అయి, బొడ్డు కోయగానే వారి మధ్య ఎడం ఆరంభమౌతుంది. ఎవరి శ్వాస, ఆలోచన, జీవితం, నడక వారిదే. నడకనేర్చి, మాటలు వచ్చి, విద్యాభ్యాసం -ఉద్యోగం – వివాహం క్రమంలో ఆ ఎడం అంతకంతకీ పెరుగుతుంది.

” “అమ్మ” అసలైన “అమ్మ”. నిజమైన కన్నతల్లి . దేవకీదేవి. “నేనే మిమ్మల్నందరినీ కన్నాను, మీ తల్లులకు పెంపుచ్చాను” అనే అమ్మ ప్రకటనను సహజ మాతృత్వ మాధుర్య విశేషాన్ని అర్థం చేసుకుంటే ‘ఎవరు కన్నారెవరు పెంచారు ?’ అనే గీతానికి అర్ధం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

“మీరంతా నా ఒడిలోనే ఉన్నారు. ఈ ఒడివిడిచి ఎవరూ లేరు” అంటుంది అమ్మ. ‘కీ॥శే॥ చిదంబరరావు తాతగారు ఇపుడు ఎక్కడ ఉన్నారు, అమ్మా?’ అని ప్రశ్నిస్తే అమ్మ, “ఎక్కడ ఉంటాడు, నా బొజ్జలోనే” అన్నది. తొలిసారిగా కళ్ళు తెరిచినా, కడసారి కళ్ళు మూసినా ఎప్పుడూ ప్రాణులు ఉండేది అమ్మ ఒడిలో, అమ్మ బొజ్జలో. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మశరీరంలో భాగంగా. కనుకనే అమ్మ, “మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు”  అని అన్నది.

  1. భర్త – బిడ్డలు : భర్త – ముగ్గురు బిడ్డల తల్లిగా, కట్టూ బొట్టూ, మెట్టెలూ మంగళసూత్రాలూ, నగలూ-నల్లపూసలూ, చీరె – గాజులు ధరించి ఒక సామాన్య గృహిణిలా అమ్మ కనిపిస్తుందికానీ అమ్మ విశ్వకుటుంబిని, జగత్కర్త – జగద్భర్త – జగద్గురువు. “నేను అమ్మను – నీకు, మీకు, అందరకూ – పశుపక్ష్యాదులకూ, క్రిమికీటకాదులకూ” క్రిమికీటకాదులకూ” అంటూ నిజ విశ్వరూపాన్ని దర్శింప చేసింది.
  2. శ్వాస : మనం శ్వాసించకుండా జీవించలేం. అమ్మ శ్వాసించకుండా ఉండగలదు. అమ్మ ఐచ్ఛికంగా తన శరీరాన్ని పరిత్యజించి కొన్నిరోజుల తర్వాత దానిని పరిగ్రహించింది. అది అనూహ్యమూ, అలౌకికమూ అయిన సంఘటన. ఆ మధ్యకాలంలో ఎలా ఉన్నది ? ఎక్కడికి వెళ్ళింది? ఏం చేసింది ? మరి ఆశరీరం ఎలా నిలబడింది? ఏమో! మానవాతీతమైన ఈ చర్యకి అర్థం ఏమిటో ! అవాఙ్మనసగోచరతత్త్వాన్ని గురించి ఏమని చెప్పగలం?

. 7. స్పర్శ : మనకి నొప్పి, బాధ, చలి, వేడిమి, సుఖం దుఃఖం అన్నీ తెలుస్తాయి. ఒకసారి అమ్మ యొక్క ఒక పాదం వేడిగాను, రెండవది చల్లగానూ ఉన్నది. “నేను బిళ్ళ (Tablet)వేసుకుంటే నీకు జ్వరం తగ్గుతుంది. నువ్వు వేసుకుంటే నాకు తగ్గదు” అన్నది. ఇది మానవమేధస్సుకి వైద్యశాస్త్రానికి అంతు చిక్కనిది. నాతో “నేను ఒకసారి 20 క్వినైన్ Tablets మింగాను, నాన్నా!” అన్నది. ఎవరి కోసమో! ఎందరికోసమో!

అమ్మ పాదాలను ప్రధమంగా స్పృశించగానో లేక తమపై అమ్మ ప్రశాంత కరుణామయదృక్కులు ప్రసరించగానో ఎందరో తమకు తెలియకుండానే (తమ ప్రమేయం లేకుండా) కన్నీటితో అమ్మ పాదాలను అభిషేకించేవారు. దీనిని ఆచార్య ఎక్కిరాల భరద్వాజ కన్నీటిలోని దివ్యత్వం (Baptism of tears) అని అన్నారు. వాస్తవానికి అది ఆయా వ్యక్తులకు ఆధ్యాత్మిక పునర్జన్మ.

పంచభూతాలను జయించిన పతివ్రతా శిరోమణిఅమ్మ..

  1. మాట : పారమార్థిక విలువలకి తిలోదకాలిచ్చి పదార్థ వాదానికి బానిసలైన వ్యక్తులు త్రికరణశుద్ధి లేక మారు మాటలు అవసరానికి మాట్లాడుతారు; తంటాలుపడుతుంటారు.

మహాత్ములకి మాటే మంత్రం. వారి మనశ్శుద్ధే మనస్సిద్ధి. అమ్మ మాట మారుమాట లేని మాట – సవరణ అవసరం లేని వివరణ, మంత్రం, నిగమాగమసారం, బ్రహ్మ సూత్రం, నిత్యసత్య వస్తు లక్షణ సమన్వితం. ఉదా: అమ్మ వాక్యాలు : భ్రాంతిలేని వాక్యం బ్రహ్మ వాక్యం. సృష్టే దైవం. విరామం లేనిది రామం. రాధ అంటే ఆరాధన.చేతలు చేతుల్లో లేవు.

  1. ఆకలి: జీవులలో ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు భూమిక అన్నమయకోశమే. ఆకలి అంటే వైశ్వనరాగ్ని రూపంగా విరాజిల్లే దైవమే. శరీరం ఆద్యంఖలు ధర్మసాధనం; కాగా ఆ శరీరానికి ఆధారం అన్నం.

అమ్మ నిరాహార “అన్ని బాధలబాధల కంటే ఆకలి బాధ ఎక్కువ” అని అన్నపూర్ణాలయాన్ని  స్థాపించింది. అది లక్షలాది మంది క్షుద్బాధని తీరుస్తోంది. కాగా అనేకుల అనుభవం, విశ్వాసం ఏమంటే – అన్నపూర్ణాలయంలోని అన్న ప్రసాదం అమ్మ అనుగ్రహ ప్రసారానికి ఒక మాధ్యమం – అని. “ఏం వేసినా నేను అన్నపూర్ణాలయం గాడిపొయ్యిలోనే వేస్తాను” అంటూ అమ్మ అద్దానిని నిత్యాగ్ని హోమకుండంగా సంభావన చేస్తుంది. కనుకనే ఒక సోదరుడు ‘అమ్మా! తిరుపతిలో 1008 హోమకుండాలనుఏర్పాటు చేసి హోమాలు చేస్తున్నారు. వెళ్ళి చూసి వస్తాను’ అని అంటే, “దానికి అంతదూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, నాన్నా!, నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉన్నదిగా” అన్నది. కొన్నాళ్ళు అమ్మ వేపాకు మాత్రమే తిని ఉన్నది. మనం కరివేపాకు తిని కూడా ఉండలేము.

  1. నిద్ర : మనకి జాగ్రద్స్వప్న సుషుప్తాద్యవస్థలు ఉన్నాయి. అమ్మ ఎప్పుడూ మెలకువతోనే ఉంటుంది. సృష్టితో నిత్యం తాదాత్మ్యంచెందే ఉంటుంది; పరాకు, ఏమరుపాటు అన్నవి లేనేలేవు. విజ్ఞులు ఈ స్థితిని ‘సహజసమాధి’ అని అం

టారు. అమ్మ నిద్రపోతుంది. నిద్రలో గురకపెడుతుంది. దూర సుదూర వ్యక్తులతో సంభాషిస్తుంది. అది నిద్రకానే కాదు. 

ఒకసారి పాలకొల్లు పట్టణ ప్రఖ్యాత ఆడిటర్ శ్రీకాశీనాధుని రాజగోపాలకృష్ణమూర్తిగారింట్లో అర్ధరాత్రి దొంగలు పడి మారణాయుధాలతో భీభత్సాన్ని సృష్టించి సంపదను దోచుకుపోతున్నారు. ఆ సమయంలో అమ్మ గాఢ నిద్రలో “నాన్నా! గోపీ ! భయపడకు” అని పలవరించింది. తర్వాత వారు జిల్లెళ్ళమూడి వచ్చి కన్నీళ్ళు  పెట్టుకోగా అమ్మ, “నాన్నా! ప్రాణనష్టం కలుగలేదుగా. మీరు క్షేమంగా ఉన్నారు. అంతే చాలు” అన్నది.

అమ్మనిద్రించునపుడు అమ్మకి వచ్చిన టపా (ఉత్తరాలు వగైరా) ఒక్కొక్కటీ తీసి చదివి వినిపించే వాళ్ళం నేడు శ్రీ అనసూయేశ్వరాలయంలో అమ్మ కృష్ణశిలా విగ్రహం ఎదురుగా నిలబడి SVJP వారు రోజు జమా ఖర్చులు చదివి వినిపించురీతిగా. అమ్మ నిద్రలేచిన పిమ్మట వాటన్నింటికి సమాధానాలు చెప్పేది. అది అమ్మకి సహజం; మనకి విశేషం.  

‘నిద్రాసమాధిస్థితిః’ అనేది అమ్మపరంగానే సత్యం. 11. కల : నిద్రలో మనం కలలు కంటాం; కళ్ళుతెరిస్తే అవన్నీ కల్లలే. అమ్మకి కలలు ఉన్నవా అంటేలేవు; లేవా అంటే ఉన్నవి.

అమ్మకలలు :

  1. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆకలిబాధ లేకుండా కడుపునిండా అన్నం తినే రోజు రావాలి. 2. అందరికీ కడుపునిండా అన్నం, కట్టుకోను గుడ్డలు పెట్టుకోవాలి. 3. తరగతి గది (ClassRoom)లో ఉపాధ్యాయుడు బెత్తంతీసికొని విద్యార్థులను దండించని రోజు రావాలి. 4. భార్యలను దేవతలుగా సమ్మానించే భర్తలను చూడాలి. 5. రోగిని నారాయణస్వరూపునిగా చికిత్స చేసేవైద్యులు కావాలి.

ఇలా అసంఖ్యాకం, అపరిమితంగా ఉన్నాయి. ఆవిధంగా అమ్మకి ఆశ – అసంతృప్తే ఉన్నాయి. అమ్మ కలలు తప్పక ఒకనాటికి నిజం అవుతాయి; ఆ క్షణాలు అమ్మకి తెలుసు.

– (సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!